సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

 

సామాజిక ఇతివృత్తాలతో సాగే ‘కథన కుతూహలం’

  • -గోపగాని రవీందర్
  • 20/12/2014
TAGS:

వటపత్రశాయి,
రచయిత: సింహప్రసాద్,
పేజీలు: 240, వెల: రూ.175/-
చిరునామా: శ్రీశ్రీ ప్రచురణలు,
401, మయూరి ఎస్టేట్స్, ఎమ్.ఐ.జి-2 650,
హైదరాబాద్- 500 085.
సెల్: 9849061668

ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో సుపరిచిత కథకులు సింహప్రసాద్‌గారు. పతనమవుతున్న మానవత్వ విలువలపై ఆవేదనతో రాస్తున్న అతికొద్దిమంది రచయితల్లో ఆయన ఒకరు. వర్తమాన జీవనంలోని సున్నిత అంశాలపై హృద్యంగా రాస్తున్న కథలు, నవలలు ఆకట్టుకుంటున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో వివిధ దిన, వార, మాస పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో పురస్కారం పొందిన ఇరవై కథలతో ‘వటపత్రశాయి’గా ఏడవ కథాసంపుటిని వెలువరించారు. పోటీకి వచ్చిన కొన్ని వందల కథలనుండి ఎన్నుకున్న కథ అంటే సహజంగానే ఆసక్తి కల్గుతుంది. మన చుట్టువున్న రకరకాల వైవిధ్య జీవితాల్ని పరిచయం చేస్తాయి.
మానవ సృష్టి నిరంతరంగా సాగుతూనే సమాజముంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా పిండదశలోనే పిల్లలను తొలగించుకుంటున్న దుస్థితిని మనం చూస్తున్నాం. మాతృత్వం చాలా గొప్ప సంప్రదాయమని చాటిచెప్పిన కథ ‘వటపత్రశాయి’. పిల్లలను కనడానికి అనువైన యవ్వన కాలాన్ని కాదనుకొని డబ్బు సంపాదనకై పరుగుపెడ్తున్న దంపతులకు చెంపదెబ్బలాంటి కథ ఇది. కుటుంబ జీవనంలో స్ర్తిని ఒక సంపాదన వనరుగాకాక జగన్మాతగా చూడాలని, ప్రతి బిడ్డా వటపత్రశాయేనని చెప్పిన కథ ఆలోచింపజేస్తుంది. ఇతర పనులను వాయిదావేసుకున్న ఫర్వలేదుకాని తల్లికావడాన్ని వదులుకోవద్దని నేటి తరానికి హితవుచెప్పిన కథ ఇది. మనం సుఖంగా ఉంటేనే సరిపోదు మన చుట్టు ఉండేవాళ్ళుకూడా బాగుండాలి. అనాథ పిల్లలకోసం నడుపుతున్న ఆశ్రమానికి సహాయం చేయడంకోసం అన్నపూర్ణమ్మ రోజు వండుకునే బియ్యంలో పిడికెడు తీసి పక్కనపెట్టి, నెల రోజుల తర్వాత ఆ బియ్యాన్ని నిర్వాహకులకు ఇచ్చి, వాళ్ళకు కొంత సహాయపడ గలిగినందుకు తృప్తిచెందుతుంది. తమ పిల్లలు తమకు పెట్టకపోయినా పింఛన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న వృద్ధులు వాళ్ళు. తాము రోజు తినే తిండిని తగ్గించుకుని సహాయం చేస్తారు. మానవీయతకు అద్దంపట్టిన కథ ‘గుప్పెడు.’
