‘భారతరత్న’కు సార్థకత

‘భారతరత్న’కు సార్థకత

  • 25/12/2014
TAGS:

ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ దేశంకంటె గొప్పవాడు కాజాలడు…ఒక రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కంటె శక్తివంతమైనది కాజాలదు. ఇలా సూత్రీకరించిన వాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. 1977లో మురార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా పార్టీ ప్రభుత్వంలో అటల్ బిహారీ విదేశ వ్యవహారాల మంత్రి…పదవీ స్వీకార ప్రమాణం చేసిన రోజున సాయంత్రం కొత్త ఢిల్లీలో జరిగిన సార్వజనికోత్సవ సభలో వాజ్‌పేయి ఈ సూత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సూత్రాన్ని ఆయన ప్రచారం చేయలేదు. పాటించి ప్రస్ఫుటింప చేశారు. అందుకే ఆయన కేవల రాజకీయవేత్త కాలేదు. రాజకీయ పరిధిని అతిక్రమించి రాజ్యాంగ విస్తృత భూమికను పండించిన ప్రజాస్వామ్య కృషీవలుడయ్యారు. జాతీయ సాంస్కృతిక సస్యక్షేత్ర ఆదర్శ హరితాంచల విధాయకుడయ్యారు. అంతర్జాతీయ ప్రసిద్ధిని పొందగలిగిన భరతమాత వరాల బిడ్డడయ్యారు. రాజకీయాలను, నైతిక నిష్ఠతో మెరుగులు దిద్దిన వాజ్‌పేయి భారత రత్న పురస్కార అలంకృతుడు కావడం భారతీయులందరికీ మోదం కలిగిస్తున్న పరిణామం. ‘మాతృదేవి’ ఆమోదం పొందిన చారిత్రక శుభఘట్టం. మహాత్మాగాంధీ వంటి మహనీయులకు సైతం ఆరాధ్యుడైన ‘మహామనా’ బిరుదాంకితుడైన మదన మోహన మాలవీయ పండితుడు క్రీస్తుశకం 1861 డిసెంబర్ 25న జన్మించారు. అదే డిసెంబర్ 25న 1924లో పుట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి మాలవీయ వలెనే మాననీయుడు అయ్యారు. మదనమోహన మాలవీయ వారణాసి హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా జాతీయ సంస్కార శోభితులైన విద్యావంతులను తీర్చిదిద్దే కార్యక్రమానికి 1916లో శ్రీకారం చుట్టారు. ఇలాంటి విద్యావంతుల పరంపరలోనివాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. హైందవ జాతీయ సంస్కారానికి అద్దంలాగా భాసిస్తున్నారు అటల్ బిహారీ…ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటునకు వనె్న తెచ్చారు. ప్రధానమంత్రిగా ఆ పదవీ గరిమెను పెంచారు. సుపరిపాలన పరిమళాలను పంచిపెట్టారు. మదన మోహన మాలవీయ పండితుని వంటి మరో పండితుడు అటల్ బిహారీ, స్వాతంత్య్ర సమరయోధుడు. మదనమోహన మాలవీయ పండితునికి లభించిన నాడే భారతరత్న వాజ్‌పేయికి కూడ లభించడంలోని ఔచిత్యం ఇది. మాలవీయ ప్రసంగం పావన గంగా ప్రవాహం వలె శ్రోతల హృదయసీమలను ముంచెత్తేదట. అటల్‌జీ ప్రసంగం మరో గంగా ప్రవాహం…గుండె గుండెలో మహానుభూతులు తరంగ భంగిమలను పొంగులెత్తించిన మధుర విన్యాసం. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని సింధే కీ ఛావనీ గ్రామంలో చిరు సరితగా జాలువారిన వాజ్‌పేయి జీవితం మహా సింధువు వలె భారతావని నలు చెరగులను ముంచెత్తింది. ఆయన జీవన ప్రస్థానం సమకాలీన భారత చరిత్రకు ప్రతిబింబం… శక్తివంతమైన ఆయన వ్యక్తిత్వం జనసంఘ్ రాజకీయ పక్షానికి కల్లోల కడలిలో చుక్కాని అయింది. భారతీయ జనతాపార్టీ ప్రగతి ప్రస్థాన కరదీపిక అయింది. ఉజ్వల కాంతుల విజయ కేతనమైంది. భారతి చరణారవిందాలను నిరంతరం స్పృశించిన కుసుమం ఆయన వ్యక్తిత్వం. మాతృగళ హారంలోని రత్నం. ఆయన సహజమైన సజీవమైన భారత రత్నం. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కార ప్రదానం ఈ వాస్తవానికి సరికొత్త ధ్రువీకరణ మాత్రమే. ఇది ఆ పురస్కారాలకు లభించిన సార్థకత!
