మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2

మరుగునపడ్డ మహనీయుడు — అసలు మహాత్ముడు – 2

  • 07/12/2014
  • |

  • – ఎం.వి.ఆర్. శాస్త్రి

మన పుణ్యభూమిలో మహాత్ములకు కొదవలేదు. ఏ కాలంలో, ఏ రంగంలో చూసినా తమ ఉనికి చేతనే లోకానికి వెలుగు చూపిన మహనీయులు ఆట్టే కష్టపడకుండానే కనిపిస్తారు. అయినా ‘మహాత్ముడు’ అనగానే మనకు స్ఫురించేది మోహన్‌దాస్ కరంచంద్ గాంధీగారే.
గాంధీజీ జీవించి ఉన్న కాలంలో ఆయన మహాత్మ్యాన్ని దేశం యావత్తూ ఏనాడూ ఏకగ్రీవంగా అంగీకరించలేదు. ఆయనను సాక్షాత్తూ దేవుడిగా, లేక అవతార పురుషుడుగా కొలిచినవారు, ఆయన మాటను వేదవాక్కుగా తలిచిన వారు, ఆయన నిప్పుల్లో దూకమంటే దూకడానికి సిద్ధపడినవారు, ఆయనలో ఇసుమంత దోషాన్ని కలనైనా ఊహించలేనివారు ఎంతమంది ఉండేవారో-

గాంధీగారితో తీవ్రంగా విభేదించినవారు… ఆయన సిద్ధాంతాలు, విధానాలు దేశానికి అరిష్టమని నమ్మినవారు… ఆయనను కపటిగా, పక్షపాతిగా, చపలచిత్తుడిగా, అబద్ధాలకోరుగా, నీతిమాలిన వాడిగా ఏవగించుకున్నవారు కూడా అంతే మంది – ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉండేవారు. జాతీయోద్యమంలో చిరస్మరణీయులైన మహా దేశభక్తులు చాలామంది ఏదో ఒక సమయంలో గాంధీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించినవారే. ఆఖరికి నెహ్రు, పటేల్ వంటి అనుంగు శిష్యులు కూడా గాంధీ నడవడిని, పోకడను ఏదో ఒక సమయంలో తప్పుపట్టినవారే.
కోట్ల మందికి ఆరాధ్యుడై, లక్షల మందిని స్వాతంత్య్ర సమరానికి కదిలించి, మొత్తం జాతీయోద్యమ గతిని మార్చిన మహానాయకుడిగా గాంధీగారి ప్రాముఖ్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరు. నీతికి, నియమబద్ధతకు, సత్యసంధతకు మారుపేరైన సత్యాగ్రహ ప్రవక్తగా ప్రపంచం మీద ఆయన వేసిన చెరగని ముద్రను సగౌరవంగా స్మరించవలసిందే. ఎంతైనా మనిషే కనక మానవ సహజమైన బలహీనతలు గాంధీజీలోనూ ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఆయన వల్ల పెద్ద తప్పులు జరిగాయి. వాటికి దేశం భయానకమైన మూల్యం చెల్లించింది.
గాంధీగారి జీవిత కాలంలోనే ఆయన లోపాలను, వైరుధ్యాలను ఎంతోమంది ఆయన మొగం మీదే తూర్పారబట్టినప్పుడు… కాలం గడిచి, ఆయా ఘటనలూ వివాదాలూ వేడి తగ్గి చరిత్ర పుటలకెక్కి, తరాలు మారాక – జాతి జీవితంలో, జాతీయోద్యమంలో గాంధీజీ పాత్ర, దాని మంచి చెడ్డల గురించి ఇంకా లోతైన మూల్యాంకనం జరిగి ఉండాల్సింది. చిత్రమేమిటంటే – కాలం గడిచేకొద్దీ మన అవగాహన మరింత తేటపడవలసింది పోయి అంతకంతకూ మసకబారిపోయింది. జాతీయోద్యమంలో గాంధీ, నెహ్రులను మాత్రమే విరాట్ పురుషులుగా చిత్రిస్తూ, వారిలోని చీకటి కోణాలను కప్పేస్తూ… వారికి గిట్టని వారి, వారితో విభేదించిన వారి ప్రాధాన్యాన్ని పథకం ప్రకారం హరిస్తూ… పథకం ప్రకారం చరిత్రకు వెల్లవేత జరిగింది. దాంతో ఎందరో మహా వ్యక్తులు, వారు సాగించిన ఎన్నో గొప్ప పోరాటాలు, వారు దేశానికి చేసిన అమోఘమైన సేవలు జాతి స్మృతిపథం నుంచి క్రమంగా చెదిరిపోయాయి.
అలా మరుగున పడ్డ మహాపురుషుల్లో మొదటి వరసలో ఎన్నదగిన వాడు స్వామి శ్రద్ధానంద. ఆయన అసలైన మహాత్ముడు. ఆ మాటంటే బహుశా మహాత్మాగాంధీకి కూడా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఆయనను మహాత్ముడిగా మొట్టమొదట గుర్తించిన వాడు మోహన్‌గాంధీగారే. దక్షిణాఫ్రికా నుంచి ఆయన రాసిన జాబే ఇందుకు రుజువు:

