ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి –శ్రీమతి గోళ్ళమూడి రత్నమ్మ

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ,ప్రధాన నియంత ,దళపతి   –శ్రీమతి  గోళ్ళమూడి రత్నమ్మ

Inline image 3

1886లో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చేబ్రోలులో వాసి రెడ్డి సాంబయ్య ,పార్వతమ్మలకు గొల్లమూడి తత్నమ్మ ఏకైక సంతానం గా  జన్మించారు .చిన్ననాటి నుంచి చదువుపై అమిత శ్రద్ధ కనబరచేవారు .సంపన్న కుటుంబం కనుక ఆడ వారికి ఘోషా పధ్ధతి ఉండేది .స్వయం గా నేర్చి తెలుగు కవిత్వం అల్లేవారు .చేబ్రోలుకు చెందిన గొల్లమూడి చంద్ర మౌళి గారితో రత్నమ్మ గారి వివాహం జరిగింది .1921లో గాంధీజీ చేబ్రోలు సందర్శించారు .ఆయన ఉపన్యాసాలకు ప్రభావితురాలైనారు .దేశ సేవలో పాల్గొని తానూ ధన్యత చెందాలని నిశ్చయించుకొన్నారు .గాంధీ ప్రభావం తో రాట్నం వడకటం నూలు తీయటం ఖాదీ ధరించటం చేశారు .

దురదృష్ట వశాత్తు రత్నమ్మ గారి భర్త అకస్మాత్తుగా చనిపోవటం తో ఆమె జీవితం లో శూన్యం ఏర్పడింది .సంతానమూ లేదు .ఈ బాధ భరించలేక తల్లడిల్లి పోయారు .క్రమంగా కోలుకొని 1928మద్రాస్ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు .1930 ఉప్పు సత్యాగ్రహం లో ఉత్సాహం గా పాల్గొన్నారు .తానూ ,తన తల్లిగారు సన్నని నూలు వాడికి దానితో వస్త్రాలు నేయించి కాంగ్రెస్ నేతలకు కానుకగా ఇచ్చేవారు .విదేశీ వస్త్ర బహిష్కరణ లోనూ తీవ్రం గా పాల్గొని విదేశీ వస్త్ర దుకాణాల ముందు పికెటింగ్ నిర్వహించి వాటిని మూయిన్చేవారు .చక్కగా ఉపన్యాసాలు చేస్తూ తోటివారిని ప్రోత్సహించి ఉద్యమం లో పాల్గొనే నేర్పు రత్నమ్మ గారికి ఉండేది .ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వానికి కారం రాసినట్లనిపించేవి .ఆమెను ‘’విప్లవ వనిత’‘గా ముద్ర వేసి అరెస్ట్ చేసి ఆరు నెలలు జైలు శిక్ష వేశారు .పది హీను రోజులు జైలులో గడిపిన తర్వాత గాంధి –ఇర్విన్ ఒడంబడిక ననుసరించి జైలు నుండి విడుదలయ్యారు ..

అయినా రత్నమ్మగారు ఉద్యమ కార్యక్రమాలను ఆపలేదు. మరింత ఉత్సాహం గా నిర్వహించారు కాంగ్రెస్ వాలంటీర్ లతో కలిసి గ్రామాలు పర్య టించి స్వాతంత్ర సముపార్జన అవసరాన్ని తెలియ జేసేవారు ఖాదీ ప్రచారమూ నిర్వహించారు .శాంతి సైనికుల శిక్షణ కోసం శిబిరాలు నిర్వహించారు.పురుషులపై పోలీసులు లాఠీ చార్జి చేసి అరెస్ట్ చేస్తే స్త్రీలతో కలిసి పికెటింగ్ చేశారు .ఆమె మహా చురుకుగా ఆలోచించి అంతే వేగం గా కదిలేవారు .ఎక్కడ పికెటింగ్ జరిగినా రత్నమ్మ  గారు ముందు ఉండేవారు .మార్గ దర్శనం చేసేవారు .ప్రోత్సాహం ఇచ్చి ముందు నిలిచేవారు .

1923శాసనోల్లంఘన సమయం లో ఆమె ముందుండి ఉద్యమించి ,పికెటింగ్ చేస్తే అరెస్ట్ చేసి వదిలిపెట్టారు  .ఏ మాత్రం భయ పడకుండా మళ్ళీ స్త్రీలతో 75 ఏళ్ళ వృద్ధురాలైన తల్లిగారితో కలిసి సత్యాగ్రహం చేశారు .పోలీసులు మళ్ళీ వీరందర్నీ అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆరు నెలలు ఖైదు విధించారు .విడుదల వగానే తీవ్రంగా మళ్ళీ ఉద్యమాలు నిర్వహించారు .

