అజరామర స్వరమూర్తి!
- 09/12/2014
ఆయన జీవన ప్రస్థానం శాస్ర్తియ సంగీత స్వర సుధా తరంగ భరిత ఉత్తుంగ సాంస్కృతిక ప్రవాహం…విశుద్ధ భావ గాంభీర్య రస ప్రపంచ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన మధుర నాదం! అన్నమాచార్య, రామదాస, త్యాగరాజ హృదయాంబర జనిత సాహితీ ధునులు ఆయన గళంలో త్రివేణీ సంగమం వలె పొంగులెత్తాయి! అశేష జనావళి హృదయాలలో అజరామర అనుభూతులను పండించాయి! ఆయనే నేదునూరి కృష్ణమూర్తి…కర్నాటక సంగీత సామ్రాజ్యానికి చెరగని కీర్తి, సుస్వర వైభవ దీప్తి, తరతరాలకు తరగని రసస్ఫూర్తి! ఆయన విశుద్ధ విద్వాంసులలో విలక్షణుడు, ప్రసిద్ధులలో ప్రసిద్ధుడు. తెలుగునాట మాత్రమేకాదు దాక్షిణాత్య సంగీత వాటిక అంతటా పరుగులు తీసిన ఆయన మంగళ గళ వినిర్గత గాన మాధుర్య స్రోతస్విని స్వరాల తోటలను పూయించింది.. ఆ పూతోటల పరిమళం సంగీత ప్రియుల గుండెలలో గుబాళిస్తోంది, గుబాళిస్తూనే ఉంటుంది! సప్త దశాబ్ద సంగీతారాధ్య, అధ్యాపన యజ్ఞవేదిక ఆయన జీవన భూమిక! సప్తస్వర ‘సామ’గానంతో నిత్యం సరస్వతీ సమారాధన సాగించిన ప్రణవమూర్తి కృష్ణమూర్తి!! ‘ఇట్టి ముద్దులాడె బాలు డేలరాడు..? వాని పట్టితెచ్చి పొట్టనిండ పాలుపోయరే!’ అన్న అన్నమాచార్యుని గీతాన్ని స్వరపరిచినా..దాశరధిని కరుణాపయోనిధిని కొలచిన గోపన్న అక్షర ‘కదళీ, ఖర్జూరాల’ను శ్రోతలకు రుచి చూపించినా, ‘ఆరగింపవే పాలు, ఆరగింపవే..’ అంటూ త్యాగరాజ రూపమెత్తి ఇష్టదేవత ఎదుట తిష్ఠవేసినా…నేదునూరి వారు అశేష శ్రోతలకు మోదం కలిగించారు, మహావిద్వాంసుల ఆమోదం పొందాడు! మూడున్నర దశాబ్దులకు ముందు తిరుపతి త్యాగరాజ మంటపం వేదికపైన, అన్నమాచార్య కళా మందిర రంగస్థలిపైన ఆయన గొంతెత్తిన నాటి దృశ్య మాలికలు..మూడు నెలలకు ముందు దృశ్య మాధ్యమ పటంపై ప్రస్ఫుటించిన ఆయన స్వర సృజన విన్యాసాలు..ఎడతెగని నాద యోగ శ్రమకు నిదర్శనాలు…వాడని స్మృతుల సుమసరాలు! ఎనబయి ఏడేళ్ల పార్ధివ జీవన ప్రస్తావన గీతంలో కృష్ణమూర్తి సోమవారం చివరి చరణాన్ని ఆలపించి ఉండవచ్చు గాక…ఆయన ఆవిష్కరించిన సంగీత మకరంద ధుని మాత్రం అజరామరంగా పరుగులు తీస్తునే ఉంటుంది! ఆయన ‘శ్రుతి’కి మృతి లేదు. ఆయన స్మృతికి చ్యుతి లేదు! వాగ్గేయ వసుంధర చరిత్రలో నేదునూరి కృష్ణమూర్తి సనాతనుడు, శాశ్వతుడు..మహనీయుడు, ‘్భరతి’ వరాల బిడ్డడు!
