ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు
- -సన్నిధానం నరసింహశర్మ
- 06/12/2014

తెలుగు భాషంటే అలుసా?
-డా.తూమాటి సంజీవరావు,
134 పుటలు,
వెల: రూ.100/-
ప్రతులకు: శ్రీమతి టి.హైమవతి,
35/16, సెకండ్ ఫ్లోర్,
15వ వీధి, అశోక్‌నగర్,
చెన్నై- 600 083.
తమిళనాడు దొరతనం తెలుగు వాచకాల్ని అచ్చువేసిన ఓ సందర్భంలో- వాటిలోని తప్పుల్ని సరిదిద్దవలసిందేనని చెన్నయ్‌లోని ఓ బడిపంతులు న్యాయస్థానానికి వెళ్ళారు; నెగ్గారు. అంతేకాదు ప్రాచీన భాషగా తెలుగు గుర్తింపును వ్యతిరేకించిన కుట్రదారులకి వ్యతిరేకంగా తనంతట తానే ప్రతికక్షిగా ధైర్యంగా నిలబడ్డారు. ఆయనే డా.తూమాటి సంజీవరావు- ఈ ‘తెలుగంటే అలుసా?’ అనే పొత్తానికి రచయిత, సంస్కృతం, ఆంధ్ర భాషల్లో పదప్రయోగ రహస్యాలు, వ్యాకరణాంశాలూ తెలిసిన పండితుడు.
ఉపోద్ఘాత ఉపసంహారాలతో కలసి 27 శీర్షికలుగా సాగిన చిన్న చిన్న వ్యాసాలు- తెలుగు భాషాక్షరాలు, పదాలు, వ్యవహారాలు, మార్పులు, చేర్పులు, పత్రికలవారుప్రయోగించే పదప్రయోగాలపై తమ భావాలు వంటివెన్నింటికో వివరణాత్మక, విమర్శనాత్మక విశేషాలు, విశే్లషణలూ నిండి వున్నాయి. ఇందులో కొన్ని ఇతరులు ఇదివరకే తడిమినవీ వున్నాయి, తాముగా క్రొత్తగా చెప్పేవీ వున్నాయి. విద్యార్థి జనానికే కాక పెద్దవారూ తెలుసుకోవలసినవీ వున్నాయి.
2014 మార్చి బెంగుళూరు పత్రిక ‘తెలుగుతేజం’లో ఇచ్చిన అరవై ఆరు పదాల అపశబ్ద సుశబ్ద పట్టికని ఇవ్వడం ప్రయోజనకరం. పదాల ఒప్పుతప్పుల నిగ్గుతేల్చి చెప్పాలనేది ఒక సామాజికాంశం. అయితే నిజాయితీ అభినందనీయమే అయినా కొన్ని సందర్బాలలో దూకుడుతనం అంత అక్కరలేదనిపిస్తుంది. రామోజీ ఫౌండేషన్‌వారు అత్యుత్సాహంతో తెలుగు భాషకు ఈనాడు, ఈటీవీ ద్వారా చేస్తున్న సేవలు-చాలవని తెలుగువెలుగు మాసపత్రికను ప్రారంభించారు. కాని భాషపై సరియైన అవగాహన లేనివారి ద్వారా వెలుగును ప్రసాదిస్తామంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది’’అన్నారు. (పుట.43). ఇక్కడ ‘అత్యుత్సాహంతో’ అని అనవలసిన అవసరం లేదేమోననిపించింది. మళ్ళీ ఆ పేరాలోనే ముందు వాక్యం ‘కొందరికిగల ఉత్సాహాన్ని ప్రోత్సహించవలసింది’ అని కూడా రచయితే అన్నారు.
