దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

తెలంగాణాలో హైదరాబాద్ కు 48కి.మీ .దూరం లో మెదక్ జిల్లాలోకరీం నగర్ రహదారి లో కొంచెం ప్రక్కగా  వర్గల్ గ్రామం లో  కొండపై ఉన్న శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం తప్పక దర్శింప దగిన క్షేత్రం .చుట్టూ లోయ ,ప్రక్కన కొండ తో బహు సుందరం గా కనిపిస్తుంది .ప్రక్కనే మూడడుల రాతి శనైశ్చర విగ్రం తో ఉన్న దేవాలయమూ దర్శింప దగినదే .ఇంత ఎత్తున్న శనీశ్వర విగ్రహం ఆంధ్ర దేశం లో లేదు .శ్రీ విద్యా సరస్వతీ దేవి తో పాటు ,కొండపై లక్ష్మే గణపతి ,శనీశ్వర ,శివ ,దేవాలయాలున్నాయి .కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా పూర్వం ఇక్కడ ఉండేవి .మూల విగ్రహాలు లేని శిధిల దేవాలయాలే .

ఆలయ ప్రాచీనత

సరస్వతీదేవి మహా భక్తుడు ,మంత్రోపాసకుడు ,వాస్తు పండితుడు ,జ్యోతిశ్శాస్త్ర వేత్త ,వ్యాపార దక్షులు అయిన శ్రీ యామవరపు చంద్ర శేఖర శర్మ ఈ ఆలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్య కారకులు .1998లో ఈ ఆలయ నిర్మాణానికి కొద్దిమంది ఉత్సాహ వంతులు ‘’సత్య పధం సేవా సమితి ‘’గా ఏర్పడి మంచి ప్రదేశం కోసం అన్వేషించారు .వారు ఇక్కడున్న వర్గల్ వచ్చి ప్రదేశం నచ్చి ,ఆలయనిర్మాణం చేద్దామని భావించారు .ఈ ప్రదేశం లో400సంవత్సరాల క్రిందటి శంభు దేవాలయం ఉండేది .ఆలయం భూ మట్టానికి రెండు అడుగుల లోతులో ఉండేది .దైవ దర్శనం చేయాలంటే ఒంగి ,పాక్కుంటూ వెళ్లి  శంభు  స్వామిని  దర్శించాల్సి వచ్చేది .శంభు దేవాలయం ప్రక్కనే రెండు వైష్ణవ దేవాలయాలుండేవి .వీటిని కాకతీయ రాజులు నిర్మించినట్లుతెలుస్తోంది .ముప్ఫై అడుగుల ఎత్తున్న  ఒక రాతి జయ స్థంభం ఉండేది .ధ్వజ స్థంభం పై సీతారామ ,లక్ష్మణ ,లక్ష్మీ దేవి విగ్రహాలతో బాటు  పెనవేసుకొన్న జంట నాగ సర్పాలవిగ్రహాలున్నాయి . ఇది చాలా ప్రాచీన చరిత్ర ఉన్న ప్రదేశం కనుక ఇక్కడే ఆలయ నిర్మాణం చేయాలన్న దృఢ సంకల్పం సమితి సభ్యులకు కలిగింది .

