|
ఆర్గానిక్ రామారం
|
|
‘‘పురుగు మందులు పురుగుల్ని కాదు. మనుషుల్ని చంపుతున్నాయి. పంటపొలాలకు మితిమీరి కొడుతున్న మందుల వల్ల తినే ఆహారం రసాయనాలతో నిండిపోతోంది. ఫలితంగా ఎన్నడూ లేని పెద్ద వ్యాధులు వస్తున్నాయిప్పుడు. రైతులు, మందుల కంపెనీలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది’’ అంటున్నారు రామారంలోని ఒక మహిళా రైతు. ఆ చైతన్యం వెనక ఎంతో కష్టం ఉంది. నల్లగొండ జిల్లా గుండాల మండలంలోని రామారానికి ఎన్నడూ లేని ప్రత్యేకత వచ్చింది. ఇదివరకు అది అన్ని ఊర్లలో ఒక ఊరు. ఇప్పుడు అనేక ఊర్లకు స్ఫూర్తి ఈ ఊరు..
ఊర్లో మూడొందల రైతులు ఉన్నారు. వరి, కంది, పెసర, కూరగాయలు ప్రధాన పంటలు. చుట్టుపక్కల ఊళ్లలోని రైతుల్లాగే వీళ్లు కూడా రసాయన మందులు, ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ‘‘మా జిల్లాలో ఇప్పటికే అధిక ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దీనికి తోడు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల తినేతిండి విషతుల్యమైపోతోంది. దీనికొక మార్గం కనిపెట్టాలనుకున్నాం’’ అన్నారు జైకిసాన్ మహిళా సంఘం సభ్యులు స్వప్న, అనిత. కార్బండిజంతో వరికి విత్తనశుద్ధి చేస్తారు. దమ్ము చేసేప్పుడు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ, నాట్లు వేశాక రెండు, మూడుసార్లు యూరియా, ఆ తర్వాత క్రిమిసంహారక గుళికలు వేయడం సహజం. దోమపోటు రాకుండా పలుమార్లు మందులు పిచికారి చేయక తప్పదు. కూరగాయల్లో బెండకు అయితే రెండు మూడు రోజులకు ఒకసారి మందుల్ని కొట్టాలి. ప్రతి గ్రామంలో చేసే పనే ఇది. అయితే మందుల మీద ఆధారపడి సేద్యం చేసే అలవాటు రైతుల్లో పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పద్ధతికి కొంత వరకైనా అడ్డుకట్టవేయాలన్నది గ్రామీణ్‌మాల్ ఫౌండేషన్ ఆలోచన.
సీతారాం కృషి..
రామారం గ్రామాన్ని పూర్తిస్థాయి సేంద్రీయ సేద్యపు గ్రామంగా తీర్చిదిద్దేందుకు నడుం కట్టారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె.సీతారం. ‘‘మీరు ఏ పంట పండించినా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వేయకండి. కేవలం సేంద్రీయ పద్ధతుల్లోనే పంటలు పండిద్దాం’’ అని చెబితే నేడు ఏ రైతు ముందుకు రాని పరిస్థితి. ఇవన్నీ గమనించిన సీతారాం.. ముందుగా గ్రామంలోని మహిళారైతులందర్నీ ఒక చోటకు చేర్చారు. అవగాహన కోసమే కొన్ని రోజులపాటు తరగతులు నిర్వహించారాయన. ‘‘మార్పు అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు. దానికి కొంత సమయం పడుతుంది. అసలు సేంద్రీయసేద్యం రైతులకే కాదు, భూమికి, పర్యావరణానికి, ఈ దేశప్రజల ఆరోగ్యానికి ఎంత అవసరమో రైతులందరికీ విడమరిచి చెబుతున్నాం. కేవలం రసాయన మందులతోనే అధిక దిగుబడులు సాధ్యమన్న అపోహల్ని ఆచరణాత్మకంగా తొలగిస్తున్నాం..’’ అన్నారు సీతారం. గ్రామంలో ఎనిమిది నెలలు కష్టపడి రైతులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన శాస్త్రవేత్తలను పల్లెకు తీసుకొచ్చి తరగతులు నిర్వహిస్తుండటం విశేషం.
మహిళలు కలిసికట్టుగా..
