కథ ప్రియమైన పాపాయికి.. (కథ)

కథ ప్రియమైన పాపాయికి.. (కథ)

  • -ఎం.విజయకుమార్
  • 29/11/2014
TAGS:

కథల పోటీలో ఎంపికైన రచన
……………….

‘‘ఒక్కొక్కళ్ళకి ఇకఇకలు.. పకపకలు.. చదువూ సంధ్యాలేదు.. వేలకు వేలు డబ్బులు పోసి ఇంటి దగ్గరవాళ్ళు పంపితే, ఇక్కడికొచ్చి సోకులు పోవడం…’’ వాక్ ప్రవాహం సాగిపోతోంది.. ఎదురుగా తలలు దించుకొని ఆడపిల్లలు.. నరకానికి మారుపేరైన ఓ కార్పొరేట్ కాలేజీలో ఐఐటి ఓరియెంటెడ్‌లో ఇంటర్ చదువుతున్న పిల్లలు వాళ్ళు.. తిట్టిన తిట్టు తిట్టకుండా అరగంట నుంచి తిట్ల ప్రవాహం కొనసాగిస్తున్న ఆమె ఆ క్యాంపస్ ప్రిన్సిపాల్..
‘‘ఒక్కొక్కరూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు… కాకపోతే ఏంటి.. ఆ మార్కులు.? స్టడీ అవర్‌కి రమ్మంటే ఆలస్యంగా రావడం… వచ్చినాక చదుతారా? అంటే అదీ లేదు.. ఒక్కోదానికీ కబురు, ఒక్కోదాన్నీ…’’ పదాన్ని సాగదీస్తూ మధ్యలోనే ఆపింది ప్రిన్సిపాల్. తరువాత వాళ్ళ ఊహకే వదిలేస్తూ. వాళ్ళూ ఊహించుకోగలరు… ఆ తరువాత ఎంత ఛండాలంగా నైనా తిట్టగలిగేది- ఆ క్యాంపస్ డీన్. ప్రిన్సిపాల్ అయినా కొంచెం పర్లేదు. ఈ డీన్ మేడమ్ నోటికి అడ్డూ అదుపూ అసలు వుండదు. పిల్లల్ని తిట్టడం కోసమే ఆమెను అపాయింట్ చేసారేమో అన్నట్లు వుంటుంది.
ఓ పెద్ద సైజు సిలిండర్‌కి చీర కట్టినట్లు కింద నుంచి పైకి సమానంగా ఒకే రకంగా వుంటూ హడావుడిగా క్యాంపస్ అంతా తిరుగుతూ… నానా హైరానా పడే ఆమెను చూస్తే… కొద్దిమందికి భయం.. చాలామందికి అసహ్యం. వారాంతపు పరీక్షల్లో.. కొంచెం మార్కులు తగ్గినాయని చెప్పి ‘్ఫడ్‌బ్యాక్’ పేరుతో ఆ తిట్ల పురాణం. ఆడుతూ పాడుతూ చక్కగా చదవవలసిన పిల్లలను- కార్పొరేట్ కాలేజీ అని పిలువబడే ఓ జైలుకి తల్లిదండ్రుల ఆశ చేర్చింది. అనుక్షణం మఫ్టీలో వున్న పోలీసుల్లాంటి కాలేజీ సిబ్బంది కాపలా మధ్య పుస్తకాలకు వేలాడుతూ వుంటారు. పాఠం అర్థమయిందా..? లేదా..? అన్నదానితో పనిలేదు. స్నానం, తిండి, నిద్ర, వికాసం వంటి వాటితో ఏం పని లేదు. అదృష్టమో, దురదృష్టమో కానీ వీళ్ళు కొంచెం తెలివిగల పిల్లలే. అందుకే ‘్ఫస్ట్‌ట్రాక్’ బ్యాచ్ పేరుతో అనుక్షణం పుస్తకాల గుదిబండను మోస్తూనే వుండాలి. మనుషులతో పనిలేదు. మనసులతో పనిలేదు. మార్కులు ఏ మాత్రం తగ్గినా ‘్ఫడ్‌బ్యాక్’ అనో కౌనె్సలింగ్ అనో.. ఏదో ఒక పేరుతో తిట్ల పురాణం. కాలేజీ యాజమాన్యాల కంటికి వీళ్ళు పిల్లలు కాదు. తరువాతి సంవత్సరానికి అడ్మిషన్లు పెంచే యంత్రాలు. వాళ్ళ విద్యా వ్యాపారానికి పెట్టుబడి సాధనాలు.
