ఒరిగిన దర్శక శిఖరం

ఒరిగిన దర్శక శిఖరం

కథా రచయిత, స్ర్కీన్‌ప్లే రైటర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌… అన్ని విభాగాల్లోను లెజండ్‌ అనిపించుకున్న సృజనాత్మక కళాకారుడు కె.బాలచందర్‌. విలక్షణమైన దర్శకత్వ శైలి, అసాధారణ కథాకథనాలతో, సమకాలీన సాంఘిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించిన తీరు బాలచందర్‌ను భారతీయ సినిమా శిఖరాగ్రాన నిలిపాయి.
తమిళ సినిమా దర్శక శిఖరంగా కొలిచింది. తెలుగులో కొద్ది సినిమాలే చేసినా వాటితో ‘మరో చరిత్ర’ సృష్టించారు. అంతర్గత మానవ సంబంధాలు, సామాజిక నేపథ్యాలు, సాహసోపేతమైన స్ర్తీ కథా పాత్రలు కేంద్రబిందువుగా మధ్యతరగతి జీవితాలను అనితరసాధ్యంగా ఆవిష్కరించడం ద్వారా వెండితెరపై ఓ విప్లవాన్నే సృష్టించారు బాలచందర్‌. స్ర్కీన్‌ రైటర్‌గా ఇండస్ర్టీలో అడుగుపెట్టి, దర్శక దిగ్గజంగా ఎదిగారు. దర్శకుడిగా 100కిపైగా సినిమాలు తెరకెక్కించి, నిర్మాతగా కవితాలయ ప్రొడక్షన్స్‌ పతాకంపై 58 చిత్రాలు నిర్మించి, ఎందరో తారలకు ప్రకాశాన్నిచ్చారు.
ఆయన తీసినవన్నీ కథాబలం ఉన్న సినిమాలే. మధ్యతరగతి కుటుంబాల్లోని సహజమైన పాత్రలతో ఆయన తీసినన్ని చిత్రాలు మరే దర్శకుడూ తియ్యలేదనేది నిర్వివాదం. కుటుంబ బంధాలు, సాంఘిక అసమానతలను చాలా లోతుగా చూపించి, వాటికి చక్కని పరిష్కారాలు కూడా చూపిన దర్శక రచయిత బాలచందర్‌. ఆయన సినిమాలు కళాత్మకతకు అద్దం పడుతూనే, కాసుల వర్షం కురిపించాయి. విమర్శకుల ప్రశంసలందుకుంటూనే కమర్షియల్‌గా సక్సెస్‌ సాధించాయి. ఆయన కథలు, కథనశైలి, పాత్రలు విలక్షణమైన, వైవిధ్యమైన దర్శకుడిగా ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో కొత్త దర్శకులు వచ్చినా, కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకున్నా బాలచందర్‌ స్థానం చెక్కుచెదరలేదు. తన సినిమాలతో, తను సృష్టించిన సినీ ధృవతారలతో ఐదు దశాబ్ధాలుగా భారతీయ సినిమాలో ‘శిఖరం’గా నిలబడ్డారు. నటీనటుల నుండి నటన రాబట్టుకోవడంలోను, తను ఎంచుకున్న కథలను వెండితెరపై ఆవిష్కరించడంలోను బాలచందర్‌ శైలే వేరు. ఆయన సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు కూడా జరిగాయి.
బాల్యం – నాటకాల్లో ప్రాచుర్యం….
