కొవ్వలి నవలల్లో వస్తు వైవిధ్యం
- – ముక్తేవి భారతి, 9989640324
- 15/12/2014
వెయ్యి నవలలు పాఠక లోకానికందించిన రచయిత శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు. వీరి నవలలు ప్రత్యేకమైన వస్తువు, శైలి గలవి. ముఖ్యంగా కొవ్వలి నవలల్లో వస్తువైవిధ్యం అప్పటి కాలాన్నిబట్టి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆనాటి సమాజం అద్దంలో చూసినట్టుగా పాఠకుని ముందు నిలుస్తుంది. కందుకూరి వారి సంస్కరణోద్యమ ప్రభావం ఆనాటి యువ రచయితలపై వుంది. వృద్ధ వివాహాలు, కన్యాశుల్కం, వేశ్యాలోలత్వం, కుహనా సన్యాసినులు, మతం మార్పిడులు, విభిన్నమైన స్ర్తిల సమస్యలు కొవ్వలి నవలల్లో ముఖ్యమైన విషయాలు. సామాజికంగా, కుటుంబ పరంగా స్ర్తిలకు జరుగుతున్న అన్యాయాలను చూపిస్తూనే, వాటినుండి బయట పడేందుకు స్ర్తిల పక్షాన కవి గొంతు విప్పటం స్పష్టంగా తెలుసుకొంటాం. వారికి జరగాల్సిన న్యాయంకోసం పోరాటం చేయటానికి సాహసం చూపటానికి కొవ్వలి వారి పాత్రలు వెనుకాడలేదు.
‘ఆడ మళయాళం’, ‘మా ఆవిడ రూపవతి’, ‘బర్తు కంట్రోలు’ వంటి నవలల్లో వ్యంగ్యం, సందేశాలతో కూడిన వస్తువైవిధ్యం ఉంది. కొన్ని నవలల్లో (ఆడ మళయాళం) మత మార్పిడి అంశం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తెచ్చిపెట్టే మతం చాలా శక్తిమంతమని బోధిస్తారు కొవ్వలి. ‘ఆడ మళయాళం’ నవలలో జ్యోషి పాత్రలో మానవత్వాన్ని రంగరించారు. మతాంతర వివాహం చేయించారు. ఈ నవలలో భగవతి అనే ఆమె బోధనలలో, మత విశ్వాసాలలో ఎంత మోసం వుందో చెప్పి స్ర్తిల కళ్ళు తెరిపించారు. అప్పుడే చెప్పిన దొంగ సన్యాసులు… సన్యాసినుల్ని నేడూ చూస్తూనే వున్నాం గదా! కొవ్వలివారి ‘మా ఆవిడ’ నవలపై గురజాడ ప్రభావం బాగా కనిపిస్తుంది. ఆనాటి సమాజంలో సామాన్యంగా కనిపించే వృద్ధ వివాహం అంశానికి నవలా రూపమిచ్చారు. ఇందులో యాభై ఏళ్ళ పాపయ్య పధ్నాలుగేళ్ళ అన్నపూర్ణని పెళ్ళాడటానికి రెండువేల రూపాయలు పిల్ల తండ్రికిస్తాడు. స్నేహితులందరూ పాపయ్యని ‘‘నీ కర్మంగాలా! ఇంత బతుకు బతికి చివరికి డబ్బిచ్చి పిల్లను కొనుక్కుంటావురా’’ అని ఈసడిస్తారు. ఆ వృద్ధుడు అయిదు రోజుల పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. మేజువాణీ, బాణాసంచా, ముత్యాల పల్లకి కోరినట్టు రాశారు. ‘‘నా ముద్దూ ముచ్చటా తీరాలి’’ అంటాడు పాపయ్య. ఇది చదువుతుంటే నాకు వీరేశలింగం, చిలకమర్తివారల ప్రహసనాలు గుర్తుకు వచ్చాయి. అమ్మయిలే గొంతు విప్పి మనసులో మాట చెప్పి ధైర్యంగా ముందడుగు వెయ్యాలని కొవ్వలి సందేశమివ్వటం ప్రగతి శీలత్వమే!
రూపవతి అయిన భార్య భర్తను అవమానపరుస్తూ, ఇంటి చాకిరీని భర్తచేత చేయిస్తూ, పర పురుషులతో అతి చనువుగా వుండే రూపవతి భార్యకన్నా గుణవంతురాలయి రూపురేఖలు బాగా లేకున్న భార్యే కుటుంబంలో శాంతి సౌఖ్యాలను చేకూరుస్తుందని కొవ్వలి ‘రూపవతి’ అనే నవలలో బోధిస్తారు. అందుకే మనవారు ‘‘రూపవతీ భార్యా శత్రుః’’ అన్నారు. రూప సంపద తాత్కాలికం- గుణ సంపద శాశ్వతమన్నదే కొవ్వలి ఉద్దేశం.
