పొద్దున్నే న్యూస్ చానళ్లలో ‘సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం’ అనే వార్త చూసినవాళ్లు ఓ పట్టాన నమ్మలేకపోయారు. సినీ వర్గాలు, ముఖ్యంగా సంగీత ప్రపంచం అసలు నమ్మలేకపోయాయి. చక్రి అనగానే ముఖాన చిరునవ్వులు చిందించే అతని స్థూలకాయమే కళ్లముందు కదులుతుంది.
‘అతను ఒళ్లు తగ్గించుకుంటే బాగుంటుంది కదా’ అనే అభిప్రాయం కలుగుతుంది. అంటే చక్రిని తెలుగువాళ్లంతా తమ ఇంటి సభ్యుడిలా సొంతం చేసుకున్నారన్న మాట. అతి కొద్దిమందే తమ మంచితనంతో ఇలా తమ ప్రభావాన్ని చూపగలుగుతారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని కంభాలపల్లిలో పుట్టి పెరిగిన జిల్లా చక్రధర్ హైస్కూల్ రోజుల నుంచే సంగీతంలో తొలి అడుగులు వేసి, స్టేజ్ మీద పాటలు పాడటం మొదలుపెట్టాడు. డిగ్రీ ఫస్టియర్‌లో ‘ఒకే జాతి మనదిరా, ఒకే బాట మనదిరా, కులభేదం లేదురా, ఒకే కులం మనదిరా’ అంటూ ఓ దేశభక్తి గీతం రాసి, దానికి బాణీలు కూడా కట్టి, ఆ పాటను పాడి బహుమతి సంపాదించేశాడు. సెకండియర్‌లో ‘సాహితి కళాభారతి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాడు. సినిమాల్లో ప్రయత్నిస్తే రాణిస్తావంటూ స్నేహితులు పోరుపెడుతుంటే, పదివేల రూపాయలు అప్పుచేసి మరీ హైదరాబాద్ వచ్చి వాలాడు. ఇక్కడి వాతావరణం చూసి, హైదరాబాద్‌పై పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. ‘హైదరాబాద్ నాదే’ అనుకున్నాడు. అప్పుచేసిన డబ్బు ఖర్చుపెట్టి ‘పండు వెన్నెల’ అనే ఆల్బమ్ తయారు చేయించాడు. కానీ కొనేవాళ్లు కనిపించక పోవడంతో దాన్ని పక్కనపెట్టేశాడు. జీవిక కోసం ఓ హాస్పిటల్‌లో డిమాన్‌సే్ట్రటర్‌గా చేరి, మూడేళ్లు పనిచేశాడు. ఆ టైమ్‌లోనే ‘పండు వెన్నెల’ను బయటకు తెచ్చాడు. అది డబ్బు తేకపోయినా, పేరుతెచ్చింది. ఆడియో కంపెనీలతో పరిచయాలు కలిగేలా చేసింది. మరో మూడేళ్లలో 30 ఆల్బమ్స్ విడుదల చేశాడు. చక్రధర్‌ను ‘చక్రి’గా మార్చుకున్నాడు. తన ఆల్బమ్స్‌లో ఎక్కువ పాటలను ‘చల్లగాలి’ అనే కలంపేరుతో రాశాడు. మొత్తం పాటలు తనే రాసిన ‘చిరుగాలి’ ఆల్బమ్‌ను చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశాడు. అప్పటివరకూ చేసిన ఆల్బమ్స్ అన్నింటికంటే ‘చిరుగాలి’ సూపర్‌హిట్. చిత్రమేమంటే అతడికి మ్యూజిక్ డైరెక్టర్‌గా కాక గేయ రచయితగా సినీ పరిశ్రమ నుంచి ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఓ చిరంజీవి సినిమా కూడా ఉంది. కానీ గీత రచయితగా కాకుండా సంగీత దర్శకుడిగా కెరీర్ కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్న చక్రి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలకు సంగీత దర్శకుడి ఆఫర్లు వచ్చాయి. వాటినీ వద్దనుకున్నాడు చక్రి. ఎందుకంటే అతని లక్ష్యం పెద్ద సినిమా. కానీ ‘మరో చరిత్ర’ సృష్టిస్తుందని చెప్పడంతో ‘మరో ప్రేమకథ’ అనే సినిమాకు ఎంతో ఇష్టంగా ఐదు పాటలు కంపోజ్ చేశాడు. కానీ ఆ సినిమా వెలుగు చూడలేదు. కానీ వాటిలో ఒక పాటను ఆ తర్వాత నాగార్జున నటించిన ‘శివమణి’ సినిమాకు వాడుకున్నాడు. ఆ పాట ‘మోనా మోనా మోనా’. ఈసారి ఏ తప్పూ చేయకూడదనుకుంటూనే ‘లైఫ్’ అనే సినిమాని ఒప్పేసుకున్నాడు. అదీ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ సినిమాలు ఆగిపోవడంలో తన బాధ్యత ఏమీ లేదని సర్దిచెప్పుకున్నాడు. ‘లిటిల్ హార్ట్స్’కు ట్యూన్స్ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజయ్యింది, కాకపోతే కాస్త ఆలస్యంగా. ఆ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌తో తొలి సినిమా ‘బద్రి’ చేసి, సూపర్‌హిట్‌నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌తో పరిచయం కలిగింది. అప్పుడు జగన్నాథ్, తన రెండో సినిమా ‘బాచి’ని తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆల్బమ్స్‌కు చక్రి కట్టిన బాణీలు విన్న ఆయన ‘బాచి’కి బాణీలు కట్టే బాధ్యతను చక్రికి అప్పగించాడు. ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో బాణీలు కట్టాడు. పెద్ద చిత్రం కదా, తన దశ తిరుగుతుందనుకున్నాడు. కానీ ‘బాచి’ బాక్సాఫీస్ వద్ద పల్టీకొట్టడంతో, చక్రికి ఎవరూ ఆఫర్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ జగన్నాథ్ తన తదుపరి చిత్రం ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’కు కూడా చక్రినే తీసుకున్నాడు. ప్రొడ్యూసర్లు ఒప్పుకోకపోవడంతో, చక్రి కోసం వాళ్లనే మార్చేశాడు జగన్నాథ్. ‘‘పైసలు పెట్టే ప్రొడ్యూసర్ వద్దంటే డైరెక్టర్ ఏం చేస్తాడు? కానీ జగన్ అన్నయ్య అలా చెయ్యలేదు.
నాకిచ్చిన మాట కోసం వేరే నిర్మాతను వెతుక్కున్నాడు తప్ప, మాట తప్పలేదు. అందుకే మా అమ్మానాన్నల తర్వాత నేను ఆజన్మాంతం రుణపడి ఉండాల్సింది జగన్ అన్నయ్యకే’’ అని ఓసారి చెప్పాడు చక్రి. ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’ విడుదలైంది. సినిమా హిట్. మ్యూజిక్ సూపర్ హిట్. ఆ సినిమాతో సంగీత దర్శకునిగా చక్రికీ, హీరోగా రవితేజకూ బ్రేక్ లభించింది. ఆ సినిమా తర్వాత చక్రి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలుగలేదు. జగన్నాథ్ డైరెక్షన్‌లోనే మరో ఎనిమిది సినిమాలకు బాణీలు కూర్చాడు. వాటిలో ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘శివమణి’, ‘దేశముదురు’ వంటి హిట్లున్నాయి. ‘నేనింతే’లో అతను బాణీలు కూర్చగా, భాస్కరభట్ల రాసిన ‘కృష్ణానగరే మామా..’ పాట తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయగీతం లాంటిదని కితాబిచ్చాడు జగన్నాథ్. చివరిగా వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గోలీమార్’. అలాగే వంశీ సినిమాలు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’లతో పాటు, ‘సత్యం’, ‘చక్రం’, ‘దేవదాస్’, ‘కృష్ణ’, ‘ఢీ’, ‘సింహా’, ‘జై బోలో తెలంగాణ’, ‘దేనికైనా రెడీ’ వంటి సినిమాలు