పూర్తి పేరు కైలాసం బాలచందర్‌. 1930, జూలై 9న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తంజావూరు జిల్లాలోని నన్నిలయం ఆయన స్వస్థలం. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. అన్నామలై విశ్వవిద్యాలయంలో జుయాలజీ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం తిరువారూర్‌ జిల్లా ముత్తుపేటలో పాఠశాల టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ఏడాది తరువాత మద్రాసులో అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో అప్రెంటిస్‌ క్లర్క్‌గా చేరారు. ఆ సమయంలో మద్రాసులో నాటకాలు ఎక్కువగా ప్రదర్శితమవుతుండేవి. ఉదోగ్యం చేస్తూనే నాటకాల వైపు ఆకర్షితులయ్యారు బాలచందర్‌. యునైటెడ్‌ అమెచ్యూర్‌ ఆర్టిస్ట్స్‌ అనే డ్రామా కంపెనీలో చేరారు. కొన్నాళ్లకి ఆంగ్లంలో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ అనే నాటకాన్ని రాశారు. అప్పట్లో మద్రాసులో ఆంగ్లంపై ప్రజలకి అంత పట్టులేకపోవడంతో తిరిగి తమిళంలోకి అనువదించారు. సొంతంగా ఒక డ్రామా ట్రూప్‌ను ఏర్పాటుచేసుకొని ‘మేజర్‌ చంద్రకాంత్‌’ నాటకాన్ని ప్రదర్శించారు. ప్రజల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. పెద్ద సెన్సేషన్‌ సృష్టించింది. ఆ తరువాత స్వీయ దర్శకత్వంలో ‘సర్వర్‌ సుందరం’, ‘నీర్‌కుమిళి’ (నీటి బుడగ), ‘మెళుగువర్తి’ (కొవ్వొత్తి), ‘నానల్‌’ (పొడవాటి గడ్డి), ‘నవగ్రహం’ వంటి బహుప్రాచుర్యం పొందిన నాటకాలను ప్రదర్శించి, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
నాటకాలకు అపూర్వ జనాదరణ…
కేబీ నాటక రచనా కౌశలం గురించి విన్న పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ తన ‘దైవతాయ్‌’ (1965) సినిమాకి స్ర్కీన్‌ప్లే, డైలాగులు రాయమన్నారు. అయితే అప్పటి వరకు నాటక అనుభవమే కలిగిన కేబీకి అపరిమిత ప్రజాదరణ కలిగిన ఎంజీఆర్‌ సినిమాకి మాటలు రాయడం కష్టమనిపించింది. తరువాత రోజుల్లో ఓ సందర్భంలో ఈ విషయాన్ని గుర్తుచేసుకొంటూ ‘ఆ సమయంలో నా పరిస్థితి నీటిలో నుండి బయటపడ్డ చేపలా ఉంది’ అని చెప్పారు. మొత్తానికి ‘దైవతాయ్‌’ నిర్మాత ఆర్‌ఎం వీరప్పన్‌ సాయంతో జనాదరణ పొందే విధంగా డైలాగులు రాయగలిగారు. నెమ్మదిగా ఎంజీఆర్‌ క్రేజ్‌, ఇమేజ్‌కి తగ్గట్టుగా డైలాగులు రాయడంలో పట్టు సాధించారు. అప్పుడే వినోదాత్మకంగా విశేష ప్రజాదరణ పొందిన ‘సర్వర్‌ సుందరం’ నాటకాన్ని సినిమాగా మలచాలని ఆనాటి దిగ్గజ నిర్మాత ఆవిచ్చి మెయ్యప్ప (ఏవీఎం) చెట్టియార్‌ నిర్ణయించి, బాలచందర్‌ నుండి హక్కుల్ని కొనుగోలు చేశారు. ఈ నాటకంలో నటించిన నాగేష్‌నే కథానాయకుడిగా పెట్టి కృష్ణన్‌ పంజు దర్శకత్వంలో ‘సర్వర్‌ సుందరం’ (1964) సినిమా తీశారు. అపూర్వ జనాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అవార్డులు, రివార్డులు దక్కాయి. అది తమిళ సినిమా ఆణిముత్యాల్లో ఒకటిగా నిలిచింది. కథా రచయితగా బాలచందర్‌ ప్రతిభ హిందీ దర్శకుల వరకూ పాకింది. ఆయన రాసిన తొలి నాటకం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ను ‘ఊంచే లగే’ (1965) పేరుతో హిందీ సినిమా తీశారు. ఇది జాతీయ స్థాయిలో పేరు సాధించింది. అదే ఏడాది ముక్తా శ్రీనివాసన్‌ నిర్మించిన ‘పూజైక్కు వంద మలర్‌’కి డైలాగులు రాశారు.