నేదునూరి విజయలక్ష్మీ రామమూర్తి దంపతుల పుణ్యఫలం కృష్ణమూర్తి. తెలంగాణలోని కొత్తపల్లిలో క్రీస్తుశకం 1927 అక్టోబర్ 10వ తేదీన పుట్టిన కృష్ణమూర్తి పూర్వాంధ్రలోని పిఠాపురంలో పెరిగాడు, ఉత్తరాంథ్రలోని విజయనగరంలో విద్య నేర్చుకున్నాడు! రాయలసీమలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాల ప్రధాన ఆచార్యునిగా ప్రసిద్ధికెక్కాడు! సంగీత స్వరూపంగా నడయాడి తెలుగువారి భావ సమైక్య స్వభాన్ని నిలబెట్టాడు! కర్నాటక సంగీత సాధన ద్వారా కృష్ణమూర్తి ‘తరాల‘ మధ్య వారసత్వ వారధిని నిర్మించాడు! ఆయన గురువులు ప్రసిద్ధులు, ఆయన శిష్యులు కూడ ప్రసిద్ధులు..ప్రసిద్ధిని, విశుద్ధ సంగీత సంప్రదాయాన్ని ఆయన గురువులనుండి స్వీకరించాడు, శిష్యులకు ప్రదానం చేసాడు! ఆయన తొలి గురువు ద్వారం నరసింహరావునాయుడు! ‘ద్వారం’ కుటుంబం కర్నాటక సంగీత సౌధానికి నిజంగానే ‘ద్వారం’ వంటిది! ద్వారం వెంకట స్వామి నాయుడు విజయనగరం సంగీత శిఖరానికి పతాకం వంటివాడు. ఆయన అన్న కుమారుడు ద్వారం నరసింహారావు…నరసింగరావు సంతానమైన దుర్గాప్రసాద్, మనోరమ, సత్యనారాయణరావు వంటివారు కూడ సంగీత సరస్వతీ సమారాధకులు! ఈ ‘ద్వారం’ కుటుంబంలో ప్రసిద్ధుడైన నరసింగరావు 1940వ దశకంలో కృష్ణమూర్తికి స్వరాక్షరాలు నేర్పించాడు. శ్రీపాద పినాకపాణి ఆచార్యత్వంలో నేదునూరివారు మహా విద్వాంసుడుగా పరిణతి చెందారు! అనితర సాధ్యమైన విలక్షణ సంగీత శైలికి అద్వితీయ ప్రతినిధి…ఇలా ప్రసిద్ధుల వద్ద విద్య నేర్వడం గొప్పతనం కాకపోవచ్చు! ప్రసిద్ధులైన శిష్య గణాలను రూపొందించడం నేదునూరి వారి నిజమైన గొప్పతనం! ఆయన సమకాలంలోనే గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాదు, శోభరాజు వంటి ఆయన విద్యార్థులు విశ్వవ్యాప్త విఖ్యాతిని గడించారు. ఇదీ కృష్ణమూర్తిగారి ఆచార్యత్వ ప్రభావం..రసమయ ప్రపంచంలో ఆయన నిలబెట్టిన సజీవ ప్రతీకలు ఆయన శిష్యులు..
