గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు

గడతో గండాలు దూరంచేసే పావగడ శనీశ్వరుడు

  • – దాసరి దుర్గాప్రసాద్
  • 15/12/2014
TAGS:

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు చెబుతారు. శని దూషణ సర్వదేవతలనూ తిట్టిన దాంతో సమానమంటారు. ఆ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. అంతటి మహిమాన్వితుడైన ఆ స్వామి కొలువుదీరిన క్షేత్రమే పావగడ. దేశంలో ఉన్న ప్రముఖ శనైశ్చర స్వామివారి క్షేత్రాలలో పావగడ కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు శనీశ్వర స్వామివారు, శీతల అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలను ఆవిష్కరించే కొండల నడుమ ఉన్న ఈ దివ్య క్షేత్రం శ్రీ శనీశ్వరస్వామి లీలా విశేషాలతో, మహత్యాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అహంభావ హీనం, ప్రసనాత్మభావం కల భక్తుల్ని శనీశ్వరుడు రామరక్షయై కాపాడతాడని పురాణాలు చెబుతున్నాయి. సత్యం, న్యాయం శనీశ్వరుని రెండు కళ్ళు. శని అంటే శక్తి. మహాశక్తి. శనీశ్వరా అంటే శివశక్తి. ఆ శివశక్తి ఆశీస్సులు పొందడానికి భక్తి ప్రధానమైనది. పరిపూర్ణ అహింసామూర్తిగా, సర్వంతర్యామిగా ఆ స్వామి పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్విత స్వామి కొలువుదీరిన పుణ్యప్రదేశమే పావగడ. ఇక్కడ ఆ స్వామి శని మహాత్మస్వామిగా భక్తులచే నీరాజనాలందుకుంటున్నాడు.
పూర్వకాలంలో ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక సాధువు శనీశ్వరస్వామి వారి పటాన్ని ఉంచి పూజలు నిర్వహించేవాడట. అయితే స్వామి వారి దృష్టి తమపై పడకూడదనుకున్న భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి దూరంనుంచే స్వామివారిని దర్శించుకునేవారట. అనంతర కాలంలో కట్టా కృష్ణయ్యశెట్టి, ఎ.నర్సింగరావు అనే భక్తులు విరాళాలు సేకరించి స్వామివారికి ఒక చిన్న మందిరాన్ని కట్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.
అనంతర కాలంలో ప్రఖ్యాత శిల్పకారుల సహకారంతో నిర్మించిన నవగ్రహాలను తిప్పయ్య అనే భక్తుడి నేతృత్వంలో ప్రతిష్టించారట. ఆనాటి నుంచి నేటివరకూ ఈ ఆలయం దినదిన ప్రవర్థమానమవుతూ భక్త జన సందోహంతో అలరారుతుంది.
మనోహరమైన దేవతా శిల్పాలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న శనీశ్వరస్వామి వారి ప్రధానాలయ గోపురం భక్తులలో భక్తి భావాన్ని ప్రోదిచేస్తుంది. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం శనైశ్వరస్వామినే నమః అంటూ ప్రధానాలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో ముందు గా ప్రధానాలయానికి వెలుపల శని దేవుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. కాకి వాహనారూడుడైన ఆ స్వామిని భక్తులు భ్రక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇదే ఆలయంలో మరో పక్క పంచముఖ హనుమంతుడు కొలువుదీరాడు. ప్రధానాలయంలోని ప్రాకారాలన్నీ వివిధ దేవీదేవతల సుందర శిల్పాలతో అందంగా ఆహ్లాదంగా దర్శనమిస్తాయి.
గర్భాలయం వెలుపలి ప్రాంగణంలో శనీశ్వరస్వామి, జ్యేష్టాదేవి సుందర మూర్తులు దర్శనమిస్తాయి. పంచలోహ సమన్వితంగా ఉన్న ఈ మూర్తులను భక్తులు భక్తితో దర్శించుకుని
సత్యశక్తి స్వరూపం…….
సంకట హరణం దేవాం
శనీశ్వరాం ప్రణమామ్యహమ్
అంటూ భక్తిశ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. స్వామివార్లకిచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు.
శనీశ్వరస్వామి గర్భాలయానికి మరోపక్క శీతలామాత ఆలయం ఉంది. ఈ ఆలయానికి ముందు చండి, ప్రచండి మూర్తు లు దర్శనమిస్తాయి. ప్రధానాలయంలో ఎడమవైపున సత్యనారాయణస్వామి, కుడివైపున వినాయకుడు, దత్తాత్రేయుని మూ ర్తులు కానవస్తాయి. గర్భాలయంలో శ్రీ శీతలామాత వారి దివ్య మంగళ రూపం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. ఈ ఆలయంలోనే శనీశ్వరస్వామి, శీతలామాత, జ్యేష్టాదేవి, సీతారామ లక్ష్మణుల పంచలోహ మూర్తులు కానవస్తాయి.
పావగడ శ్రీ శనైశ్చరస్వామి ఆలయం శనిదేవుని విశేష పూజలకు ప్రత్యేక వేదికగా అలరారుతోంది. ఇక్కడ నవగ్రహ మండపంలో శని దేవునికి, ఇతర గ్రహదేవతలకు రోజూ వందలాది మంది భక్తులు నిర్వహించే అర్చనాది అభిషేకాలు నయన మనోహరం. ఆద్యంతం ఆధ్యాత్మికానురక్తిని ప్రోదిచేసే ఆయా పూజల్లో పాలుపంచుకోవడం భక్తులు తమ అదృష్ట్భాగ్యంగా భావిస్తారు. అత్యంత భక్తివిశ్వాసాలతో ఇక్కడ స్వామి వారిని తిల తైలాభిషేకాలతోపాటు అఖండ హారతి నిర్వహిస్తే సమస్త గ్రహ బాధలనుంచి శని దేవుడు విముక్తి కల్గిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి ఆయా పూజలన్నీ చేయించి స్వామి సేవలో మునిగి తేలుతారు. పూజానంతరం తమ బాధలను, బరువులను స్వామివారి సమక్షంలో విడిచిపెట్టే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. దీనికిగాను పూజలు చేయించుకునే భక్తులు వెండి దండాలను చేతబూని స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ఆయా దండాలను స్వామివారికి సమర్పిస్తారు. తమ గ్రహబాధలను, ఇతర కష్టాలను దండాల రూపంలో చేతబూని స్వామి వారికి సమర్పిస్తారు. వైవిధ్యంగానూ, విశేషంగానూ కానవచ్చే ఈ సంప్రదాయం దేశంలోని ఏ శనీశ్వరస్వామి ఆలయంలోనూ కనిపించదు. ఆసక్తిని గొలిపే ఈ తంతు చూడడానికి రెండు కనులూ చాలవంటే అతిశయోక్తి కానేరదు. ఈ ఆలయంలో శని త్రయోదశికి, శని జయంతికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఆయా పర్వదినాలలో స్వామివారి ఆలయం భక్తసంద్రంలా అగుపిస్తుంది.

దండంపట్టుకో.. సుఖదుఃఖాలను దింపేసెయ్
ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి కోరుకున్న పూజలన్నీ చేయించి స్వామి సేవలో మునిగి తేలుతారు. పూజానంతరం తమ బాధలను, బరువులను స్వామివారి సమక్షంలో విడిచిపెట్టే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. దీనికిగాను పూజలు చేయించుకునే భక్తులు వెండి దండాలను చేతబూని స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత ఆయా దండాలను స్వామివారికి సమర్పిస్తారు. తమ గ్రహబాధలను, ఇతర కష్టాలను దండాల రూపంలో చేతబూని స్వామి వారికి సమర్పించడమే ఈ ప్రదక్షణ, దండంసమర్పణంలోని అంతరార్థం. వైవిధ్యంగానూ, విశేషంగానూ కానవచ్చే ఈ సంప్రదాయం దేశంలోని ఏ శనీశ్వరస్వామి ఆలయంలోనూ కనిపించదు.

దేవాలయానికి మార్గం
ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం జిల్లా హిందూపురం వరకు వచ్చి అక్కడనుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. అలాగే కళ్యాణదుర్గం నుంచి అరవై కిలోమీటర్లు దూరంలో అలరారుతున్న ఈ దివ్య క్షేత్రం చేరుకోవడానికి ప్రయివేటు బస్సులు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ భక్తులకు కావాల్సిన భోజన వసతి సదుపాయాలున్నాయి. పావగడ శ్రీ శనీశ్వరస్వామి ఆలయ దర్శనం సర్వగ్రహ పీడా నివారణం. స్వామి దర్శనం సర్వశుభకరం.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.