‘అంతా పాపులే… దేవుళ్లూ దొంగలే’ ….3
- 14/12/2014
- – ఎం.వి.ఆర్. శాస్త్రి
|
చదువు పట్టదు. జులాయిలా తిరుగుతాడు. చెడు సావాసాలు. మాంసం లేనిదే ముద్ద దిగదు. చెడ తాగుతాడు. సానివాడల చుట్టూ తిరుగుతాడు. పక్కా వ్యభిచారి. దేవుడిని నమ్మడు. పైగా తిడతాడు. పరమ నాస్తికుడు. హిందూ మతమంటే మంట. సాధు సంతులంటే అసహ్యం.
ఇదీ అవతారం! ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు మున్షీరాంను చూసిన వారెవరూ అతడి గురించి ఒక్క మంచి మాట చెప్పరు. వీడు భ్రష్టుడు; పాపాత్ముడు; మంచి కుటుంబంలో చెడబుట్టాడు; జన్మలో బాగుపడడు – అని ఏవగించుకుంటారు. అంతగా కంపరం కలిగించిన ఆ నికృష్టుడే మునుముందు గొప్ప ధర్మవీరుడవుతాడు; దారి తప్పిన వారికి మార్గం చూపిస్తాడు; చదువులను వెలిగిస్తాడు; మహా విద్యా సంస్థను నడుపుతాడు; వేద విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెడతాడు; పవిత్రంగా జీవిస్తాడు; జాతి గర్వించదగ్గ మహా పురుషుడవుతాడు – అని కలనైనా ఊహించరు.
మున్షీరాం పుట్టింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ఏడాది ముందు. 1856 ఫిబ్రవరి 22న. పంజాబ్‌లోని జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామంలో. సుక్షత్రియ కుటుంబంలో. వారిది మడి, ఆచారం నిష్ఠగా పాటించే సాంప్రదాయక కుటుంబం. తాతలాగే తండ్రి కూడా శివభక్తుడు. తల్లికీ పూజా పునస్కారాలు జాస్తి. ఐదుగురు పిల్లల తరవాత పుట్టిన కడగొట్టు బిడ్డ కనకేమో మున్షీరాంను (మొదట పెట్టిన పేరు బృహస్పతి. పలకటం కష్టమని దాన్ని మున్షీరాంగా తరవాత మార్చారు) అల్లారుముద్దుగా పెంచింది. తండ్రి నానక్‌రాం ఈస్టిండియా కంపెనీ కొలువులో పోలీసు అధికారి. ఉద్యోగరీత్యా ఊళ్లు తిరుగుతూండేవాడు. తరచు బదిలీలుండేవి. దానివల్ల పిల్లవాడి చదువు సరిగా సాగలేదు. తండ్రికి క్షణం తీరిక లేకపోవటం, తల్లి గారాబం అబ్బాయిని చెడగొట్టాయి.
దానికితోడు చెడు సావాసాలు. చిన్నతనంలోనే బడి ఎగ్గొట్టి బలాదూరుగా తిరగటం, భంగు, సారా తాగటం, చీట్ల పేక ఆడటం అలవాటైంది. వయసొచ్చాక పడుపుగత్తెలనూ మరిగాడు. కొత్వాలుగారి అబ్బాయి కావటంవల్ల ఎవరూ మందలించేవారుకారు. మొదట్లో కాస్తో కూస్తో దేవుడి మీద గురి ఉండేది. పోనుపోను అదీ పోయింది.
దానికీ కొన్ని కారణాలున్నాయి.
మున్షీరాం విద్యాభ్యాసం ఎక్కువగా కాశీలో జరిగింది. తండ్రి అక్కడి కొత్వాలు. చిన్నప్పుడు దైవభక్తి బాగానే ఉండేది. తరచూ గుడికి వెళ్లి విశ్వనాథుని దర్శనం చేసుకునేవాడు. 19వ ఏట ఓ రోజు సాయంత్రం చీకటి పడ్డాక ఆలయానికి వెళ్లాడు. ప్రధానాలయం గుమ్మం బయట ఇద్దరు పోలీసులు కాపలా ఉన్నారు. లోపల రేవా మహారాణిగారు ఉన్నారు. ఆమె అర్చన ముగిసేదాకా ఎవరినీ పోనిచ్చేది లేదన్నారు.
