నా రాజకీయ జీవనం ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంత ర్లీనంగా భాగమైన ఒకే ఒక వ్యక్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. గత 50 సంవత్సరాలుగా పార్టీలో నాకు అత్యంత సన్నిహిత సహచరుడు.. ఆయన నాయకత్వాన్ని నేను ఎప్పుడూ ఎలాంటి సందేహం లేకుండా అంగీకరించాను.
అటల్‌జీ 1948లో జాతీయవాద వారపత్రిక ‘పాంచజన్య’కు సంస్థాపక సంపాదకుడిగా పనిచేశారు. దాన్ని క్రమం తప్పకుండా నేను చదువుతున్నందువల్ల ఆయన పేరు అప్పటికే నాకు సుపరిచితం. శక్తివంతమైన ఆయన సంపాదకీయాల్నీ, అప్పుడప్పుడు ప్రచురించే ఆయన కవితల్నీ చదివి నేనెంతో ఉత్తేజితుడినయ్యేవాడిని. ధర్మప్రకాశన్ ఆధ్వర్యంలో లక్నోలో ఈ పత్రికను ప్రారంభించిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాద్యాయ ఆలోచనల్ని కూడా తెలుసుకునేందుకు అది అవకాశం కల్పించింది. రకరకాల పేర్లతో వ్యాసాలు రాయడమే కాక ప్రూఫ్‌రీడర్, కంపోజర్, బైండర్, మేనేజర్‌గా కూడా వారు పనిచేశారు. అప్పుడప్పుడే హిందీ నేర్చుకున్న నాలాంటి వారికి ఆ భాషలోని అంతర్లీనమైన సౌందర్యం, స్వచ్ఛత, దేశభక్తితో కూడిన ప్రేరణ కల్పించే అపార సామర్థ్యం పాంచజన్య ద్వారా అర్థమయ్యేవి.
1952లో నేను తొలిసారి అటల్‌జీని క లిశాను. భారతీయ జనసంఘ్‌కు చెందిన యువకార్యకర్తగా ఆయన రాజస్తాన్‌లోని కోటా నుంచి వెళుతున్నారు. అక్కడ నేను ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పనిచేస్తున్నాను. కొత్తగా ఏర్పడిన పార్టీకి ప్రజల్లో ఆదరణ కల్పించడం కోసం ఆయన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీతో పాటు రైలులో వెళుతున్నారు. ఆ రోజుల్లో అటల్‌జీ డాక్టర్ ముఖర్జీ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. అస్పష్టంగా ఉన్న ఆయన రూపురేఖలు నా మనస్సులో ఇంకా ముద్రితమై ఉన్నాయి. ఒక యువ రాజకీయ కార్యకర్తగా వాజ్‌పేయ్ సన్నగా ఉండేవారు. నేను కాస్త పొడవు కాబట్టి ఆయనకంటే సన్నగా కనిపించే వాడిని. యవ్వనపు ఆదర్శ భావాలు ఆయన పుణికి పుచ్చుకున్నారని నాకు సులభంగా అర్థమైంది. రాజకీయాల్లో ప్రవేశించినా, ఆయన చుట్టూ ఒక కవితాత్మక ఆకర్షణ నెలకొని ఉండేది. ఆయనలో ఏదో ఒక శక్తి జ్వలిస్తున్నట్లు కనిపించేది. ఆయనలోని అంతర్జ్వాల ఆయన ముఖంపై ప్రస్పుటంగా గోచరించేది. అప్పుడాయన వయసు 27 లేదా 28 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ మొదటి పర్యటన ముగిసేనాటికి వాజ్‌పేయి ఒక అసాధారణమైన యువకుడని, ఆయన గురించి నేను తెలుసుకోవాలని నాలో నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆయన రెండో సారి పర్యటనకు వచ్చారు. అద్భుతమైన ఆయన వ్యక్తిత్వం, లక్షలాది మంది ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేయగలగిన ప్రతిభావంతమైన ఆయన వక్తృత్వం, హిందీ భాషపై అసాధారణమైన ఆధిపత్యం, అత్యంత తీవ్రమైన రాజకీయ అంశాలపై కూడా చమత్కారికంగా, వ్యంగ్యంగా వ్యక్తీకరించగలిగిన ఆయన సామర్థ్యం.. ఇవన్నీ నా పై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపాయి. ఆయన రెండో పర్యటన ముగిసేనాటికి ఆయన ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడని ఒకరోజు భారతదే శానికి నాయకత్వం వహించగలిగిన లక్షణాలు ఆయనలో ఉన్నాయనే అభిప్రాయం నాకు ఏర్పడింది.
