నగరం’ ఇంకా నరకమే!
- -ఆంధ్రభూమి ప్రతినిధి బృందం, రాజమండ్రి
- 09/12/2014
ఆ ఘోరకలి జరిగి అయిదు నెలలు కావస్తున్నా- అది గతించిపోయే జ్ఞాపకం కాదు.. ఆ గాయం ఇంకా రగులుతూనే ఉంది.. సాయం కోసం తల్లడిల్లుతున్న ఆ గుండెలను ఎలా ఓదార్చగలం..? ఆ అభాగ్యుల బతుకుల్లో కొత్త వెలుగులు ఎలా నింపగలం..? నిస్తేజం ఆవహించిన ఆ గ్రామానికి తిరిగి జవసత్వాలు ఎలా ఇవ్వగలం..? అత్యంత భయానకమైన ఆ ప్రమాదం నుంచి నేర్వాల్సిన పాఠాలను మన పాలకులు ఇంకా ఒంటపట్టించుకోలేదు.. కొంతమందిని విగతజీవులుగా, మరికొంత మందిని వికలాంగులుగా చేసి, జనజీవనంపై పెను ప్రభావం చూపిన ఆ ప్రమాదం అప్పటితో సమసిపోలేదు.. బాధిత కుటుంబాల వారసులు, క్షతగాత్రులు పూర్తిస్థాయిలో సహాయానికి నోచుకోక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు.. ఆర్థిక సమస్యలతో, పలురకాల వైకల్యాలతో సతమతమవుతున్న వారికి ఎలాంటి భరోసా కనిపించడం లేదు.. ఒకప్పుడు స్వర్గసీమలా విలసిల్లిన ఆ గ్రామం ఇప్పటికీ- మానని గాయమే..! గ్యాస్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటన ఆ గ్రామస్థులను నిత్యం ఓ పీడకలలా వెంటాడుతోంది.. పాలకులు ప్రకటించిన ‘పునరావాస ప్రక్రియ’ నేటికీ కొలిక్కిరాలేదు.. ఈ ఏడాది జూలై 27న తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన దుర్ఘటన అనంతరం అక్కడి పరిస్థితులు వ్యవస్థల వైఫల్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి..
================
ఎటు చూసినా పచ్చదనం, ప్రశాంత వాతావరణం.. ఠీవిగా నిలబడ్డ కొబ్బరి చెట్లు.. పగలు, రాత్రి తేడా లేకుండా రోజంతా సందడిగా కనిపించే రహదారులు.. ఇవన్నీ కోనసీమలోని ‘నగరం’ గ్రామంలో ఒకప్పటి పరిస్థితులు.. ఇపుడు అక్కడ శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. ఈ ఏడాది జూలై 27న తెల్లవారక ముందే జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడుతో ఎన్నో బతుకులు తెల్లారిపోయాయి. పైప్‌లైన్ పేలుడుతో వ్యాపించిన అగ్నికీలల్లో 15 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన 27 మందిని ఆస్పత్రుల్లో చేర్చగా చికిత్స పొందుతూ మరో 8 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) 25 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసి చేతులు దులుపుకున్నాయి. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారు ఇప్పటికీ వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అలనాటి భీతావహ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్థులు నేటికీ భయం నీడలో కాలం వెళ్లదీస్తున్నారు.
