ఏపీలో భాజపాకు మంచి రోజులు?
- – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
- 21/12/2014
ఇప్పటికే ఉన్న సూచనలు గత ఆదివారంనాడు స్పష్టమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి ప్రత్యామ్నాయంగా మారేందుకు బిజెపి నాయకత్వం ఇక తుది నిర్ణయం తీసుకున్నట్లే. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌కు చెందినరాంమాధవ్ డిసెంబర్ 14న హైదరాబాద్‌లో మాట్లాడుతూ, ‘‘స్థానిక సంస్థలనుంచి లోక్‌సభ వరకు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలలోనూ బిజెపి అభ్యర్థులు రంగంలో ఉంటారు’’, అని అరమరికలు లేని విధంగా ప్రకటించారు.
దీనిపై ప్రస్తుతం వారి మిత్రపక్షమైన టిడిపి నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం గమనార్హం. పైకి ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా వారు ఆ విషయమై చర్చించుకునే ఉంటారు. అందుకు తమ ప్రతివ్యూహం ఏ విధంగా ఉండాలన్న ఆలోచన సీరియస్‌గా చేయవలసిన దశ ఇంకా వచ్చిందనలేము గాని, అధినాయకుడు చంద్రబాబు మనసులో ఒకచోట రాంమాధవ్ ప్రకటన తప్పక నమోదై ఉంటుంది. అట్లా నమోదుకావడమంటే అర్థం వ్యూహరచన దిశగా నెమ్మదిగా ఆలోచనలు జరుగుతాయని. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో ఈ కోణంనుంచి ఆసక్తికరమవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలహీనమైన పార్టీ అని అందరికీ తెలిసిందే. తెలంగాణలోకన్నా బలహీనమైనది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రత్యామ్నాయం కాగలమని పార్టీ నాయకులు పైకి అంటున్నప్పటికీ, అందుకు అవకాశాలు తమ పరిస్థితి మెరుగ్గా ఉన్న తెలంగాణ కన్న, నామమాత్రంగాగల ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ. ఇదొక చిత్రమైన స్థితి అయినా వాస్తవం. అందుకు కారణాలు ఊహించేందుకు రాజకీయ పాండిత్యం అవసరం లేదు కూడా.
అధికారంలోగల పార్టీల మాట అట్లుంచితే, ప్రతిపక్ష క్షేత్రంలోగల శూన్యత ఎటువంటిదన్నది ఇటువంటి వ్యూహాలకు ప్రధానమవుతుంది. తెలంగాణలో టిఆర్‌ఎస్ తర్వాత కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపికి టిడిపితో పొత్తు ఉన్నా, అది బిజెపికి కలిసిరాని బంధంగా మాత్ర మే కొనసాగుతున్నది. మొత్తానికి టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ స్థానంలోకి రాగల అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇందుకు భిన్నం. అక్కడ కాంగ్రెస్ లేదు. రాగల అవకాశాలు స్వల్పం. వామపక్షాలకు అవకాశం శూన్యం. ప్రతిపక్ష క్షేత్రంలో మిగిలింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఒక్కటే. అది యథాతథంగా బలంగానే ఉంది. అటువంటి స్థితిలో టిడిపికి బిజెపికి ప్రత్యామ్నాయంగా కాగలగటం ఎట్లా సాధ్యం?
ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి. బిజెపి ఎదుగుదలకు రెండు లక్ష్యాలుంటాయి. అది వీలైతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్థానంలో రెండవ శక్తిగా మారటం కావచ్చు, లేదా రాజకీయ రంగాన్ని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలతో కలిపి ముక్కోణంగా మార్చటం కావచ్చు. ప్రస్తుతం ద్వికోణంగా ఉన్న స్థితిని మిత్రపక్షమంటూ లేకుండా తనంతట తాను ముక్కోణంగా మార్చగలిగినా అది చెప్పుకోదగ్గదే అవుతుంది. లేదా అన్నీ కలిసివస్తే 2019నాటికో, తర్వాతనో తమదే రెండవ స్థానమైనా కావచ్చు.
ఇంతకూ బిజెపిని ఏ మార్గంలో శక్తివంతం చేయనున్నారు? తమ సిద్ధాంతాలు ప్రచారంచేసి, ప్రజల సమస్యలపై ఉద్యమాలు చేసి సంస్థను ఒక్కొక్క ఇటుకగా పేర్చుకుంటూ అభివృద్ధిపరచటం ఒక పద్ధతి. తాము కేంద్రం లో అధికారంలో ఉన్నందున దానిని ఆకర్షణగా చూపి ఇతర పార్టీలకు చెందిన ముఖ్యులను, ఏ పార్టీకి చెందని వారిని చేర్చుకోవటం ద్వారా ఆ పనిచేయటం రెండవ పద్ధతి. మూడవ పద్ధతిగా ఈ రెండు మార్గాలనూ మేళవించవచ్చు.
