పశ్చిమ బెంగాల్‌లో అశాంతి

పశ్చిమ బెంగాల్‌లో అశాంతి

  • -తాడేపల్లి హనుమత్ ప్రసాద్
  • 02/12/2014
TAGS:

కలకత్తా ఒకప్పుడు దేశభక్తుల నిలయం. భరతమాత దాస్య శృంఖలాలను త్రెంచేందుకు అసంఖ్యాకంగా విప్లవకారులు విజృంభించిన కర్మభూమి. ఓ అరవిందుడు, ఓ వివేకానందుడు, ఓ నేతాజీ, ఓ రామకృష్ణ పరమహంస ఇలా అనేకమంది తమ జీవన కసుమాలను దేశమాత ముందుంచారు. ‘వందేమాతరం’ నినాదామిచ్చి బంకించంద్రుడు చరితార్థుడయ్యాడు. అది భారత స్వాతంత్రోద్యమ తారకమంత్రమైంది. అలాంటి బెంగాలు స్వాతంత్య్ర సమయంలో పశ్చిమ బెంగాలు, తూర్పు బెంగాలుగా విడిపోయింది. పాకిస్తాన్ పరమైన ఆ తూర్పు బెంగాలు 1971లో పాకిస్తాన్‌నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ముస్లింలు అధికంగా గల ప్రాంతాలు దేశ విభజన సమయంలో మనదేశంనుంచి విడిపోయాయి.
ఇది బ్రిటిషు విభజించు పాలించు విధానానికి పరాకాష్ఠ అయితే, పాకిస్తాన్‌నుంచి బంగ్లాదేశ్ ఏర్పడడం ముస్లింలు సైతం కలిసి జీవించలేరని, ఒక జాతిగా మనలేరని, అంతఃకలహాలతో కాపురం చేయలేరన్న సత్యాన్ని స్పష్టం చేస్తోంది. 1965లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధానంతరం 1971లో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది. తమ దేశ ప్రజలని కూడా చూడకుండా పశ్చిమ పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజల్ని చిత్రవధలు చేసారు. ఆడపడచులను వివస్తల్రను చేసి హింసించారు. వారి కిరాతక చర్యలకు బతకలేని లక్షలాది తూర్పు పాకిస్తాన్ ప్రజలు భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. వలస వచ్చేవారిని మత భేదం లేకుండా తిండి, బట్ట, ఆశ్రయం ఇచ్చి సంవత్సరానికి పైగా పోషించింది పుణ్య భారత్. ప్రపంచంలో ఏ దేశం కూడా ముందుకొచ్చి ఈ బెంగాలీలకు నిష్కృతి మార్గం చూపని రోజుల్లో భారత్ సహాయ సహకారాలనందించింది. బంగ్లాదేశ్ అవతరించింది. ఈ విశాల విశ్వంలో తమకు స్నేహపాత్రులు అనదగ్గవారు భారతదేశ ప్రజలే, తమ అత్యంత మిత్రదేశం హిందూ దేశమే అని వేనోళ్ల కీర్తించారు బంగ్లాదేశ్ పాలకులు, ప్రజలు 1972లో. కాని గత 42 ఏళ్లలో బంగ్లాదేశ్ 20 కోట్లమంది హిందువులను తన్ని భారత్‌కు తరిమేసింది. భారత్ చేసిన మేలు మరిచి మత పిచ్చితో పేట్రేగిపోయింది. శత్రు ఆస్తి చట్టం పేర, తరిమివేయబడ్డ హిందువుల భూమిని స్వాధీనం చే సుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువుల కన్నీటి గాథ ఎంత చెప్పినా తక్కువే.