‘వంశవృక్షం’ కథలో నీ ఎదుగుదల మూలాలను తెలుసుకోవాలని సూచిస్తారు. ఉద్యోగ జీవితంలో అవినీతి అక్రమ సంపాదనలో కూరుకుపోయి, తమకు నీడనిచ్చిన కుటుంబానే్న మరిచిన ఉదంతం బాధను కల్గిస్తుంది. పేద పురోహితుడి అశక్తికి కారణం తనదగ్గర డబ్బు లేకపోవడం. తన పూర్వికులు సహాయంకోరిన వాళ్ళను ఆదుకొని ఆస్తులను కోల్పోతారు. ఆ రెవెన్యూ అధికారి కుటుంబం కూడా వాళ్ళు అందించిన సహకారంతోనే నిలిచింది. ఆ కుటుంబం కష్టాల్లోఉంటే సహాయం చేయాల్సిందిపోయి డబ్బులకోసం సతాయించడం చూస్తాం. నేటి మానవ నైజానికి నిదర్శనమీ కథ. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న అత్యాచార యత్నాలను ధైర్యంగా తిప్పికొట్టి, తగిన బుద్ధిచెప్పిన కథ ‘ఓ సీతకథ.’ ఒక లంబాడీ మహిళ బతుకుకై ఆర్ట్స్ విద్యార్థులకోసం తన అందమైన యవ్వనాకృతుల్ని అర్పించిన దీనగాథ ‘మోడల్’కథ. ఆమె దేహాన్ని చిత్రించి ఎంతోమంది గొప్ప చిత్రకారులైనారు. ఆమె ఆకలి మాత్రం తీరలేదు. చివరికి ఆమె శవంగా మారినా మోడల్‌గా ఉండి దహన ఖర్చులను సంపాదించుకున్న తీరు ద్రవింపజేస్తుంది.
కార్పొరేట్ విద్య అందించే డబ్బుకు దాసోహమన్న గణిత మేధావి సూరిబాబు గుర్తింపుకై పడిన తండ్లాటలో చదువుచెప్పిన గురువునే తక్కువచేసి ఆలోచించుకుంటాడు. పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆ గురువుకు సన్మానం చేయాలను కుంటారు. గురువు మాత్రం నాకన్న విశేషమైన కృషిచేసిన నా శిష్యుణ్ణి సన్మానం చేస్తానని సూరిబాబుకు సన్మానం చేస్తాడు. దాంతో అతనిలోని అహంకారం పటాపంచలవుతుంది. గురువు ఔన్నత్యాన్ని చాటిచెప్తునే నేటి విద్యారంగంలోని అవలక్షణాలను కూడా చర్చించిన కథ ‘పరబ్రహ్మం.’
రైతులకు గిట్టుబాటు ధర లేక పంటలు వేయమని సమ్మెచేస్తున్న పట్టించుకోని ప్రభుత్వాల తీరును ఎండగట్టిన కథ ‘రోమ్-నీరో-్ఫడేలు’. ఆడపిల్లల జనాభా తగ్గడంతో పెళ్ళికోసం పరీక్షలురాసే రోజులు రానున్నాయని హాస్యంగా చెప్పిన కథ ‘రేపింతే’. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రతీది వినోదభరితంగా ఉండాలనే మీడియా ప్రభావంవల్ల మానవత్వం మసకబారుతున్న వైనాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు ‘విష పరిష్వంగం’ కథలో. ఒక నిరుద్యోగి ఉరిని ఈవెంట్‌గా మార్చుకున్న వ్యాపార కోణాన్ని చూపి నివ్వెరపోయేట్లు చేశారు. మార్పు సహజం. రెండు దశాబ్దాల క్రితందాక కూడా కంప్యూటర్ల ప్రభావం లేదు. టైపు మిషన్‌లతో ఉపాధి చూసుకున్నవారు ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా వచ్చిన ప్రగతితో ఆ కుటుంబాలవారు ఉపాధికి దూరమయ్యారు. ఐనా నమ్ముకున్న వృత్తే కాపాడుతుందని నమ్మిన వృద్ధుని కథే ‘పాతనీరు’. పాతది పనికిరాదనే దృక్పధాన్ని నిరసించే కథ ఇది. ఒకప్పటి పాత నీరు కొత్తదే అని తెలిపిన కథ. దేని ఉపయోగం దానికి ఉంటుందని తెలుస్తుంది. నేటి అవినీతి ఉద్యోగులకు బుద్ధిచెప్పటానికి ఒక తెలివైన పౌరుడు లంచంగా దొంగనోట్లును ఇస్తాడు. దాంతో ఆ ఉద్యోగి పడిన అవస్థల కథే ‘గాంధీతాత నవ్వేడు’. నగరంలో పెరిగిన సెల్‌టవర్ల మూలన అంతరిస్తున్న పక్షుల గూర్చిన కథ ‘వాయసం.’ పిండాలు తినే కాకులు కనబడవు. మారిన అలవాట్లు కాకులకు తిండి లేకుండా చేశాయని ఆవేదన చెందుతారు. చివరికి పిండాలు తినడానికి కాకులు రావు కాని కుక్కలు ఎగబడుతున్నాయని వాస్తవ స్థితిని చిత్రీకరించారు. సర్‌గోసి మదర్ గూర్చిన కథ ‘తల్లీ నిన్నుదలంచి..’ పేదరికంలో మగ్గుతున్న ఒక కుటుంబం గర్భాశయాన్ని అద్దెకివ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో బతకాలనుకుంటే, బిడ్డను కన్న తర్వాత వీసా సమస్యతో బిడ్డను వదిలించుకుంటే ‘విత్తనం నాదికాకపోయిన భూమినాదే’ కాబట్టి నేనే పెంచుకుంటానని ఆ తల్లి ధైర్యంగా బిడ్డను స్వీకరిస్తుంది.
మనిషికి నిజమైన ఆనందం సంపాదనలో లేదని పదుగురికి సహాయం చేయడంలోనే ఉందని చెప్పే కథ ‘మనిషి దేవోభవ’. అత్తాకోడళ్ల పోట్లాటలు కొత్తకాదు కాని టీవిల దగ్గరనుండి నేటి ఫేస్‌బుక్ వాడకం దాకా వాళ్ళ రుసరుసలు, తిట్టుకోవడాలు హాస్యంగా వివరిస్తూనే కొడుకుగా, భర్తగా పాత్రలను పోషిస్తూ ఆ పురుషుని బాధలను వర్ణించారు ‘ఒక యుద్ధం ఒక సంధి ఒక శాంతి’ కథలో. భార్యభర్తల మధ్య ఉండే చిన్నచిన్న సంఘటనలకు విపరీతంగా ఆలోచించి చిన్నాభిన్నం అవుతున్న ఇతివృత్తాలు అనేకంగా ఉన్నాయి. అందుకే తొందరపడి కఠిన నిర్ణయాలను తీసుకోవద్దని చెప్పేకథ ‘మనసా! తొందరపడకే.’ విలాసానికి బానిసైన ఒక బ్యాంకు ఉద్యోగి పతనావస్థకు దర్పణం ‘జారుడుమెట్లు’కథ. ‘రెయిన్‌రెయిన్ గో అవే’ రైమ్స్ నేర్పే కానె్వంటు చదువులను నిరసిస్తూనే వాన అవసరాన్ని చాటిచెప్పిన కథ ‘వాన వాన వల్లప్ప’. కుటుంబం ఆనందాల హరివిల్లు అంటారు. ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఉమ్మడి కుటుంబంగూర్చి పెద్ద ఉపన్యాసం ఇస్తే, ఒక చానల్ రిపోర్టర్ ఆయన అబద్ధాలను బట్టబయలుచేసి, తల్లిని మరిచిన నీది ఒక ఉమ్మడి కుటుంబమా? అని నిలదీస్తుంది ‘ఆత్మపదార్థం’ కథలో. ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని, కష్టాల్లో ఉన్నవాళ్ళకు వాటి పట్టింపు ఉండదని, ఉత్తరాఖండ్ వరదల్లో యాత్రికులను సైనికులు కాపాడిన సాహస విధానాన్ని చక్కటి కథనంతో వివరించిన కథ ‘గబ్బిలం’. మొత్తంమీద విభిన్న సామాజిక అంశాలపై రాసిన సింహప్రసాద్ కథలు ఒక్కసారైన చదవాల్సిందే. కొలకలూరి ఇనాక్, పోరంకి దక్షిణామూర్తి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముందుమాటలు ఈ సంపుటికి అదనపు ఆకర్షణ.

