నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం..
- -ద్వా.నా.శాస్ర్తీ
- 06/12/2014

తెలుగు పద్య
నాటకములు-అనుశీలన (సిద్ధాంత గ్రంథం)
-డా.దేవరపల్లి ప్రభుదాస్
వెల: రు.350
ప్రతులకు రచయిత,
ఫోన్ నం. 9440448948
పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు…అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో అనుబంధం ఉంది గానీ అది వ్యక్తిగతం తప్ప పాఠకుడికి లాభించేది కాదు. నాట్యకళ ఆవిర్భావం, రాజుల నాట్య గాన ప్రసక్తి, యక్షగానాలు, ఆరుబయలు రంగస్థలం వంటి వాటిని పూర్వ రంగంగా వివరించారు. అయితే తొలిగా సుగ్రీవ విజయం పేర్కొనాలి. (ఇది రాసిన కవి కందుకూరి రుద్రయ్య అన్నారు-రుద్రకవి గదా!) పద్య నాటకాల ప్రారంభ దశను విశే్లషిస్తూ మంచి సమాచారమిచ్చారు. ప్రభుదాస్ పరిశోధన, విశే్లషణలు ఎంత లోతుగా ఉన్నాయో ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. పురాణం సూరి శాస్ర్తీ గారిచ్చిన నాటక రచనల వర్గీకరణ జాబితాను పట్టుకుని మనకి అందించారు. తెలుగులో మొత్తం 1410 పద్యనాటకాలు రచించబడ్డాయని తెలిపి వాటిని పేర్కొనడంవల్ల పరిశోధన మరింత ప్రామాణికమయింది. నాటక సమాజాలు ప్రారంభంలో ఎన్ని ఉన్నాయో తెలిపే పట్టిక నేటి పరిశోధకులకి ఉపయుక్తంగా ఉంటుంది.
తెలుగులో నాటక వాజ్ఞ్మయం అనగానే డా. ప.ఎస్.ఆర్. అప్పారావు గుర్తుకురావాల్సిందే. వీరి ‘తెలుగు నాటక వికాసము’ అనే ప్రామాణిక గ్రంథం నేటికీ గొప్ప ఆకర గ్రంథమే. ఆ తర్వాత చాలా పుస్తకాలు వెలువడ్డాయి. దేవరపల్లి ప్రభుదాస్ తెలుగు విశ్వవిద్యాలయంలో పద్య నాటకాలపై ప్రత్యేకంగా పరిశోధన చేసారు. ఆ సిద్ధాంత గ్రంథాన్ని అందుబాటులోకి తేవడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. పరిశోధక విద్యార్థులకి, నాటక రంగం వారికి మార్గదర్శకంగా ఉంటుంది.
పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు… అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో అనుబంధం ఉంది గానీ అది వ్యక్తిగతం తప్ప పాఠకుడికి లాభించేది కాదు. నాట్యకళ ఆవిర్భావం, రాజుల నాట్య గాన ప్రసక్తి, యక్షగానాలు, ఆరుబయలు రంగస్థలం వంటి వాటిని పూర్వ రంగంగా వివరించారు. అయితే తొలిగా సుగ్రీవ విజయం పేర్కొనాలి. (ఇది రాసిన కవి కందుకూరి రుద్రయ్య అన్నారు-రుద్రకవి గదా!) పద్య నాటకాల ప్రారంభ దశను విశే్లషిస్తూ మంచి సమాచారమిచ్చారు. ప్రభుదాస్ పరిశోధన, విశే్లషణలు ఎంత లోతుగా ఉన్నాయో ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. పురాణం సూరి శాస్ర్తీ గారిచ్చిన నాటక రచనల వర్గీకరణ జాబితాను పట్టుకుని మనకి అందించారు. తెలుగులో మొత్తం 1410 పద్యనాటకాలు రచించబడ్డాయని తెలిపి వాటిని పేర్కొనడంవల్ల పరిశోధన మరింత ప్రామాణికమయింది. నాటక సమాజాలు ప్రారంభంలో ఎన్ని ఉన్నాయో తెలిపే పట్టిక నేటి పరిశోధకులకి ఉపయుక్తంగా ఉంటుంది. సురభి సమాజంలోని పనారస గోవిందరావు కృషిని కళ్లకి కట్టించారు. ప్రభుదాస్ సూక్ష్మ పరిశీలన చేసారనడానికి విశాఖపట్నంలోని సంగీత మానినీ సమాజం గురించి పేర్కొనడమే నిదర్శనం. మారేపల్లి రామచంద్రశాస్ర్తీగారు(కవిగారు) 1902లోనే దీనిని స్థాపించి వేశ్యలలో మార్పు తీసుకు వచ్చి వారిచేత పాత్రలు వేయించిన సంఘ సంస్కర్త.అందరూ మరిచిపోయిన కవిగారి గురించి సేకరించి రాయడం పరిశోధనకి వనె్న చేకూర్చింది. ఒకే వస్తువు గల నాటకాన్ని ఎవరెవరు రాసారో విశేష సమాచారం ఇచ్చారు.