ఘోరమైన, మూఢమైన దురాచారాల్ని పోగొట్టేందుకు కథలు, నవలలు, ప్రహసనాలు, గేయాలు, నాటికలూ వెలువడ్డాయి. అటువంటి రచనల వల్లనే సమాజంలో మార్పు వచ్చింది. కొవ్వలి రచనలు కూడా ఆ కోవకి చెందినవే. ‘బర్త్ కంట్రోలు’ నవలలో కొవ్వలి భర్తల పక్షం వహించినట్టు అనుకుంటాం గానీ భర్తల్ని మోసంచేసే భార్యలూ ఉన్నారని కళ్ళు తెరిపించటానికే ఈ నవల రాసినట్టు భావించాలి. ‘బర్త్ కంట్రోల్’ అనే నెపంతో గున్నమ్మ భర్తను శారీరక సుఖానికి దూరంగా వుంచుతుంది. అయితే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకొంటుంది. గర్భం దాల్చి- తనకు పుట్టిన పిల్లని సంబంధం పెట్టుకొన్న వాడి భార్యకి అప్పగించి భర్తతో ‘‘నేను మీకు అన్యాయం చేశాను’’ అన్నప్పుడు పశ్చాత్తాపం వచ్చిందని పాఠకుడు గున్నమ్మపై సానుభూతి చూపించేలా రాశారు కొవ్వలి!
కొవ్వలివారి ‘దాసీ పిల్ల’ రెండవ నవల. చెళ్ళపిళ్ళవారు మెచ్చుకొన్న నవల. ఇందులో లక్ష్మి దాసీ పిల్ల. సంఘం చేత నీచంగా చూడబడుతూ, సేవక వృత్తిలో తనువు తెల్లార్చుకొనే తక్కువ కులాలలో కూడా నీతి, ప్రేమ, ఆత్మగౌరవం వంటి ఉత్తమ గుణాలుంటాయని ఈ నవల చెప్తుంది. ఎంతటి అభ్యుదయ దృక్పథం! ఈ ‘దాసీపిల్ల’ నవలలో చాలా మలుపులున్నాయి. చివరకు సుఖాంతం చేస్తారు. ఈ నవలలో సత్యవతి బాల వితంతువు. ఆ అమ్మాయికి కేశఖండన చేయించాలని తల్లిదండ్రులు అనుకోవటంతో సత్యవతి అత్త కొడుకుతో లేచిపోవాలనుకొంటుంది. ఇందులో క్రైస్తవ మత ప్రచారాన్ని, కొందరి దొరసానుల దయాహృదయాల్ని, చదువుకొన్నవారి అభ్యుదయ భావాల్ని వివరిస్తూ యువత సమాజాన్ని తీర్చిదిద్దగలదన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు కొవ్వలి.
‘‘కూడు లేక ఏ మానవుడూ చెడిపోడు. పూటకు లేని వాడయినా గుణవంతుడయితే కోటికి పడగలెత్తగలడు. గుణహీనుడయిన కోటేశ్వరుని జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు. ఈ నిజమును తెలుసుకొని బతికినవారు ధన్యులు’’ అంటారు, ‘నిశానీదార్’ నవలకి ముందు మాటలో! ఈ నవలలో నిరక్షర కుక్షి అయిన రంగనాయకులు ఇంగ్లీషు బాగా చదివానని గొప్పలకి పోతూ డాంబికాలు చెప్తూ భార్యని, అత్తని మోసం చేస్తూ వుంటాడు. ఈ నవల ఇంగ్లీషు వ్యామోహాన్ని ఒక కోణంలోనూ, మోసకారితనాన్ని మరో కోణంలోనూ చూపించి ఆడవారు ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సానుకూలపరచుకోవాలని హితవు చెప్తారు కొవ్వలి. ఈ రంగ నాయకులు పాత్ర గురజాడవారి గిరీశం పాత్రను గుర్తుకు తెస్తుంది. ఇద్దరూ సమాజానికి కీడు చేసేవారే!
‘విడాకులు’ నవలలో సాంఘిక సమస్యలు చాలా చూపించారు. దాంపత్యం, ప్రేమ, స్నేహం, స్ర్తి ఆశయాలు వంటివి వెల్లడించారు. స్ర్తిల సమస్యలకి ఎవరు కారకులు? తల్లిదండ్రులా? సమాజమా? ఎవరు? అన్నదే కొవ్వలి వారి తపన!
కొవ్వలి లక్ష్మీనరసింహారావుగారి నవలల్లో సంఘ సంస్కరణలు విభిన్న రూపాల్లో కనిపిస్తుంది. వీరి నవలలు చదువుతుంటే ఏ నవలకి ఆ నవల ప్రత్యేకమైనదే అనిపిస్తుంది. సమాజంలో ఎంతటి వైవిధ్యం వుందో వీరి నవలల్లోనూ అంతటి వస్తువైవిధ్యం వుంది. ‘రూపం కాదు, గుణం ముఖ్యం’, ‘కుహనా సంస్కారవంతులుంటారు జాగ్రత్త’, ‘కుల మతాల ఉచ్చుకు దూరంగా వుండండి’, ‘్భర్యాభర్తల అనుకూలత’….. ఇలా ఎన్నో అంశాల్ని తమ నవలల్లో వివరించి మనకి కనువిప్పు కలిగించారు. కొవ్వలివారు కేవలం వ్యవస్థలోని లోపాలనే చెప్పి ఊరుకోలేదు- వాటిని సరిదిద్దాలని తపన చెందారు. ఇటువంటి గొప్ప నవలా రచయిత మన తెలుగువాడవటం గర్వించదగినది.

