గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76
115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు
వేదాల తిరు వేంగళా చార్యుల వారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దవరం అగ్రహారం లో 1895లో జన్మించారు .వైష్ణవ కుటుంబం లోని వీరు సంస్కృత ఆంధ్రభాషలను చిన్నతనం లోనే అభ్యసించారు .ఈ రెండు భాషల్లో మహా పాండిత్యాన్ని సంపాదించారు .దర్శన ,అలంకార శాస్త్రాలను మధించారు .స్వంత గ్రామం లోనే పండితుల వద్ద ప్రాధమిక విద్య నేర్చారు .ఒంట బట్టిన గీర్వాణ తెలుగు భాషా పాండిత్యాల వలన సంతృప్తి చెందక విద్యా తృష్ణ తీరక ఆచార్యుల వారు దేశ పర్యటన చేశారు .
విజయ నగరం చేరి మహా మహోపాధ్యాయ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి వద్ద ను ,పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి దగ్గరా న్యాయ ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాధ్యయనం కూలం కషం గా నిష్టతో చేశారు .న్యాయ శాస్త్ర శిరోమణి పరీక్షకు హాజరై సర్వోత్తములుగా ఉత్తీర్ణత సాధించారు .పిఠాపురం రాజాస్థాన విద్వాంసులు శ్రీ గుది మెళ్ళవెంకట రంగా చార్య స్వామి సన్నిధిలో న్యాయ ,వేదాంత ,మీమాంస ,సాహిత్య ,వ్యాకరణ ,తంత్ర సంప్రదాయక విజ్ఞానం లో మెరుగులు దిద్దుకొని సంపూర్ణ ప్రజ్ఞా వంతులని పించు కొన్నారు .అంటే సమస్త శాస్త్రాలలో అపార ప్రజ్ఞా పాటవాలను సాధించి తమ దీమత్వాన్ని ప్రకటించారు .సమకాలీనులలో వేదాల వారి వంటి వారెవరూ లేరని చెప్పుకొనేవారు .
విశిష్టాద్వైత సిద్ధాంతం లో పరిపూర్ణులైన ఆచార్యుల వారు ద్వైత ,అద్వైత ,శుద్దాద్వైతసిద్ధాంతాలలోనూ అపూర్వ ప్రావీణ్యం పొందారు .ఇంతటి సమ ద్రుష్టి ఉన్న వారు ఆ కాలం లో చాలా అరుదుగా ఉండేవారు .’చతుర్మత తత్వ సారం ‘’అని వీరు రాసిన అపూర్వ గ్రంధం తెలుగు భాషా సమితి వారి బహుమతిని పొందింది .సంస్కృత అధ్యాపకులు గా వీరి సేవలు నిరుపానమై నిలిచాయి .మహా పండితులైన శ్రీ శ్రీనివాస శిరోమణి వంటి వారు ఆచార్యుల వారి ప్రముఖ శిష్యులై వర్దిల్లారు .
పూరీ జగన్నాధ క్షేత్ర సంస్కృత కళాశాల ,కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం,చిట్టి గూడూరు శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత కళాశాల లలో ఆచార్యుల వారు సంస్క్రుతాధ్యాపకులుగా సేవలు అంద జేశారు .గుంటూరు ఆంద్ర క్రైస్తవ కళాశాల వీరి ప్రతిభను గుర్తించి సంస్కృత అధ్యాపకులుగా స్వీకరించి సేవలుఅందుకొన్నది .
ఆచార్యుల వారు ఆంద్ర ధ్వన్యాలోకనం ,(లోచన సహితం )కావ్యాలం కార సూత్ర వ్రుత్తి,రస గంగాధరం (పూర్వ ,ఉత్తర ఖండాలు )వ్యక్తీ వివేకం ,(ఆంధ్రానువాదం )తెనాలి రామకృష్ణుని కవిత్వం భారతోపన్యాసాలు ,భాగవత ఉపన్యాసాలు ,రాజ్య ప్రదానం అనే నవల ,జాతక కధలు ,గోపికా వల్లభ శతకం ,చతుర్మత తత్వ సారం,కావ్య ప్రకాశిక (ఆంధ్రానువాదం )వంటి ఎన్నో గ్రంధాలు రచిం చారు .చివరి రోజులు గుంటూరులోని ఆనంద తీర్ధ అగ్రహారం లో గడిపారు .డెబ్భై ఏడవ ఏట వేదాల తిరు వేంగళా చార్యుల వారు మార్చి 1972 లో పరమ పదం చేరుకొన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