పిల్లల మనసుల్లో ఎన్నో ఆలోచనలు. ఎదురుగా ఉన్న ప్రిన్సిపాల్‌ని, డీన్‌ని పొడిచి పారేద్దామన్న కసి. కాలేజీలో పడేసిన అమ్మానాన్నలమీద ఏదో తెలియని కోపం.. కానీ.. ఏమీ చేయలేని నిస్సహాయత. ఒక్కొక్కరి కళ్ళు వర్షించే మేఘాలుగా వున్నాయి. పంటి బిగువున దుఃఖాన్ని భరిస్తున్నారు. చచ్చిపోవాలన్నంత బాధ వుంది కొందరిలో. ఎప్పుడు వదిలేస్తారా..? వెళ్లి తనివిదీరా ఏడుద్దామా.. అన్నట్లు నిలబడి వున్నారు.
‘‘పోయి తగలడండి… ఈసారి మార్కులు తగ్గితే సహించేది లేదు’’ అన్న ప్రిన్సిపాల్ మాట పూర్తయ్యేలోపే… బతుకు జీవుడా అనుకొంటూ అక్కడినుంచి వేగంగా హాస్టల్ గదులవైపు వారు సాగిపోయారు.
***
అర్ధరాత్రి సమయం.. చాలామంది ఏడ్చి.. ఏడ్చి.. అప్పుడే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. నెమ్మదిగా స్వప్న లేచి కూర్చుంది. చుట్టూ చూసింది. మిగతా రూమ్మేట్లు ముగ్గురూ నిద్రలో వున్నారు. వాళ్ళ మనసుల్లో గూడు గట్టుకున్న దైన్యంలా బెడ్‌లైట్ వెలుతురు. ఆ గుడ్డి వెలుతురులోనే- మెల్లగా, శబ్దం రాకుండా తన పెట్టెలోనుంచి ఒక పుస్తకం తీసింది. పుస్తకం మధ్యలో ఓ కవరు లోనుంచి కాగితం తీసి.. టార్చిలైట్ వెలుగులో చదవసాగింది. చదవడం పూర్తయినాక.. కాగితం కవరులో ఉంచి నెమ్మదిగా పెట్టెలో వుంచి పడుకుంది. తనని ఎవరూ గమనించలేదనుకుని నిద్రలోకి జారుకుంది. తనని రెండు కళ్ళు గమనించాయని, ఆ కళ్ళు రూమ్మేట్ ఈశ్వరివని ఆమెకి తెలియదు.
***
ఈశ్వరి నెమ్మదిగా హాస్టల్ గదిలోకి ప్రవేశించింది. క్లాసులు జరుగుతుండగా తనకు ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చేసింది. తరచూ అర్ధరాత్రి వేళ స్వప్న చదివేది ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెలో పెరిగింది. స్వప్న పెట్టెని సమీపించింది. దానికి తాళం వేసి లేదు. పెట్టె తెరచి వెతుకులాట ప్రారంభించింది. అడుగున ఎక్కడో ఓ పుస్తకంలో కవరు కనబడింది. అందులో నుంచి ఓ కాగితం తీసింది. ‘‘స్వప్న ఏం చదువుతున్నదో, అది బాయ్‌ఫ్రెండ్ రాసిన లవ్‌లెటరో ఏంటో.. తేలిపోతుంది’’ అనుకుంటూ కాగితం మడతలు విప్పింది. చూపులు అక్షరాల వెంట పరుగు తీయసాగాయి.
