నా దారి తీరు -81
బాబు గారింట్లో ఈ బాబు
మెయిన్ రోడ్ లోనే రోడ్డుమీదనే శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గుడికి వెళ్ళేదారిలో గుడికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం విష్ణు భొట్ల శాస్త్రి గారిల్లుంది .వారిని ఊరిలో అందరూ గౌరవం గా ‘’బాబు గారు ‘’అంటారు .కనుక పేరుకంటే బాబు గారనే పేరుతోనే అందరూ పిలుస్తారు .అప్పటికే ఎనభై ఏళ్ళ ‘’వృద్ధ వేదపండు’’ .ఎర్రగా కుది మట్టం గా పంచె తో విభూతి రేఖలతో కన్పిస్తారు .సాధారణం గా చోక్కా వేసుకోరు .డబ్బా పండు వంటి మై ఛాయ. భార్య మహా లక్ష్మీ దేవిలాగా పొడుగ్గా కాళ్ళకు కడియాలు నుదుట పెద్ద కుంకుమ బొట్టు ,మేడలో బంగారు ఆభరణాలు ,చేతులకు బంగారు గాజులతో అపర అన్నపూర్ణా దేవిగా కనిపిస్తారు .మాటలో ఆత్మీయతా ,ఆప్యాయతా మూర్తీభవించి ఉంటారు .నన్ను ఇద్దరూ ‘’మాస్టారు గారు ‘’అనే పిలిచే వారు .అలాంటి వారింట్లో బయట ఒక చిన్న గది నాకు అద్దేకిచ్చారు .ఉయ్యూరు నుంచి నా మడత మంచం తెచ్చుకౌండా వారిదే ఒక మంచం నాకిచ్చారు .పక్క బట్టలు దిండు మాత్రం తెచ్చుకొన్నాను ఉమ్రావ్ స్టవ్ కిరోసిన్ వంట పాత్రలు ,కంచం ,గ్లాస్ లతో దిగాను .పొద్దున్నే పాలు పొయించుకుని కాఫీ డికాషన్ వేసి పాలు వేడి చేసి కాఫీ కలుపుకొని తాగేవాడిని . దొడ్లో స్నానం చేసి సంధ్యా వందనం చేసుకొని వంట మొదలు పెట్టేవాడిని .నా అవస్థ చూసి మామ్మ గారు వాళ్ళ ఇంట్లో నే ఒక్కో సారి కాఫీ ఇచ్చేవారు .నేను తోమ్మిదిన్నరకల్లా భోజనం చేసి స్కూల్ కు బయల్దేరేవాడిని .ఇంటి కి బడి సుమారు కిలో మీటరు ఉంది .నడిచే వెళ్ళేవాడిని .
మధ్యాహ్నం మిగిలిన స్టాఫ్ మెంబర్ లతో కలిసి దగ్గరలో ఉన్న ఒక తాటాకు పాక హోటల్ లో ఇడ్లీ ,లేక బజ్జీ బొండా ఏదో ఒకటి తిని టీ తాగే వాడిని .పల్లీ చట్నీ చాలా బాగుండేది .ఆక్కడి నుండి మళ్ళీ స్కూలు కు వెళ్ళేవాడిని .మళ్ళీ రొటీన్ వర్క్ సాయంత్రం దాకా. తర్వాత ఆటలాడుకొనే వాళ్ళం .ఇది అయిన తర్వాత ఇంటికి వచ్చే వాడిని .ఆచార్యులుగారు నేనూ సైన్స్ అటేన్దరూ కలిసి ,అమ్మవారి గుడికి ,శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామిగుడికీ మధ్యలో ఉన్న శివాలయానికి వెళ్లి , దగ్గరలో ఉన్న చెరువు దాకా నడిచి వెళ్లి కాసేపు అక్కడ ఊర్చుని చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకొనే వాళ్ళం .మళ్ళీ రాత్రి వంట .సంధ్యా వందనం .తర్వాత భోజనం .బాబు గారింట్లో మధ్యాహ్న భోజనం ఆలస్యం అయ్యేది కారణం ఆయన నిత్యం అనుష్టానం చాలా సేపు చేసేవారు .అది పూర్తీ అయితే కాని భోజనం చేసేవారు కాదు .మామ్మ గారు నాకోసం మధ్యాహ్నం చేసిన కూరలు పచ్చళ్ళు జాగ్రత చేసి నాకు తినమని ఇచ్చే వారు .నన్ను వారింటిలో ఒక సభ్యునిగా భావించి ఆదరించారు .ముప్పాళ్ళ లో భండారు సుబ్బారావు గారు ,భార్య సీతారావమ్మ గారు చూపించిన ఆత్మీయతను మళ్ళీ ఇక్కడ బాబు గారు బామ్మ గారి దంపతుల నుండి పొందాను .మంచి సంస్కార వంతులు దంపతులు .నన్ను రోజూ ఏమి వండుకోన్నారని అడిగి ,తినేవి లేవని తెలుసుకొని వారింట్లో ఊరగాయ అప్పడం వడియాలు నాకు వేయించి ఇచ్చేవారు .ఆ ఆదరాన్ని జీవితం లో మరువ లేను .బాబు బహు గ్రంధ కర్త .స్మార్తం లో దిట్ట .ఆ చుట్టూ ప్రక్కలే కాక సుదూర ప్రాంతాలలో వారి పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి .మంచి జ్యోతిష్ పండితులు .ముహూర్తాలోసం నిత్యం చాలా మంది వచ్చేవారు .మంచి చెడు చెప్పేవారు .ఈ దంపతులకు పిల్లలు లేక పోవటమే పెద్ద వెలితి .వీరింటి ప్రక్కనే బాబు గారి తమ్ముడుగారిల్లు ఉంది. తమ్ముడు చనిపోయాడు .మరదలు ఉంది వారికి పిల్లలున్నారు .మామ్మ గారి తమ్ముడు వాళ్ళు వెనక బజారు లో స్వంత ఇంట్లో ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడూ వస్తూ సందడి చేసేవారు .తమ్ముడి కూతురికో మనవ రాలికో లెక్కలు చెప్పిన జ్ఞాపకం .