నేడు పశ్చిమ బెంగాలు బాంబుల తయారీ కేంద్రంగా, తీవ్రవాదుల అడ్డాగా మారి భారత్‌లో అస్థిరత్వం సృష్టించే విదేశీ కుట్ర జరుగుతోంది. బంగ్లాదేశ్ కేంద్రంగా ‘జమాత్ ఉల్ ముజహిదీన్ బంగ్లాదేశ్’ ఉగ్రవాద సంస్థ ఇందుకు తగిన ప్రణాళిక రచించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ వర్గాల దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబర్ 12, 2014 నాడు పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో ఖాగ్రాగర్‌లో ఒక అద్దె ఇంట్లో జరిగిన పేలుడులో షకీల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బంగ్లాదేశీయుడు. 7 ఏళ్లుగా భారత్‌లో ఉంటున్నాడు. పేలుడు పదార్ధాల తయారీ సమయంలో ఈ పేలుడు జరిగింది. ఆ సందర్భంగా బద్రుల్ అలమ్ మొల్లా, మరో ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్టు చేసారు. వారి విచారణనుబట్టి వారికి బంగ్లాదేశ్‌నుంచి ఆర్థికంగా, ఇతరత్రా అన్నివిధాల సహాయం అందుతోందని తెలిసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసారు. పశ్చిమ బెంగాల్‌ను ఒక ఉగ్రవాద అడ్డాగా మార్చేందుకు జరుగుతున్న కుట్ర గురించి చర్చించారు. అప్రమత్తంగా ఉండమన్నారు. మమత ముందు కేంద్రాన్ని విమర్శించారు. కేంద్రం అతి క్రియాశీలత్వం ప్రదర్శిస్తోందన్నారు. కాని విషయం లోతు మమతకు తెలియనిదా? అందరు రాజకీయ నాయకుల్లాగే ఆమె కూడా సెక్యులర్ రంగు పులుపుకున్నారు. 2011లో నాడు శివశంకర్ మీనన్ బంగ్లాదేశ్‌తో తీస్తా జలాల పంపకం గురించి చర్చిస్తే 2014కు పరిస్థితి ఇలా ఎందుకుమారిపోయింది?
‘తాకి’ పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా బంగ్లాదేశ్‌తో వున్న చిట్టచివరి భారత సరిహద్దు జిల్లా. అక్కడ బంగ్లాదేశ్‌నుంచి జనం వలసలు మామూలే. జనంతోపాటు సరుకు, అన్నీ అక్రమ రవాణా అవుతాయి. నిజానికి ‘తాకి’ రమణీయమైన పర్యాటక ప్రాంతం. 2011లో విజయదశమి రోజున లక్షమంది దుర్గాదేవి నిమజ్జనోత్సవ సమయంలో యచ్చామటి నది గుండా బంగ్లాదేశ్‌నుండి అక్రమంగా చొరబడ్డారు. అక్టోబర్ 2, 2014 తరువాత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. కేవలం 110 మంది ముస్లిం కుటుంబాలున్న సరిహద్దు గ్రామం సయ్యద్‌పూర్‌లోకి బంగ్లాదేశ్‌నుంచి ముస్లింలు వస్తూపోతుంటారు. ఆ గ్రామ ప్రజలకు ‘చొరబాటు’కు అర్ధం తెలీదు. చేపలు పట్టుకునే నూర్ మహమ్మద్ సర్దార్ భద్రత కట్టుదిట్టం చేసినా ఈ చొరబాట్లు ఆగలేదని ఒప్పుకున్నాడు. లక్షమంది చొరబాటు గురించి అడిగితే ఆ ఏడాది దుర్గాదేవి ప్రతిమల నిమజ్జన సమయంలో ‘గందరగోళం’ నెలకొందని ఒప్పుకున్నాడు. ‘జీవనోపాధి కోసం వస్తుంటారని’ పెదవి విరిచాడు. నకిలీ పాన్ నంబర్లతో, ఐడిలతో ఇలా యదేచ్ఛగా చొరబాట్లు జరగడానికి భారత్ ధర్మ సత్రమా? ‘తాకి’ వద్ద నియక్తులైన సరిహద్దు భద్రతాదళ అధికారి శివరతన్ సింగ్, నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తరువాత సరిహద్దులు భద్రంగా ఉన్నాయని, చొరబాట్లు ఆగాయని ఒప్పుకున్నాడు.
బుర్ద్వాన్ పేలుళ్ల తరువాత అనుమానాస్పద వ్యక్తుల్ని, సమూహాల్ని సరిహద్దు గ్రామాల ప్రజలు గుర్తించి సరిహద్దు భద్రత దళాలకు అప్పగిస్తున్నారట. అక్రమ చొరబాటుదార్లలో చాలామంది వ్యవసాయ కూలీలుగా, నిర్మాణ కార్మికులుగా వచ్చి రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు. బంగ్లాదేశ్‌తో ‘సరిహద్దు భూమి ఒప్పందం’ (లాండ్ బౌండరీ అగ్రిమెంట్) బిల్లు 2013 నవంబర్‌లో యుపిఎ పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది. కాని ఇంతవరకు పార్లమెంట్ దాన్ని ఆమోదించలేదు. సుమారు 70 లక్షలమంది బంగ్లాదేశీయులు బంగ్లాదేశీయులు భారత్‌లో పనిచేస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆ విధంగా సుమారు సంవత్సరంలో 25 కోట్ల పనిదినాలను మనం బంగ్లాదేశీయులకిస్తున్నాం! అయినా వారికి, బంగ్లాదేశ్ ప్రభుత్వనికి భారత్‌పట్ల కృతజ్ఞత లేదు.