దర్శకుడిగా ఆరంగేట్రం…
బాలచందర్‌ దర్శకత్వ ఆరంగేట్రం ఓ సంచలనం. తొలి సినిమాతోనే దర్శకుడిగా తనదైన ముద్ర వేసి, తమిళ సినిమాని తనవైపు తిప్పుకున్న అపార ప్రతిభాశాలి. ఆ సమయంలో సినిమాలన్నీ కథానాయక ప్రధానమైనవే. వాటికి భిన్నంగా సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో – మధ్య తరగతి కుటుంబ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించాలనుకున్నారు. తను రాసిన నాటిక ‘నీర్‌కుమిళి’నని సినిమాగా తీయాలని నిర్ణయించి, మెగాఫోన్‌ పట్టారు. తొలి చిత్రంతోనే కొత్త ట్రెండ్‌ సృష్టించారు. అప్పటి వరకు వెండితెరపై హీరోయిజాన్నే చూసిన ప్రేక్షకులకు ‘నీర్‌కుమిళి’ (1965) కొత్త అనుభూతిని పంచింది. మధ్య తరగతి జీవితాలు ఆ పాత్రల్లో ప్రతిబింబించడంతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ సినిమా మొత్తం దాదాపుగా ఒక సెట్‌లోనే తీసేశారు. సహజత్వానికి దగ్గరగా ఆయన తెరకెక్కించిన తీరు అందరికీ బాగా నచ్చింది. సినిమా హిట్టయ్యింది, దర్శకుడిగా కె.బాలచందర్‌కి గుర్తింపు వచ్చింది. తన నాటక బృందంలో ఉన్న నటీనటులతోనే ఈ సినిమా తీశారు. ఇక ఆ తరువాత దర్శకుడిగా బాలచందర్‌ ప్రస్థానం అప్రతహరితంగా కొనసాగింది. తను రాసిన నాటకాలనే సినిమాలుగా మలచి విజయాలందుకున్నారు. ‘నానల్‌’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘ఎదిర్‌ నీచ్చల్‌’ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. తెలుగులో ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘ఆకలి రాజ్యం’, ‘తొలికోడి కూసింది’, ‘కోకిలమ్మ’, ‘రుద్రవీణ’ వంటి ఆణిముత్యాలను రూపొందించారు. ‘మరో చరిత్ర’ను హిందీలో ‘ఏక్‌ దూజే కేలియా’గా రీమేక్‌ చేసి, అక్కడా నీరాజనం అందుకున్నారు.
నటుడిగా…
1996లో వచ్చిన ‘కల్కి’లో తొలిసారిగా వెండితెరపై కనిపించారు బాలచందర్‌. సినీ దర్శకుడిగానే ఆయన కనిపిస్తారు. ఆ తరువాత 2006లో తెలుగు నటుడు ఉదయ్‌ కిరణ్‌తో తీసిన ‘పొయ్‌’ చిత్రంలో అతిథి పాత్ర పోషించారు. అప్పటికి నాలుగేళ్ల తరువాత బాలచందర్‌ ప్రధాన పాత్రలో ‘రెట్టై సుళి’ వచ్చింది. కొత్త దర్శకుడు తామిరై తెరకెక్కించిన ఈ చిత్రంలో మరో దర్శక దిగ్గజం భారతీరాజా కూడా నటించారు. ఈ ఏడాదిలోనే వచ్చిన ‘నిన్నైత్తదు యారో’ చిత్రంలో గెస్ట్‌ రోల్‌ చేసిన బాలచందర్‌ తన ప్రియ శిష్యుల్లో ఒకరైన కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘ఉత్తమ విలన్‌’లో నటించారు. ఈ సినిమా ఫైనల్‌ కాపీ పూర్తి కాకముందే ఆస్పత్రి పాలయ్యారు.
ధృవ‘తార’ల సృష్టికర్త…
భారతీయ సినిమాకి ముఖ్యంగా దక్షిణాదికి గొప్ప గొప్ప నటీనటులను, సాంకేతిక నిపుణులను అందించారు బాలచందర్‌. ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఉలగ నాయకుడు కమల్‌హాసన్‌, మ్యూజిక్‌ మ్యాస్ర్టో ఏఆర్‌ రెహ్మాన్‌లను పరిచయం చేసింది ఆయనే. నాజర్‌, సరిత, వివేక్‌, విమలారామన్‌… చెప్పుకుంటూనే పోతే 1980ల నుండి ఇప్పటి వరకు తమిళ, తెలుగు సినీ పరిశ్రమలను ఏలుతున్న అగ్ర నటీనటుల్లో చాలా వరకు బాలచందర్‌ శిష్యులే. తను తీసిన సినిమాల్లాగే 100 మందికిపైగా తారలను వెండితెరకు పరిచయం చేశారు. కమల్‌హాసన్‌ అత్యధికంగా 35 చిత్రాల్లో నటించారు. కథానాయికల్లో సరిత 22 సినిమాల్లో నటించింది.