ఒక నెల గడిచిన తర్వాత హాస్టల్ పిల్లలు ట్యూషన్ చెప్పమని వచ్చారు .ప్రతి శనివారం నేను ఉయ్యూరు వెళ్లి సోమవారం పొద్దును కాని రానని ,ఉన్న రోజుల్లోనే చెబుతానని డబ్బు ఇవ్వక పోయినా ఇంట రెస్ట్ ఉంటె చెబుతానని అన్నాను .అలానే అని అయిదుగురు చేరారు .వాళ్ళు ఎస్ సి లు .అయినా బాబుగారు మామ్మ గారు ఏమీ పత్తిన్చుఒక పోవటం వారి సంసారాన్ని తెలియ జేసింది .ఉదయం ఏడుగంటల నుండి ఎనిమిదిన్నర దాకా వంట వండు కుంటూ చెప్పేవాడిని .రాత్రి ఏడు నుంచి తొమ్మిది దాకా చెప్పేవాడిని .శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహ స్వామి స్వామి ఆలయానీ వెళ్లి పూజ ,భోగం పవళింపు సేవ చూసేవాడిని .ఆడవాళ్ళూ ఆచార్యులవారు చక్క ని పవళింపు సేవ పాటలు భావ రాగ యుతం గా భక్తియుతం గా పాడే వారు. చాలా ఆనందం కలిగేది .ప్రసాదాలు బాగా ఉండేవి చాలా పద్దతిగా కార్య క్రమాలను అయ్యవారు నిర్వహించేవారు .కుటుంబం అంతా అంటే భార్యా ,ఉమారుడు కోడలు ,మనుమలు మనుమరాళ్ళు అందరూ అంటే శ్రద్ధతో స్వామి సేవలు చేసేవారు .చూడ ముచ్చటగా ఉండేది .
లెక్కల మేష్టారు ఆచార్యులు గారు మా వెనక బజారులో ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు. నాలానే వంట చేసుకొనే వారు .చాలా సహృదయుడు .నామం పెట్టు కొనే వారు. చామన ఛాయ.దేహం నవ్వు ముఖం గొప్ప సహాయ ఆరి .పిల్లలను లేఅలకు మోటివేట్ చేయటం లో చాలా శ్రమ పడేవారు .మంచి మార్కులు వచ్చేట్లు చేసేవారు .అంతటి కృషి చేసిన వారు అక్కడేవ్వరూ లేరు .ఇది మరువ రాని విషయం .ఏదో పోటీలుపెట్టి పెన్నులు వగైరా కొని తెచ్చి బహుమతులిచ్చేవారు .పిల్లలకు ఆయన అంటే మహా గౌరవం చనువు ఉండేవి .తెలుగు శాస్త్రి గారింటికీ అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం భోజనమూ చేసేవాళ్ళం .ఆచార్యుల గారిని ఆయన వచ్చిన ఊరివారు చైర్మన్ పై ఒత్తిడి తెచ్చి మళ్ళీ వాళ్ళ ఓరీ ట్రాన్స్ ఫర్ చేయిన్చుకోన్నారు .స్పాట్ వాల్యుయేషన్ లో కనిపించేవారు ఆ తర్వాత .