తక్షశిల, నలంద వంటి చోట్ల సహస్రాబ్దుల క్రితం విలసిల్లిన మహా విద్యాలయాల బోధనా సంప్రదాయాలను పునరుద్ధరించడానికై మదనమోహన మాలవీయ ప్రారంభించిన జాతీయ సంస్థ వారణాసి విశ్వవిద్యాలయం. అన్ని రంగాలకు ఆధారభూతమైనది విద్యారంగమన్న వాస్తవానికి అనుగుణంగా మాలవీయ ఈ మహత్తర సంస్థను నిర్మించారు. శీలవంతులైన విద్యావంతులు జాతికి, జగతికి హితం కలిగిస్తారు. శీలం లేని విద్యావంతులు రాక్షసులుగా మారి సమాజ విఘాతం కలిగిస్తారు. ఇదీ చరిత్ర! మాలవీయ స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక ఉద్యమ వీరుడు, దళిత జనోద్ధారకుడు, ఆచార్యుడు, కవి, పండితుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాది. కానీ వ్యక్తులను శీలవంతులుగా దిద్దే విద్యావేత్తగానే ఆయన ప్రసిద్ధుడు. అందుకే మదన మోహన మాలవీయ వ్యక్తి నిర్మాణ ఉద్యమం- ఎమ్.ఎమ్.ఎమ్-గా వినుతికెక్కారు. అయితే ఆయనకిప్పుడు భారత రత్న పురస్కారం ఇవ్వడం కొత్త వివాదాలకు, విచిత్ర పరిణామాలకు దోహదం చేయవచ్చు. 150 ఏళ్ల క్రితం జన్మించి 68 ఏళ్లకు పూర్వం పార్థివ దేహ పరిత్యాగం చేసిన ఆ మహనీయునికి సమకాలీనులైన మహనీయులు మరెందరో ఉన్నారు. బంకించంద్రుడు, లోక మాన్యుడు, వివేకానందుడు, లాలాలజపతిరాయ్…ఇంకా ఎందరో ఉన్నారు. వారందరికీ భారతరత్న పురస్కారం అవసరమా? ఈ సనాతన భూమి అనాది చరిత్రలో భారతరత్నాలు అసంఖ్యాకులు. అందువల్ల ఈ పురస్కారాన్ని వర్తమాన జాతీయ స్ఫూర్తి ప్రదాతలకు పరిమితం చేయడం మేలు. అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం ఇలాంటి వర్తమాన వాస్తవం…
అటల్ బిహారీ వాజ్‌పేయి జాతీయ భావనిష్ఠకు 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం శ్రీకారం. 18 ఏళ్ల వాజ్‌పేయిని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించి, కారాగృహం పాలు చేసింది. 1975 నాటి ఎమర్జెన్సీ నాటి ఆయన జైలు జీవితం ఈ శ్రీకారానికి శిఖరం. రాజకీయపక్ష సంకుచిత ప్రయోజనం కంటె స్వజాతి హితం మిన్న అని విశ్వసించి సమాచరించిన రాజనీతిజ్ఞుడు అటల్ జీ. బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన యుద్ధ సమయంలో ఆయన జనసంఘ్ నాయకుడు, ఇందిరాగాంధీకి వ్యతిరేక పక్షంవాడు. కానీ యుద్ధ విజయం సాధించిన ఇందిరను ఆయన ‘దుర్గాదేవి’గా అభివర్ణిచారు. 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అణు పరీక్ష నిర్వహించినప్పుడు అభినందించిన జాతి హిత చింతకుడు వాజ్‌పేయి. 1993లో ఆయన పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు. భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పక్షం అధినేత. పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం మానవ అధికారాలను మంట గలుపుతోందన్నది ఆరోపణ. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు అభ్యర్థనపై వాజ్‌పేయి మన ప్రతినిది బృందానికి నాయకత్వం వహించారు. సమితి సభకు వెళ్లి పాకిస్తాన్ తీర్మానాన్ని వమ్ము చేసి విజయుడై తిరిగి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడం జాతి హితానికి వాజ్‌పేయి యిచ్చిన ప్రాధాన్యానికి చెరగని సాక్ష్యం…ప్రధానిగా ఉండిన సమయంలో వాజ్‌పేయి సుపరిపాలనకు నమూనాను నిలబెట్టారు. ఆంతరంగిక భద్రత, ఆర్థిక భద్రత సరిహద్దుల భద్రత, సాంస్కృతిక చైతన్యం…ఇవన్నీ సుపరిపాలన స్వభావ స్వరూపాలు. వాజ్‌పేయి పాలన ఈ స్వభావగీతాన్ని వినిపించింది..
పదవికి ప్రాధాన్యం ఇవ్వడం వాజ్‌పేయికి తెలియని విద్య. పదవులు ఆయనను వరించాయి. వరించిన పదవులను త్యజించడం ఆయనకు తృణప్రాయం. ‘‘నిరీహణమీశః తృణమివ తిరస్కార విషయః’’-నిస్వార్ధపరునికి అధికార పదవి గడ్డిపోచవలె తిరస్కార విషయం- అన్న చాణిక్య సూక్తి వాజ్‌పేయి జీవితాన్ని నడిపించింది. లాల్‌కృష్ణ అద్వానీ అభివర్ణించినట్టు అటల్ బిహారీ వ్యక్తిత్వం నిష్కలంకతకు సజీవ విగ్రహం…

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.