కందాల విందులూ.. చమత్కారాల చిందులూ
- -సన్నిధానం నరసింహశర్మ
- 20/12/2014
నృహరీ!
పంచశతి; కవి: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ;
పుటలు: 224, వెల: తెలుపలేదు;
ప్రతులకు: డా.అక్కిరాజు సుందరరామకృష్ణ,
1-8-702/1/1, ఆంధ్రా బ్యాంకు సందు, నల్లకుంట,
హైదరాబాదు- 500 044
కావత్తు ప్రాస కుదిరిందని చెప్పడం కాదు; ఇది అక్కిరాజువారి చక్కనైన పొత్తం, కంద పద్యాల ముచ్చటైన మనోవిహార యాత్రాఫలాలు. యావత్తు పుస్తకం చదివితే అక్కిరాజు సుందర రామకృష్ణ నాటక, కావ్య పద్య పఠనంలోనే కాదు, పద్య రచనంలో కూడా రాణించదగిన వారనిపిస్తుంది.
దశావతారాల్లో నరసింహావతారం ఒక విలక్షణ అవతారం. సగం నరుడూ, సగం సింగమూ. నృహరీ మకుటంతో ఇప్పుడు శతక సింహాసనంపై అక్కిరాజు భాసిస్తున్నారు. ఆమూక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు నరసింహస్వామిని ‘దంభకేసరి’ అన్నాడు. ‘లక్షాధికారైన లవణమన్నమెకాని, మెరుగు బంగారంబు మింగబోడు’వంటి శాశ్వత సూక్తిరత్నాకరమైన నరసింహ శతకం వేమన శతకం వంటి శతకాల వెంబడిని ప్రజావాఙ్మయ విలీనమైంది. ఆమధ్య రామడుగు వెంకటేశ్వరశర్మ చెంచులక్ష్మి అనే ఒక మనోహర కావ్యంలో నృసింహస్వామి కథాభివర్ణనలు చేశారు. ఇలా నరసింహస్వామి ఇప్పటికీ సాహిత్యంలో అవతరిస్తూనే వున్నాడు.
వర్తమాన కాలంలోని ఈ పంచశతి ఆకట్టుకునే సామాజిక అయస్కాంతాల్ని స్వంతం చేసుకుంది.
‘కొడుకులు సింహాసనముల/ కడునేర్పున కూర్చొనంగ కావించెడి ఆ/
చెడుగుల యత్నములక్కట/ అడుగడుగునా గాంచుచుంటి
మయ్యా నృహరీ’ అంటూ కుటుంబ పాలనల్ని నిరసిస్తారు. ‘పుడమిని మాత్రమె కాదుర/ కడు కంపునుగొట్టు మురికి కాల్వలగూడన్/ చెడుగులు కబ్జాచేసిరి/ సడిసప్పుడు చేయకుండ చతురతన్నహరీ’ అంటూ భూకబ్జాదారుల నిస్సిగ్గు పనుల్ని నిరసించారు.
భాషా సంపద పుష్కలంగా ఉంటే యతి, ప్రాస, గమక, గమనాల్లో వీర విహారం చేయగలం- ఎటొచ్చీ శోధనా నైపుణ్యం, సమయ సందర్భ పద క్రీడారహస్యాలు తెలిస్తే అని కవి నిరూపించారు. దేవుళ్ళపై భలే చమత్కారాలు చేస్తారు. డ్రెస్సులు గడిగడి మార్చుచు/ కస్సూబుస్సులను చూప ఘనునీకంటెన్/ డ్రెస్సే ఎరుగని శివుడే/ లెస్సగు దైవంబు తెలిసెలేరా- నృహరీ’ అటువంటిదే.
గణగుణాలూ, గుణగణాలూ రెండిటా నిండుదనాన్ని పొందిన త్రిశతి, యిది.
‘తలకాయలు తమతమ జే/బులలోపల వేసికొనుచు పోలింగు కు, పో/వలసిన రోజులు వస్తే/ సెలవింక డెమోక్రసీకి సిరిసిరి మువ్వా’ అంటూ ఆధునిక భావాలతో సిరిసిరిమువ్వ శతకంలో కందకందుక క్రీడాకారుడయ్యాడు. ప్రశంసని హృదయంలోంచి కంఠంలోకి తెచ్చుకుని మాటల్లోకి తెచ్చుకోలేనివారు తప్ప ఎవ్వరైనా ఈ త్రిశతిని మెచ్చుకు తీరతారు ఇందులోని తలపు మువ్వల సవ్వడులకి.
‘పక్కింటివారి లోగిట/ చక్కగా తెగ పూచినట్టి చామంతి పువుల్;/ కుక్కలు కాపలయున్నను/ పక్క ప్లానేసి జయము వడసితి- నృహరీ అంటారు సహజ చమత్కారంగా.
‘ఇప్పుడు పెద్దమగాడను/ చెప్పగ, బాల్యాన సిసలు చిల్లరగాడన్/ తప్పులు దండిగ చేసితి/ అప్పామన్నించు నీ ప్రియాత్మజు- నృహరీ’ అనడంలో నీ ప్రియాత్మజుడను అనడంలో ఆత్మీయత, కొంటెతనం గడుసుదనం మేళవించాయి. ఈ నృహరి త్రిశతిలో ‘వీరస్తుతులు!’ లేవుగాని వైరభక్తివుంది. నరసన్నను కన్నతండిరిగా భావించిన చనవు మాటలుంటాయి.
‘ఈ మధుమేహమదేమో/ భామలపై తరుగనట్టి వాంఛలవేమో! శ్రీ మహిళాధవ, భువి/ కడు/ ధీమహితుడు చెప్పలేడు- తెలియుర నృహరీ!’ అంటూ ‘మధు’మోహాన్ని’ కూడా దాపరికం లేకుండా చెబుతారు.
‘ఎంచగ గతమున నెంతో/ మంచిగ పలుకాడు నీవు, మార్చితె మోటౌ చెంచుల ‘కుర్రో’యనివి/న్పించెడి ‘బేవర్సు’ బాస బిత్తరినృహరీ!’ అన్నారు. బేవర్సు బాస అని యధాలాపంగా అనేశారు, చమత్‘కారం’గా.
ఉత్తిచమత్కారాలు శక్తిచమత్కారాలై విభిన్న భావ విహారాలై చమత్కారాల చిందుల్తో కందాల విందుల్ని చేసింది ఈ త్రిశతి.
చమత్కారమంటే ‘లోకాతీతమగు వస్తువును చూడగా చిత్తమునకు కలుగు ఆనందహేతువైన వికాసం’ అని అర్థం. ఈ త్రిశతి అటువంటి హృదయ వికాసాన్ని కలిగిస్తుంది. కవిగారు సుమారు అరవై పుటల్లో ‘నామాట’అని వ్రాసింది పఠన యోగ్యమవడం విశేషం. అందులో అనుభవాలు అనుభవసారాలూ వున్నాయి.
‘‘ఇది భక్తికావ్యం కాదు, ఇది అధిక్షేపకావ్యమే. భగవంతునికి తనను తాను అర్పించుకునే ఆర్తినివేదనం, కైవల్య ప్రాప్తికై ఆరాటంకాదు, చెడుపై చెడుగుళ్ళూ ఆడడం, మాటల తూటాలను పేల్చడం బాధ్యతగా కర్తవ్యంగా తలపోస్తూ భగవంతుని నిలదీయడం’’అని ఆచార్య నిత్యానందరావు ‘పద్య పరశువు’ అనే తమ అభిప్రాయంలో అన్నది యదార్ధ వాక్యాలు.
మంచి కవిత్వాలు వస్తున్నాయి. కని పూర్వంలా రసజ్ఞులు, కవితాభిమానులు కవిత్వ ప్రచారం పంపిణీలు చేయలేకపోతున్నారనిపిస్తుంది. చేస్తే ఈ పొత్తం ప్రయోజనదాయకం. ఈ పంచశతి కందాలవిందుల్ని చేస్తూ మనపై చమత్కారాల పన్నీటి చుక్కల్ని చిందిస్తుంది.