Phoenix, Natal
21 Oct, 1914
Dear Mahatmaji
Mr.Andrews has familiarised your name and your work to me. I feel that I am writing to no stranger. I hope, therefore, that you will pardon me addressing you by the title which both Mr.Andrews and I have used in discussing you and your work. Mr.Andrews told also how you, Gurudeva and Mr.Rudra had influenced him. He described to me the work your pupils did for the passive resisters and gave such word pictures of the life at Gurukula that as I am writing this I seem to be transported to the Gurukula. Indeed he has made me impatient to visit the three places described by Mr.Andrews and to pay my respects to the three good sons of India who are at the head of these institutions.
I remain,
Yours,
Mohandas K. Gandhi
[Inside Congress, Swami Shraddhanand, p.48]

ఫీనిక్స్, నేటాల్
21 అక్టోబర్, 1914
ప్రియమైన మహాత్మా
మీ పేరు, మీరు చేస్తున్న పని మిస్టర్ (సి.ఎఫ్) ఆండ్రూస్ నాకు పరిచయం చేశాడు. నాకు తెలియని కొత్త మనిషికి ఉత్తరం రాస్తున్నానని నాకు అనిపించటం లేథు. మీ గురించి, మీరు చేస్తున్న పని గురించి మాట్లాడుకునేటప్పుడు నేను, ఆండ్రూస్ ఉపయోగించే బిరుదుతోనే మిమ్మల్ని సంబోధించాను. ఇందుకు మన్నిస్తారని ఆశిస్తున్నాను. మీరు, గురుదేవ (రవీంద్రనాథ్ టాగోర్), మిస్టర్ రుద్ర (్ఢల్లీలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజి ప్రిన్సిపాల్) తనను ఎలా ప్రభావితం చేసిందీ ఆండ్రూస్ చెప్పాడు. సత్యాగ్రహుల కోసం మీరు, మీ విద్యార్థులు ఏమి చేశారో అతడు నాకు వివరించాడు. గురుకులంలో జీవితాన్నీ కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఆండ్రూస్ వర్ణించిన ఆ మూడు చోట్లకు వెళ్లి, ఆ సంస్థలను నడిపిస్తున్న భారతమాత గొప్ప పుత్రులు ముగ్గురినీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని నేను తహతహలాడుతున్నాను.
ఇట్లు
మీ మోహన్‌దాస్ కె.గాంధి

దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహాన్ని గాంధీజీ 1914లో మళ్లీ మొదలెట్టాడు. అక్కడి సత్యాగ్రహులకు సహాయంగా లక్షల రూపాయల విరాళాలు పంపించాలని గోపాలకృష్ణ గోఖలే భారతీయులకు విజ్ఞప్తి చేశాడు. దానికి ఆశించినంత స్పందన రాలేదు. ఆ సమయాన స్వామి శ్రద్ధానంద (అప్పట్లో ఆయన పేరు లాలా మున్షీరాం. ఇంకా సన్యాసాశ్రమం స్వీకరించలేదు) గాంధీ మొగం ఎరగకపోయినా, ఆయన సాగిస్తున్న దక్షిణాఫ్రికా ధర్మ యుద్ధానికి మద్దతుగా నిధుల సేకరణకు నడుము కట్టాడు. హరిద్వార్‌లో ఆయన గురుకులంలోని బ్రహ్మచారులు నెల రోజుల పాటు పాలు, నెయ్యి మానేసి, సెలవు రోజుల్లో కూలీ పని చేసి 1500 రూపాయలు పోగు చేశారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ఉత్తరంలో గాంధీజీ ప్రస్తావించింది ఈ సహాయానే్న.
‘విశ్వకవి టాగోర్, శ్రద్ధానంద, ప్రిన్సిపాల్ సుశీల్‌రుద్ర – ఈ ముగ్గురు ఆండ్రూస్ దృష్టిలో త్రిమూర్తులు. దక్షిణాఫ్రికాలో ఉండగా అతడు ఎప్పుడూ వాళ్ల గురించి చెబుతూండేవాడు’ అని గాంధీజీ తన ఆత్మకథ “The First Experience” అధ్యాయం)లో రాశాడు.
1914లో సత్యాగ్రహం ముగించాక ఫీనిక్స్ ఆశ్రమం సహచరులు, గాంధీ స్వదేశానికి మరలారు. లండన్‌లో ఆగి తనను కలసి వెళ్లవలసిందని గోఖలేగారు గాంధీకి చెప్పాడు. ఆయన కోసం ఎదురుచూస్తూ, ఇతర రాచకార్యాలు చక్కబెడుతూ గాంధీ లండన్‌లో ఉండగా, ఫీనిక్స్ బృందం ఇండియా వచ్చేసింది. వారిని ఎక్కడ ఉంచాలన్న సమస్య ఎదురైంది. అప్పుడు ఆండ్రూస్ సలహాపై వారికి హరిద్వార్‌లోని కాంగ్‌డీ గురుకులంలో బస ఏర్పాటు చేశారు. ‘స్వామి శ్రద్ధానందజీ వారిని సొంత పిల్లల్లా చూసుకున్నాడు’ అని గాంధీజీ ‘ఆత్మకథ’లో మెచ్చుకున్నాడు.
ఇండియాకు తిరిగొచ్చాక సంవత్సరంపాటు దేశమంతా తిరిగి రమ్మన్న గోఖలే మాట మీద చేసిన దేశాటనలో గాంధీగారు హరిద్వార్ వెళ్లి తాను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న మహాత్ముడిని కలిశాడు. అది 1915లో కుంభమేళా కాలం.
‘గురుకుల్ చేరి మహాత్మా మున్షీరాంజీని కలవటం గొప్ప అనుభూతి. ఆయనది భారీ విగ్రహం. బయటి రణగొణ ధ్వనికీ, గురుకులంలోని ప్రశాంతికీ అద్భుతమైన తేడా కనిపించింది. మహాత్ముడు నన్ను తన ప్రేమతో ముంచెత్తాడు. బ్రహ్మచారులు నన్ను చక్కగా చూసుకున్నారు’ అని ‘ఆత్మకథ’లో గాంధీజీ గుర్తు చేసుకున్నాడు.
తనకు సమయానికి సహాయం చేసిన మహాత్ముడిని కలిసి, ఆయన ప్రేమకు, అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడయ్యాక ఆయనతో గాంధీగారి అనుబంధం మరింత గట్టిపడి ఉండాలి. గట్టిపడింది కూడా. మున్షీరాంజీకీ గాంధి మహా నచ్చాడు. ఆయన ప్రభావంవల్లే గురుకులాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయనను సంప్రదించే, ఆయన సలహా మేరకే సత్యాగ్రహ సమరంలో తొలి అడుగులు వేశాడు.
కాని ఈ అన్యోన్య మైత్రి ఎక్కువ కాలం నిలవలేదు. లోతుకు వెళ్లే కొద్దీ, చేదు అనుభవాలు అయ్యే కొద్దీ, గాంధీ తత్వం స్వామీజీకి బోధపడింది. క్రమేణా దూరం పెరిగింది. శ్రద్ధానందకు లౌక్యం తెలియదు. తాను నమ్మింది కుండబద్దలు కొట్టినట్టు ఎదుటి వారి మొగం మీదే చెప్పడం ఆయనకు అలవాటు.
ఆ సంగతి మొదటి ఉత్తరంతోనే గాంధీగారికి అర్థమైంది. దక్షిణాఫ్రికా నుంచి ఆయన ఇంగ్లీషులో జాబు రాస్తే ‘మహాత్మా మున్షీరాం’ హిందీలో జవాబు రాశాడు. పైగా ‘హిందీని ‘జాతీయ భాష’ చేయాలని కోరుకునేవాడికి తన దేశవాసులతో విదేశీ భాషలో ఉత్తరాలు రాసే హక్కు లేదు’ అని నిష్కర్షగా చెప్పాడు కూడా. గాంధీగారు మళ్లీ ఎన్నడూ ఆయనకి ఇంగ్లీషులో రాయలేదు. ఇద్దరి మధ్య ఉత్తరాలన్నీ హిందీలోనే నడిచాయి.
కొసమెరపు: పైన ఉటంకించిన తొలిజాబు కోసం గాంధిగారి ‘కలెక్టెడ్ వర్క్స్’లో వెతక్కండి. అది మీకు అక్కడ కనపడదు. వేరొకరిని ‘మహాత్మా’ అని సంబోధించడం మహాత్ముడి కాంతి వలయానికి శోభనివ్వదని అనుకున్నారో?! అలా సంబోధించబడ్డ వాడు ఉత్తరోత్తరా తమ మహాత్ముడికి ఎదురు తిరిగినవాడు కావటం ఇబ్బందిగా తోచిందో?! గాంధీగారి ఉత్తరాలను, అన్ని రకాల రాతలను సంపుటీకరించిన మహాత్ములు మొత్తానికి ఆ ఉత్తరాన్ని దాచేశారు.
పైన చెప్పుకున్న చరిత్ర వెల్లవేతకు ఇదో చిన్న ఉదాహరణ!
*