తెలుగులో…
తమిళంలో ఘన విజయం సాధించిన ‘భామా విజయం’ను ‘భలే కోడళ్లు’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ‘సుఖదుఃఖాలు’, ‘చిరంజీవి’, ‘సంబరాల రాంబాబు’, ‘జీవితతరంగం’, ‘తూర్పు పడమర’ చిత్రాలకు స్ర్కీన్‌ప్లే రచయిత. దర్శకుడిగా ‘భలే కోడళ్లు’ (1968), ‘సత్తెకాలపు సత్తయ్య’ (1969), ‘బొమ్మా బొరుసా’ (1971), ‘అంతులేని కథ’ (1976), ‘మరో చరిత్ర’ (1978), ‘అందమైన అనుభవం’ ‘1979), ‘గుప్పెడు మనసు’ (1979), ‘ఇది కథ కాదు’ (1979), ‘ఆకలి రాజ్యం’ (1981), ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ (1981), ‘47 రోజులు’ (1981), ‘తొలికోడి కూసింది’ (1981), ‘కోకిలమ్మ’ (1983), ‘రుద్రవీణ’ (1988) వంటి మంచి చిత్రాలు అందించారు.‘భామా విజయం’, ‘సర్వర్‌ సుందరం’ వినోదాత్మక చిత్రాలుగా ఎంతో పేరుతెచ్చాయి.
అవార్డులకే వన్నెతెచ్చిన బాలచంద్రుడు…
9 జాతీయ అవార్డులు, 13 ఫిలిం ఫేర్‌ అవార్డులు, 10 రాష్ట్ర అవార్డులు, 4 నంది అవార్డులు, 3 గౌరవ డాక్టరేట్‌లు.. చెప్పుకుంటూ పోతే బాలచందర్‌ కీర్తిసిగలో అవార్డులు ఎన్నో ఎన్నెన్నో! వినోద రంగంలో ఆయన చేసిన సేవలకు 1987లో పద్మశ్రీ వరించింది. 2010లో ఇండియన్‌ సినిమాలోనే అతిపెద్ద పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే, 2011లో ప్రతిష్టాత్మక ఏఎన్‌ఆర్‌ జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 1970లో తమిళనాడు రాష్ట్ర అత్యుతన్న పురస్కారం కలైమామణి దాసోహమంది. ఇక వివిధ సంస్థలు ఇచ్చిన అవార్డులు, చేసిన సన్మానాలకు లెక్కేలేదు.
బాలచందర్ జర్నీ 1930-2014

కె.బాలచందర్‌ మంగళవారంనాడు సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో కన్నుమూశారు. 84 ఏళ్ల బాలచందర్ కు భార్య, ముగ్గురు పిల్లలు. ఆయన భార్య పేరు రాజం. కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కుమారులు. పుష్ప కందస్వామి అనే కుమార్తె.
సినిమారంగంలో ఎంతోమందిని నటీనటులుగా, సాంకేతిక సిబ్బందిని పరిచయం చేశారు. వారిలో కమల్‌ హాసన్‌, రజినీకాంత్‌, మమ్ముట్టి ముఖ్యులు. తమిళంలో చిరంజీవిని పరిచయం చేశారు. అదేవిధంగా శ్రీవిద్య, శ్రీదేవి, సరిత, వివేక్‌ (తమిళ హాస్య నటుడు) ప్రకాష్‌ రాజ్‌, వై. జి. మహేంద్రన్‌ (తమిళ నటుడు), సుజాత, చరణ్‌ (తమిళ దర్శకుడు), రమేష్‌ అరవింద్‌, మాధవి, జయసుధ, జయప్రద, శ్రీ ప్రియ, గీత, చార్లి (తమిళ హాస్య నటుడు), యువరాణి, విమలా రామన్‌ కూడా వున్నారు. సాంకేతిక విభాగంలో ఏ.ఆర్‌.రెహమాన్‌ ‘రోజా’ సినిమాను నిర్మించిన బాలచందర్‌, సంగీత దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చారు. తొలికోడి కూసింది, ఆకలిరాజ్యం, ఇదికథ కాదు, మరోచరిత్ర చిత్రాలు అప్పట్లో తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.
