స్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి
1-1-1911 లో జన్మించిన యల్లాప్రగడ సీతాకుమారి హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు .సికంద్రా బాద్ కీస్ బాలికా విద్యాలయం లో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగించారు .జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం ,ప్రచారం విస్తృతం గ చేశారు .1934నిజాం రాష్ట్ర ఆంద్ర మహాసభకు అధ్యక్షత వహించారు .హైదరాబాద్ లో ఆంద్ర యువతీ మండలి స్థాపనలో భాగస్వాములయ్యారు .’’ఆంద్ర ‘’అనే మాటను తెలంగాణా ప్రాంతం లో విస్తృతంగా ప్రచారం చేయటానికి విస్తృత ప్రయత్నం చేశారు .చిక్కడ పల్లి ‘’ప్రమదావనం ‘’స్తాపకురాలై ప్రమదల సేవ లో చొరవ చూపారు .
స్త్రీ విద్య ,మహిళా స్వాతంత్ర్యం ,వరకట్న నిషేధం ,వితంతు వివాహం మొదలైన విషయాలపై తీవ్ర కృషి చేశారు .నిజాం నిరంకుశ పాలనలో ‘’అక్కి రెడ్డి పల్లి ‘’ గ్రామం లో జరిగిన స్త్రీ ల అత్యాచారాలపై విచారణ జరిపే సంఘం లో సభ్యురాలైనారు .అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లో పర్యటించి స్త్రీలకు ధైర్యం చెప్పారు సీతాదేవి .అనాధలకు వితంతువులకు భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు .ఆంద్ర ,తెలంగాణా రాష్ట్రాలను ఏకీకృతం చేసి విశాలాంధ్ర ఎర్పడాలన్ను ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు .నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి పోటీలేకుండా 1957లో ఆంద్ర ప్రదేశ్ శాసన సభ కు ఎన్నికయ్యారు .ఆంధ్రులకు సంబంధించిన అన్ని ఉద్యమాలలో ముందు ఉండి నడిపించారు .సీతాదేవి గారి భర్త వై వి.ఎల్ నారాయణ రావు గారు పేరు పొందిన సర్వోదయ కార్య కర్త .
సీతాదేవి కధానికలు రచించి సాహిత్యాన్ని పండించారు .ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు హాట్ న్యూస్ గా ‘’గోల్కొండ పత్రిక ‘’లో రాసేవారు .సంస్కరణ ద్రుష్టి నిండుగా మెండుగా ఉన్న విదుషీమణి సీతా దేవిగారు .నిర్భీకత ఆమె సొమ్ము .స్త్రీ జనాభ్యుదయమే ధ్యేయం గా డెబ్భై అయిదు సంవత్సరాలు జీవించిన సంస్కర్త ,విదుషీమణి ఏకీక్రుతాంధ్ర దేశంకోసం పాటు పడిన మహిళ శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారిగారు2-1-1986న మరణించారు .
దేశ బాంధవి –దువ్వూరి సుబ్బమ్మ
తూర్పు గోదావరిజిల్లా రామచంద్రా పురం తాలూకా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ,పంచారామాలలో ముఖ్యమైనది అయిన దాక్షారామం లో సువ్వూరి సుబ్బమ్మ గారు 1880లో జన్మించారు .తండ్రి మల్లాది సుబ్బావధాని గారు .దువ్వూరి వెంకయ్యగారితో ఆమె వివాహమైంది . ఆంద్ర దేశం లో స్వాతంత్ర్య యుద్ధం లో మార్గ దర్శి గా పని చేసిన వారిలో సుబ్బమ్మ గారిది ప్రధమ తాంబూలం .ఆమె ధైర్య సాహసాలు చొరవ అనితర సాధ్యం గా ఉండేవి .
సహాయ నిరాకరణ ఉద్యమం లో ఆమె ప్రముఖ పాత్ర వహించారు .ఉద్యమ శిక్షణ పొందిన భారతీయ మహిళలో సుబ్బమ్మ గారు రెండవ వారు .అంతగా ఆమె వ్యక్తిత్వం భాసించింది అన్నమాట .1922ఉద్యమం లో నాయకత్వం వహించి బ్రిటిష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించారు. ఆమె ను అరెస్ట్ చేసి ఏడాది కాలం జైలు శిక్ష వేశారు .రాజ మండ్రి జైలులో ఈ శిక్ష అనుభవించారు సుబ్బమ్మగారు .విడుదలై మళ్ళీ విజ్రుమ్భించి ఉప్పు సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయి 31-3-1930 నుండి ఆరు నెలలు వెల్లూరు జైలులో కారాగార వాసం అనుభవించారు .శిక్ష పూర్తికాగానే క్విట్ ఇండియా ఉద్యమం లో చేరి పెద్దాపురం లో గొప్ప ప్రదర్శన నిర్వహించి లాఠీ చార్జీకి గురైనారు .
సుబ్బమ్మగారు పదహారు సంవత్సరాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు .1923లో కాకినాడ లో జరిగిన కాంగ్రెస్ సభలో సుబ్బమ్మగారికి ‘’దేశ బాంధవి ‘’బిరుదునిచ్చి సత్కరించారు .రాజమండ్రిలోని సనాతన విద్యాలయ మేనేజర్ గా కొంతకాలం సేవ చేశారు .1964లో సుబ్బమ్మగారికి తీవ్రం గా జబ్బు చేసింది .ఆ జబ్బులోనే నెహ్రు మరణించాడన్న వార్త విన్నారు .దీనితో మానసికం గా కుంగిపోయి మందులు తీసుకొనే లేదు .ఎనభై నాలుగేళ్ళు దేశ సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నా ధైర్య శీలి దువ్వూరి సుబ్బమ్మగారు 31-5-1964న నెహ్రు చనిపోయిన నాలుగు రోజులకే మరణించారు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-12-14-ఉయ్యూరు