మున్షీరాం దిమ్మెరపోయాడు. అంతలో ఒక పోలీసు అతడు ఫలానా అని గుర్తు పట్టి దయచేసి కొద్దిసేపు వేచి వుండమని మర్యాద చేయబోయాడు. కుర్రవాడు ఆగకుండా విసురున ఇంటికి వెళ్లాడు. రాత్రి నిద్రపట్టలేదు. ఎంతసేపూ అదే ఆలోచన. దేవుడి దగ్గర కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయా? మనుషులకు భేదభావం ఉండొచ్చు. దేవుడికి ఏమైంది? ఎవరో మహారాణి వచ్చిందని మురిసి మామూలు భక్తులను దగ్గరికి రానివ్వనివాడు ఏమి దేవుడు? అసలు దేవుడనే వాడున్నాడా? మనిషి చెక్కిన విగ్రహమేనా?
ఇలా ఆలోచిస్తూ పోయే కొద్దీ విశ్వనాథుడి మీదే కాదు, అందరు దేవుళ్ల మీదా మున్షీరాంకు అసహ్యం వేసింది. రారుూరప్పలకు మహిమ ఉన్నదని మూర్ఖంగా నమ్మే హిందూ మతమంటేనే విరక్తి పుట్టింది. సరైన దారి ఏదో ఎవరు చూపించగలరా అని ఆలోచిస్తే తనకు పరిచితుడైన ఒక క్రిస్టియన్ మిషనరీ స్ఫురించాడు. పుస్తకాల్లో తాను చదివిన రోమ్ నాగరికత, క్రీస్తు కరుణ గుర్తొచ్చాయి.
కిరస్తానీ మతం మీద కుతూహలం కలిగి, తెలిసిన ప్రొటెస్టంట్ మిషనరీ దగ్గరికి వెళ్లాడు. అతడు బోలెడు సంతోషపడ్డాడు. మంచి నిర్ణయం తీసుకున్నావ్. నీ కళ్లు తెరచుకున్నాయి. ప్రభువు నిన్ను కరుణించాడు. వెంటనే మా మతంలోకి మారు’ అని వెంటపడ్డాడు.
‘అది తరవాత చూద్దాం. ముందు మీ మతం గురించి చెప్పు’ అన్నాడు మున్షీరాం. అతడి ప్రశ్నలకు సందేహాలకు అవతలి వాడు జవాబు చెప్పలేక పోయాడు. అతడి వల్ల కాదనుకొని, మున్షీరాం ఓ రోమన్ కాథలిక్ ప్రీస్టు దగ్గరికి వెళ్లాడు. మొదటి వాడి మీద అతడు నయం అనిపించాడు. క్రైస్తవ మతం గొప్పతనం చెబితే అర్థంకాదు. సందేహాలు పక్కనపెట్టి చర్చికి వస్తూ ఉండు. మెల్లిగా నీకే అంతా తెలుస్తుంది’ అన్నాడు.
మనవాడికి ఆ సలహా నచ్చింది. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా చర్చికి వెళ్లసాగాడు. అక్కడి పద్ధతులు, బోధలు అతడిని ఆకట్టుకున్నాయి. ఫాదరీ మంచితనం మరీ నచ్చింది. చేరవలసిన చోటికి చేరాననుకున్నాడు. క్రైస్తవ మతం పుచ్చుకునేందుకు నిశ్చయించుకున్నాడు. ఆ సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఒక స్నేహితుడిని మాత్రం సంప్రదించాడు. అతడేమో ‘మంచిది. అలాగే కానియ్’ అన్నాడు.
ఇంకేం? ‘మీ మతం తీసుకుంటాను. ఏమి చేయాలో చెప్పండి’ అని అడగటానికి ఫాదర్ ఇంటికి వెళ్లాడు. ఆయన కనపడలేదు. ఇంట్లో అలికిడి లేదు. లోపలికి వెళ్లి తొంగి చూస్తే ఇంకో ఫాదరీ ఎవరో ‘నన్’ (క్రైస్తవ సన్యాసిని)తో అసభ్య భంగిమలో కనపడ్డాడు.
మున్షీరాంకి దిమ్మ తిరిగింది. మళ్లీ చర్చి గుమ్మం తొక్కితే ఒట్టు. ఇంకోసారి మధురలో ఏదో గుడి చూడబోతే ఓ మూల గోసాయి పూజారి భక్తురాలితో సరసమాడుతూ కనిపించాడు. ఈ అనుభవాలతో మున్షీరాంకి దేవుళ్లన్నా, మతాలన్నా మనసు విరిగింది. అందరూ దొంగలే, అసలు దేవుడనేవాడే లేడు అని నిశ్చయానికి వచ్చి పక్కా నాస్తికుడయ్యాడు.
