పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న శారదా చిట్‌ఫండ్ స్కామ్‌లో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మదన్ మిత్రను సీబీఐ అరెస్టు చేయడం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ. ఈ కుంభకోణంలో ఒక మంత్రిని అరెస్టు చేయడం ఇదే ప్రధమం కావడంతో పాటు, ఆయన మమతకు అత్యంత సన్నిహితుడు కూడా. అంతకంటే ముఖ్యంగా, శారదా గ్రూప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడిదారు.
ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం మీద దర్యాప్తు కొనసాగుతున్నంత కాలమూ రాజకీయం కూడా రంజుగా సాగుతూంటుంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యేవరకూ పతాకస్థాయిలోనే ఉంటుంది. 15లక్షలమంది అమాయకుల నుంచి వేలాది కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అసలు సంగతి పక్కనబెట్టి, కేవలం ఈ కంపెనీమీదే ఎందుకు కక్షకట్టారని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. ఆ కంపెనీ పెద్దలతో పాటు ఇప్పటికే ఒక్కరొక్కరుగా అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటే, ఇప్పుడు సీబీఐ గాలి ఏకంగా మంత్రులమీదకు మళ్ళినప్పుడు ఎదురుదాడి మరింత పెంచక తప్పదు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొనలేక పిరికిపంద మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనీ, అమిత్ షా, సీబీఐ సమావేశంలో మిత్రా అరెస్టుకు రంగం సిద్ధమైందని తృణమూల్ నాయకురాలు విరుచుకుపడుతున్నారు. బర్ద్వాన్ పేలుళ్ళకు మందుగుండు సమకూరింది ఈ కుంభకోణం సొమ్ముతోనే అంటూ అమిత్‌షా కలకత్తాలో విస్పష్టంగా ప్రకటించి దీదీని గద్దెదించందే వదలనని రణనినాదం చేయడంతో పోరు పతాకస్థాయికి చేరింది.
డబ్బు పోగొట్టుకున్న సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టే, శారదా అధినేత తన కంపెనీల్లో తెలివిగా ఇరికించిన అనేకమంది రాజకీయనాయకులు, సినీనటులు బితుకుబితుకు మంటూ బతుకుతున్నారు. అస్సాం మాజీ డీజీపీ శంకర్ బారువా అవమానం భరించలేక ఏకంగా తనింట్లో ఆత్మహత్యే చేసుకున్నాడు. శారదా మీడియా గ్రూప్‌కి ప్రధాన కార్యనిర్వాహకుడిగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయల వేతనం అందుకున్న తృణమూల్ మాజీ నాయకుడు, మమతా బెనర్జీ కుడిభుజం కునాల్ ఘోష్ ఆత్మహత్య చేసుకుంటానని జైల్లోనే హెచ్చరికలు చేశాడు. ప్రధాన లబ్ధిదారు మమతని ఎందుకు వదిలేశారని ఆయన వాదన.
