అగ్నిసరస్సులో ఈదాల్సిందే… మదర్ ఇండియా సినిమా పాటలు –

అగ్నిసరస్సులో ఈదాల్సిందే…
శ్రమైక జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు తీసిన చిత్రం ‘మదర్‌ ఇండియా‘ . నర్గిస్‌ తన అసమాన ప్రతిభను ప్రదర్శించిన ఈ చిత్రం 1957లో విడదల అయ్యింది. ఇందులోని ‘దునియా మే హమ్‌ ఆయేతో జీనా హి పడేగా’ అనే పాట ప్రతి భారతీయ హృదయాన్నీ ఉర్రూతలూపింది. శకీల్‌ బదాయునీ రాసిన ఈ పాటను , నౌషాద్‌ స్వరబద్ధం చేస్తే లతా మంగేష్కర్‌ తన చెల్లెళ్లు మీనా మంగేష్కర్‌, ఉషా మంగేష్కర్‌లతో కలిసి గానం చేశారు.
దునియా మే హమ్‌ ఆయే హై తో జీనా హీ పడేగా
జీవన్‌ మే అగర్‌ జెహర్‌ తో పీనా హీ పడేగా /దునియా మే/
(లోకంలోకి వచ్చాక మనం జీవించాల్సిందే
జీవితంలో విషమే ఉన్నా తాగాల్సిందే)
ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, జీవితం అపురూపమైనదే. ఈ కష్టాలకూ, బాధలకూ అతీతమైన ఒక జీవితానందం సజీవత్వంలోనే సిద్ధిస్తుంది. సుఖ సంతోషాలు, జీవన మాధుర్యాలూ అన్నిసార్లూ లభించవు. ఆ మాటకొస్తే జీవితంలో అత్యధిక భాగం సంఘర్షణలూ, సంక్షోభాలే ఉంటాయి. తేనెల జలపాతాలకన్నా, విష ధారలే ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ అలా జీవితంలో విషఽభాండాలే ఉన్నా, ఆ విషాన్ని సైతం జీర్ణించుకోవాలి. ఎందుకంటే, ఆ విషాన్ని చిలికితే గానీ, జీవిత సత్యాలు బోఽధపడవు. ఆ సత్యాల్ని అక్కున చేర్చుకుంటే గానీ, అమృత భాండాలు మన చేతికందవు
గిర్‌గిర్‌కే ముసీబత్‌ మే సంబల్‌తే హి రహేంగే
జల్‌ జాయే మగర్‌ ఆగ్‌ పే చల్‌తే హీ రహేంగే
గమ్‌ జిస్‌నే దియే….
గమ్‌ జిస్‌నే దియే హై వొహీ గమ్‌ దూర్‌ కరేగా -2 / దునియా మే /
(కష్టాలు పడీ పడీ తిరిగి నిలదొక్కుకుంటాం
కాలిపోతున్నా సరే, నిప్పులమీద నడుస్తూనే ఉంటాం
ఎవరీ బాఽధలిచ్చారో…
ఎవరీ బాధలిచ్చారో వారే వాటిని దూరం చేస్తారు- /లోకంలోకి/)
ప్రశాంతంగా, ప్రసన్నంగా సాగిపోయేదే జీవితమనే భ్రమల్లోంచి ఎప్పటికైనా బయటపడాల్సిందే.. జీవితమంటే నిరంతర యుద్ధమనే సత్యం బోధపడేదాకా మనిషి ఎదిగినట్లు కాదు. మనలో మనకే జరిగే అంతర్యుద్ధమే కావచ్చు. చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల మీద యుద్ధం కావచ్చు. మొత్తానికి యుద్ధం తప్పదు. నిజానికి జీవితంలో పోరాటం చేయనిదే శాంతీ లేదు, ప్రసన్నతా రాదు. ఈ నిజాన్ని స్వీకరినంచినప్పుడే ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచే ప్రయత్నం చేస్తాం. ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి గెలిచే ప్రయత్నం చేస్తాం.