అదే సమయంలో అతడి తల్లి మరణించింది. తండ్రికీ వ్యాపకాలు ఎక్కువయ్యాయి. దాంతో కుర్రవాడికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఎప్పుడో తప్ప కాలేజికి వెళ్లేవాడు కాదు. పాఠం పుస్తకాలు పక్కన పడేసి వాల్టర్ స్కాట్, చార్లెస్ డికెన్స్ నవలలు తెగ చదివేవాడు. వారణాసిలో పరీక్ష తప్పి, అక్కడ బాగా లేదని అలహాబాద్ కాలేజిలో చేరాడు. అక్కడా క్లాసులు ఎగ్గొట్టి, సావాసగాళ్లను వెంటేసుకుని జూదాలు ఆడేవాడు. భంగు, మద్యం తెగ తాగేవాడు. సానివాడల్లో గానా బజానాలు చేస్తూ కులికేవాడు. పాపం చేస్తున్నావ్ అని ఎవరైనా మందలిస్తే అంతా పాపులే, అంతటా మోసమే, దేవుళ్లూ దొంగలేనంటూ తిట్టిపోసేవాడు. సాధువులను, సన్యాసులను చూస్తూనే మండిపడేవాడు.
ఇలా దేవుడికీ, ధర్మానికీ ఆమడదూరమై, నాస్తికత్వంలో మునిగి తేలుతూండగా మున్షీరాం ఓసారి సెలవులకు బరేలీ వెళ్లాడు. అప్పట్లో అతడి తండ్రి ఉద్యోగం అక్కడ. ఇంట్లో కూడా ఇలాగే రెట్టమతంతో అడ్డదిడ్డంగా వాదిస్తూంటే ఓరోజు తండ్రి అన్నాడు ‘ఎవరో దయానంద స్వామి అట! ఊళ్లోకి వస్తున్నాడు. చాలా గొప్పవాడు అంటున్నారు. ఈ పిచ్చి వాగుళ్లు మానేసి ఆయన సభకి వెళ్లు. అప్పుడైనా నీ తిక్క కుదురుతుందేమో’ అన్నాడు. ‘నేను వెళ్లను’ అన్నా వినలేదు. ‘పెద్దపెద్ద తెల్లదొరలు కూడా హాజరవుతారట. అక్కడ బందోబస్తూ అదీ జాగ్రత్తగా చూసుకోమని పైనుంచి ఆదేశాలొచ్చాయి. కాబట్టి నేను ఎలాగూ వెళతాను. ఇంట్లో కూచుని ఏం చేస్తావ్, నువ్వూ రావలసిందే’ అని తండ్రి పట్టుబట్టాడు.
కుమారుడికి ఉక్రోషం వచ్చింది. ‘సరే వస్తాలే’ అని పైకి అన్నాడు. ‘వచ్చి ఏమి చేయాలో అది చేస్తానులే’ అని లోపల అనుకున్నాడు. తనకు తోడుబోయిన తొట్టిగ్యాంగును కూడగట్టాడు. సభలో అల్లరి చేసి, వచ్చిన స్వాములారిని పరాభవించాలని పథకం వేశాడు. ‘ఉండు నీ భరతం పడతా’ అని సన్యాసి మీద పళ్లు నూరుతూ, జతగాళ్లను వెంటేసుకుని సభాస్థలికి ఈలవేస్తూ వెళ్లాడు.
తన జీవితంలో అదే గొప్ప మలుపు అని అతడికి తెలియదు.
వచ్చినవాడు సామాన్యుడు కాదు.
స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ్ సంస్థాపకుడు. దేశంలో ఎందరో ఉద్దండ పండితులను శాస్త్ర చర్చల్లో పిండి చేస్తూ, వెర్రిమొర్రి వాదాలను ఖండిస్తూ, వేద ప్రమాణాన్ని అద్భుతంగా నిరూపిస్తూ ఆధ్యాత్మిక రంగంలో ప్రభంజనంలా ముందుకు దూసుకుపోతున్న వేదమూర్తి.
తిట్టుకుంటూ, పళ్లు కొరుకుతూ తీరా స్వామి దగ్గరికి వెళ్లాక ఏమైంది?