సంగీత దర్శకునిగా అతనికి పాపులారిటీని తెచ్చాయి. వీటిలో ‘సింహా’ సినిమా అతనికి ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డును అందించగా, అంతకంటే ముందు ‘సత్యం’ సినిమా సంగీతం ఫిల్మ్‌ఫేర్‌ను తెచ్చింది. ఇప్పటివరకూ అతను వందకు మించిన చిత్రాలకు సంగీతం సమకూర్చగా, 97 చిత్రాల వరకూ విడుదలయ్యాయి. ‘ఢీ అంటే ఢీ’, ‘టామీ’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. చక్రి సంగీతంలోని ఆకర్షణ ఏమంటే, అవి మాస్, క్లాస్ తేడా లేకుండా అందరినీ అలరించగలగడం. ఈ మధ్యే అతను ఓ గట్టి నిర్ణయం తీసుకున్నాడు – ‘పనిని మరో పది రెట్లు ఎక్కువగా ప్రేమించాలి. సంగీతంతోనే ఎక్కువ సమయం స్నేహం చేస్తూ సంగీత జీవన సౌందర్యాన్ని ఆస్వాదించాలి’ అని. కానీ ఆ కోరికను తీర్చుకోకుండానే నాలుగు పదుల చిన్న వయసులోనే, సంగీత ప్రియులనందరినీ విషాదంలో ముంచేసి వెళ్లిపోయాడు.
స్థూలకాయమే శాపం
కేవలం నలభై ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చక్రి మరణించడానికి స్థూలకాయమే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెరీర్ కొత్తలో ముద్దుగా, బొద్దుగా ఉన్న చక్రి తర్వాత స్థూలకాయునిగా మారిపోయారు. అందుకే ఆయనను టాలీవుడ్ బప్పీలహిరి అని సరదాగా అనేవారు. చక్రి భోజనప్రియుడనే సంగతి ఆయన సన్నిహితులందరికీ తెలిసిన విషయమే. అయితే అది మామూలు భోజనప్రియత్వం కాదు. అపరిమితమైన భోజనప్రియత్వం. సంగీత దర్శకునిగా బాగా బిజీగా ఉన్న కాలంలో రాత్రి వేళల్లోనూ పనిచేస్తూ రావడంతో ఆయన ఆహారపుటలవాట్లు, తద్వారా ఆయన జీవన విధానం మారిపోయాయి. రాత్రంతా పనిచేసి, తెల్లవారుఝామున నాలుగింటికి ఆయన ఆహారం తీసుకున్న సందర్భాలు చాలా ఎక్కువనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం ఎక్కువగా భుజిస్తూ రావడం వల్ల ఆయన స్థూలకాయునిగా మారిపోయారు. దానితో పాటు ముఖం కూడా నలుపు తిరిగిపోయింది. ‘‘నేను కూడా ఒకానొక సమయంలో 148 కిలోల బరువు వరకూ పెరిగాను. అప్పుడు బరువుతగ్గమని చక్రి నాకు పలుసార్లు సలహా ఇచ్చాడు. నేనేమో అతన్ని తగ్గమని చెప్పేవాణ్ణి. అతని సలహాను నేను పాటించాను. ఇప్పుడు నా బరువు 75 కిలోలు. కానీ తను మాత్రం మరింత బరువు పెరిగిపోయాడు’’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారు దర్శకుడు సూర్యకిరణ్. ఆయన డైరెక్ట్ చేసిన ‘సత్యం’ సినిమాకు సమకూర్చిన సంగీతంతో చక్రి మొదటిసారిగా ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. ఒక్క సూర్యకిరణే కాదు, సన్నిహితులు చాలామంది బరువు తగ్గించుకొమ్మని చక్రికి చెబుతూనే ఉండేవాళ్లు. లైపోసెక్షన్ చేయించుకుంటే, దాని వల్ల తర్వాత దుష్ఫరిణామాలు ఎదురవుతాయేమోననే సందేహాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే ఆయన తన ఆహార అలవాట్లనూ మార్చుకోలేక పోయారు. ఆ బలహీనతే చివరకు గుండెపోటు రూపంలో ఆయన ప్రాణాన్ని కబళించిందని చెప్పాలి.