నాటకాలతో తొలి అంకం
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్‌ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్‌ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించాడు.
సినిమా ప్రవేశం:
ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.
మొదటి సినిమా తరువాత ఆయన రాసిన నాటకాల్లో ఒకటైన ‘నీర్కుమిళి’ ని సినిమాగా తీశాడు. ఆ సినిమాలో అన్ని సన్నివేశాలు దాదాపు ఒకే సెట్‌‌లో ఉంటాయి. అలాంటి కథ అప్పటి ప్రేక్షకులకు కొత్త. అనుకున్నట్టే అది విజయం సాధించింది. దాంతో ఆయన చిత్ర దర్శకుడిగా మారాడు. తరువాత మేజర్‌ చంద్రకాంత్‌, ఎదిర్నేచ్చల్‌ లాంటి చిత్రాలు తీశాడు. అప్పుడాయనకు పెద్ద స్టార్లతో సినిమాలు తీయమని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడూ హీరోలు దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసుకోలేదు. ‘సర్వర్‌ సుందరం’ (1964) కథ తయారు చేసినప్పుడు మాత్రం ఆ పాత్రకు నగేష్‌ అయితే చక్కగా సరిపోతాడనిపించింది. అప్పటికి ఆయన చాలా బిజీ హాస్యనటుడు. కానీ ఆయన్ని కలిసి కథ వినిపించడంతో అందుకు అంగీకరించాడు. ఆ సినిమా బాలచందర్‌కు మేలిమలుపు నిచ్చింది. క్రిష్ణన్‌ పంజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాలచందర్‌ దానికి మాటలు రాశాడు. ఆ చిత్ర సంభాషణలకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అవకాశాలు బాగా పెరిగాయి.
ఉద్యోగం-సందేహం:
అవకాశాలు పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలా వద్దా? అని కొన్నాళ్ళు సందేహించాడు. అయితే మెయ్యప్పన్‌ అనే నిర్మాత ఆయనకు ధైర్యం చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేయించడమే కాకుండా వరుసగా మూడు అవకాశాలిచ్చాడు. దాంతో ఆయన సినిమా పరిశ్రమలో స్థిరపడ్డాడు.
అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. అలా వెలుగులోకి వచ్చినవే సుజాత నటించిన అంతులేని కథ, సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన సింధుభైరవి, ప్రమీలతో తీసిన అరంగేట్రం. ‘సింధుభైరవి’లో మగవాడి సహాయం లేకుండా బ్రతకాలనుకునే పాత్ర సుహాసినిది. అరంగేట్రంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించడం కోసం వేశ్యావృత్తిని స్వీకరిస్తుంది. అప్పటి సమాజంలో ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేసేవారు కావడంతో ఈ కథలు వివాదాస్పదం అయ్యేవి. అంతేకాదు అప్పట్లో వచ్చే సినిమాల్లో విషాదాంతాలు ఉండేవి కావు. చాలావరకు పెళ్ళితో అంతమయ్యేవే. కానీ ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఉండేవి.
చిరంజీవితో….
చిరంజీవి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రవీణ గ్రామాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ యువకుడి కథ. దీనికి ఆయన ఆ చిత్ర నిర్మాత నాగేంద్రబాబుతో కలిసి ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. కమల్‌ హాసన్‌, సరిత నటించిన ‘మరో చరిత్ర’ అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్న విషాదాంత ప్రేమకథ.
అందుకున్న పురస్కారాలు:
1973 లో తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి పురస్కారం, 1982లో ఏక్‌ దూజే కేలియే సినిమాకు గాను ఫిల్మ్‌ ఫేర్‌ ఉత్తమ స్క్రీన్‌ ప్లే అవార్డు గెలుచుకున్నారు. 1987లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం. 1989లో రుద్రవీణ సినిమా కోసం జాతీయ స్థాయిలో నర్గీస్‌ దత్‌ అవార్డు, వెండి కమలం బహుమతుల్ని చిరంజీవి, నాగేంద్రబాబులతో పంచుకున్నారు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.