ఒకే వ్యక్తీ ఆరుమతాలు -శ్రీ అరవింద రావు

హిందూమతంలో ప్రముఖంగా ఉండే మూడు సంప్రదాయాల్ని ప్రచారం చేసిన ఆచార్యులు శ్రీ శంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీమద్వాచార్యులు. వీరి పేర్లు మనలో చాలామందికి తెలుసు. చరిత్ర క్రమంలో వీరిలో మొదటివాడు ఎనిమిదవ శతాబ్దికి చెందిన శంకరాచార్యులు. ఈయన కే రళలో పుట్టాడు. కేవలం 32 సంవత్సరాలే జీవించాడు.ఆ స్వల్పకాలంలోనే దేశం నలుమూలలూ తిరిగాడు. కేరళ నుండి కాశ్మీర దేశం వెళ్లి అక్కడి పండితులతో వాదోపవాదాలు చేసి సర్వజ్ఞపీఠాన్ని ఎక్కాడు. పశ్చిమంలో ద్వారకలోనూ, తూర్పున ఉన్న పూరీ నగరంలోనూ పీఠాల్ని ఏర్పాటు చేశాడు. ఆయన రాసిన పుస్తకాలు అపారం. చాలా మూలగ్రంఽథాలపై వ్యాఖ్యలు వ్రాశాడు. ఇవన్నీ సాధారణంగా తెలిసిన విషయాలే. అయితే అతనికి షణ్మతస్థాపకాచార్యుడు – అంటే ఆరు మతాల్ని స్థాపించినవాడు అనే పేరు ఉందని చాలామందికి తెలీదు. ఒక వ్యక్తి ఆరు మతాల్ని స్థాపించడమేమిటి? ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.
మిగతా మతాల్లో లాగ హిందూమతంలో ఒక సంస్థాగత నిర్మాణం (ౌటజ్చుఽజీట్చ్టజీౌుఽ్చజూ ట్టటఠఛ్టిఠట్ఛ) లేకపోవడం వల్ల ఎవరికి వారే ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి ఆచార్యులు, మహర్షులు అనుకునే ప్రమాదం ప్రాచీన కాలం నుంచీ ఉంది. పరమాత్మను ఏ విధంగానైనా ఉపాసన చేయవచ్చని ఉపనిషత్తులు కూడా స్వాతంత్య్రం ఇచ్చాయి. అందువల్ల శంకరాచార్యుల కాలంనాటికే విచ్చలవిడి సంప్రదాయాలు సమాజంలో ఏర్పడ్డాయి, శివుడు, శక్తి, సూర్యుడు, విష్ణువు మొదలగు దేవతా స్వరూపాలన్నీ వేదాల్లో చెప్పినవే. ఇవన్నీ ఒకే తత్త్వంలో వివిధ కోణాలనుంచి చూస్తే వచ్చే పేర్లు. ఇందులో భరత ఖండంలోని ఒక్కొక్క దేవుడి ఆరాధన ప్రముఖంగా ఉండేది. ఉదాహరణకు కాశ్మీరదేశంలో శివుడి ఆరాధన, బెంగాల్‌ ప్రాంతంలో విష్ణువు ఆరాధన, ఒరిస్సా ప్రాంతంలో సూర్యుడు, తమిళ ప్రాంతంలో షణ్ముఖుడు ఇలాగ. వీరిని ఉపాసన చేసే మార్గాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఉండేవి. మనిషి స్వభావాన్ని బట్టి కూడా పూజా పద్ధతులు ఉంటాయి. శ్రీకృష్ణుడు దీన్నే సాత్విక, రాజస, తామస విధానాలు అని గీతలో చెబుతాడు. సాత్వికులు శ్రద్ధ, భక్తి, నియమనిష్ఠలతో పూజ చేసేవారు. రాజ గుణం ఉన్నవాళ్లు కొంత డాంబికంగా, తీవ్రమైన ఫలాకాంక్షతో పూజించేవారు. తామస ప్రవృత్తి కలవాళ్లు శాస్త్రవిరుద్ధంగా ఘోరమైన రీతిలో పూజలు చేసేవారు.