ఊరు బావురుమంటోంది…
గ్యాస్ పైప్‌లైన్ పేలుడు తర్వాత నగరం గ్రామం వైపు ఎవరూ కనె్నత్తి చూడడం లేదు. అత్యంత సారవంతమైన ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎకరం భూమికి కోటి రూపాయల ధర పలకగా, ఇపుడు పదిలక్షలకే ఇస్తామన్నా కొనేవారు కానరావడం లేదు. దుర్ఘటన తర్వాత చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. అద్దెకు ఉంటున్న వారు ఇళ్లు ఖాళీ చేశారు. ఫలితంగా గ్రామంలో చాలా ఇళ్లు బోసిపోతున్నాయి. భోజనం హోటళ్లు, కూల్‌డ్రింకు షాపులు, టీ దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు తాము రోజూ నాలుగు బస్తాల బియ్యం వండి వార్చేవారమని, ఇపుడు నాలుగు కుంచాల బియ్యం ఉడికించడం గగనంగా మారిందని గ్రామంలోని ఓ హోటల్ యజమాని చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవతుంది. కుటుంబం మొత్తాన్ని రాజాలా పోషించే తమ కుమారుడు ఇప్పటికీ కోలుకోలేదని, తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని భోజనం హోటల్ నడుపుతున్న బోణం నరసింహ మూర్తి, ఆయన భార్య పళ్లాలమ్మ కంటతడి పెడుతూ చెబుతున్నారు. నష్టపరిహారం కింద ఇచ్చిన అయిదు లక్షలు మందుల ఖర్చుకి చాలడం లేదని, ఇక తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. తక్కువ అద్దె ఇచ్చి ఇళ్లలో ఉండమన్నా ఎవరూ ఉండడం లేదని, తమ ఊరి పేరు చెబితే ఇతర ప్రాంతాల వారు హడలెత్తిపోతున్నారని నగరం గ్రామ పెద్ద వానరాశి రాంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎంతోమంది నేడు జీవనోపాధి లేక ఆర్థిక సమస్యలతో అలమటిస్తున్నారు. ఇపుడు రోజూ సాయంత్రం చీకటి పడితే చాలు.. జన సంచారం లేక వీధుల్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. అప్పనపల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఒకప్పుడు నగరంలోనే విడిది చేసేవారు. పేలుడు తర్వాత ఇక్కడ బస చేసేందుకు భక్తులు జంకుతున్నారు.
‘గెయిల్’కి భారీ నష్టం..
నగరం వద్ద పేలుడు సంభవించి నెలలు గడుస్తున్నా పైప్‌లైన్‌ను పునరుద్ధరించడంలో జాప్యం కారణంగా ఓఎన్‌జిసికి రోజుకు 75 లక్షల రూపాయల మేరకు నష్టం జరుగుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సమీపంలోని పలు పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. గత ఆరునెలల్లో సు మారు 135 కోట్ల రూపాయల విలువ చేసే గ్యాస్ వినియోగం కాకుండా పోయిందని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. పైప్‌లైన్ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని ఓఎన్‌జిసి ఉన్నతాధికారులు పేర్కొనడంతో పునరుద్ధరణ పనులను ‘గెయిల్’ అధికారులు చేపట్టలేదు. తాటిపాక, పాశర్లపూడి చమురు బావుల నుంచి గ్యాస్ సరఫరాను చాలావరకూ నిలిపివేశారు. చమురు బావులు మళ్లీ కళకళలాడాలంటే ‘ప్రొడక్షన్ డ్రిల్లింగ్’ పనులను చేపట్టాల్సి ఉంటుంది. అధికారుల నిర్వాకం ఫలితంగా పైప్‌లైన్ పనులకు, డ్రిల్లింగ్‌కు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ ఆధారిత పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకం కావడంతో మరికొంత మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలు చోట్ల ‘గెయిల్ టెర్మినల్స్’ మూత పడడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనాలకు అందడం లేదు. ఓఎన్‌జిసి, గెయిల్‌లకు పూర్వ వైభవం మళ్లీ సాధ్యమా? అన్న అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి.
చేతలు కాలాక..
నగరం దుర్ఘటన నేర్పిన గుణపాఠంతో భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా గెయల్ కొన్ని దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. కెజి బేసిన్‌లో పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న గ్యాస్ ఒత్తిడిని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. పేలుడు నేపథ్యం లో 2015 జూన్‌కు గానీ విజయవాడ వైపు గ్యాస్‌ను సరఫరా చేసే అవకాశం లేదని గెయల్ ప్రతినిధులు చెబుతున్నారు. పైపులెన్ల పరిస్థితిని, భద్రతా చర్యలను సమీక్షించే బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఐఐఎల్)కు గెయిల్ అప్పగించింది. పైప్‌లైన్లను తనిఖీచేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. విశాఖ వైపు పైపులైన్లకు తనిఖీలు నిర్వహిస్తుండటంతో గ్యాస్ రవాణా దాదాపు స్తంభించింది. ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకు, వంట గ్యాస్‌కూ కొరత ఏర్పడింది. పేలుడు ఘటనకు గెయల్ అధికారులదే బాధ్యత అని విచారణ సంఘాలు తేల్చి చెప్పడంతో నగరం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఆ సంస్థ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా నాలెడ్జ్ యూనివర్సిటీని నెలకొల్పాలని నిర్ణయించినట్టు గె యిల్ ప్రతినిధులు చెబుతున్నారు. సామాజిక బాధ్యత కింద ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వారు అంటున్నా, అది కార్యరూపం దాల్చేదెపుడో..? *