మొదటిసారి స్వామి దయానంద సరస్వతిని చూడగానే నాకు కొత్త జన్మ వచ్చింది. నాలో ఏదో విశ్వాసం ఉప్పొంగింది. ఆయన వర్ఛస్సు, తేజస్సు అచ్చెరువు కలిగించి నన్ను కట్టి పడేశాయి. రెవరెండ్ టి.జె.స్కాట్, మరి కొందరు యూరోపియన్లు అక్కడ కూచుని స్వామి చెప్పేది మహా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు స్వామి ఓంకారం గురించి మాట్లాడుతున్నారు. ఒక సంస్కృత పండితుడు ఇంత ధాటిగా మాట్లాడి, చదువుకున్న వారిని ఇంతలా ఆకట్టుకోవడమేమిటని నాకు ఆశ్చర్యం వేసింది. ఆ ఋషి ప్రభావం వల్ల నా వంటి నాస్తికుడికి కూడా గొప్ప ఆత్మానందం కలిగింది.
[Swami Shraddhanand (Autobiography) Ed.M.R.Jambunathan, p.27]
బరేలీ టౌన్‌హాల్‌లో కొథ్దిరోజులపాటు దయానంద ఋషి వరసగా ప్రసంగాలు చేశాడు. క్రైస్తవ మతాచార్యుడు రెవరెండ్ స్కాట్, కమిషనర్ ఎడ్వర్డ్, కలెక్టర్ రీడ్, ఇంకా డజన్ల కొద్దీ యూరోపియన్లు రోజూ హాజరై ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించేవారు. పుక్కిటి పురాణాల గురించి, పంచపాండవుల పెళ్లి, ద్రౌపది బహు భర్తృత్వం లాంటి అంశాల అసంబద్ధత గురించి స్వామీజీ నిశితంగా ఆక్షేపిస్తూంటే తెల్లదొరలు చెవులు రిక్కించి, ముసిముసిగా నవ్వుతూ బాగా ఆనందించేవారు. అదే ఊపులో కన్యకు గర్భం లాంటి క్రైస్తవ లీలలనూ స్వామి అంతే తీవ్రంగా ఎండగడుతూంటే వారి మొగాలు మాడిపోయేవి. అంత పరుషంగా క్రైస్తవ మతాన్ని ఆక్షేపిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉండవచ్చని వారితో వీరితో కబురు పంపించారు. స్వామి ఆ హెచ్చరికలను కొనగోటితో కొట్టిపారేశాడు. ‘కలెక్టర్లకు, గవర్నర్లకు కోపం వస్తుందేమోనని భయపడేవాడిని కాను. ఆత్మకు చావు లేదని నమ్మినవాడిని. నన్ను ఎవరేమి చేయగలరు?’ అని ఆయన మెరిసే కళ్లతో బహిరంగ సభలో గంభీరంగా సవాలు చేస్తూంటే ఆయన ధైర్యానికి అందరూ అవాక్కయ్యారు. మతాలకు, సంకుచిత అంతరాలకు అతీతమైన స్వామి దివ్యబోధ విదేశీయులను ఎంతగా ఆకట్టుకున్నదంటే రెవరెండ్ స్కాట్ ఆయనను తన చర్చికి సాదరంగా ఆహ్వానించి క్రైస్తవ భక్తులకు ప్రవచనం ఇప్పించాడు.
చెబితే ఎవరూ నమ్మని ఈ ఘటనలన్నీ మున్షీరాం జాగ్రత్తగా గమనించేవాడు. దయానంద ఋషి ఊళ్లో ఉన్నన్నాళ్లూ రోజూ ఆయన బసకు వెళ్లి రాత్రి వరకూ ఆయననే అంటిపెట్టుకుని ఉండేవాడు. వీలు చిక్కినప్పుడల్లా తన సందేహాలను అడుగుతూండేవాడు. మళ్లీ నోరెత్తకుండా స్వామి సూటి జవాబులు ఇచ్చేవాడు. అయినా మున్షీరాంకు మనసు సమాధానపడేది కాదు. ఏదో తెలియని అశాంతి. ‘మీరు ఏమి చెప్పినా ఎంత చెప్పినా నాకు దేవుడి మీద గురి కుదరటం లేదు ఎందుకని?’ అని ఓసారి ఆయననే అడిగేశాడు. ‘నీకు గురి కలిగిస్తానని నేనెప్పుడు చెప్పాను? అది దేవుడు చేయాల్సిన పని. సమయం వచ్చినప్పుడు చేస్తాడు’ అన్నాడు స్వామి.
అలాగే జరిగింది. *

