అనాథలకో సూపర్‌ స్పెషాలిటీ

అనాథలకో సూపర్‌ స్పెషాలిటీ

సమాజంలో అనాథలకు ఆదరణ లభించటం అంత సులువు కాదు. అదే అనాథ బాలికలయితే వాళ్లకి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఒక వేళ ఏదైనా అనాథాశ్రమంలో చేరినా… వారికి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభించటం అసాధ్యం. ఈ జఠిలమైన సమస్యను తీర్చటానికి ‘యశోదా పౌండేషన్‌’ ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొంది.
సాధారణంగా అనాథాశ్రమాలు తమ వద్ద ఉన్న పిల్లలకు పదో తరగతి వరకు మాత్రమే విద్యను అందించగలుగుతాయి. ఆ తర్వాత ఏదో ఒక వృత్తి పనిచేసుకొమ్మని ప్రోత్సహిస్తాయి. చాలా సార్లు ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి దొరకాలంటే రకరకాల నైపుణ్యాలు అవసరమవుతాయి. ఈ నైపుణ్యాలను పెంపొందించే సంస్థలు ఎక్కుగా లేవు. ‘‘దీనిని మేం గుర్తించాం. అందుకే ఈ ఫౌండేషన్‌ను స్థాపించాం. పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించటం, వారు మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా మారేలా శిక్షణ ఇప్పించటం, ఆ తర్వాత మా సంస్థల్లోనే ఉద్యోగం ఇవ్వటం మా ప్రధానోద్దేశం’’ అంటారు యశోద హాస్పిటల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జి.రవీందర్‌ రావు. ఇప్పటి దాకా ఈ సంస్థ నుంచి 2108 మంది శిక్షణ పొందితే, వారిలో 1882 మందికి ఉద్యోగాలు లభించాయి.
రాష్ట్రంలోని వివిధ అనాథాశ్రమాలలో 16-20 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను ఎంపిక చేసి ఫౌండేషన్‌లో 65 రోజుల శిక్షణ ఇస్తారు. ‘‘మా దగ్గర శిక్షణ పొందే వారిలో 80 శాతం మంది అమ్మాయిలే. సాధారణంగా అనాథాశ్రమాలలో ఉన్న అబ్బాయిలను ఎక్కువగా దత్తత తీసుకుంటుంటారు. అమ్మాయిలను దత్తత తీసుకొనేవారు తక్కువ. యుక్త వయస్సు వచ్చిన తర్వాత వారికి రక్షణ ఉండాలంటే ఉపాధి తప్పనిసరి. అందుకే మేము అమ్మాయిలనే పౌండేషన్‌లో చేర్చుకుంటామ’’ని రవీందర్‌ రావు వివరించారు. ఫౌండేషన్‌లో చేరిన వెంటనే వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఇంగ్లీషు, గణితం మొదలైన సబ్జెక్టులలో, ఉద్యోగానికి అవసరమైన కొన్ని మౌలికాంశాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటుగా ఉపకార వేతనం కూడా చెల్లిస్తారు. పిల్లలలో ఉన్న ప్రత్యేక ఆసక్తులను గమనించి డీఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఈసీజీ టెక్నీషియన్‌, సీఎస్‌ఏలాంటి సాంకేతిక వృత్తి విద్యా కోర్సులతోపాటు ఎలకి్ట్రషియన్‌, ప్లంబింగ్‌, డ్రైవింగ్‌, కార్పెంటరీ లాంటి వృత్తుల్లో కూడా శిక్షణ ఇస్తారు. 60 రోజుల తర్వాత శిక్షణ పొందిన వారికి మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఒకసారి శిక్షణ పొందిన తర్వాత వారికి యశోదా ఆసుపత్రి గ్రూపులో ఉద్యోగాలు ఇస్తారు. మరికొన్ని సంస్థలు కూడా ఉపాధి కల్పిస్తున్నాయి.
మానసిక కౌన్సిలింగ్‌
ఫౌండేషన్‌లో శిక్షణ కోసం అనాథలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్లు పెరిగిన వాతావరణం, పరిస్థితులు, మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. అనాథలమనే ఆత్మన్యూనత, అగమ్యగోచరమైన భవిష్యత్తు అనాథలను మానసికంగా కుంగదీస్తుంటాయి. దాంతో తామేమీ చేయలేమని, తమకేమీ చేతకాదనే నిరాశలో కూరుకుపోతుంటారు. వాళ్లలో నెలకొనే ఈ భావనలను వదిలించి ఆత్మస్థయిర్యాన్ని నింపాలంటే తప్పనిసరిగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. అందుకే యశోద చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఉపాధి శిక్షణలో భాగంగా పిల్లలకు మానసిక కౌన్సిలింగ్‌ కూడా ఇస్తోంది. దాంతో జీవితం పట్ల సానుకూల ధృక్పథాన్ని అలవరచుకోవటానికి వీలవుతుంది. వారికి మానసికంగా సాయం చేయటం ఉపాధి పొందిన తర్వాత కూడా కొనసాగుతుంది. కొన్ని సార్లు ఉద్యోగం చేసే సమయంలో వారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి నైతికంగా మద్దతు ఇచ్చేవారు ఎవరూ ఉండరు కాబట్టి ఫౌండేషనే ఆ సాయాన్ని అందిస్తుంది.
సమస్యలనేకం..
మన దేశంలో అనాథలకు సంబంధించిన చట్టాలపై అవగాహన చాలా తక్కువ. చాలా మంది అనాథాశ్రమాలను సేవా భావంతోనే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకున్న సంస్థలు కూడా తక్కువే. ‘‘మన రాష్ట్రంలో ఉన్న అనాథాశ్రమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మేము సేకరిస్తున్నాం. అంతే కాకుండా అనాథలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభించాం.
ఉదాహరణకు మన ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలకు లభించే అవకాశాలు అనాథలకూ ఉంటాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కల్పించటానికి ప్రయత్నిస్తున్నామ’ని రవీందర్‌ రావు వివరించారు.
అనాథలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మన ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం రిజర్వేషన్ల విషయంలో ఎస్సీలకు లభించే అవకాశాలు అనాథలకూ ఉంటాయనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.