ఔరత్‌ హై వో ఔరత్‌ జిసే దునియా కి శరమ్‌ హై
సంసార్‌ మే బస్‌ లాజ్‌ హీ నారీ కా ధరమ్‌ హై
జిందా హై జో…
జిందా హై జో ఇజ్జత్‌ సే వో ఇజ్జత్‌ సే మరేగా -2 / దునియా మే/
లోకం పట్ల వినయవిధేయతలున్న ఆడదే ఆడది. లోకపు గౌరవాన్ని నిలబెట్టే ధర్మమూ ఆడదారి మీదే ఉంది.
సజీవులెవరు?
పరువుగా బతికి పరువుగా మరణించినవారే లోకంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. /లోకంలోకి /)
లోకం నుంచి మనం ఏవి ఆశిస్తామో.. లోకానికి మనం అవే ఇవ్వాలి. ఆ క్రమంలో లోకం పట్ల మనం వినమ్రంగా ఉండాలి. వినయంగా ఉండాలి. అనాదిగా మహిళ ఆ విలువల్ని పాటిస్తూనే ఉంది. అంత వినయంగా ఉంటూనే కుటుంబ గౌరవాన్నీ తద్వారా సామాజిక గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కూడా మహిళ మీదే ఉంది. అయితే, లోకంలో కోటానుకోట్ల మంది పుట్టారు, గిట్టారు. కానీ, నిజమైన బతుకు బతికిందెవరు? కడ ఊపిరి దాకా పరువుగా బతికి, పరువుగా ప్రాణాలు వదిలిన వాళ్లే కదా! గెలిచావా లేదా అన్నదొక్కటే ముఖ్యమా? ఆ నిలిచి, గెలిచే క్రమంలో ఏ విలువల మీద నడిచావన్నది అత్యంత ముఖ్యమవుతుంది.
మాలిక్‌ హై తేరే సాథ్‌ న డర్‌ గమ్‌ సే తూ యే దిల్‌
మెహ్నత్‌ కరే ఇన్సాన్‌ తో క్యా కామ్‌ హై ముష్కిల్‌
జైసా జో కరే….
జైసా జో కరేగా యహాఁ వైసా హీ భరేగా -2 / దునియా మే/
(దైవం నీ తోడుగా ఉన్నాడు బాధలకు భయపడాల్సిన పనేముంది?
మనిషి శ్రమించాలే గానీ, సాఽధ్యం కానిది ఏముంది?
ఎవరు ఎంత చేస్తే….
ఎవరు ఎంత చేస్తే వారికి ఇక్కడ అంతే ప్రాప్తిస్తుంది)
అన్నీ ఊరకే వచ్చిపడాలనుకునే వారికి తన శరీరమే తనకు పూర్తిగా సహకరించదు. అలా కాకుండా, తన శ్రమను నమ్ముకున్నవారిలో , శ్రమైక జీవన సౌందర్యాన్ని దర్శించిన వాళ్లల్లో అన్నేళ్లూ తనలో నిగూఢంగా పడి ఉన్న సర్వశక్తులన్నీ పెల్లుబికి వస్తాయి. ఆ సమయాన సాటి మనుషులూ, సమస్త ప్రకృతీ, చివరికి లోకంలోని దివ్యశక్తులు సైతం మనిషికి అండగా నిలబడతాయి. చేసిన వారికి చేసినంత అన్నట్లు, మనిషి ఏం చేస్తే దాని తాలూకు ఫలితమే వస్తుంది. తుమ్మ మొక్కను నాటి మామిడి పళ్లు కావాలంటే అది అయ్యే పనేనా? ఏమైనా సుఖంగా బతకాలనుకునే వారిని కష్టాలే వెంటాడతాయనేది వాస్తవం. కష్టాన్ని ప్రేమించేవారికే సకల సౌఖ్యాలూ సంప్రాప్తిస్తాయనేది ఏనాడూ మొక్కవోని ఓ పరమ సత్యం.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.