గ్రామంలో జైకిసాన్ మహిళా సేంద్రీయ పరస్పర సహాయ కేంద్రం ఏర్పాటైంది. ఈ కేంద్రం సేంద్రీయ సేద్యానికి కావాల్సిన సహాయ సహకారాలను, పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ‘‘మొదట్లో సేంద్రీయ సాగు చేస్తే పంటలు పండుతాయో లేదోనన్న అపోహలు ఉండేవి. అయితే కొంత అవగాహన వచ్చాక ధైర్యంగా ముందడుగు వేశాం. వరి, కంది, పెసర మూడు పంటలను ఎంచుకున్నాము. మా ఊళ్లో మూడొందలకు పైగా రైతులుంటే నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌పీఎం) పద్ధతిలో సాగు చేసేందుకు రెండొందల యాభై మంది రైతులు ముందుకు వచ్చారు. వరి, కంది, పెసరలతోపాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు’’ అన్నారు మహిళా సంఘ సభ్యులు.
ఏ పంట పండించినా మార్కెటింగ్ చేయడమే పెద్ద సమస్య. ఇక, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసిన పంటను ప్రత్యేకంగా అమ్ముకుంటేగాని గిట్టుబాటు కాదు. అందుకోసం గ్రామీణ్‌మాల్ ఫౌండేషన్ ఊళ్లోనే మార్కెటింగ్ సదుపాయం కల్పించింది. దీంతో అక్కడే ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పాటైంది. రసాయన మందులతో పండించిన వరి ధాన్యం మార్కెట్‌లో క్వింటాలు రూ.1700 పలుకుతోంది. అందులో బస్తాకు హమాలికి ఆరురూపాయలు, వందకు రెండు రూపాయలు చొప్పున ఇరవై నాలుగు రూపాయల కమీషన్, మరో, ఇరవై రవాణాఛార్జీలు కలిపి.. యాభై అవుతోంది. అలాంటి భారం రైతుల మీద మోపకుండా రూ.1750 కి కొని వెంటనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే సీతారం కృషి వల్ల.. మరింత అధిక ధరలకు కొనేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయిప్పుడు. ఫ్యూర్ అండ్ హానెస్ట్ సంస్థ ప్రతినిఽధులు క్వింటాలుకు రూ.2100 చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రామారంకు వస్తున్న గుర్తింపు చుట్టుపక్కల ఊళ్లకు పాకింది. దీంతో ఇప్పుడందరు ఆ ఊరి రైతులకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు.
గ్రామంలో మహిళా సంఘం సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న పంటలను ప్రోత్సహించేందుకు.. సెర్ఫ్ సంస్థ అయిదు లక్షలు రుణం మంజూరు చేసింది.
సీజన్‌లో సాగుకు శ్రీకారం చుట్టాలంటే ఏ రైతుకు అయినా విత్తనాల సేకరణే పెద్ద సమస్య. ఆ ఇబ్బంది రామారం గ్రామస్థులకు ఎదురవ్వలేదు. ఎందుకంటే వారే స్వయంగా విత్తనబ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు.
రసాయన మందులకు ప్రత్యామ్నాయం పశువులపేడ, చెట్ల ఆకులు, పచ్చిరొట్ట ఎరువులు. ఇక, మోనో, క్లోరోఫైరిపాస్, గుళికలకు బదులు లింగాకర్షణ బుట్టలు, దీపపు ఎరలు, చెట్ల ఆకులు, గోమూత్రంతో తయారైన కషాయాలు వాడుతున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు బాగా తగ్గుతోంది.
‘‘రైతులను వ్యవస్థీకృతం చేసి, విత్తనబ్యాంకును పటిష్టం చేయడం నా లక్ష్యం. రైతుల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే.. ఆర్థిక ఎదుగుదల దానంతట అదే వస్తుంది. వాళ్లల్లో వ్యవసాయం మీద నమ్మకం ఏర్పడుతుంది’’
– సీతారాం,
గ్రామీణ్‌మాల్ ఫౌండర్
‘‘మా గ్రామాన్ని ఎన్‌ఐఆర్‌డి దత్తతకు తీసుకుంది. ఇది మాకు మరింత ప్రోత్సాహకరం. మహిళా రైతుల్ని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రదర్శన క్షేత్రాలు చూపిస్తున్నారు. దీనివల్ల సేద్యం పట్ల మా పరిధి మరింత విస్తృతం అవుతోంది.’’
|