1935గుంటూరు ‘’ఆంధ్ర రాష్ట్ర మహిళా సభ ‘’కు అధ్యక్షత వహించి ఉద్యమ తీవ్రతను తన ప్రసంగం లో వివరించారు .ఆమె కృషికి మెచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ సంఘం  రత్నమ్మగారిని ‘’మహిళా నియంత లందరిపైనా ‘’దళాది పతిగా ,ప్రధాన నియంతగా’’ నియమించింది .రెట్టించిన ఉత్సాహం తో స్త్రీలందరినీ అధిక సంఖ్యలో ప్రోత్సహించి శాసన ధిక్కారం చేయిన్చారామే .ఇక ఆమెను ఆపటం కష్టం అనుకొన్న బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి పది నెలలు శిక్ష విధించింది .రైతు బాంధవుడు ఆచార్య రంగా నిడుబ్రోలు లో ప్రతి ఏడాది నిర్వహించే రాజ కీయ పాఠశాలో రత్నమ్మ పాల్గొనేవారు .దేశం లో ఏమూల కాంగ్రెస్ సమావేశాలు ,సభలూ జరిగినా తప్పకుండా వెళ్లి హాజరయ్యేవారు  .జిల్లా కాంగ్రెస్ ,రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలై కాంగ్రెస్ ప్రచారం చేశారు.

1936ఎన్నికలలో గుంటూరు జిల్లా బోర్డుకు తెనాలి రెవిన్యు ఫిర్కా నుండి రత్నమ్మగారిని కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపిక చేశారు .1939లో గుంటూరు జిల్లాబోర్డు సభ్యలయ్యారు .1939లో చేబ్రోలు లో మహిళా గ్రంధాలయాన్ని స్థాపించి అధ్యక్షురాలైనారు .మహిళాభి వృద్ధే దేశాభి వృద్ధి అని త్రికరణ శుద్ధిగా నమ్మి పని చేసేవారు .చేబ్రోలు లో మరుసటి ఏడాది స్త్రీలకూ హిందీ విద్యాలయం ఏర్పాటుకు సాయపడ్డారు .అదే తర్వాత గుంటూరు హిందీ మహా విద్యాలయం గా పేరు పొందింది .ఏది చేపట్టినా అభి వృద్ధి చేసి చూపి సామర్ధ్యాన్ని నిరూపించిన మహిళా మాణిక్యం రత్నమ్మ గారు .ఆమె చొరవ ,పూనిక అలాంటిది .ధన సహాయం విరాళాల సేకరణ వనరుల చేకూర్పు లలో ఆమె తోడ్పాటు మరువ లేనిది .

1940వ్యక్తీ సత్యాగ్రహం లో ముందున్నారు .క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని అరెస్ట్ అయి శిక్ష పడకుండానే విడుదలయ్యారు రత్నమ్మగారు .1944జనవరి 26స్వతంత్ర దిం వేడుక లను పెద్ద ఎత్తున బ్రహ్మాండం గా జరిపారు .దీనికి ఫలితం ఆరు నెలల కారాగార శిక్ష అనుభవం .1945నిడుబ్రోలు ఆంద్ర మహిళా శిక్షణ కేంద్రం ఏర్పరచారు .గురువుగా ఉండి అన్నీ పకడ్బందీ గా చేశారు .అదొక పండుగ లాగా జరిగిందని ఇప్పటికీ జనం చెప్పుకొంటారు .1946 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి తీవ్ర కృషి చేశారు .

సత్తెన పల్లి లో తన గురువు గారి మఠానికి విరాళాలు ఇచ్చి ,సేకరించి తోడ్పడ్డారు .శాశ్వత ఆదాయం లభించే ఏర్పాటు చేశారు . చేబ్రోలు లో గురువుగారి పేర మఠం కట్టించినిర్వహణ కోసం  భూమిని ,నిధిని సమకూర్చారు .స్వయం గా బ్రహ్మ విద్య బోధించారు .ఇక్కడే మహాత్ముని కస్తూరి బాయిల చిత్రపటాలను ఆవిష్కరించారు .గ్రందాలయాన్నికూడా స్థాపించి స్వాతంత్ర్య సమరయోధులను ఆహ్వానించి గౌరవించి సత్కరించేవారు .రత్నమ్మ గారి తల్లిగారు స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు .ఆమె 91 ఏట గాంధీజీ జయంతి నాడు మరణించారు .అప్పటినుండి రత్నమ్మ గారు గాంధి జయంతిని ,తల్లిగారి వర్ధంతిని కలిపి ఘనం గా నిర్వహించేవారు  .తనకున్న సంపద నంతటినీ దేశం కోసం వినియోగించిన త్యాగ మూర్తి రత్నమ్మగారు .88ఏళ్ళ ధన్య జీవితాన్ని గడిపి దేశ భక్త గొల్లమూడి రత్నమ్మ గారు 5-7-1972న స్వర్గస్తులయ్యారు .రత్నమ్మ గారి జీవితం స్పూర్తిదాయకం ,చిరస్మరణీయం .ఆమె ఒక మహిళా మాణిక్యం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-12-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.