వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన –కోటికల పూడి సీతమ్మ,రాత్రి పాఠ శాల నడిపిన -జయంతి సూరమ్మ

వీరేశ లింగం గారి పై కావ్యం రాసిన  –కోటికల పూడి సీతమ్మ

Inline image 1

అబ్బూరి వారి ఇంటి ఆడపడుచు ,కోటికలపూడి వారింటి కోడలు అయిన సీతమ్మగారు 1874లో పుట్టారు .భర్త కోటికలపూడి రామారాగారు .భర్త రాజమండ్రిలో ఉద్యోగి అయినందున కాపురం అక్కడే పెట్టారు .అప్పుడే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీర్శ లింగం పంతులుగారి శిష్యరికం చేసింది వారి వద్దనే తెలుగు నేర్చుకొన్నది కవితా ప్రతిభా పంతులుగారి ఆశీర్వాద బలం తో అబ్బింది .వీరేశ లింగం గారి జీవిత చరిత్రను పద్య కావ్యం గా సీతమ్మ గారు రాసింది .రాణి అహల్యాబాయి జీవిత చరిత్రను కూడా కావ్య బద్ధం చేసింది .

సీతమ్మ గారు ‘’సాదు రక్షక శతకం ‘’,’’ఒక మహమ్మదీయ వనిత ‘’అనే కరుణ రస భరిత పద్య రచన చేసింది .చిన్నకావ్యాలలో ఆమె రాసిన ‘’లేడీ జేన్ గ్రే ‘’పేరు పొందింది .తానూ వివిధ సందర్భాలో  వైవిధ్య విషయాలపై చేసిన ఉపన్యాసాలను సేకరించి ఒక సంపుటిగా ప్రచురించింది .1913లో బాపట్ల ఆంద్ర మహిళా సభకు అధ్యక్షురాలై సేవలందించిందిజీవిత చరమాంకం లో పిఠాపురం మహా రాణి చిన్న మాంబ గారికి విద్య నేర్పే అరుదైన అవకాశం పొందింది ఈ విధం గా ఆ ఆస్థాన గురు పీఠం అలంకరించి గౌరవం పొందింది .వీరేశ లింగం గారి అంటే వాసిగా జీవిస్తూ స్త్రీ సంక్షేమం కోసం అవిరళ కృషి చేసింది . అరవై రెండేళ్ళు మాత్రమె జీవించిన సీతమ్మగారు 1936లో మరణించింది .

రాత్రి పాఠశాల నడిపిన -జయంతి సూరమ్మ

శ్రీకాకుళం జిల్లా కవట అగ్రహారం లో 1887లో సీతారామయ్య ,కనకమ్మ దంపతులకు జన్మించారు .ఎనిమిదవ ఏట బరంపురం వాస్తవ్యుడు జయంతి వెంకట నారాయణ గారితో సూరమ్మ గారి వివాహం జరిగింది .ఇద్దరూ శుద్ధ శ్రోత్రియ  కుటుంబీకులే .భర్త తన పందొమ్మిదవ ఏట బ్రహ్మ సమాజం లో చేరారు .బంధువులు అడ్డు చెప్పినా వినలేదు .భర్తతో బాటు సూరమ్మ గారు కూడా  బ్రహ్మ సమాజం లో చేరి ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు .ఇద్దరూ రాజమండ్రిలో  స్థిర పడి వీరేశలింగం గారి ప్రభావానికి లోనైనారు .వారి నుండి సంస్కారం ,సంఘ సంస్కరణ నేర్చుకొన్నారు .

దంపతులు కలకత్తా వెళ్లి సాధన ఆశ్రమం లో శిక్షణ పొంది ,కాకినాడ లో పిఠాపురం రాజ స్థాపించిన ‘’బ్రహ్మ మందిరం ‘’,అనాధ శరణాలయాలను నిర్వ హించే బాధ్యత తీసుకొన్నారు .హరిజన సేవ చేస్తూ ,వారి విద్యకై కృషి చేశారు . చెన్నై వెళ్లి అక్కడ ప్రచారకులుగా ఉండి రాత్రి పాఠశాలలు నడిపారు .రామ మోహన రాయ్ పేరుతొ ఒక లాడ్జి నీ నడిపారు  .బ్రహ్మ సమాజ యువకులకు ఇది విశ్రాంతి భవనం గా ఉండేది .వేశ్యా వ్రుత్తి నిర్మూలన కార్య క్రమంలో సూరమ్మ గారు ప్రత్యెక శ్రద్ధ తీసుకొన్నారు .అనిబి సెంట్ ప్రభావానికి లోని సభ్యులై కాంగ్రెస్ సమావేశాలకు హాజరైనారు .

