తులసీ దాస దాసి –నేల నూతుల పార్వతీ కృష్ణ మూర్తి
తెలుగు హిందీ భాషలలో సవ్య సాచిలాగా కవిత్వం అల్లిన దిట్ట శ్రీమతి నేల నూతుల పార్వతి .మర్మావుల సుబ్రహ్మణ్యం ,లక్ష్మీ నరసమ్మలు తలిదండ్రులు .1922లో సనాతన బ్రాహ్మణ సంప్రదాయం లో జన్మించారు .పదకొండేళ్ళకే నెల్లూరు వాసి నేల నూతుల కృష్ణ మూర్తిగారి తో వివాహమై పార్వతీ కృష్ణ మూర్తి అయ్యారు .పెళ్లినాటికి పార్వతి చదువు మూడవ తరగతిమాత్రమే .
భర్త కృష్ణ మూర్తి గారిచ్చిన ప్రోత్సాహం తో రెట్టింపు ఉత్సాహం తో ,ఆమె ఆయన గురుత్వం లోనే హిందీ తమిళ ,తెలుగు సాహిత్య మధనం చేశారు .తులసీ దాసు అంటే విపరీతమైన అభిమానం ఆమెకు. ఈ ఆరాధనా భావం తోనే ఆయన రచించిన ‘’శ్రీ రామ చరిత మానస’’ ను సరళ సుందర మైన శైలిలో తెలుగులోకి ‘’శ్రీరామ చరిత మానసామ్రుతం ‘’గా అనువాదం చేసి ,1961లో ప్రచురించారు..అంతేకాదు తన కలం పేరును ‘’తులసీ దాస దాసీ ‘’అని పెట్టుకొని ఆయనపై ఉన్న అనన్య భక్తీ ప్రపత్తులను తెలియ జేసుకొన్నారు .దీనితో ప్రముఖ ఆంద్ర కవయిత్రుల సరసన స్థానం పొందారు .తన పేరును ఎప్పుడూ అజ్ఞాతం గానే ఉంచుకొని ‘’తులసీ దాస దాసీ ‘’పేరుతోనే రచనలు చేశారు .
ప్రాచీన తెలుగు భాషలోని సంప్రదాయాలను అవగాహన చేసుకొని ,వచన రచనలో కొత్త మార్గాలలో ప్రయాణించారు .ధ్వని ప్రాధాన్యం ఉన్న పలుకు బడులతో ,సలక్షణ భాష తో భావ గాంభీర్య మున్న చిక్కని చక్కని వచనాన్ని రాశారు .భాషకు కొత్త సోయగాన్ని ,అందాన్ని అలంకారాన్ని సంతరించారు .చమత్క్రుతికి ప్రాధాన్యం ఇచ్చారు .కాశ్మీరీ భాషలో ప్రముఖ కవి మాలిక్ మొహమ్మద్ జాయ్సీ రాసిన ‘’పదుమావత్’’అనే హిందీ గ్రంధాన్ని ‘’పద్మావతి ‘’గా తెలి గీకరించారు .’’పవిత్ర గోదావరి ‘’మోనోగ్రాఫ్ రాశారు .దీన్ని బెంగుళూర్ లోని ఇండియన్ బుక్ హౌస్ ముద్రించింది .
తీరిక ఉన్నప్పుడు ‘’కల్కి ‘’,’’ఆనంద వికటన్ ‘’తమిళ పత్రికలూ చదివి ఆ భాషలో వస్తున్న రచనలను ఆకళింపు చేసుకొనే వారు .పెళ్లి నాటికి మూడవ తరగతిమాత్రమే చదివిన పార్వతీ స్వయం కృషితో ఇంత సాహిత్య మధనం చేసి అపూర్వ సాహిత్యాన్ని సృజన చేసి అబ్బుర పరచారు .కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ భర్తకు చేదోడు వాదోడుగా సాయపడుతూ ,ఆదర్శ గృహిణి అయ్యారు .రోజూ నృత్యం ,సంగీతం ,సాహిత్యం చరిత్ర పరిశోధనలో భర్త కృష్ణ మూర్తిగారు క్షణం తీరిక లేకుండా ఉండేవారు .ఆయన బహుముఖీన వ్యాసంగానికి ఏ మాత్రం భంగం కలుగ కుండా ,ఇతోధిక సహకారం అందజేసి భర్త ఔన్నత్యానికి వన్నె తెస్తూ నిజ ధర్మ పత్ని అనిపించుకొన్నారు .20-10-1993నఎనభై ఒక్క సంవత్సరాల వయసులో భర్తచేతుల మీదుగా శ్రీమతి పార్వతీ కృష్ణ మూర్తి పరమ శివ సాన్నిధ్యం చేరారు .
