ఇదేమీ వర్షాకాలం కాదు. వణికిస్తున్న చలికాలం. అయితే వాణీవిశ్వనాథ్ గుర్తుకొస్తే.. వర్షంలో తడిసి ముద్దవుతాం. అప్పట్లో – ఒంపు ఒంపున హంపి శిల్పంలా పల్చటి సిల్కుచీరల మీద.. ఆ వయ్యారి ఒలకబోసిన అందాలకు దాసోహం అవ్వని ప్రేక్షకులు లేరు. వానపాటలంటే వాణీవిశ్వనాథే చెయ్యాలి అనేంత పేరు తెచ్చుకుందీ సుందరి. హీరోలతో పోటీపడి నటిస్తూ.. అదిరిపోయే స్టెప్పులేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకముద్రను చాటుకున్న వాణి.. అవకాశాలున్నప్పుడే.. బయటికొచ్చి ఓ మలయాళీ విలన్‌ను ప్రేమించి.. సెటిల్ అయిపోయింది.. ఇద్దరు పిల్లలతో హాయిగా కాలం వెల్లదీస్తున్న ఆమెను కదిపింది ‘నవ్య’..
అదే నా గ్లామర్ రహస్యం
నాకు ఇద్దరు పిల్లలు. 2003లో పాప ఆర్చ, 2008లో బాబు అద్రి పుట్టారు. వారితోనే లైఫ్ సాగిపోతోంది. మంచి అవకాశాలు వస్తున్నప్పుడే పరిశ్రమ నుంచి తప్పుకున్నాను. ఒకవైపు సినిమా ఛాన్సులు, మరోవైపు భర్త ఈ రెండింటిలో – భర్తే ప్రధానమనిపించింది. మంచి భర్త దొరకడం అదృష్టం. పెళ్లయిన తరువాత మనం మనల్ని చాలా మార్చుకోవాలి. హీరోయిన్‌గా వున్నప్పుడు నలుగురు సర్వెంట్లు వుండేవారు. అన్ని చోట్లా అలాగే కావాలనుకుంటే మన జీవితం చెడిపోయినట్లే..శ్రీ ఒక ఇంటికి ఇల్లాలైన తరువాత అన్నీ మనమే చూసుకోవాలి. మా ఇంటివరకు అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఒకరకంగా ఇంట్లో పనే నా గ్లామర్ రహస్యం!
రజనీతో నటించలేకపోయా..
పెద్ద నటులతో నటించే అవకాశం రావడం గొప్పగానే వున్నా అది కూడా నాకు మైనస్ అయిందేమో అనిపిస్తుంది. ఎన్‌టీఆర్‌తో చేయడం వల్ల బాలకృష్ణ గారితో కలిసి నటించలేకపోయా. వెంకటేష్‌గారితోను మిస్ అయ్యా! ఆయనతో ఓ సినిమా ప్రారంభమైనా ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక నా అభిమాన నటుడు రజనీకాంత్‌తో కలిసి పని చేసే అవకాశం రాలేదు. ఇది ఎప్పటికీ నాకు లోటే. 6వ తరగతి చదువుతున్న మా పాప ఇటీవల తన స్కూల్లో ‘రజనీకాంత్ జీవితం’పై వకృత్త్వ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. అదే నాకు కొంత ఊరట.
ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత
ఎంతోమంది గొప్ప నటులతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఎన్‌టీఆర్ వద్ద తోటివారిని గౌరవించడం నేర్చుకున్నాను. చిరంజీవి గారి వద్ద టైం పంక్చువాలిటీకి ఉన్న విలువను తెలుసుకున్నాను. ఆయనతో డ్యాన్స్ చేయడమంటే మాటలా? నేను టెన్షన్ పడకుండా చక్కగా మాట్లాడుతూ మంచి వాతావరణం కల్పించేవారు. నేచురల్‌గా నటించడం మోహన్‌లాల్‌కే సాధ్యం. కేవలం డైలాగ్ డెలివరీతో ఎలాంటి భావమైనా పలికించవచ్చన్నది మమ్ముట్టి గారిని చూసి నేర్చుకున్న విద్య.
