గీర్వాణకవుల కవితా గీర్వాణం -84
125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి
తర్క సముద్రాన్ని అవలీలగా ఈదిన మహానుభావులు
ఆది భట్ట సుబ్రహ్మణ్యం ,మహా లక్షమ్మ దంపతులకు రామ మూర్తి శాస్త్రి బొబ్బిలి తాలూకా మురడాం అగ్రహారం లో 1961లో జన్మించారు .ద్రావిడ శాఖ కు చెందిన వారు .సొంత ఊరిలోనే పంచకావ్యాలు నేర్చారు .శ్రీ పాద రామ శాస్త్రి గారి దగ్గర తర్క ప్రకరణాలు ,నిరుక్తి ,పక్షత ,వ్యదికరణం ,సిద్ధాంత లక్షణం ,అవచ్చేదకత్వ నిరుక్తి ,పక్షత ,సామాన్య నిరుక్తి అనే తర్క గ్రందాలనన్నిటినీ అవలోడనం చేసు కొన్నారు .కాశీ వెళ్లి కర్నాటక సీతా రామ శాస్త్రిగారి వద్ద ‘’నవ్యభిచారం ‘’,’’సత్ ప్రతి పక్షం ‘’’’,అవయవం ‘’అనే మహోద్గంద్రాలు పఠించారు .వంగ దేశీయులైన వజ్ర కుమార విద్యా రత్న భట్టాచార్యుల వారి నుండి ‘’వ్యుత్పత్తి వాదం ,శక్తి వాదం ‘’,ప్రామాణ్య వాదం ‘’,’’విధి వాదం ,’’ముక్తి వాదం ‘’అనే అపూర్వ గ్రంధాలన్నీ నేర్చుకొన్నారు .అంటే తర్క శాస్త్రాన్ని ఆమూలాగ్రం మదించి ,శోధించి అంతు చూసిన తర్క మార్తాండులన్న మాట .కలకత్తా లో ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణులై ‘’తర్క తీర్ధ ‘’బిరుదం తో పాటు ,అయిదు వందల రూపాయల ‘’నవ రత్న రూప ‘’బహుమతిని పొందారు .
వేదాంత ధిషణ
ఇంతటితో సంతృప్తి చెందకుండా రామ మూర్తి గారు కాశీ లో ద్రావిడ సుబ్రహ్మణ్య దీక్షితులు గారి దగ్గర వేదాంత సూత్ర ,శంకర భాష్యం లో చతుస్సూత్రి వరకు అద్యయనం చేశారు గీతా భాష్యాన్ని ,సూత్ర భాష్యాన్ని ,అద్వైత సిద్ధిని ,గౌడ బ్రహ్మానందాన్ని స్వీయ ప్రతిభ తో స్వయం గా అధ్యయనం చేసి నేర్చుకొని అసమాన ధిషణతో అగ్రగామి అయ్యారు .
బోధనా సామర్ధ్యం
కర్నాటక దేశం లో చిత్రాపూర్ లో ఉన్న శంకర పీఠ స్వామికి వేదాంతాన్ని బోధించారు విద్యార్ధులకు తర్కాన్ని నేర్పారు .అక్కడే మూడేళ్ళు ఉండి తర్వాత దర్భంగా ,మండిమొదలైన సంస్థానాలను దర్శించి పండిత ప్రకాండులను శాస్త్ర చర్చలో మెప్పించి విశేష గౌరవాదరణలు పొందారు .ఉర్లాం సంస్థానం లో తర్క శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు .మూడేళ్ళు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ,పన్నెండేళ్ళు రాజ మండ్రి లో ,రెండేళ్ళు విజయనగర మహారాజా వారి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉంది వందలాది విద్యార్ధులకు తర్కాన్ని బోధించి తీర్చిదిద్దారు .
అక్కడి నుండి తిరుపతి చేరి సంస్కృత కళాశాలకు ప్రధానాచార్యులుగా అమూల్యమైన సేవలు కొద్దికాలమే అందజేశారు ..తర్వాత దక్షిణ దేశ సంచారం చేస్తూ పండితులతో శాస్త్రార్ధ చర్చలు చేస్తూ చివరికి ‘’లుకులాం ‘’అగ్రహారం చేరుకొన్నారు .అక్కడ వితరణ శీలురైన బ్రాహ్మణులు బూర్లె శ్రీరాములు గారు ..శాస్త్రిగారికి భూమిని, వసతి గృహాన్ని ఏర్పాటు చేసి గౌరవించారు .అక్కడే సుఖ జీవనం సాగిస్తూ విద్యార్ధులకు విద్యా బోధన చేశారు .