1957లో అటల్‌జీ పార్లమెంటుకు ఎన్నికైన తరువాత దీన్‌దయాళ్‌జీ నాకు సంబంధించిన మరో చర్య తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి ఢి ల్లీకి మారి పార్లమెంటు పనిలో అటల్‌జీకి సహాయపడాల్సిందిగా దీన్‌దయాళ్‌జీ నన్ను కోరారు. అప్పటి నుంచి అటల్‌జీ, నేను జనసంఘ్, తరువాత బీజేపీ ప్రతి పరిణామ దశలోనూ కలిసికట్టుగా పనిచేశాము. లోక్‌సభలో ప్రవేశించిన తరువాత ఆయన పార్లమెంటులో పార్టీ వాణిని వినిపించారు. పార్టీకి సంఖ్యాబలం ఏమాత్రం లేకపోయినా, ఆయన అంతకు మించి ప్రతిష్టను గడించారు. 1968 ఫిబ్రవరిలో దీన్‌దయాళ్‌జీ విషాద మరణం తరువాత ఆయన పార్టీ అధ్యక్షపదవీ బాధ్యతల్ని కూడా చేపట్టవలసివచ్చింది. పార్టీ చరిత్రలో అది అత్యంత సంక్లిష్ట సమయం అయినప్పటికీ ఈ సంక్షోభం నుంచి జనసంఘ్‌ను ఆయన కాపాడి సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకున్నారు. కార్యకర్తలు, మద్దతుదారుల్లో అటల్‌బిహారీ అధంకారంలో వెలుగురేఖలా భాసిల్లారు. అదే అప్పుడు వారి నినాదమైంది. (అంధేరీ మే ఏక్ చిన్గారీ… అట్ బిహారీ.. అటల్ బిహారీ)
ఆ తరువాత తారాజువ్వలా ఎదిగేందుకు కారణం అయోధ్య ఉద్యమం. అయితే ఈ సమయంలో అట్‌జీ దాదాపు నిష్ర్కియంగా ఉండిపోయారు. అయితే 1996లో అటల్‌జీ 13 రోజుల ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన పార్టీ వైఫల్యం నుంచి 1998లో విజయవంతంగా అధికారాన్ని చేపట్టడం వరకూ ఆయన వ్యక్తిగత ఆదరణే ప్రదానాంశమైందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈ ఆకర్షణ పార్టీకున్న మద్దతుకంటే అతీతమైనది. మరోసారి మేమిద్దరమూ రాజకీయ అస్పృశ్యతా సంకెళ్లను చేధించి ఎన్‌డిఏను ఏర్పరచేందుకు కలిసికట్టుగా కృషి చేశాము.