‘మా నాయకులంతా దొంగలు… చివరకు నేను కూడా దొంగనే. మిగతా వారంతా సర్వసంగ పరిత్యాగులన్నమాట’ అని ఏడాది క్రితం మమత ఎగతాళిగా మీడియాతో వ్యాఖ్యానించారు. వరుసగా జరుగుతున్న అరెస్టులు, ఆ కంపెనీకీ, ఆమె పార్టీ నాయకులకూ బలమైన ఆర్థికబంధాలున్నాయన్న ప్రతిపక్షాల విమర్శలను నిజం చేస్తున్నాయి. తన వాగ్ధాటితో ఎంతగా నెట్టుకువస్తున్నప్పటికీ, ఒకపక్క తీవ్రవాదులకు రాష్ట్రం ఆశ్రయమిస్తోందన్న విమర్శలు, మరోపక్క ఈ కుంభకోణంలో ఒక్కటొక్కటిగా బైటపడుతున్న అంశాలు మమతని ఇరకాటంలో పడవేస్తున్నమాట నిజం. శారదా అధినేత సుదీప్తసేన్ సీబీఐకి రాసినట్టుగా చెబుతున్న లేఖలో చాలామంది తృణమూల్ నాయకుల పేర్లున్నాయనీ, దీనిని ఆధారంగా తీసుకున్నా కాకున్నా అది అందించిన సమాచారంతో ఆధారాలు వెతికిపట్టుకుని మరీ మరిన్ని అరెస్టులు జరగక తప్పదని అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న సుదీప్తసేన్ ఎనిమిదేళ్ళ క్రితం చిట్‌ఫండ్ వ్యాపారాన్ని ఆరంభించి, ఇంత తక్కువ కాలంలో వేలాది కోట్లు నొల్లుకోవడడం రాజకీయ అండ లేనిదే ఏమాత్రం సాధ్యం కాదన్నది వాస్తవం. వసూళ్ళలో మూడోవంతు ఏజెంట్లకే ఇచ్చినప్పుడు వారు వేల సంఖ్యలో తయారవకుండా ఉండరు, లక్షల సంఖ్యలో సామాన్యులను ముంచకుండానూ ఉండరు. సమకూరిన వేలాది కోట్లతో కొత్త కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. బెంగాల్‌నుంచి మరో నాలుగు రాష్ట్రాలకు కూడా సంస్థలనూ వ్యాపారాన్నీ విస్తరించాడు. చట్టాలను ఉల్లంఘించి జరుగుతున్న ఈ వ్యాపార విస్తరణని గుర్తించడానికి సెబీకి మూడేళ్ళు పట్టింది. ఇంతలోగా తన రాజకీయ పలుకుబడిని కూడా విస్తరించుకున్న సుదీప్తొ సేన్ మమత అనుచరుగణాన్ని తన భూరి విరాళాలతో, హోదాలతో తనవైపు తిప్పుకున్నాడు. మంత్రులను తన కంపెనీల్లో పెట్టుబడిదారులుగా మార్చడం, వారి వారి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటిని పరోక్షంగా కాపాడటం, మిథున్ చక్రవర్తి వంటి నేతలుగా ఎదిగిన నటులను భారీ పారితోషికాలతో బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవడం ఇత్యాది జాగ్రత్తలు తీసుకున్నాడు. పార్టీతో ఇంతగా మమేకమైపోయిన కంపెనీపై చర్యలు తీసుకోవడానికి మమత ప్రభుత్వానికి మనసు ఎలా ఒప్పుతుంది? సెబీ విడతలవారీగా హెచ్చరికలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో, చివరకు తన అనుమతిలేకుండా ఎక్కడా పెట్టుబడులు పెట్టకూడదంటూ ఆంక్షలు విధించింది. నాన్‌బ్యాంకింగ్ సంస్థలపై కేసులు పెట్టమంటూ రిజర్వు బ్యాంకు చేసిన సూచనలు కూడా ఆదిలో అమలు కాలేదు. చివరకు సెబీ, రిజర్వుబ్యాంక్ ఒత్తిడి పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడంతో శారదా కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. శారదా కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోనూ,సీబీఐతోనూ విచారించాలని చివరకు న్యాయస్థానాలు చెబితే తప్ప వ్యవహారం ముందుకు కదలలేదు.
ఏడాదిన్నర కాలంగా దర్యాప్తు సాగుతూ, దాడులు జరుగుతూ, అరెస్టులు కొనసాగుతూ శారదా కుంభకోణం కథ ఇప్పటికీ ముగియలేదు. ఈ మధ్యకాలమంతా ఇది రాజకీయంగా అగ్గి రాజేయడానికి తప్ప సామాన్యుడికి స్వస్థత చేకూర్చిందేమీ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొద్ది వందల కోట్ల రిలీఫ్ ఫండ్ వేలాదికోట్లు కోల్పోయిన అమాయక ప్రజలకు పంచడానికి ఏమూలకు సరిపోతుంది? వ్యవహారాన్ని ఎన్నికలతో ముడిపెట్టకుండా సత్వరమే దర్యాప్తు పూర్తిచేయడంతో పాటు, బాధితులందరినీ ఆదుకునేందుకు కేంద్రం రంగంలోకి దిగితే నిరాశానిస్పృహల మధ్య ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సామాన్యులను కాపాడినవారవుతారు.