విలన్‌తో లవ్
మాది ప్రేమ వివాహం. మలయాళ సినిమాల్లో బాబూరాజ్ విలన్. ఆయన ‘ది గ్యాంగ్’ తీశారు. అందులో నెపోలియన్ హీరో, నేను హీరోయిన్‌ని. బాబూరాజ్ విలన్. ఆ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడ్డాను. విషయం బయటికి పొక్కడంతో ‘హీరోయిన్‌ని సొంతం చేసుకున్న విలన్’ అంటూ మీడియాలో పెద్దపెద్ద వార్తలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 28వ తేదీన తిరుపతిలో మా పెళ్లి జరిగింది.
‘‘నేను మలయాళీ అమ్మాయిని. అమ్మ పేరు గిరిజ. నాన్న విశ్వనాథ్ అప్పట్లో పేరు మోసిన జ్యోతిష్యులు. ఐదో తరగతి వరకు నా చదువంతా కేరళలోనే సాగింది. తర్వాత చెన్నై వచ్చేశాను. అక్కడే నాన్న జ్యోతిష్యం చెప్పేవారు. సరిగ్గా నేనప్పుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాననుకుంటా? ఒక రోజున – తన కొత్త సినిమాకు మంచి ముహూర్తం పెట్టమని నాన్నను అడిగేందుకు మా ఇంటికి వచ్చారు కోవై తంబి అనే నిర్మాత. అదే సమయంలో స్కూలు బ్యాగుతో ఇంట్లో అడుగుపెట్టాను నేను. నన్ను చూసిన ఆ నిర్మాత – ‘‘మీ అమ్మాయి చూడముచ్చటగా ఉంది. మీరు ఒప్పుకుంటే నా సినిమాలో అవకాశం ఇస్తాను..’’ అన్నారు. ‘‘అయ్యో వద్దు వద్దు. మా పాప ఇంకా చదువుకుంటోంది. అప్పుడే సినిమాలంటే దాని చదువు పాడైపోతుంది..’’ అన్నారు నాన్న. కానీ ఆయన వింటేగా! నాన్నను మొహమాట పెట్టేశారు. దాంతో నాకు తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘మన్నుక్కువైరం’. మురళి, పాండ్యన్ హీరోలు. అందులో నాది శివాజీగణేశన్‌కు మనవరాలి పాత్ర. 1987 డిసెంబర్‌లో నా అభిమాన హీరో రజనీకాంత్ పుట్టినరోజు నాడే ఆ సినిమా విడుదలవ్వడం నా అదృష్టం. సినిమా యావరేజ్‌గా ఆడింది కానీ నా పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఏడాది తర్వాత విజయకాంత్ గారి ‘పూదోట్ట కావల్ కారన్’లో అవకాశం వచ్చింది. అందులో విజయకాంత్-రాధికల దత్తపుత్రిక పాత్ర నాది. అది కూడా మంచి పిక్చర్. దీన్నే తెలుగులో కృష్ణంరాజు, రాధిక జంటగా ‘ధర్మతేజ’ పేరుతో రీమేక్ చేశారు. అందులో కూడా నా పాత్ర నాకే వచ్చింది. అయితే తెలుగులో నా తొలిపిక్చర్ అది కాదు. జగపతిబాబు హీరోగా పరిచయమైన ‘సింహస్వప్నం’ నా తొలి తెలుగుచిత్రం.
కన్నడలో రాజ్‌కుమార్‌తో..
అప్పటికే తెలుగు భాష రాక.. నానా ఇబ్బందులు పడుతుంటే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అది కూడా మహానటుడు రాజ్‌కుమార్‌కు హీరోయిన్‌గా. ఆ సినిమా పేరు ‘పరశురాం’. అప్పటికి నా వయసు 17 ఏళ్లు. ఆ తరువాత అక్కినేని-జయసుధ నటించిన ‘భలేదంపతులు’లో రాజేంద్రప్రసాద్ గారికి జంటగా నటించాను. అప్పటి నుంచి సీరియస్‌గా తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. ఏదోలే పార్ట్‌టైం అన్నట్లుగా తెలుగును పట్టించుకోలేదు. కాని ఆ సమయంలోనే చదవడం కూడా నేర్చుకోవడం చూసి జయసుధ గారు ‘తెలుగు భలే నేర్చుకున్నావే..!’ అంటూ ప్రశంసించారు. అది మరపురాని కాంప్లిమెంట్.