  • భాషా, సాహిత్యాలకు సరైన పథ నిర్దేశం

    • -వెలుదండ నిత్యానందరావు
    • 20/12/2014
    TAGS:

    సాహిత్య విమర్శకు
    ‘కోవెల’ సంపత్కుమార సాహిత్య దర్శనం
    వెల: రు.100.. పేజీలు: 104
    ప్రతులకు: డా.టి.రంగస్వామి
    శ్రీలేఖ సాహితి, ఇంటి.నెం.14-5/2,
    మండల కార్యాలయం ఎదురుగా
    శ్రీలేఖ కాలనీ, హసన్‌పర్తి,
    వరంగల్లు-506371
    తెలంగాణ రాష్ట్రం
    ఫోన్: 0870-25647222

    విమర్శకునిగా, వక్తగా, కవిగా ఆచార్యునిగా కోవెల సంపత్కుమారాచార్య వారు జగమెరిగినవారు. వారు కీర్తిశేషులై అపుడే నాలుగేళ్లు దాటుతుంది. కోవెల సంపత్కుమార పర్యవేక్షణలో డాక్టరేటు పట్టం గ్రహించిన ప్రియ శిష్యుడు శ్రీలేఖ సాహితీ సంస్థ నిర్వాహకుడు డా.టి.రంగస్వామి ఈ నివాళి గ్రంథాన్ని ప్రకటించారు. ఇది ఒక ఉత్తమ గురువునుంచి సంక్రమించిన ఉత్తమ సంస్కార లక్షణంగా భావిస్తూ శ్రీరంగస్వామిని అభినందించవచ్చు.
    సంపత్కుమార ఛందఃపరిశోధన పారమ్యతను ఉగ్గడిస్తూ పల్లె శీను, ఆముదాల మురళి, ఆముక్త కావ్యాన్ని విశే్లషిస్తూ ఎస్.రాజేంద్రప్రసాద్, శ్రీరంగస్వామి గార్లు రాసిన వ్యాసాలున్నాయి. చింతయంతి, శతకాలు, కాలస్పృహ, అపర్ణ లాంటి కావ్యాల గురించి పి.వీరస్వామి, ఆకునూరి విద్యావతి, భిక్షపతి మొదలైనవారు రాసిన వ్యాసాలు, పెన్నా శివరామకృష్ణ, టి.ఉదయవర్లు సంపత్కుమార గారితో గతంలో చేసిన ఇంటర్వ్యులను ఈ సంకలనంలో పొందుపరిచారు.
    విశ్వప్రేమ అనే వృత్తానికి ప్రేమ కేంద్రబిందువని వైవాహిక జీవితమంటే ఐహిక సౌఖ్యమొకటే కాదు, మేధాపరమైన సహవాసం. ఇరువురు కలిసి సేవామార్గంలో, నివృత్తి మార్గంలో పయనించవచ్చు (పుట 66) అంటూ సంపత్కుమార రాసిన అపర్ణ కావ్యాన్ని విశే్లషిస్తూ పెన్నా శివరామకృష్ణ వ్యక్తీకరించిన అభిప్రాయాలు విశిష్టమైనవి, ఔచితీమంతమైనవి.
    సాహిత్యం వెర్రితలలు వేస్తున్న కాలంలో దాన్ని సన్మార్గంలో పయనింపచేసిన మహామనీషి, భారతీయమైన ఆధ్యాత్మిక తత్వాన్ని భూమికగా స్వీకరించాలని వ్యక్తిగా జీవించడం మాత్రమే కాదు సమాజంలో ఒక సంఘ జీవిగా ఇతరుల సమస్యలకు ప్రతినిధిగా ఉండాలి. కాని వాటినుండి దూరంగా పరిగెత్తకూడదని సంపత్కుమార స్పష్టంగా ప్రబోధించారని (పుట 45) డా.ఆకునూరి విద్యాదేవి అభిప్రాయపడ్డారు.