ఆంధ్రా బప్పీలహరి – చక్రి
బప్పీలహరిని ఎప్పుడూ కావాలని అనుకరించలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చక్రి. ఆయన ఒకప్పుడు బంగారు గొలుసులను ఇష్టంగా ధరించేవారు. వాటి గురించి గతంలో ఓ సారి చక్రి చెబుతూ ‘‘నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు చెయిన్ వేసుకోవాలని ఉండేది. కానీ అప్పుడు కుదరలేదు. పైగా నా ఫ్రెండ్ చెయిన్ ఒకటి తీసుకొచ్చి తాకట్టు పెట్టేశాను. దాన్ని విడిపించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. సంగీత దర్శకుడిగా స్థిరపడ్డాక ఓ సారి మా అమ్మతో కలిసి నగల దుకాణానికి వెళ్లా. అక్కడ సన్నటి చెయిన్ తీసుకున్నా. అది ఎప్పుడూ మెడలో ఉండేది. ఆ తర్వాత ఓ సారి దుబాయ్‌కి వెళ్లినప్పుడు లావు గొలుసులు వేసుకున్నవారిని చూశా. అప్పట్లో మన పరిశ్రమలో ఫైట్ మాస్టర్లు కూడా అంత పెద్ద గొలుసులు వేసుకునేవారు. దాంతో మోజుపడి నేను కొనుక్కున్నా. మ్యూజిక్ డైరక్టర్ అలా ధరించడం అందరికీ కొత్తగా అనిపించిందేమో.. అందరి దృష్టి నామీదే పడింది. దాంతో అందరూ నన్ను ఆంధ్రా బప్పీలహరి అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన్ని నేనెప్పుడూ కావాలని అనుకరించలేదు. విదేశాలకు వెళ్లి ముంబైలో ఫ్లైట్ దిగి వస్తుంటే ‘హలో బప్పీజీ’ అని పలకరించేవారు. నేను కూడా హాయ్ అని చెప్పేవాడిని. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో మా ఇంటికి మా కజిన్ ఓ అమ్మాయి వచ్చింది. తన కాలేజీలో నాకు ఓ పేరు ఉందని చెప్పుకొచ్చింది. ‘ఆంధ్రా బప్పీలహరి అని అంటారా’ అని అడిగా. కాదని చెప్పింది. ఇంకేంటని ఉత్సాహంతో ఆరాతీస్తే ‘గొలుసుల రామన్న’ అని పిలుస్తారని చెప్పింది. ఆ రోజు నుంచి నా మెడలో గొలుసులు వేసుకోవడం మానేశాను. ఎక్కడికైనా ఫంక్షన్లకి వెళ్తుంటే మాత్రం అమ్మ గొలుసు వేస్తుంది. చేతికి మాత్రం ఎనిమిదేళ్ల క్రితం మా సోదరి తొడిగిన కడియం ఉంటుంది. అలాగే నా భార్య శ్రావణి చేయించిన బ్రేస్‌లెట్ ఎప్పుడూ ఉంటుంది’’ అని అన్నారు.
జీవితగమకాలు..
పలు సందర్భాల్లో చక్రి తన గురించి పలు అంశాలను స్నేహపూర్వకంగా చెప్పుకొచ్చేవారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆ వివరాలు…
జూ వరంగల్‌లో విజయలక్ష్మి దగ్గర వయొలిన్ నేర్చుకున్నారు. తిరుపతయ్య దగ్గర కర్ణాటక సంగీతం (గాత్రం) మూడేళ్లు అభ్యసించారు. చక్రి విద్యార్హత ఎం.కాం.
మెహబూబాబాద్‌లో వినాయకచవితి, శ్రీరామనవమి పర్వదినాల్లో తన ఆర్కెసా్ట్రతో స్టేజ్‌షోలు చేసేవారు.
కంబాలపల్లిలో ఉండగా కబడ్డీ, కోకో బాగా ఆడేవారు. ఇంటర్ స్థాయిలో క్రికెట్, డిగ్రీలో ఉండగా టేబుల్ టెన్నిస్ ఆడటం అలవాటయ్యాయి. తన కుటుంబసభ్యులతో ఇంట్లో ఉన్నప్పుడు చక్రి చెస్ ఆడటానికి మొగ్గుచూపేవారు. ఎప్పుడూ ఆయనదే పైచేయి.