పద్య నాటకాలకే పౌరాణిక నాటకాలని పేరు. ఇతి హాసాలలో పురాణాలలో గల ఇతి వృత్తాలు పద్య నాటకాలకి మూలాలు. అయితే నాటక రచయితలు తమ కల్పనలు జోడించి ప్రేక్షకుల మెప్పుకోసం, ప్రదర్శనా సౌలభ్యం కోసం రాసేవారు. నాటకాల వర్గీకరణ కూడా రచయిత శ్రమ ఫలితమే! ‘సుప్రసిద్ధ పద్యనాటకాల విశే్లషణ’లో పేర్కొన్న ఏడు నాటకాలూ సుప్రసిద్ధమే కానీ- ‘రక్తబలి’ వీటిలాగ సుప్రసిద్ధమని తెలియదు. ఈ నాటికల ఇతివృత్తం, అంకాల సారాంశం ఇస్తూ విశే్లషించారు. ‘కురుక్షేత్ర’ నాటకంలో కృష్ణుడు కర్ణునితో నువ్విటు వచ్చేస్తే ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందనే పద్యం ఉదహరించారు. అయితే అమూలకమని చెప్పడం సమంజసం. సత్య హరిశ్చంద్ర నాటక విశే్లషణలో ‘కాటిసీను’లో జాషువా పద్యాలు పాడతారని చాలామందికి తెలీదు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన పద్యాలు కావివి ఈ సంగతి సమాజం వారు చెప్పకపోవడం అన్యాయం. ప్రభుదాస్ చెప్పిన కొత్త అంశం ఏమిటంటే జాషువా పద్యాలు కాటిసీనులో చేర్చి పాడడం అనేది బండారు రామారావుగారితో ప్రారంభమైందనడం! జాషువా పద్యాల వల్లనే ఆ సీను కరుణ రస ప్లావితం అవుతోంది. తాండ్ర సుబ్రహ్మణ్యం రాసిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (ఇది కూడా కల్పితమంటారు), విద్వాన్ కణ్వశ్రీ రాసిన ‘బాలనాగమ్మ’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తీ గారి ‘బొబ్బిలి యుద్ధం’, కాళ్లకూరి నారాయణరావుగారి ‘చింతామణి’ నాటకాలను విశే్లషించారు. ‘చింతామణి’ నాటకంలో ప్రదర్శించే వారి నోటినుంచి వచ్చే మితిమీరిన అసభ్య పదాలు తక్కువే. ఇది సంఘ సంస్కరణ నాటకం. కాళ్లకూరి వారు రాసిన మూడు నాటకాలు సంస్కరణాత్మకమైనవే. అసలు ఆయన జీవితమే సంస్కరణ దిశగా సాగింది. చివరగా ‘ఆంధ్ర భీమ’ గుంటుపల్లి ఇన్నయ్య రాసిన క్రైస్తవ తొలి నాటకం ‘రక్తబలి’ గురించి వివరించారు.
మూడో అధ్యాయంలోని ప్రదర్శనా పద్ధతులు అనే అంశం మొదటి అధ్యాయంలోనే రావాల్సి ఉంది. ఇందులో ‘పద్యం చదవడమా? పాడడమా?’ అని వివరించారు కానీ టూకీగా ఉంది. పద్యం రాగభరితమైతే రాగం బాగుందనిపిస్తుంది కానీ పద్యం బాగుందనిపించదని చెప్తారు. కానీ రాగం లేకుండా చదివితే వచనానికి పద్యానికి తేడా ఏముంది? ప్రభుదాస్ చెప్పినట్టు ‘వన్స్‌మోర్’ల కోసం, ఆధిక్యతను ప్రదర్శించడం కోసం రాగాలుతియ్యడం అలవాటైపోయింది. కాబట్టి భావయుక్తంగా, తగిన రాగంలో శ్రుతిపక్వంగా పాడడం సముచితం. ఇంకా పద్యానికి వాద్య సహకారాలు, సంగీతం పాత్ర, రసాభాస, నంది నాటకోత్సవాలు వంటి వాటిని కూడా వివరించారు. నాటకాల విమర్శ మరింత అవసరమనిపిస్తుంది. ఆయా నటుల ప్రత్యేకతల్ని ప్రదర్శనలోగల లోపాలు, చమత్కారాలను కూడా చేరిస్తే బాగుండేది. ఏమైనా పద్యనాటకాలపై ఈ గ్రంథం ప్రామాణికం. మినీ విజ్ఞాన సర్వస్వం!