ఇక ప్రజల సమస్యలపై ఉద్యమాలకు సంబంధించి గల ఇబ్బందులేమిటో తెలిసిందే. తాము భాగస్వామిగాగల కూటమి అధికారంలో ఉన్నపుడు ఉద్యమాలంటే తమపై తాము ఉద్యమించుకోవటమే. ప్రచారాల ద్వారా విస్తరించబూనటం తెలుగుదేశం పార్టీకి సరిపడదు. అది తమకు ప్రమాదకరమని భావిస్తారు వారు. అపుడు రెండుపార్టీల మధ్య ఘర్షణలు కాకపోయినా ఉద్రిక్తతలు తలెత్తుతాయి. మిత్ర సంబంధాలు దెబ్బతింటాయి. అంతమాత్రాన ఒక పార్టీ తననుతాను బలోపేతం చేసుకోకుండా మిన్నకుంటుందని కాదు. కాని పరిస్థితి కొంత సున్నితంగా ఉంటుంది. దానిని ఎదుర్కొంటూ పని చాకచక్యంగా సాగించటం తిరిగి సమయం తీసుకునేదే. మరొకవైపు ఏవో ఒక ఎన్నికలు, చివరకు 2019 ఎన్నికలు వచ్చిపడతాయి.
ఈ స్థితిలో, మనకు వినవస్తున్న మాటలు నిజమే అయిన పక్షంలో, బిజెపి నాయకత్వం ఇతర పార్టీల నాయకులను, తద్వారా ఆయా సామాజిక వర్గాల వారిని, ప్రాంతాలవారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందనుకోవాలి. అట్లా కొద్దిమంది ముఖ్యులు ఇప్పటికే చేరారు. కావూరి సాంబశివరావు, పురంధీశ్వరి వంటి వారి ప్రాబల్యం గురించి తెలిసిందే. మరికొన్ని పెద్ద పేర్లు వినవస్తున్నాయి. వీరు ప్రధానంగా కాంగ్రెస్ కుటుంబీకులు. ఆ పార్టీ పరిస్థితి అక్కడ దయనీయంగా మారినందున అక్కడినుంచి, అదే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి అనిశ్చయంగా మారుతున్నందున రానున్న కాలంలో చాలా చేరికలు ఉండగలవన్నది అంచనా. ఇటువంటి వారికి వేరే మార్గం లేదు కూడా. టిడిపిలోకి వెళ్లటం కష్టం. ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులతో కలహాలున్నాయి. అందరూ కలిసి స్వంత పార్టీ కొత్తగా ఏర్పాటుచేయలేరు. కనుక బిజెపి ఒక్కటే మార్గం. పైగా అది కేంద్రంలో అధికారంలో ఉంది. ఇతరత్రా దేశంలో ఇంకా బలపడుతున్నట్లు తోస్తున్నది. మరొకవైపు చూస్తే, బిజెపి ఈ పద్ధతిలో బలపడటం టిడిపికి బెరుకుపుట్టించవచ్చు.
మొత్తానికి ఇందువల్ల జరిగేది ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఒక స్వతంత్ర శక్తిగా ముందుకు రావటం. అయితే అందుకు ఇతర పార్టీల వారిని ఆకర్షించగల ఏకైక అయస్కాంతం జాతీయ స్థాయిలో బిజెపికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉండగల బలం. ఒకవేళ ఏ కారణంవల్లనైనా అది బలహీనపడితే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఇసుక గూడు అవుతుంది. కనుక రాష్ట్ర బిజెపి నాయకత్వం కీడెంచి మేలెంచే పద్ధతిలో దీనినికూడా పరిగణనలోకి తీసుకుంటూ కనీసం ఒకమేరకైనా ‘ఒక్కొక్క ఇటుక’ నిర్మాణ సూత్రాన్ని అనుసరించటం వారికే మేలుచేస్తుంది.
పోతే, టిడిపి నాయకత్వానికి ఇది నచ్చగల పరిస్థితికాదని వేరే చెప్పనక్కరలేదు. ఏ పార్టీఅయినా తమకు ఎదురులేని అధికారం కావాలని కోరుకుంటుంది. తాము ఇకనుంచి అన్ని ఎన్నికలలో తమంతట తాము పోటీచేయగలమని ప్రకటించిన రాంమాధవ్‌కు ఇది తెలియనిది కాదు. దీని అర్థం రెండు పార్టీల పొత్తు తెగిపోగలదని ఎంతమాత్రం అనుకోవద్దు. కాకపోతే బిజెపి బలం పెరిగినకొద్దీ టిడిపి ఎక్కువ సీట్లు కేటాయించవలసి వస్తుంది. అంగీకారాలు కుదరనపుడు ‘మైత్రీపూర్వక పోటీలు’ జరుగుతాయి. ఇదంతా మనం ఇతర పార్టీల మధ్యనేగాక బిజెపి-శివసేన, బిజెపి- బిజూజనతాదళ్ సంబంధాల విషయంలో కూడా చూసిందే.
దీనికి కీలకం ఇక్కడ టిడిపి, ఢిల్లీలో బిజెపి ఎంత జనాకర్షకంగా పాలిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు రాష్ట్రాన్ని బాగా అభివృద్ధిపరచి, గతంలోవలెగాక మానవాభివృద్ధి మార్గంలో అన్నివర్గాల ప్రజలకు మేలుచేసిన పక్షంలో, బిజెపి పెరుగుదలవల్ల కలిగే సవాలును ఎదుర్కొనగలుగుతారు. అదే విధంగా పైన చెప్పుకున్నట్లు, ఎన్‌డిఎ ప్రభుత్వపాలన ఇక్కడ బిజెపికి ప్రాణాధారమవుతుంది. ఇందులో ఎవరు ఎక్కడ పట్టుతప్పినా ఏమి జరిగేదీ ఊహించటం పెద్ద కష్టం కాదు. అది వైఎస్‌ఆర్‌సిపికి, కాంగ్రెస్‌కు కొత్త ఊపిరులిచ్చినా ఆశ్చర్యం ఉండదు.
—
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797