చక్రి తన నివాసానికి పెట్టుకున్న పేరు ‘పూజ కుటీర్’. తనకు సినీ పరిశ్రమలో ‘బాచి’తో తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ పేరును కుదించి పూజ కుటీర్ అని పెట్టుకున్నారు.
జూ పూరి జగన్నాథ్‌ను అన్నయ్య అని పిలిచేవారు. దర్శకుడు వం శీని అంకుల్ అనేవారు. చక్రిని వంశీ బిడ్డ అని పిలిచేవారు.
ఏ మాత్రం ఖాళీ దొరికినా కేరళకు వెళ్లి సేదతీరడానికి ఇష్టపడేవారు చక్రి. మున్నార్ అంటే ప్రత్యేకమైన ప్రీతి.
స్టూడియోలో సరిగమలు కూర్చడం మాత్రమే కాదు. గరిట పట్టి చికెన్ వండటంలోనూ దిట్ట చక్రి. పెన్ను పట్టి పాటలు రాయడంలోనూ సిద్ధహస్తుడు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకత్వం కోసం వెతుకుతున్నప్పుడు ఆయన చేసిన ‘పండు వెన్నెల’ ఆల్బమ్ విన్నవారు ‘పాటలు రాస్తావా’ అని అడిగేవారట. చిరంజీవి సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చినా నిక్కచ్చినా కాదనుకున్నారు చక్రి.
చక్రి జాతకాలను నమ్మేవారు. ఎప్పుడూ పగడపుటుంగరాన్ని కుడిచేతికి ధరించేవారు.
ప్రతి పుట్టినరోజుకు తన స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులతో రక్తదానం, నేత్రదానం చేయించేవారు.
ఫ్రెండ్‌షిప్ డే రోజు ప్రత్యేకంగా తన చిన్ననాటి స్నేహితులను, పరిశ్రమలోని మిత్రులను పిలిచి షడ్‌రుచులతో భోజనాలు పెట్టించేవారు.
సినిమా పరిశ్రమకి వచ్చిన కొత్తల్లో చక్రి ఫిట్‌గా కనిపించేవారు. ‘ఏమయ్యా.. నువ్వు మ్యూజిక్ డైరక్టర్‌వా? ఫైట్ మాస్టర్‌వా?’ అని తమ్మారెడ్డి భరద్వాజ ఓ సారి చమత్కరించారట. 2007 తర్వాతే తనకి భారీకాయం వచ్చిందని, సమయానికి భోజనం, నిద్ర లేకపోవడమే తన ఊబకాయానికి కారణమని, పరిశ్రమకి రాకముందు తప్పనిసరిగా వ్యాయామం చేసేవాడినని చెప్పేవారు చక్రి.
చక్రికి జేసుదాస్ గాత్రం అంటే ప్రాణం. జేసుదాస్ పాటలను చక్రి పాడగా విన్నవారు ఆయన వారసుడేనని అనుకున్న సందర్భాలూ ఉన్నాయట.
చక్రి దగ్గర రెండు సెల్‌ఫోన్‌లుంటాయి. ఓ సెల్‌ఫోన్‌లో కేవలం తన భార్య శ్రావణి నెంబర్ మాత్రమే ఉంటుంది. ఆమెకి తప్ప ఆ నెంబర్ ఇంకెవరికీ తెలియదు. ఆ ఫోన్‌ని ఇప్పటిదాకా స్విచ్ఛాఫ్ కూడా చేయలేదట.
తండ్రి జిల్లా వెంకటనారాయణ, సోదరి ఆదర్శిని చేత తన సినిమాల్లో పలు పాటలు పాడించారు చక్రి. ఆయన బలవంతం మీదే శ్రావణి ‘శ్రీమన్నారాయణ’లో కోరస్ పాడారు. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు.
‘జై బోలో తెలంగాణ’ కోసం కేసీఆర్ రాసిన పాటను స్వరపరచిన ఘనత తనదేనని అంటుండేవారు. ఆ చిత్రంలోనే ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానమా..’ పాటను గద్దర్ ఆలపించారు.