బ్రాహ్మణులకు కార్పొరేషన్
బ్రాహ్మణులకు కార్పొరేషన్
- 09/12/2014
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 8: అగ్రవర్ణంగా కొనసాగుతున్నప్పటికీ.. చాలకాలంగా అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న బ్రాహ్మణుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ లిమిటెడ్ పేరిట ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధికి కార్పొరేషన్లు పనిచేస్తుండగా, తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది. ఈ కార్పొరేషన్ ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పనిచేస్తుంది. తరువాత నేరుగా కార్పొరేషన్‌కు విధివిధానాలు రూపొందిస్తారు. రాష్ట్రంలో అగ్రవర్ణంగా ఉన్న బ్రాహ్మణులు చాలా ప్రాంతాల్లో ఆర్ధికంగా మాత్రం వెనుకబడి ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అభివృద్ధికి ఆర్ధికంగా ఆదుకోవాలని చాలాకాలంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విజ్ఞప్తులకు కార్యరూపం వచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో బ్రాహ్మణుల అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అదే మూలధనంతో ఒక్కొక్కటి పది రూపాయల షేర్ విలువతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అవసరం మేరకు అదనంగా నిధులు సమకూర్చేందుకూ నిర్ణయించారు. ఈ సంస్థకు తొలి ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వెనుకబడిన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్‌ను నియమించారు. అలాగే తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా బీసీ సంక్షేమ కమిషనర్ వాణిప్రసాద్‌ను నియమించారు. తొలి షేర్ హోల్డర్లుగా దానకిషోర్, హేమ మునివెంకటప్ప, టి.నారాయణరెడ్డి, వాణిప్రసాద్, రాజా పుష్ప, వైవి అనురాధ, కె.శ్రీనివాసరావు ఉంటారు. ఇక డైరెక్టర్లుగా దానకిషోర్, హేమ మునివెంకటప్ప, వాణిప్రసాద్ ఉంటారు. రాష్ట్ర బీసీ సహకార ఆర్ధిక సంస్థ కార్పొరేషన్‌లోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఉంటుంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.


హైదరాబాదు నుండి వచ్చే వార్తలో కొంత అస్పష్టత ఉంటోంది. ఏ రాష్ట్రప్రభుత్వం? మీరు చెప్పింది తెలంగాణా రాష్ట్రప్రభుత్వం గురించా? సీమాంధ్రప్రభుత్వం గురించా? దయచేసి విశదీకరించగలరు.
LikeLike
కరణాలతో రణాలు – పూజారులకు పంగనామాలు పెట్టిన గతం ఓ చరిత్ర
ఎందరివో అకాల మరణాలు – మరెందరివో అత్మహత్యలు అందుకు ఎన్నో సాక్ష్యాలు
బ్రాాహ్మణ పురోహిత పెళ్ళి కొడుకులు – పెళ్ళాడేందుకు పిల్లలలు దొరకని వర్తమానం
చాలీచాలని నిధులు విదిలించినా – వారి సంక్షేమానికి ఓ ప్రారంభం
శుభం – అందుకోండి మా అభినందనలు మా స్వర్ణాంధ్ర నేతా
ప్రగతి ప్రదాతా – దాతా – విధాతా – నిధులు పెంచండి
— బందా., కన్వీనర్ ,ధన్వంతరీ ఫౌండేషన్ ,విజయవాడ బ్రాంచి.
LikeLike