అలా తెలుగులో మకాం..
తెలుగులో నా కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పిన చిత్రం ‘నా మొగుడు నాకే సొంతం’. అందులో మోహన్‌బాబుగారు హీరో. ఆ చిత్రం సక్సెస్‌తో తెలుగులోనే స్థిరపడ్డాను. భాషా సమస్యను అధిగమించేందుకు – సినిమా డైలాగుల్ని పదే పదే ప్రాక్టీసు చేసేదాన్ని. ఒక్కోసారి సెట్‌లో దాసరి నారాయణ రావు గారు అప్పటికప్పుడు డైలాగుల్ని మార్చేసేవారు. ‘‘సార్! నాకు వచ్చిందే అంతంతమాత్రం డైలాగులు. ఇప్పుడు మీరు హఠాత్తుగా మారిస్తే ఎలా’’ అంటూ మొరపెట్టుకునేదాన్ని. అందుకాయన ‘‘నువ్వు మలయాళ అమ్మాయివి కదా! తెలుగును ఈజీగా నేర్చుకోగలవు. సమస్యే లేదు’’ అని ప్రోత్సహించేవారు. ఆ సినిమా హిట్టవ్వడంతో నాకు మంచి పేరొచ్చింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘మా అల్లుడు’, ‘మా ఇంటి కథ,’ ‘చిన్న కోడలు’ వంటి చిత్రాలలో నావన్నీ హోమ్లీ పాత్రలు. కాని చిరంజీవి గారితో చేసిన ‘ఘరానా మొగుడు’ మాత్రం నన్ను గ్లామర్ గాళ్‌ని చేసింది. ఆయనతో నేను ‘కొదమసింహం’లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించా.
అక్కడికక్కడే ఎన్టీఆర్ పేమెంట్ ఇచ్చారు..
‘ఘరానా మొగుడు’ సెట్‌లో వుండగానే ఎన్‌టీఆర్ గారు ‘సామ్రాట్ అశోకా’కు హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ‘మనమూ ఓ ట్రయల్ వేసి చూద్దాం’ అనుకుని అటు నుంచి అటే ఇంటర్వ్యూకు వెళ్లాను. నిజానికి అందులో హీరోయిన్ పాత్ర కోసం శ్రీదేవి, మాధురీదీక్షిత్, భానుప్రియ వంటివారిని తీసుకునే ఆలోచన వుందని ప్రచారం జరుగుతున్నా.. అదృష్టం పరీక్షించుకుందామనే ఇంటర్వ్యూకు వెళ్లాను. సెలెక్టవుతానన్న నమ్మకం అస్సలు లేదు. ఎన్‌టీఆర్ చాలా సంప్రదాయాలు పాటిస్తారని తెలుసు. అందులో అశోకుని భార్య పాత్ర కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నేనేమో ‘ఘరానా మొగుడు’ సెట్‌లో జీన్స్‌పై వుండడంతో ఆ డ్రెస్‌తోనే వెళ్లాను. అప్పుడు నా బ్యాగులో చీర లేదు. అయినా ధైర్యం చేసి వెళ్లాను. గదిలోకి వెళితే ఎన్‌టీఆర్ కూర్చొని వున్నారు. ‘‘ఊఁ.. మీరు మలయాళీయా’’ అని అడిగారు. టీ ఇస్తే తాగేశాను. కొన్ని ప్రశ్నలడిగారు. పేమెంట్ గురించి కూడా అడిగారు. నేను ఇచ్చిన జవాబులతో ఏమనుకున్నారో ఏమో.. టేబుల్‌లో నుంచి డబ్బు, డైలాగుల స్ర్కిప్ట్, ఓ క్యాసెట్ తీసి నా చేతిలో పెట్టారు. స్ర్కిప్ట్‌లో సంస్కృత డైలాగులున్నాయి. సంస్కృతం నాకు కొంత వచ్చు కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. ఆయనకు థ్యాంక్స్ చెప్పి హోటల్‌కు వెళ్లిపోయాను. గదిలో చూసుకుంటే ఆయన చెప్పిన పేమెంట్‌కన్నా రూ.50 వేలు ఎక్కువే ఉంది. వెంటనే ఎన్‌టీఆర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆయన ‘‘ఒక్క నిమిషం’’ అని.. కొంతసేపాగిన తరువాత ‘‘వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని వెనక్కి పంపొద్దు. అది నా గిఫ్ట్ అనుకొని మీరే వుంచుకోండి’’ అని నవ్వేశారు.