గురుభ్యోన్నమః అనకూడదు; గురుభ్యోనమః అనాలని, ‘అథమ’ ప్రయోగం మానుకోవాలని ఇలా కొన్ని చెప్పడం గ్రహించడానికి మంచిదే. అయితే వాడుక భాషలో ప్రజలు కొన్నిటి మార్చడం కొన్నిటికి అర్థాలు కాలార్థాలు చేయడం పరిపాటే. సుస్వాగతం వాడడం మంచిది ఎందుకు కాదో వేత్తలు చెబుతారు. స్వాగతం చెప్పేదానికి బలకరంగా చెప్పినట్లుగా భావించుకుని సుస్వాగతాన్ని ప్రజలు వాడడాన్ని స్వాగతించవలసిందే.
‘‘ఇంటర్‌లో సున్నాల పాపం విద్యార్థులదా? అధ్యాపకులదా?’’ అనే వ్యాసం రచయిత సమస్యాధ్యయన శక్తికి దర్పణం పట్టింది. పాఠశాలల్లో భాషాబోధన విషయంలో ఈయన సూచనలు ఆలోచనాత్మకాలు (పుట 57) తిరుపతిలో 2012లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంలో ‘ఆహూతులకు స్వాగతం’ బానర్ని అర్థవంతంగా విమర్శించారు. అయితే ఒక్కొక్కప్పుడు చెప్పేదానికి సాగతీతతో చెప్పినట్లనిపించింది.
‘్భష కాలానుగుణంగా మారుతుంది. మారటం దాని సహజ లక్షణం. మారుతుంటేనే అది జీవభాష/ జీవద్భాష అవుతుంది. ఆ మార్పులో కృతకత్వం కంటె సహజత్వం ఉండాలి. అటువంటిదే సమాజంలో అంగీకారమవుతుంది’’(పుట 66) అన్నారు. అందువల్లనే కొన్నిటిని సర్దుబాట్లతో చూడాలి.
బ్లాక్‌బోర్డు అంటే నల్లబల్ల సరిపోతుంది. బ్లాక్‌మనీ అంటే ‘నల్లడబ్బు’ ఎలా సరిపోయింది. అది పత్రికలవారు వాడేది అంటారీయన. ఇక్కడ నలుపు భావించుకోవలసింది. పదుగురాడుమాట పాడియై ధర జెల్లింది, నల్లడబ్బు ప్రజాస్థీరీకరణ అయింది. ‘నల్లబజారు’నూ వాడుతున్నాం గదా! అయితే శబ్దమూలాలను వాటి ఆనుపానులను గ్రహించడం మంచిదే. ‘వాల్‌పోస్టరును కుడ్యపత్రిక అని తర్జుమా చేసి వ్రాశారు. తరువాత గోడపత్రిక అని వ్రాస్తున్నారు. గోడ దేశ్యపదం, పత్రిక తత్సమం ఈ రెండింటినీ ఎలా కలిపారో ఆ కలిపినవారికే ఎరుక’ (పుట 67) అన్నారు. భాష ప్రవాహశీలం, కాలానుగుణం అని ఒకప్రక్క ఒప్పుకొంటున్నప్పుడు ఈపాటి మిశ్ర సమాస పదాలను ముఖ్యంగా పాతుకుపోయిన వాటిని ఆహ్వానించకపోతే ఎలా?
సంజీవరావు ఆలోచనలు ఆలోచించవలసినది. అధ్యయనం అభినందించదగినది. భాషకు సంబంధించిన సామాజిక సమరం ప్రస్తుతించవలసింది అని ఎవరికైనా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే.
ఓసారి ఏదో సందర్భంలో ఎవరో చెళ్లపిళ్లవారితో ‘దీనికి వ్యాకరణం’ ఒప్పుకుంటుందా? అంటే శ్రవణ వ్యాకరణం ఒప్పుకుంటే చాలన్నారట.
తూమాటి సంజీవరావు సంస్కృత శబ్దాల విషయంలో ఎక్కువ చెప్పారు. తెలుగు మాటల విషయంలో కూడా వారు రచనలు కొన్నిచేస్తే అవీ ఉపయోగకరంగా ఉంటాయి. తెలుగు భాష అంటే అలుసుగా చూడకుండా ఉండడానికి ఇటువంటి పుస్తకాలు అవసరం