శంకరాచార్యుల కాలం నాటికి దేశంలో దాదాపు అరవై వరకూ విభిన్న సంప్రదాయాలు ఉండేవట. ఒకే దేవుణ్ని వివిధ సంప్రదాయాల్లో, వివిధ రీతుల్లో పూజించే వారట. వీటిని ముఖ్యంగా దక్షిణాచారము, వామాచారము అనే పేర్లతో రెండు తరగతులుగా చెబుతారు. ఈ పదాల్ని ఈనాటి ఉదాహరణతో బాగా అర్థం చేసుకోవచ్చు. ఒక పై ఆఫీసరు మన కార్యాలయం తనిఖీకి వచ్చినప్పుడు సంపత్సరం పాటు శ్రద్ధగా మనం చేసిన పనిని చూపించి మెప్పించడం అనేది దక్షిణాచారము. అలా కాకుండా పై ఆఫీసరుకు మద్యమాంసాదులు నైవేద్యం చేసి మంచి సర్టిఫికేట్‌ కొట్టడానికి ప్రయత్నించడం వామాచారము. దేవుడైనా, పై ఆఫీసరైనా మనిషి స్వభావం ఒకటే. అందువల్ల మనిషి మంచి ప్రవర్తన కలిగివుండి శ్రద్ధతో పూజించడం దక్షిణాచారం. శ్మశానాల్లో కూర్చుని మద్యమాంసాలు సేవిస్తూ, పూజ చేస్తున్నట్లు భావించుకోవడం వామాచారం.
శంకరాచార్యుల కాలం నాటికి ఇలాంటి వామాచారం అధికంగా ఉండేది. గణేశుడిని పూజించడంలో గణేశుడి బొమ్మపై మద్యాన్ని ఉమ్మి, గణేశుడు తన భార్యతో రతిచేస్తున్నట్లు భావిస్తూ కొద్దిమంది గడిపేవారు. ఇది ఉచ్ఛిష్టగణపతి సంప్రదాయం. కాపాలికులు అనేది మరొక సంప్రదాయం. మనుషుల పుర్రెల్ని మాలగా మెడలో వేసుకుని శ్మశానంలోని బూడిదను ఒంటికి పూసుకుని తాము జ్ఞానులమంటూ తిరిగేవారు మరికొందరు. బొటనవేలు కోసుకుని ఆ రక్తంతో సూర్యుడికి తర్పణం చేసేవారు మరొకరు. ఒంటినిండా శూలాలు గుచ్చుకుని తిరిగేవారు మరొకరు. మరికొందరు మన్మధుణ్ణి పూజించేవారు. మరికొందరు కుబేర భక్తులు. కొందరు భేతాళుణ్ణి, భూతపిశాచాల్నీ వశంలో పెట్టుకునేవారు. వీళ్లందరూ తీవ్రంగా ఉపాసన చేసేవారే. కానీ సమాజానికి సరియైున మార్గదర్శకం చేయ లేదు. ఈ రీతిగా వెర్రితలలు వేస్తున్న సమయంలో నాస్తికవాదం కూడా బలంగా ప్రచారంలోకి వచ్చింది.