ఆలయ నిర్మాణం –విస్తరణ

1989లో వసంత పంచమి నాడు సుముహూర్తం లో శ్రీసరస్వతీ ఆలయ నిర్మాణానికి శంకు  స్థాపన చేశారు .ఆ రోజున సమితి వారి చేతిలో ఉన్న రొక్కం కేవలం 2,700రూపాయలు మాత్రమే .సరస్వతి ఆలయ నిర్మాణం ఇక్కడ జరుగుతోందని తెలియగానే విరాళాలు ప్రవాహం లా వచ్చి చేరాయి .సరస్వతీ అమ్మవారి కృపతో లక్ష్మీదేవి కూడా సహకరించి  నిధులకు కొరత లేకుండా నిర్విఘ్నం గా నిర్మాణపు పనులు కొన సాగాయి .1992లో మాఘ శుద్ధ త్రయోదశినాడు పుష్పగిరి పీఠాదిపతులు శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి ఈ ఆలయం లో  శ్రీ విద్యా సరస్వతి ,శ్రీ  శనైశ్చర విగ్రహాలను ప్రతిస్టించారు .తరువాత ఆలయాన్ని కంచి పీఠానికి అప్పగించేశారు .వారి ఆధ్వర్యం లో ఇక్కడ వేదపాఠశాలను 1999లో కంచి పీఠానికి చెందిన శ్రీ శ్రీ శంకర విజయ సరస్వతీ స్వామి ప్రారంభించారు .ఇందులో మూడు వందల మంది విద్యార్ధులకు వసతి సౌకర్యం ఉన్నది .2001లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం లో విగ్రహ ప్రతిష్ట జరిగింది .ఈ మొత్తం నిర్మాణానికి కోటి రూపాయలకు పైగానే ఖర్చయింది .ఆలయానికి తూర్పున పదమూడున్నర ఎకరాల భూమి ఉంది .ఇందులో ఒక పార్కు ,లైబ్రరి ,హాస్పిటల్ లను నిర్మించటానికి పధకాలను సిద్ధం చేశారు .

తల్లీ నిన్ను దలంచి

పిల్లల అక్షరాభ్యాసానికి ఇక్కడ మంచి వసతి ఉంది .రోజూ ఎందరొ తలిదండ్రులు  తమ   పిల్లలకు అక్షరాభ్యాసం చేయించు కొంటారు .దీనికి రుసుం ఉంటుంది .నిత్యం భక్తులకు ఉచిత భోజన సౌకర్యం ఉంది .సరస్వతీ దేవి ఆలయం చాలా ఎత్తుమీద ఉంటుంది నుక మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళలేనివారికి లిఫ్ట్ సౌకర్యం కల్పించారు .మేయింటి నెన్స్ కోసం మనిషికి అయిదురూపాయలు వసూలు చేస్తారు .

సాధారణ రోజుల్లో శ్రీ విద్యా సరస్వతీ ఆలయ సందర్శకులు కనీసం రోజూ  వంద మందికి తక్కువ ఉండరు .నిత్యం ఇక్కడ తామరపూలతో అష్టోత్తర పూజ ఉంటుంది .దీనికి టికెట్ ఇరవై ఒక్క రూపాయలు .కుటుంబం అంటా కూర్చుని పాల్గొని చూడవచ్చు .ఆలయం బయట తామరపూలు కొనుక్కొని భక్తులు తెచ్చుకోవాలి . .దసరా ఉత్సవాలలో వేలాది భక్తులు నిత్య దర్శించి తరిస్తారు .నవరాత్రి ఉత్సవాలు విఘ్నేశ్వర పూజ తో ప్రారంభమవుతాయి .మహాభిషేకం ,నవ రాత్రి కలశ స్థాపన ,చతుశ్శష్టి ఉపచార పూజ ,హారతి , మంత్రం పుష్పం కుంకు మార్చన నిత్యం జరుగుతాయి .ప్రత్యెక పూజలుగా లక్ష పూల అర్చన ,పుస్తక రూపిణిసరస్వతీ పూజ నిర్వహిస్తారు .సరస్వతీ దేవి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం రోజున అంటే సరస్వతీ పూజ నాడు  విశేషమైన పూజలు నిర్వహిస్తారు .నవరాత్రులలో చివరి రోజున విజయ దశమి నాడు , అష్టోత్తర శత లక్ష అభిషేకం జరిపి అమ్మవారికి వివిధ విశేష అలంకారాలను చేస్తారు .చండీ హోమం ఇక్కడ మరోప్రత్యేకత.