ఆయన పక్కనే నాకొక కుర్చీ..
ఎన్‌టీఆర్ తోటి నటీనటులకు ఇచ్చే గౌరవం అంతాఇంతా కాదు. ‘సామ్రాట్ అశోకా’ షూటింగ్ సెట్‌లో ఆయనకు ప్రత్యేకంగా కుర్చీ వుండేది. దాని పక్కనే నాకొక సీటు వేసేవారు. షూటింగ్ విరామంలో వాటిల్లోనే కూర్చొనేవాళ్లం. ఆ సమయంలో సెట్‌కి అప్పుడప్పుడూ చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ వంటి వారంతా వస్తుండేవారు. ఎన్‌టీఆర్‌ను పలుకరించేందుకు వారు దగ్గరికి వచ్చేవారు. సెట్‌లో నిలబడే వారంతా మాట్లాడేవారు. దాంతో నేను కూడా లేచి నిలబడేదాన్ని. కానీ ఎన్‌టీఆర్ ‘‘మీరు కూర్చోండి’’ అని చేతులూపేవారు. ఆ వ్యవహారం నాకు చాలా ఇబ్బందిగా వుండేది. ఆ సినిమా షూటింగ్‌లోనే లక్ష్మీపార్వతిని పరిచయం చేశారాయన. ఆ సమయంలోనే ‘‘మీ ఇద్దరి చుబుకం ఒకే విధంగా వుంది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చిత్రం తర్వాత హిందీలో మూడు అవకాశాలు వచ్చాయి.
ఎట్టకేలకు మాతృభాషలోకి ఎంట్రీ..
తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటించిన తరువాత.. నా మాతృభాష మలయాళంలో అవకాశం వచ్చింది. అంతే! మూడు షిఫ్టుల్లో పని చేయాల్సి వచ్చింది. ఇతర భాషల్లో పని చేయడానికి సమయమే లేదప్పుడు. తెలుగులో చేసిన ‘సర్పయాగం’ మలయాళంలోను నేనే చేశాను. అక్కడ బాగా రిసీవ్ చేసుకున్నారు ప్రేక్షకులు. తెలుగులో 50, మలయాళంలో 50 చిత్రాలకు పైనే చేశాను. మొత్తం 120 సినిమాలకు పైనే చేశాను. 12 వాన పాటలకు డ్యాన్స్ చేశా. అప్పట్లో ‘‘వాన పాటలు చేస్తే వాణీవిశ్వనాథే చేయాలి’’ అనేవారు.
అక్కడైతే హీరోలను కూడా తిట్టొచ్చు..
తెలుగు, తమిళం చిత్రాల్లో పోటీ ఏమీ లేదు. కానీ మలయాళంలో మాత్రం హీరోలే మాకు పోటీ. మలయాళంలో అన్ని రకాల పాత్రలు చేశాను. ముఖ్యంగా నేను చేసిన పోలీస్ పాత్రల్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా నన్ను చూసి భయంభయంగా దూరం జరిగేవారు జనం. మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్‌గోపీ వంటి వారందరితో చేశా. తెలుగు, తమిళం సినిమాల్లో హీరోల ఇమేజ్ దెబ్బతినకుండా కథలుంటాయి.
డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్