మరో గిన్నీస్ కు రంగం సిద్దం -కూచి భొట్ల ఆనంద్

మరో గిన్నీస్ కు రంగం సిద్దం

ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర – ఈ నెల 26 నుంచి 28 వరకూ మూడు రోజులు హైదరాబాద్‌లో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. 8500 మంది నృత్యకళాకారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మరోసారి గిన్నిస్‌ రికార్డు సాధించనుంది. ఈ సమ్మేళనానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి సిలికానాంధ్ర నిర్వాహకులు కూచిభొట్ల ఆనంద్‌ అనేక విశేషాలు తెలియజేశారు.

‘జగమంత తెలుగుకుటుంబం’ అనేది సిలికానాంధ్ర నినాదం. ఇప్పటి దాకా మేము మూడు సార్లు నృత్య సమ్మేళనాలు నిర్వహించాం. ఈ సారి హైదరాబాద్‌లో ‘నవతరం-నాట్యతరంగం’ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది సమ్మేళనానికి బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి. ఈసారి ఇందులో పాల్గొనేందుకు ఇప్పటి దాకా 8 వేల మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 18 దేశాలకు చెందిన నృత్య కళాకారులు ఉన్నారు. మన దేశం నలుమూలల నుండి దాదాపుగా రెండువేల ఐదువందల మంది హాజరవబోతున్నారు. వీరికి వసతి, ఆతిథ్య ఏర్పాట్లకు సంబంధించిన కూపన్ల పంపిణీ పూర్తయ్యింది. ‘మహాబృంద’ నాట్యంగా పిలిచే ఈ ప్రదర్శనలో ఇప్పటివారికి చాలా మందికి తెలియని ‘రామాయణ శబ్దం’, ‘బాలగోపాలతరంగం’ అంశాలతో కూచిపూడి మువ్వల రవళి జరుగుతుంది. ఈ నెల 26వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు 600 మంది గురువులు, వారి శిష్యబృందం కలిసి కూచిపూడి గ్రామకుల దేవతలైన బాలాత్రిపురసుందరి, రామలింగేశ్వర స్వామి చిత్రపటాలతో కళారూప శోభాయాత్ర నిర్వహిస్తారు. దీనితో కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంప్రదాయబద్ధమైన సూత్రధారుల వేషధారణతో కళాకారుల ఊరేగింపు చేశాక పూర్వరంగం – రంగపూజ చేసి ఽధ్వజావిష్కరణ చేస్తారు. ఆ తరువాతి రెండురోజులు 22 నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇవే కాకుండా అభినయపూర్వక ప్రసంగాలు, ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
మంచి మనసులు తోడై…
ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడమంటే ఖర్చుతో కూడుకున్నదే. అయితే అమెరికా నుంచి ఇక్కడివరకు మంచి పనికి మేమున్నాం అనేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. వారి మంచి మనసుల వల్లనే కార్యక్రమ ఏర్పాటు సాధ్యపడుతోంది. ఈ ఏడాది సమ్మేళనానికి తెలంగాణ ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సాహం లభిస్తోంది. క్రీడల శాఖ వారు గచ్చిబౌలి స్టేడియాన్ని ఉచితంగా కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యాభై లక్షల రూపాయల నిధులిచ్చింది. మిగతాది కళాభిమానుల నుండి సమకూరుతుంది. సమ్మేళనంలో పాల్గొనే వారు 800 రూపాయలు రుసుము చెల్లించాలి.. వాస్తవానికి ఈ కార్యక్రమంలో పాల్గ్గొనే వారికి ఆతిధ్యం ఇవ్వాలంటే నాలుగువేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అందుకే రుసుము వసూలు చేస్తున్నాం.
తొలిసారి అమెరికాలో..
కూచిపూడి అంతర్జాతీయ సమ్మేళనాన్ని మొదటిసారి అమెరికాలోని కూపర్టినో నగరంలో నిర్వహించాం. అప్పుడు నాట్యంలో అగ్రశ్రేణి కళాకారుల్ని, మహామహులైన గురువుల్ని పేరుపేరునా ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో యామిని కృష్ణమూర్తి, రాజారెడ్డి వంటి ప్రముఖులు ప్రేక్షకులను అలరించారు. 335 మంది బృందంతో చేసిన నాట్య ప్రదర్శన మొట్టమొదటి ప్రపంచరికార్డు సృష్టించింది. ఆ తరువాత 2010 డిసెంబర్‌లో హైదరాబాదులో నాలుగువేల మంది ప్రతినిధులతో 2850 మంది నర్తకులు చేసిన ‘థిల్లాన’ కూడా రికార్డులకి ఎక్కింది. 2012లో అంతకన్నామిన్నగా 6500 మంది ప్రతినిధులు, 5700 మంది నర్తకులతో ‘దశావతారం శబ్దం’ రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన మన రికార్డుల్ని మనమే తిరగ రాసేలా చేసింది.
 జిఎల్‌ఎన్‌ మూర్తి, హైదరాబాద్‌
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.