శనైశ్చర పూజ

ప్రతి నెల త్రయోదశినాడు శనీశ్వర పూజ నిర్వహిస్తారు .అది శనివారం రోజున వస్తే మహా విశేషం .దీన్ని శని త్రయోదశి అంటారు .ఉదయం అయిదు గంటలకే వినాయక పూజ తో ప్రారంభిస్తారు .జపం ,హోమం తర్పణ తైలాభిషేకం హారతి పూర్ణాహుతి నిర్వహిస్తారు .ఇదంతా పూర్తీ అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది .ఈ పూజకు వేలాది మంది దేశం లో పలు  ప్రాంతాలలనుండి భక్తులు వచ్చి పాల్గొంటారు .శనిదొష నివారణ చేసుకొంటారు .

విద్యా సరస్వతీ దేవి

ప్రశాంత వాతావరణం లో సకల సౌకర్యాలతో ఉన్న శ్రీ విద్యా సరస్వతీ  దేవాలయాన్ని దర్శించి అభీష్ట సిద్ధి పొందవచ్చు .అమ్మవారుఆరు అడుగుల  చాలా భారీ విగ్రహం .వెడల్పు ముఖం  వీణా ,పుస్తక దారిణి .వెండి తొడుగుతో ధగ దగా మెరిసి పోతూ తెల్లని శుభ్ర వస్త్రాలతో దర్శనమిస్తుంది .భక్తులు ‘’ విశ్వకారిణీం,విశాలాక్షీం ,వర్గల్ గిరి నివాసినీం, విద్యా సరస్వతీం వందే వీణా పుస్తక ధారిణీం ‘’అనుకొంటూ దర్శించి పరమానందాన్ని ,అనుభూతిని పొందుతారు .

రత్నాలయ శ్రీ వెంకటేశ్వర స్వామి

వర్గల్ కు పదిహేను కిలో మీటర్ల దూరం లో నాచారం వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని ,ఆరుకిలో మీటర్ల దూరం లో రత్నాలయం లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించి సంతృప్తి చెందుతారు .ఈఆలయం లో విశాలమైన పార్కు ,అందమైన విగ్రహాలు చెట్లూ ఉన్నాయి .సరదాగా పిక్నిక్ కూడా వచ్చితెచ్చుకోన్నవి తిని కాలక్షేపం చేస్తారు .శ్రీ టి.ఆర్ .వెంకటేష్ ,శ్రీమతి రమాదేవి దంపతుల ఆలోచనే ఈ ఆలయ నిర్మాణం .వీరికుమారుడు శ్రీ రత్నయ్య ఈ బ్బ్రుహన్నిర్మాణాన్ని2001లో  పూర్తీ చేసి తలిదండ్రుల సంకల్పానికి రూపం కల్పింఛి  ,పితృ ఋణం దైవ ఋణం తీర్చుకొన్నారు . .చాల ప్రశాంత వాతావరణం లో ఆలయం అందమైన ప్రక్రుతి మధ్య నిర్మితమైనదేవాలయం .స్వామి విగ్రహమూ చాలా భారీగా ఉంటుంది .అభయ వరదుడుగా, పద్మావతీ ఆండాళ్ సహితం గా భక్త కల్ప ద్రుముడుగాఉన్న కలియుగ దేవుడు .  తిరుమల శ్రీనివాసుని దర్శించలేని భక్తులకోసం ఏర్పడిన ఆలయం. ఇక్కడ కూడా తిరుమలలో లాగానే బ్రహ్మోత్సవాలను నిర్వహించి ,ఇక్కడే అక్కడి వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చేయటం ఈ ఆలయం ప్రత్యేకత .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-14-ఉయ్యూరు .

Inline image 1       Inline image 2Inline image 3

Inline image 4   Inline image 5

vargal                               ratnalayam

Inline image 6 vargal teple Inline image 7

ratnalayam

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in దేవాలయం and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.