దుఃఖ భాగినుల పాలిటి కల్ప తరువు –ముత్తా ఆండాళమ్మ
పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలియని సౌజన్య మూర్తి ముత్తాఆండాలమ్మ గారు 1923లో ఒక చిన్న ఇంట్లో ఏడుగురు బాలికల తో తమళనాడులో మద్రా స్ నగరం లో ఏర్పాటు చేసిన సేవాసదనం ఇంతింతై పెరిగి అనాధ బాలికల పాలిటి వట వ్రుక్షమైంది .దుఃఖ భాగినులైన స్త్రీలను సాంత్వన పరచి స్వయం కృషితో వారు జీవించాలి అన్న ముందు చూపుతో ఆమె ఏర్పరచిన సేవాసదనం ఇది .ఒక శరణాలయం గా విద్యాలయం గా వృద్ధి చెందింది .తమిళ నాడుకే శ్రీలంక బర్మా దేశాల నుండి కాక ఇతర రాష్ట్రాలనుంచి , వచ్చి చేరే బాలికలకు ఆశ్రయ స్థానమైంది .విద్యతో బాటు చేతిపని కూడా నేర్పే ఏర్పాటు జరిగింది .గిల్టు పూత ,లక్క పూత ,ఎలక్ట్రికల్ దీపాలకు రంగు రంగుల డోమ్ లను ఏర్పాటు చేయటం ,పట్టు గుడ్డలతో షెడ్ లు కల్పించటం ఇక్కడ నేర్పించేవారు .కుట్టుపని ,అల్లిక ,జలతారు నగిషి ,దుస్తుల తయారీ ఫేం కుర్చీలు అల్లటం అన్నీ కొత్త విధానాలలో విద్యార్ధినులకు నేర్పుతున్నారు .
ఈ సేవాసదనం ఆదర్శ ప్రాయం గా నడవటం చూసి మెచ్చుకొన్న దాతలు స్వయం గా ముందుకు వచ్చి ఆర్దికసాయమేకాకుండా వనరులను కూడా కల్పించి అభివృద్ధికి చేయూత నిస్తున్నారు .ఇందులో పని చేసే ఉపాధ్యాయినులు ఆదర్శం గా అంకిత భావం తో పని చేసి విద్యార్ధినులను తీర్చిదిద్దటం ఇక్కడి ప్రత్యేకత .ఇప్పుడు పాతిక మంది ఉపాధ్యాయినులు ఇక్కడ పని చేస్తున్నారు .వారి వసతి భోజనం జీతాలు అన్నీ సేవాసదనమే భరిస్తుంది .ఈ నాడు రెండు వందల పది మంది విద్యార్ధినులకు ఆశ్రయం గా ఉంది .తమిళ నాడు మొత్తం మీద ఇలాంటి సంస్థ ఇదొక్కటే నని అంటారు .పాసశ్చాత్య దేశాలనుండి కూడా ఆర్ధిక సాయం అందుతోంది ఇప్పుడు .విద్యార్ధుల ఆర్ధిక స్థాయిని బట్టి రుసుము వసూలు చేస్తారు .ఏమీ లేని వారికి అన్నీ ఉచితం గానే ఏర్పాటు చేసి ఆదుకొంటారు .నిజానికి వీరి సంఖ్యే బాగా ఎక్కువ . ఇలాంటి వారికి సేవ చేయటానికే ఆండాళమ్మ గారు దీన్ని ఏర్పాటు చేశారు కదా .
వీరి భర్త జస్టిస్ ముత్తావెంకట సుబ్బా రావు గారు మద్రాస్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సేవాసదనం ఇది .దిక్కులేని మహిళలను ఆదుకోవటమే ధ్యేయం .అ నాటి గవర్నర్ జనరల్,మద్రాస్ గవర్నర్ భార్యలు దీనిపై ప్రత్యెక శ్రద్ధ తీసుకొని నిర్వహణ కు అన్నివిధాలా సహాయం అందించేవారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-14-ఉయ్యూరు