ప్రియమైన పాపాయికి…
ఓ సగటుజీవి అయిన నాన్న వ్రాయునది. మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు అక్షర రూపంలో పొందుపరుస్తున్నాను. బహుశా నామీద ఎంతో కోపం వుండవచ్చు.. ‘నాన్న’ అన్న నా పెద్దరికాన్ని గౌరవిస్తూనో లేదా భయపడుతూనో.. నా నిర్ణయాన్ని నీవు ఆమోదించి వుండవచ్చు. చూసేవాళ్ళకి చిన్న విషయంగానో, హాస్యాస్పదంగానో అనిపించవచ్చు. కానీ నీ వైపునుంచి ఆలోచిస్తే ఎంతో బాధాకర విషయం. చదువు పేరుతో ఇంటికి దూరంగా.. ఓ కార్పొరేట్ కాలేజీలో నువ్వు చేరడం. పేరుకే అది కాలేజీ, నిజానికి అది ఒక జైలు అని తల్లిదండ్రులందరికీ తెలుసు, కానీ.. తప్పదు. తాము నెరవేర్చుకోలేని కలలు తమ పిల్లలన్నా నెరవేర్చాలన్న ఓ పెద్ద ఆశ. పోటీ ప్రపంచంలో పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారేమోనన్న భయం, బలహీనత. అందుకే వద్దు మొర్రో… అన్నా బతిమాలో, బెదిరించో స్థాయికి మించినదయినా అప్పో సోప్పో చేసి చేర్చటం, అక్కడినుంచి వొత్తిడి పెంచడం, ఊహల్లో బతకడం…
అప్పటివరకూ అమ్మానాన్నల ప్రేమను పొంది, చిరు అలకలు, బుజ్జగింపులతో.. ఆనందాలను ఆస్వాదిస్తూ ఓ అందమైన చిన్ని ప్రపంచంలో ఆనందంగా వున్న మిమ్ములను చదువు నెపంతో- కాలేజీ నాలుగు గోడల మధ్య బందీలను చేస్తాం. సగటు తల్లిదండ్రులను అందమైన ప్రకటనల మాయాజాలంలో ముంచేసే ఓ విద్యా వ్యాపార సంస్థలోకి మిమ్ములను నెట్టేస్తాం. మాటలకి, చేతలకు పొంతన లేకపోయినా.. రకరకాల పేర్లతో నిలువు దోపిడీ చేస్తున్నా నోరు విప్పలేని సగటు జీవులం. కాలేజీ వాళ్లు ఎంత దోపిడీ చేసినా ‘ఇదేమిటి..?’ అనే ప్రశ్నించే ధైర్యం చాలక, అనుక్షణం ఆత్మవంచన చేసుకుంటూ ముసుగులో బతికే పిరికివాళ్ళం.
మిమ్ముల్ని కలవడానికొచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులుగా మాకెంత నరకమో.. మెత్తని కత్తితో గుండెను కోస్తున్న ఫీలింగ్. మా బాధలు వింటే.. ఎక్కడ మీ మనసు మారుతుందో అని.. మాట మారుస్తూ.. మిమ్ములను ఏమారుస్తూ.. ప్రేమ పేరుతో తినుబండారాలను మీ నోటిలో కుక్కేస్తూ.. మీ నోరు తెరవనివ్వం. తిరిగివెళ్ళే ప్రతిసారీ.. గేటులోపలి నుంచి మీరు చేతులూపుతుంటే.. చెమ్మగిల్లిన మా కళ్ళు మీకెక్కడ కనబడతాయోనని.. మీరెక్కడ నొచ్చుకుంటారో అని.. ధైర్యంగా మీ కళ్ళలోకి చూసి వీడ్కోలు చెప్పలేని దౌర్భాగ్యులం..
ఇక మీ పరిస్థితి చూస్తే ఏముంది.? స్వేచ్ఛగా ఎగిరే పక్షి రెక్కలు విరిచి, పంజరంలో పడేసినట్లుగా అనుక్షణం మీకు నరకమే. మీరు పుస్తకాలనే తినాలి. పుస్తకాలనే తాగాలి.. పుస్తకాలనే శ్వాసించాలి.. అంటూ… ప్రతిక్షణం ఒత్తిడికి గురిచేసే కళాశాల యాజమాన్యం. ఆడపిల్లలుగా మీకు కలిగే ఇబ్బంది అర్థం చేసుకోకపోగా, మాటలతో మనసును గాయపరుస్తూ సాటి మహిళలే మిమ్మల్ని హింస పెడుతుంటారు. ఎవ్వరినీ ఏమీ అనలేక.. ఏమీ చెయ్యలేక, కోపాన్ని బాధలను దిగమింగుకుంటూ.. మీరు చదువుకునే యంత్రాల్లా మారతారు.
కానీ, కన్నా.. ఓ చిన్న అనుమానం నీకు రావచ్చు. ఇన్ని తెలిసి, ఇంత బాధపడే నాన్న… ఇక్కడ ఎందుకు చేర్పించినట్టు? ముందే చెప్పానుగా- సగటు తండ్రినని. తెలివిగల పిల్లను కార్పొరేట్ కాలేజీలో చేర్పించకుంటే అందరూ తిడతారన్న భయం. రేపు పోటీ పరీక్షల్లో నీకు మంచి ర్యాంక్ రాకపోతే నువ్వు చిన్నబుచ్చుకొని- ‘‘నన్ను అక్కడ చేర్చితే బాగుండేదేమో..’’ అని అనుకోకుండా ఉండాలన్న ఆశతో మంచి కాలేజీలో చేర్చాను.
ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియని నీకు.. హాస్టల్‌లో మిగతా పిల్లల మధ్య గడిపితే… ప్రపంచం అంటే కొంతయినా తెలుస్తుందని మరో ఆశ. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే మనస్తత్వం అలవడుతుందనే ఆలోచనతో హాస్టల్‌కి పంపాను. అయతే- నీకు నేనొక హామీ మాత్రం ఇవ్వగలను. ర్యాంకుల కోసం నువ్వు పరుగెత్తనక్కరలేదు. పరీక్ష అనగానే రాత్రింబవళ్లు హైరానా పడనక్కర్లేదు. చదువులో నీ సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నించు. కొన్నిసార్లు నువ్వు విజయం పొందవచ్చు.. ఇంకొన్నిసార్లు అపజయం పొందవచ్చు. విజయం సాధిస్తే గర్వం వద్దు. ఓటమిలో నిరుత్సాహం చెందకు. ఎవరేమన్నా సీరియస్‌గా తీసుకోకు, అలాగని వారి మాటలను నిర్లక్ష్యం చేయబోకు. మంచి మార్కులు పొందినా నిన్ను మెచ్చుకోని వారు- ఏ కొంచెం మార్కులు తగ్గినా నొచ్చుకొనే మాటలు అనటానికి ముందుంటారు. ఓ చిన్న మాట… కాలేజీ వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు బాధపడొద్దు, కానీ బాధపడినట్లు నటించు. నీ మోములో బాధలాంటి ఏ భావం కనబడకపోతే.. నిర్లక్ష్య ధోరణిలో వున్నావని వారి అహం సంతృప్తి చెందక- మరింతగా మాటలనే ప్రమాదముంది. అప్పుడు ఎంత వద్దనుకున్నా నీ మనసు గాయపడవచ్చు. వీలయినంతవరకు ఏదైనా అనే అవకాశం వాళ్ళకివ్వకుండా చూసుకో.. ఎక్కువగా ఆలోచించి దిగులు పడకు. ఇలా రాశానని ఏమి అనుకోవద్దు. రాయాలనిపించి రాశాను.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకో- ‘‘ప్రతిసారీ విజయం రాదు.. అలాగని అపజయం కూడా తిష్టవేసుకొని కూర్చోదు. నిజాయితీగా ముందు ప్రయత్నించాలి. ఫలితం తరువాత. నీ విజయానికి ఎంత మురిసిపోతానో.. నీ అపజయానికీ అంతే బాసటగానే వుంటాను. సగటు తండ్రినే గాని.. బాధల్లో నిన్ను ఒంటరి చేసేవాడిని మాత్రం కాదు. ఆల్వేస్ యువర్ లివింగ్ డాడ్… వుంటాను.. సెలవ్’’.
***
ఏదో అలికిడి వినబడటంతో- అప్పటికే ఉత్తరం చదవేసిన ఈశ్వరి తలెత్తి గుమ్మం వైపు చూసింది. ఎదురుగా స్వప్న. కోపంతో అరుస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా చిరునవ్వు చిందిస్తూ నిలబడి వుంది. ‘‘నాకు తెలుసు నువ్వు గమనిస్తున్నావని… ఏదో ఒక రోజు ఇలా చేస్తావని ముందే ఊహించాను… నీవు ఊహించుకొనే రహస్యాలేమీ లేవు నాకు’’ అంటూ దగ్గరికొచ్చి ఈశ్వరి భుజంపై చెయ్యి వేసింది. ‘‘బాగా దిగులుగా అనిపించినపుడు.. మా డాడీ రాసిన ఉత్తరం చదువుకుంటాను. నా పక్కన కూర్చొని నన్ను ఓదార్చుతున్నట్లుగా వుంటుంది, అందుకని…’’ వాక్యం పూర్తయ్యేలోపే.. స్వప్నను ఒక్కసారిగా ఈశ్వరి వాటేసుకుంది. ఈశ్వరి మనసులో కూడా ఏదో భారం తొలగిపోయినట్లుగా వుంది. ఇద్దరూ కొద్దిసేపు అలా వుండిపోయారు. స్వప్న ఆ ఉత్తరాన్ని మరోసారి ప్రేమగా చూసుకుంది. ‘‘ఐ లవ్ యు మై డాడ్.. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్’’ -అని ఉత్తరం అడుగున ఆమె రాసుకున్న వాక్యాలు మెరుస్తున్నాయి- వాళ్ళ కళ్ళల్లో కొత్త మెరుపులా.
*

రచయత ఫోన్ నెంబర్:
76600 91053

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.