    పల్లేరు వీరస్వామి సంపత్కుమార రచించిన చింతయంతి కావ్యంలోని ఆర్త్భక్తి, లోకరీతులు, సంస్తుతి, భాగవతాంశాలు మా తృత్వం, వ్యాజస్తుతి, కృష్టానురక్తి, గోదావచస్సుధలను సోదాహరణంగా వివరించిన తీరు పాఠకులకు సంతృప్తి కలిగిస్తుంది. తెలంగాణ ప్రజల వ్యావహారిక భాషలోనే పాఠ్య గ్రంథాలుండడంవల్ల కలిగే లాభనష్టాలేమిటని పెన్నా శివరామకృష్ణ అడిగిన ప్రశ్నకు కోవెల సంపత్కుమార ఇచ్చిన జవాబు చూడండి.
    రాజకీయంగా ఆర్థికంగా రాష్ట్ర విభజన ఉద్దేశాలు ఏమైనా కావచ్చు. కాని భాషాపరంగా మొత్తం తెలుగువారిలో ఒక ఏకీభావం ఉండడం అవసరం. నిజానికి మాండలికాలనేవి భాషాపరంగా యాసలు. భిన్నమైన వ్యావహారిక పద సముదాయం ఉండవచ్చు. అందువల్ల ఒక ప్రాంతపు భాష పాఠ్యగ్రంథ భాషగా ఉండడంవల్ల ఈ ఏకీభావం ఆ ప్రాంతంలోనే దెబ్బతినడానికి అవకాశం ఉంది. తెలంగాణలోనే వేరు వేరు జిల్లాల్లో వేరు వేరైన పలుకుబడి, యాసలు ఉన్నాయి. అందువల్ల వీటిలో భాషా సమత్వం కోసం ఒక సాధారణత్వాన్ని సాధించడం అవసరం. బోధన ఎట్లాగు ఎవరు చెప్పినా, చెప్పకపోయినా ఆయా యాసలోనే సాగుతుంది. మాండలిక పదాలు భాషలో చేరడం భాషా సమృద్ధికి దోహదం చేస్తుంది. కాని ఆ యాసలే పాఠ్యభాషలో కూడ రావాలనడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదేమో! ఇదే పరిస్థితి మిగతా ప్రాంతాలకు కూడా వర్తిస్తుంది. పాఠ్యభాష, బోధన భాష రెండూ కలిసి విద్యార్థి భాషా శక్తిని పెంపొందిస్తాయి. భాషా, సాహిత్యాల విషయంలో ఎవరికైనా విశాల దృక్పథం అవసరం. భాషా, సాహిత్యాలు యాక్షన్- రియాక్షన్ల విషయాలు కావు (పుట 95)
    ఇప్పుడు ఉద్యమావేశంలో ఉన్నాం. క్రమేపీ ఒక నాలుగయిదేళ్ల తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు ఈ భావనకే అందరూ చేరక తప్పదు. కోవెల సంపత్కుమార గారి వనంలోని ఫోటో అందవైంది ముఖ చిత్రంగా అలంకరించినందుకు మంచి పుస్తకాన్ని అందించినందుకు శ్రీరంగస్వామి అభినందనీయులు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.