సన్యాసాశ్రమ స్వీకారం –ముక్తి
రామ మూర్తి శాస్త్రి గారు ‘’శక్తి వాదం ‘’పై ఒక వ్యాఖ్యాన గ్రంధం రచించారు .ఆదినుండి శ్రీ విద్యోపాసకులైన వీరు జీవితాంతం కొనసాగించారు .జీవిత చరమాంకం లో రాజ మండ్రి చేరి గోదావరీ నది తీరం లో ఆవాసం ఏర్పరచుకొని సన్యాసాశ్రమం స్వీకరించారు .యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమె జీవించినా జీవితాన్ని అత్యంత సార్ధకం చేసుకొని ఎదురు లేని తర్క పండితునిగా రాణించి న రామ మూర్తి శాస్త్రి గారు 1920లో ముక్తి పొందారు .
126-రావు బహదూర్ –కిడాంబి రామానుజాచార్యులు
జిహ్వాగ్రాన సరస్వతీ తాండవం
సంస్కృతం లో ఆశు ధార గా కవిత్వం చెప్పి ,ఏక సందాగ్రాహిగా గుర్తింపు పొంది ,న్యాయ శాస్త్ర మధనం చేసి అసాధారణ ప్రజ్ఞా వంతులుగా పేరు పొందిన కిదాంబి రామ చంద్రా చార్యులవారు పశ్చిమ గోదావరి జిల్లా పెంట పాడులో 1853లో జన్మించారు .స్వగ్రామం లోనే సంస్కృతాన్ని అధ్యయనం చేశారు .కావ్య ,నాటక ,అలంకార వ్యాకరణాలలో ఇరవై ఏళ్ళ వయసుకే అపార పాండిత్యాన్ని సాధించారు .వీరి సునిశిత మేధాశక్తి అందరినీ ఆకర్షించింది .
‘’నానార్ధ రత్నమాల ,’’మేదిని ‘’వంటి నిఘంటువులు వీరికి కంఠోపాఠంగా ఉండి జిహ్వాగ్రాన తాండవ మాడుతూ ఉండేవి .వీరి ఏక సందాగ్రాహనం వల్లనే ఇది సుసాధ్యమైంది .పదహారు ,పదిహేడేళ్ళ వయసులోనే అష్టావధానాలు చేసిన చిచ్చర పిడుగు ఆచార్యుల వారు .సంస్కృతం, తెలుగులలో కవితాదారను మహా ఆశువుగా చెప్పి మెప్పించే నేర్పు వీరిది .అనేక రాజాస్థానాలు సందర్శించి ప్రభు సత్కారాలు అందుకొన్న కవీశ్వరుడు .
మహా విద్యా వేత్త
గ్రంధ రచన కంటే విద్యా వేత్తగా విశేషం గా గుర్తింపు పొందారు . వీరి రచనలో ముఖ్యమైనవి ‘’హేస్టింగ్ చరిత్ర ‘’,మత విద్య’’వంటి తెలుగు ఇంగ్లీష్ గ్రందాలున్నాయి .1873లో విజయ నగరం చేరి ఆస్థాన ప్రదానామాత్యులు పెను మత్స జగన్నాధ రాజును ,ప్రభువు ఆనంద గజపతి మహా రాజును దర్శించారు .తన అసాధారణ వైదుష్యం తో వీరిద్దరి మెప్పూ పొంది ,ఆదరణకు లోనై అక్కడే హైస్కూల్ లో చేరి 1874లో ప్రవేశ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు .రాజా వారి ఉపకార వేతనం పొంది మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో ఏం .ఏ .చదివి ఉత్తీర్ణులైనారు .ఆ నాటి మొదటి బాచీ విద్యార్ధులలో వీరున్నారు .న్యాయ శాస్త్రం పై మక్కువ ఎక్కువవ్వటం తో దానినీ చదివి బి ఎల్ పట్టా పొందారు .
విద్యా సేవ
విద్యాభ్యాసం మద్రాస్ లో పూర్తీ చేసుకొని మళ్ళీ విజయనగరం చేరుకొన్నారు .వీరిని మహా రాజావారు తమ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా నియమించి గౌరవించారు ,కొద్దికాలానికే ఆచార్యుల వారు పదోన్నతి పొంది 1887లో ప్రధానాచార్యులు అంటే ప్రిన్సిపాల్ అయ్యారు .1920వరకు ఆ పదవిని అత్యంత సమర్ధ వంతం గా నిర్వహించారు .తర్వాత విజయ నగర సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా నియమిమ్పబడ్డారు .విద్యా రంగానికిరామానుజా చార్యుల వారి సేవను గుర్తించిన అ నాటి ఆంగ్ల ప్రభుత్వం 1912లో ‘’రావు బహదూర్ ‘’బిరుదు నిచ్చి గౌరవించి సత్కరించింది .డెబ్భై ఏడేళ్ళు యశో జీవితాన్ని సార్ధకం చేసుకొని ఆచార్యుల వారు 1928లో కీర్తి శేషులయ్యారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు

