నేడు ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు ప్రదానోత్సవం
- 21/12/2014
హైదరాబాద్, డిసెంబర్ 20: సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం సాయంత్రం సికిందరాబాద్ టివోలి గార్డెన్స్‌లో ‘శివానంద ఎమినెంట్ అవార్డు- 2014’ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకుల పక్షాన ట్రస్టు మేనేజింగ్ ట్రస్టి కె.బసవరాజు తెలిపారు. ఈ పురస్కారాలను ఈ సారి భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు, పద్మభూషణ్ మహామహోపాధ్యాయ డా.సత్యవ్రత్ శాస్ర్తీలకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సద్గరు శివానందమూర్తి అనుగ్రహభాషణం చేయనున్నట్లు వివరించారు.
పురస్కార గ్రహీతలు వీరే!
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన పలువురు ప్రముఖులకు ప్రతి ఏటా శివానంద ఎమినెంట్ అవార్డులను ప్రదానం చేసి సత్కరించుకునే ఆనవాయితీని చాలా కాలంగా ట్రస్టు కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం పురస్కారాలు స్వీకరించిన ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి. వీరిలో భారత రత్న ప్రొఫెసర్ సి.ఎన్.రావు బనారస్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్‌సి, యుఎస్‌ఏలో పిహెచ్‌డి చేసిన తరువాత అనేక పరిశోధనలు చేసి 63 విశ్వవిద్యాలయాలనుండి గౌరవ డాక్టరేట్‌లు పొందారు. అనేక విజ్ఞానశాస్త్ర అకాడమీలకు సభ్యులుగా వ్యవహరించారు. అనేక సేవలందించి పతకాలు, అవార్డులు స్వీకరించి, ప్రముఖులచే మన్ననలు పొందారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులనిచ్చి సగౌరవంగా సత్కరించిందని నిర్వాహకుల పక్షాన బసవరాజు తెలిపారు.
పురస్కారాన్ని స్వీకరించనున్న మరొక ప్రముఖులు డాక్టర్ సత్యవ్రత్ శాస్ర్తీ సంస్కృతంలో బి.ఎ ఆనర్స్, పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ సంస్కృతం మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. బనారస్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందారని, 45 సంవత్సరాలుగా బోధనా శాఖలో డీన్‌గా, సంస్కృతిశాఖ అధిపతిగా, ఒడిషా రాష్ట్రంలోని పూరిలోని శ్రీ జగన్నాధ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా అత్యుత్తమ సేవలందించారు. సంస్కృతంలో జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి విద్యావేత్త సత్యవ్రత్ శాస్ర్తీ అని బసవరాజు పేర్కొన్నారు. వీరికి పురస్కారాలను ప్రదానోత్సవం చేసేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో తొలుత సాయంత్రం 5 గం. ల 45నుండి 45 నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
chitram..
సద్గురు శివానంద మూర్తి