పదకవితా పితామహుడైన అన్నచారార్యుని గీతాలను భాండాగార విముక్తం బ్రహ్మాండమంతా మారుమోగించిన పరిశోధక త్రయంలో కృష్ణమూర్తి చిన్నవాడు! కానీ ఈ కృషిలో అన్నలిద్దరితో సమానంగా ఎన్నదగినవాడు. వేటూరి ప్రభాకర శాస్ర్తీ, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ప్రారంభించిన పరిశోధక ప్రక్రియను ఆ తరువాత కొనసాగించిన స్వరాక్షర మూర్తి నేదునూరి కృష్ణమూర్తి! కృష్ణమూర్తి స్వరపరిచిన అన్నమాచార్యు కీర్తనలు అనేక దశాబ్దులుగా సామాన్య శ్రోతలను, సంగీత కోవిదులను సమానంగా అలరిస్తున్నాయి! ‘అదివో అల్లదివో హరివాసము’ అన్న అన్నమాచార్య సుప్రసిద్ధ కృతికి ‘శ్రుతి’ని కల్పించినవాడు నేదునూరి! ‘హరివాసము’ అన్న పదజాలం ‘శ్రీహరివాసము’గా మారడం తరువాతి కథ! అన్నమాచార్యుడు ‘హరివాసము’ అని మాత్రమే పద ప్రయోగం చేసాడన్నది నేదునూరి వారు చేసిన నిర్ధారణ! అంతేకాదు ‘అదివో..’ అన్న పదంలోని మొదటి అక్షరానికి ‘హరివాసము’లోని మొదటి అక్షరానికి అన్నమయ్య ‘యతి’ సామ్యం కల్పించాడు! ‘శ్రీహరి వాసము’ అని మార్చినప్పుడు ‘యతి’ గతి తప్పిపోతుంది! అందువల్ల నేదునూరి వారి నిర్ధారణకు అనుగుణంగా సంగీత ప్రస్ధానం సాగించడం వర్తమాన వాగ్గేయకారుల, సంగీత విద్వాంసుల విధి! అదే నేదునూరి వారికి మనం ఘటించగలిగిన నిజమైన శ్రద్ధాంజలి…పదునాలుగవ శతాబ్ది నాటి పురందరదాసు కర్నాటక శాస్ర్తియ సంగీత అధ్యయనానికి ‘పాఠ్యక్రమాన్ని’ నిర్ధారించిన మార్గదర్శకుడు! అన్నమాచార్య గీతాలాపనకు ‘స్వర’ మార్గాన్ని సుగమం చేసిన అభినవ పురందరదాసు నేదునూరి కృష్ణమూర్తి! ఈ ‘స్వర’ మార్గాన్ని రాళ్లపల్లి వారు ఆరంభించారు. నేదునూరి కొనసాగించారు! ‘ఏకైవ మూర్తిః బిభిదేత్రిధాసా’-ఒకే మూర్తి మూడు విభిన్న రూపాలుగా కనిపిస్తోంది-అని మహా కవి కాళిదాసు చెప్పినట్టు వేటూరి, రాళ్లపల్లి, నేదునూరి-ఈ ముగ్గురూ ఒకే సంగీత సాహిత్య స్వభావానికి మూడు విభిన్నమైన స్వరూపాలు! నేదునూరివారు ఆలపించిన అజరామర కృతుల సమాహారం ‘అన్నమయ్య అంతరంగ తరంగం’ ‘అన్నమయ్య పదకదంబం’, ‘అన్నమయ్య పదకమలం’, ‘్భద్రాచల రామదాసు కీర్తనలు’, ‘త్యాగరాజ అపురూప కృతులు’ వంటి దృశ్య మాధ్యమ సంపుటాలుగా విస్తరించి ఉంది! ఇవి అనేక సంపుటాలు! ఆయనకు దాదాపు నలబయి పురస్కారాలు, బిరుదులు లభించాయి! ఆయన నాదయోగి..కీర్తి పరాన్ముఖ విరాగి!
తన కవిత్వంలోని ‘ప్రసన్న కథాకలితార్థయుక్తి’ని కవీంద్రులు మెచ్చుకుంటారని ఆదికవి నన్నయ చెప్పుకున్నాడు. మరి కవీంద్రులు కాని ఇతరుల మాట ఏమిటి? వారు అక్షర రమ్యతను చూసి మురిసిపోతారు! నేదునూరి వారి సంగీత సరస్వతి ఇలా విద్వాంసులను సంభ్రమాశ్చర్య స్రవంతిలో ముంచెత్తింది! ‘ఆరోహణ’ ‘అవరోహణ’, ‘ఆలాపన’, ‘శ్రుతి, లయ’ ‘సంగతి’, ‘స్వరం’, ‘రాగం’ మేళకర్త వంటి సంగీత పరిభాష తెలియని సామాన్య శ్రోతలను సైతం నేదునూరి వారి గాత్రం అలరించింది. అలరిస్తునే ఉంటుంది! అతడు అజరామరుడు.