శంకరాచార్యులు ఇలాంటి వామాచారాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఉపనిషత్తుల సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధమని వాదించి అనేక దురాచారాల్ని మాన్పించారు. దేశమంతా గమనిస్తే ముఖ్యమైనవి ఆరు సంప్రదాయాలు ఉండేవి. అవి విష్ణువు, శివుడు, శక్తి, వినాయకుడు, సూర్యుడు, షణ్ముఖుడు (కుమారస్వామి) అనే దేవతారూపాలకు చెందిన సంప్రదాయాలు. శంకరాచార్యులు వీటికి సంబంధించిన దక్షిణాచారాన్ని మాత్రం సమర్థించి వీరందరిపై స్తోత్రాలు రాశారు. ఈయన స్తోత్రాలన్నీ వేదాంతపరంగా ఉంటాయి. ఆయా దేవుళ్లను కేవలం కోరికలు కోరడం కాకుండా పరబ్రహ్మ స్వరూపాలుగా వర్ణించడం, తనకు సరైన జ్ఞానం, వైరాగ్యం ఇవ్వమని కోరడం ఈయన స్తోత్రాల్లోని ప్రత్యేకత. పై ఆరు ఆచారాల్ని సమర్థించి, ఆ ఆరు రూపాలు కూడా పరమాత్మ రూపాలుగా చెప్పడం వల్ల ఇతడిని షణ్మతస్థాపకాచార్యుడు అన్నారు. ఈయన కొత్తమతాన్ని దేన్నీ స్థాపించలేదు. ఉన్నవాటి మధ్య ఘర్షణలు లేకుండా సమన్వయం చేశాడు. ఈనాటి భాషలో చెప్పాలంటే ఈయన ఒక గొప్ప సంఘసంస్కర్త.
మనం నేడు కూడా దక్షిణ భారత దేశమంతటా గమనించే పంచాయతనం అనే పద్ధతి శంకరాచార్యుల ప్రభావమే. పంచాయతనం అంటే ఐదు దేవతల్ని ఒకేచోట ఉంచి పూజించటం. ఉదాహరణకు విష్ణు దేవాలయం ఉంటే గర్భగుడిలో విష్ణుమూర్తి విగ్రహం ఉండి, ప్రాకారం నాలుగు మూలలా మిగతా నలుగురు దేవుళ్లు (శివుడు, గణపతి, శక్తి, సూర్యుడు) ఉండడం. శివుడి గుడి అంటే గర్భగుడిలో శివుడిని స్థాపించి మిగతా నాలుగు మూలలా మిగతా దేవుళ్లు ఉండడం. దేవాలయాల్లోనే కాకుండా తమ తమ ఇండ్లలో పంచాయతన పూజ చేసుకునేవాళ్లు కూడా ఇలాగే చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన దేవతా చిహ్నాన్ని (సాలగ్రామము లేదా లింగం మొదలైనవి) మధ్యలో ఉంచి మిగతా చిహ్నాల్ని చుట్టూ ఉంచడం. వివిధ సంప్రదాయాల మధ్య శత్రుత్వం లేకుండా అందరినీ గౌరవించే సంప్రదాయం సమాజంలో స్థాపించడానికి శంకరాచార్యుల ప్రచారమే ముఖ్యకారణం. పాశ్చాత్యదేశాల్లో లాగ పరమతదూషణ మనలో లేదు. వైష్ణవులు విష్ణువే దేవుడని చెప్పినా మిగతావారిని రాక్షసులంటూ దూషించలేదు. శైవులు శివుడే దేవుడని చెప్పినా విష్ణువును రాక్షసుడని దూషించలేదు. విభిన్న సంప్రదాయాలన్నింటినీ ఉపనిషత్తుల గొడుగు కిందికి తేవడం, వాటి మధ్య సంఘర్షణలు లేకుండా చేయడం శంకరాచార్యుల గొప్పదనం.
భిన్నత్వంలో ఏకత్వం చూడటం అంటే ఇదే. ఉపనిషత్తులు ఇలాంటి ఏకత్వాన్నే బోధిస్తాయి. ఈ వాతావరణం దాదాపు 14-15 శతాబ్దాల వకకూ కొనసాగినట్లు తెలుస్తుంది. క్రమక్రమంగా ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పిన బోధనలు బలహీనపడటం వల్ల శైవులు, వైష్ణవులు అనే పేరిట దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ జరగడం దురదృష్టకరమైన పరిణామం. మన మూల గ్రంథాల్లో చెప్పిన ఉదారమైన, శాశ్వతమైన భావాల్ని సరిగా అర్థం చేసుకోవడం, చాటిచెప్పడం ప్రపంచ శాంతికి ఒకే ఒక మార్గం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.