సూరమ్మ గారు పిల్లల చదువులకోసం బరంపురం వెళ్ళారు .ఇంగ్లీష్ చదువులపై విరక్తి కలిగి తమ పిల్లలను చదువు మాన్పించారు .వ్రుత్తి విద్య నేర్పే జాతీయ విద్యాలయం లో చేర్పించారు .భర్త ‘’హ్యుమనిటి ‘’అనే ఆంగ్ల వారపత్రిక నిర్వహించేవారు .దానిలో హిందీలో వ్యాసాలూ రాసేవారు సూరమ్మ గారు .విదేశీ వస్త్రా బహిష్కరణ ఉద్యమం లో చేరి తన ఇంట్లోని విదేశీ వస్త్రాలన్నీ తగల బెట్టారు .రాట్నాలు ,యేకులు కొని కొని ఊరంతా పంచిపెట్టారు .అప్పుడు ఊరు ఊరంతా రాట్నాల సవ్వడే వినిపించేది. సూరమ్మ గారు నూలు వడకటం లో ప్రవీణురాలు .అతి సన్నని నాజూకైన నూలు తీసి బట్టలు తయారు చేయించేవారు ప్రతి ఇంటికి ఖద్దరు బట్టలను తీసుకొని వెళ్లి అమ్మేవారు .

1922లో బరంపురం కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు .భర్త ,ఆయన సోదరులు అరెస్టయ్యారు .అయినా భయపడక ఖాదీ ప్రచారం చేస్తూ ఖాదీ బట్టలు అమ్మేవారు .’’కల్లు మానం డోయ్ బాబూ’’ అంటూ కల్లు  దుకాణాల వద్ద పికెటింగ్ చేసేవారు .తాగుడు వల్ల వచ్చే అనర్ధాలను తెలియ జేస్తూ పాటలు రాసి పాడి ప్రచారం చేశారు .తాగు బోతుల వెకిలి చేస్టలను ప్రాహసనాలుగా చేసి వారిముందే ప్రదర్శించి బుద్ధి తెచ్చుకోనేట్లు చేసి వారితో నే  స్వయం గా ఒట్టు వేయించి  కల్లుజోలికి పోము అని శపథం చేయించే వారట. ఆమె మాట మీద అంట గౌరవం అన్నమాట.ప్రాక్టికల్ మనిషి అని రుజువు చేసుకొన్నారు .

బరంపురం లో జాతీయ విద్యాలయం స్థాపించి తమ పిల్లలను అందులోనే చదివించారు .జీతం, భత్యం లేని కాంగ్రెస్ వాలంటీర్ గా చాలా చురుకుగా పని చేశారు భర్త అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు పిల్లల చదువుచూస్తూ  వారిని తీర్చి దిద్దుకోవటం లో శ్రద్ధ వహించేవారు .’’మా కొద్దీ తెల్ల దొరతనం ‘అనే గరిమెళ్ళ వారి గీతాన్ని ఊరూరా తిరిగి పాడుతూ ప్రబోధించి దేశ భక్తీ రగుల్కొల్పేవారు .ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ఆరు నెలలు కఠిన జైలు శిక్ష అనుభవించారు .జైలులో కనీస వసతులకోసం పోరాటం జరిపారు .విడుదల అవగానే మళ్ళీ ఉత్సాహం గా ఉద్యమాలు నడిపారు .కాంగ్రెస్ విరాళాల కోసం జోలె పట్టి మిగిలిన వారినీ సంఘటిత పరచి గ్రామాలు తిరిగి చందాలు వసూలు చేసి పార్టీకి సమర్పించేవారు .’’గాంధీ టోపీనే జోలెగా’’వాడి కొత్త తరహా జోలెకు దారి చూపారు .తెలుగు హిందీ ఒరియా భాషల్లో పాటలు రాసి ప్రచారం చేసేవారు .ప్రజలను బాగా ఉత్తేజితులను చేయటం లో సూరమ్మ గారికి  గొప్ప చాకచక్యం ఉండేది .

చదివి డిగ్రీలుపొందక పోయినా లౌకికజ్ఞానం పుష్కలం గా ఉండేది సూరమ్మ గారికి. తన పిల్లలను విద్యా వంతులను చేసి ప్రయోజకులను చేశారు .సంస్కారం ఆత్మ విశ్వాసం ఆమెకు పెట్టని ఆభరణాలు .స్వతంత్ర జీవనం పై అందరికి అవగాహన కల్పించేవారు .ఆమె కుమారులు ,అల్లుళ్ళు అందరూ స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొని జైలుకెళ్ళిన వారే .అదీ ఆమె తర్ఫీదు ప్రభావం .సూరమ్మ గారి కుటుంబం అంతా దేశ సేవలో పునీతులైన వారే .మనం గర్వం గా చెప్పుకోదగ్గ చరిత్ర సాధించిన వారే .జీవితాన్ని సేవగా ,అభ్యుదయ పధం లో నడవాలన్న ధ్యేయం గా ,సంస్క్రణాభి లాషిగా   జాతీయతా స్పూర్తిగా గడిపిన సూరమ్మ గారు ఎనభై రెండేళ్ళు సార్ధకం గా జీవించి 10-2-1969న అనాయాసం గా మరణించారు. ఆమె పేరిట హైదరాబాద్ లో ఆంద్ర మహిళా సభ వారు నిర్వహిస్తున్న నర్సింగ్ హమ్ లో ఒక వార్డుకు ‘’జయంతి సూరమ్మ వార్డు ‘’అని పేరుపెట్టి గౌరవించారు .అది పది మంచాల వార్డు అందులో  జయంతి  సూరమ్మ గారి ఫోటో ఉంటుంది .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-14-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.