కొన్ని దశాబ్దాలుగా కొంత మంది వ్యక్తుల ఊహిస్తున్నదానికి భిన్నంగా అటల్‌జీకి నాకు ఉన్న బాంధవ్యంలో ఏనాడూ పోటీతత్వంకానీ, సంఘర్షణకానీ తలెత్తలేదు. అయితే మామధ్య ఎప్పుడూ అభిప్రాయభేదాలు లేవని చెప్పడం నా ఉద్దేశం కాదు. అవును.. కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మా వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉండటం వల్ల సహజంగానే వ్యక్తులపై, సంఘటనలపై, సమస్యలపై మా అంచనాలు కూడా చాలా సందర్భాల్లో బిన్నంగా ఉన్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువిచ్చే ఏ సంస్థలోనైనా ఇది సహజమే. అయితే మా సంబంధాలు ఇంత ప్రగాఢంగా ఉండడానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదట దేశం, తరువాత పార్టీ, తరువాత వ్యక్తి ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తమ సభ్యులందరికీ పిలుపునిచ్చిన జనసంఘ్, బిజెపి సిద్ధాంతమూ, ఆదర్శాలు, విలువలను మేము బలంగా పంచుకున్నాము. పరస్పర విశ్వాసం, గౌరవాన్ని తగ్గించే విధంగా మేము మా అభిప్రాయాలకు ఏనాడూ తావివ్వలేదు. కానీ మూడవ అత్యంత ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది నేను ఎలాంటి ప్రశ్నలకూ తావివ్వకుండా నా అంతరాంతరాల్లో కూడా అటల్‌జీని నా సీనియర్‌గా, నా నాయకుడిగా అంగీకరించాను. అయితే, నా పట్ల అటల్‌జీ అనుసరించిన సర్దుబాటు ధోరణిని కూడా నేను ఇక్కడ ప్రస్తావించాలి. కొన్ని అంశాలపై నా ఆలోచన ఫలానా విధంగా ఉన్నదని ఆయనకు తెలిస్తే దానిపై తనకు పెద్ద వ్యతిరేక అభిప్రాయం లేకపోతే ఆయన దాన్ని అంగీకరించేవారు. ‘అద్వానీజీ ఏం చెప్పారో అదే సరైనది..’ అనేవారు. ఆ తరువాత మేము చర్చిస్తున్న విషయం అంతటితో సుఖాంతమయ్యేది.
లెక్కలేనన్ని సందర్భాల్లో అటల్‌జీతో నేను గడిపిన క్షణాల్ని తరచిచూస్తే, ఆయనకు ఈ నివాళిని ముగించే ఉత్తమ మార్గం గురించి ఆలోచిస్తుంటే నాకు 1959 ప్రాంతంలో మేమిద్దరమూ కలిసి చూసిన ఒక సినిమా గుర్తుకొస్తుంది. హిందీ సినిమాలను కలిసి చూడటం మా ఇద్దరికీ ఇష్టమైన అలవాటు. 1970 ద్వితీయార్థం వరకూ మేము ఢిల్లీలో రీగల్, ఇతర సినిమా హాళ్లకు కలిసి వెళ్లే వాళ్లం. అటల్‌జీ, నేను జనసంఘ్‌కు చెందిన వందలాది కార్యకర్తలతో కలిసి ఢిల్లీ మున్సిల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో కష్టపడి పనిచేశాము. మా ప్రయత్నాలు ఎన్ని చేసినా విజయం లభించకపోవడంతో నిరాశకు గురయ్యాం. ‘చలో కోయీ సినిమా దేఖ్‌నే చల్‌తే హై.’ అని అటల్‌జీ నాకు చెప్పారు. మేమిద్దరం పహాడ్‌గంజ్‌లో ఉన్న ఇంపీరియల్ సినిమాకు వెళ్లి ప్రముఖ నటుడు, నిర్మాత రాజ్‌కపూర్ నటించిన ఒక సినిమాను చూశాము. దాస్తో విస్కీ ప్రతిష్టాత్మక నవల ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ ఆధారంగా నిర్మించిన ఆ సినిమా భారత స్వాతంత్య్రం తరువాత జరిగిన ఘటనల్ని చిత్రీకరించింది. నెహ్రూకాలంలో హామీలు నెరవేరకపోవడంతో భ్రమలు కోల్పోయిన ప్రజల గురించి, పేదలకు జరిగిన అన్యాయాల గురించి అది చిత్రీకరించింది. అయితే నవోదయం రానున్నదని, ప్రజలు సహనంగా, విశ్వాసంగా ఉండాలని ఆ సినిమా పిలుపునిచ్చింది. దాని ఆశావహ సందేశం అటల్‌జీలో, నాలో ఉన్న నిరాశను పోగొట్టేవిధంగా ఉంది. ఆ సినిమా పేరు కూడా ‘ఫిర్ సుబాహోగీ’.
(అద్వానీ ఆత్మకథ ‘నా దేశం నా జీవితం’ నుంచి..)