త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ మీదుగా శిక్షణ పొందిన తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడడం విషయమై భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటిరోజే చొరబాటుదార్లు పెట్టే బేడా సర్దుకోవాలని హెచ్చరించారు. బెంగాల్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బిజెపి తమ రాజకీయ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. బీర్‌భూమి వంటి బిజెపి బలంగా ఉన్న ప్రాంతాలలో మమత ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. నిజానికి జమాత్ ఎ ఇస్లామీ వంటి సంస్థల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.బంగ్లాదేశ్ సీనియర్ మంత్రి ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ ‘1971 యుద్ధ నేరాలకు పాల్పడిన జమాత్ ఎ ఇస్లామీ నాయకులకు బంగ్లాదేశ్ కోర్టు శిక్ష విధించిందని, ఇపుడు వారు పాకిస్తాన్ మద్దతుతో భారత భూభాగం ఆసరాగా విజృంభిస్తున్నారని, భారత్ దీన్ని నిరోధించాలని’ కోరారు. 2014 ఎన్నికల తరువాత బెంగాల్ ప్రజలు క్రమంగా మమత చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. 34 ఏళ్ల కమ్యూనిస్టుల కంచుకోటను పగలకొట్టి నందుకు 40 నెలల క్రితం మమతను అంతా అభినందించారు. కాని మమత కూడా కమ్యూనిస్టుల హింసా తత్వాన్ని వొంటబట్టించుకుంది. తాజాగా 2013లో మిడ్నపూర్ జిల్లాలో మతకల్లోలాలు జరిగాయి. 2014 ఎన్నికల్లో 825 హింసాత్మక సంఘటనలు జరిగాయి. బుర్ద్వాన్‌లో జరిగిన పేలుళ్ల విచారణ జరగకుండా, సాక్ష్యాలు ఏవీ ఎన్‌ఐఏకు లభించకుండా స్థానిక పోలీసులు మాయం చేయడం మమత చిత్తశుద్ధిని శంకించేలా చేసాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా విచారణపై ముందు తాత్సారం చేసింది. అందులో ఎన్‌డిఏకు రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చు.
ఎన్‌ఐఎ రంగప్రవేశంతో 150 మంది జిహాదీ తీవ్రవాదుల దురాగతాలు బట్టబయలు కానున్నాయి. అస్సాం పోలీసులు అంతకు ముందే ఆరుగుర్ని అరెస్టు చేసారు. మరో 30 మందిని అనుమానితులుగా గుర్తించారు. అందులో కొన్ని మదరసాలు, స్వచ్ఛం ద సంస్థలు కూడా ఉన్నాయి. బుర్ద్వాన్ పేలుళ్లకు, పాట్నా గాంధీ మైదాన్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ల పేలుళ్లతో ఉన్న సామ్యాన్ని కూడ ఎన్‌ఐఎ గుర్తించింది. సిములియా మదరసాలో తీవ్రవాదుల శిక్షణ విషయం గురించి కూడా ఎన్‌ఐఏ పేర్కొంది.
ఏతావాతా తెలిసేదేమంటే, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బాంబులు కురిసిన నేల జిహాదీ తీవ్రవాదుల బాంబులతో బెంబేలయ్యే పరిస్థితి నేడు నిర్మాణమైంది. పాలకుల ఓటు బ్యాంకురాజకీయాలు, జాతీయ సమగ్రతకు సమైక్యతకు సవాలయ్యాయి. మా, మాటి, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన మమతకు మాతృభూమిని రక్షించుకునేందుకు ఇదే ఆఖరి అవకాశం. లేదా, బెంగాల్‌లో మరో వందేమాతర ఉద్యమం పురుడుపోసుకుంటుంది. 2016 ఎన్నికల్లో జాతీయ శంఖారావం మార్మోగిపోతుంది. అందులో ఉన్మాదులతోపాటు ఉపేక్షాధోరణితో ఉన్న రాజకీయం కూడా మట్టి కరవడం ఖాయం.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.