స్వార్థం లేని విరాగి
లాలా మున్షీరాం మొదటి నుంచీ దమ్మున్న కార్యకర్త. ఆయన చేసే పనే ఆయనకు నాయక స్థానాన్ని ఎల్లప్పుడూ తెచ్చిపెడుతూ వచ్చింది. ప్రజలను ఆకర్షించే లక్షణం ఆయనలో ఉంది. ఆయన మొహమాటం లేకుండా మాట్లాడుతాడు. తాను నమ్మినదాన్ని పట్టుదలతో ఆచరిస్తాడు. 1892-93లోనూ, ఆ తరవాతా జరిగిన కొన్ని సంఘటనలనుబట్టి మున్షీరాంజీ ప్రాచుర్యం కోసం, నాయకత్వం కోసం పాకులాడుతాడని నేను భావించాను. ఆ అభిప్రాయం తప్పని నెమ్మది మీద గ్రహించాను. ప్రతి గొప్ప వ్యక్తికీ ఉన్నట్టే మున్షీరాంజీలోనూ కొన్ని లోపాలు ఉండవచ్చు. ఆయన త్వరగా ఉద్వేగానికి లోనవుతాడు. కాని అది తాను మనస్ఫూర్తిగా అంకితమైన ఆశయాల విషయంలోనే. ఆయన సేవానిరతి గొప్పది. తన విశ్వాసాల కోసం ఎంతటి కష్టనష్టాలకైనా వెనుదీయడు. ఆయన లేశమైనా స్వార్థం లేని విరాగి.
-లాలా లజపతిరాయ్ (‘ఆత్మకథ’లో)

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.