నేను తెచ్చిన సంస్కరణలు
స్కూలు లో మార్కుల రిజిస్టరు అటెండెన్స్ రిజిస్టరు ,కన్సాలిడేటెడ్ రిజిస్టర్ ల నిర్వహణ సరిగ్గా ఉండేదికాదు .ఏ పిల్లాడు ఏ క్లాసులో ఏ సెక్షన్ లో ఉన్నాడో తెలిసేదికాదు .ఈ విషయం హెడ్ మాస్టారు ఆన్జనేయులుగారికి చెప్పాను ఆయనీ దీని మీద అవగాహన లేదు .సుందరరావు ఇలాంటి వాటిలో రిస్క్ తీసుకొనే వాడు కాదు .అందుకని నన్నే ఫస్ట్ అసిస్టంట్ గా ఉండమని వీటి సంగతి ,పరీక్షల నిర్వహణా చూడమన్నారు .నాకు చేతి నిండా పని .నా క్లాసులు నేను అటెండ్ అవుతూ ఈ పని చూశాను .మొదటి టెస్ట్ కే అన్నీ లైన్ లో పెట్టాను .ఆరవ తరగతి పిల్లల నంబర్లు ఆరు వందలు ఏడవ తరగతికి ఏడు వందలు అలాగే వరుసగా ఇస్తూ పడవ తరగతి వారికి వెయ్యి తో నంబర్లు మొదలైయ్యేట్లు చేశాను .ఆరవ తరగతి ఏ సెక్షన్ నంబర్లు 6101,Bsection 6201,Csection 6301 etc ఏడవతరగాతి ఏ సెక్షన్ నంబర్లు 7101,B section -7201 C section 7301 etc ఎనిమిదో తరగతి ఏ సెక్షన్ నంబర్లు 8101 B section 8201 C section -8301 తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ నంబర్లు 9101 B section 9201 ,C section -9301,పదవ తరగతి ఏ సెక్షన్ నంబర్లు 1101 ,B section 1201 C section 1301తో ప్రారంభంయ్యేట్లు చేశాను . అటెండెన్స్ లన్నీ నేనే రాసి నేనే యెర్ర సిరా తో నంబర్లు వేశాను .ఇది చూసి యెంత తేలికగా హాయిగా ఉందొ అని అందరూ నన్ను అభినందించారు .అలాగే మార్కుల రిజిస్టర్ లో కూడా పేర్లు నంబర్లూ నేనే రాశాను కంసాలిడేటెడ్ అటెండెన్స్ రిజిస్టర్ కూడా నేనే రాసి నంబర్లు వేశాను .ప్రతి సెక్షన్ టీచర్ నెలాఖరుకు ఎవరైనా మానేస్తా సగం కంటే ఎక్కువ రోజులు రాకపోతే వాళ్ళ నంబర్లను కింద బ్లాంక్ నంబర్లు గా రాయించాను .మరుసటి నెల హాజరు పట్టీ లో బ్లాంకులు చూపిస్తూ పేర్లు రాయించాను. రెండో నేలకే టీచర్లు బాగా అలవాటు పడ్డారు .ఒక వేళ వారు చేయక పొతే మర్చిపోతే నేనే వెంటపడి రాయిన్చేవాడిని .మూడో నెలలో అంతా గాడిలో పడ్డారు .ఈ మార్పులను అందరూ హర్షించటం నాకు తృప్తి నిచ్చింది .పరీక్షలను కూడా చాలా పద్బండీ గా నిర్వహించాను కాపీలు కొతట్టా నివ్వలేదు ,తేనివ్వలేదు .మొదట్లో ఇబ్బందిపడ్డా క్రమం గా అలవాటు పడ్డారు .పరీక్షల్లో ఒక క్షణం కూడా కూర్చునే వాడినికాదు .టైం ప్రకారం క్వేస్చిన్ పేపర్లు ఇవ్వటం ,టైం కే పిల్లలు రాయటం ,అనుకొన్న గడువు లో టీచర్లు దిద్ది మార్కులు పోస్ట్ చేయటం ప్రోగ్రెస్ కార్డులు జారీ అన్నీ నియమం గా జరిపించాను .
ఒక సోషల్ మేష్టారు వెనతెశ్వర రావు గారు బెజవాడ ఆయన ఎర్రగా బా పలుచగా తెల్ల జుట్టుతో ఉండేవారు . చాలా ఆత్మీయంగా ఉండేవారు నాపద్ధతులన్నీ నచ్చాయి ఆయన రిటైర్ అయిన తర్వాత అప్పుడప్పుడు బేజ వాడలో కలిసే వారు . కాకాని నరసింహారావు బారుగా నల్లగాఉండేవారు .జగ్గయ్య పేటలో కాపురం .ఆక్కడినుండే మోటారు సైకిల్ మీద వచ్చేవారు .అక్కడ వ్యవసాయం వ్యాపారం చాలా ఉన్నాయి .మనిషి మంచివాడు .స్నేహ శీలి .మన ప్రాంతం వాడే అవటం తో బాగా సన్నిహితుడయ్యాడు . సైన్స్ సుందరరావు అప్పుడప్పుడు తన ఇంటికి ఆహ్వానించి టిఫిన్ కాఫీ ఆఫర్ చేసేవాడు .శని వారం రాత్రి ఇంటికి చేరే సరికి రాత్రి తొమ్మిది దాటేది .పది హీను రోజులోసారి రుద్రపాక ఉదయానికే వెళ్లి చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వర రావు గారిని కలిసి ఉయ్యూరు బదిలీ చేయమని అడిగే వాడిని .ఇక్కడ ఉంటున్నా ముళ్ళ మీద ఉంటున్నట్లే ఉండేది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-11-14-ఉయ్యూరు

