అసోంలో బోడో మిలిటెంట్ల ఉన్మాద చర్య అత్యంత కీలకమైన ఈ సమస్య మీద సత్వరమే దృష్టిసారించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది. ఆదివాసీల ఊచకోత అనంతరం తలెత్తిన ఉద్రిక్తత కాస్తంత తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ మరణించిన వారి సంఖ్య వందకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్ విభాగాలకు మిలిటెంట్ల దాడుల గురించి ముందస్తు సమాచారం అందినప్పటికీ, ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ దానిని కొట్టిపారేయడమూ, పోలీసు యంత్రాంగం తర్జనభర్జనల్లో ఉండటమూ ఊచకోత రెండు జిల్లాల్లో జరగడానికి వీలుకల్పించినమాట వాస్తవం.
అసోం జీవవైవిధ్యానికే కాదు, జాతి వైరుధ్యానికి కూడా మారుపేరు. వివిధ తెగలకు, మతాలకు నిలయం. ఆధిపత్య పోరాటాలకు పుట్టినిల్లు. బోడో మిలిటెంట్ బృందాలు కత్తులు, తుపాకులతో పాటు గ్రెనేడ్లు కూడా విసురుతూ గ్రామాలమీద పడి ఊచకోత కోయడం అత్యంత భయానకమైన సన్నివేశం. పసికందుల నుంచి పండుముందుసలి వరకూ ఎవరినీ వారు విడిచిపెట్టలేదు. మారుమూల ప్రాంతాలకు పోలీసు బృందాలు చేరుకొనేలోగా అనేక గ్రామాలు తగలబడిపోయాయి. ‘బోడో కానివాడిని తగలబెట్టండి’ అంటూ తన సాయుధబలగాలకు నిషేధిత నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (సాంగ్‌బిజిత్) అధినాయకుడు ఇచ్చిన ఆదేశాలు తూచ తప్పకుండా అమలు జరిగాయి. ఆ వర్గంతో చర్చలు జరిపేది లేదని ఇప్పటికే ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటన తరువాత రెండునెలల్లోగా దీని అధినాయకత్వాన్ని నిర్మూలించాలని సంకల్పం చెప్పుకున్నాయి. చర్చలకు దిగిరాని ఈ మొండిఘటాన్ని తుదముట్టించాలనుకోవడం ఇదే మొదటిసారి కాదు. మూడుదశాబ్దాలుగా హింసకు మారుపేరుగా ఉన్న అసోంలో నిజానికి ఈ ఏడాది అది కాస్తంత తగ్గుముఖం పట్టింది.
రెండు ప్రధాన మిలిటెంటు గ్రూపులు అరబింద రాజ్‌ఖోవా నాయకత్వంలోని ఉల్ఫా, రంజన్ దైమారీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్‌బీ) వర్గం చర్చలకు దిగిరావడం ఇందుకు కారణం. కానీ, ఎన్డీఎఫ్‌బీ సాంగ్‌బిజిత్ గ్రూపుమాత్రం చర్చలను తిరస్కరించి దాడులకు పాల్పడుతూ వచ్చింది. భారత్ భూటాన్ సరిహద్దుల్లోని బోడో ప్రాదేశిక ప్రాంతంలో భద్రతా దళాల ఏరివేత కార్యక్రమంలో ఈ వర్గం బాగా దెబ్బతిన్నది. ఇందుకు జవాబుగా ఈ వర్గం భారీ దాడులకు పాల్పడే అవకాశాలున్నాయన్న హెచ్చరికలను విస్మరించడమే రెండు జిల్లాల్లో భారీ ఊచకోతకు కారణమైంది. సాంగ్‌బిజిత్ వర్గం సంఖ్యాబలం మూడువందలు కూడా ఉండదనీ, దానిని నిర్మూలించడం త్వరలోనే సాధ్యమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వసిస్తున్నప్పటికీ, ‘స్వతంత్ర బోడోలాండ్’ కోసం ఉద్యమిస్తున్న ఇటువంటి సంస్థలకు బోడోల్లో ఉన్న సానుభూతిని విస్మరించలేనిది.
అత్యధిక సంఖ్యాకులు తమకు చారిత్రకంగా అన్యాయం జరిగిందని భావిస్తున్నప్పుడు వారి కోర్కెల్లో న్యాయబద్ధమైనవి పరిష్కరించే ప్రయత్నం నిజాయితీగా జరగాలి. హక్కుల విషయంలోనూ, అభివృద్ధి విషయంలోనూ అన్యాయాన్ని సరిదిద్దక తప్పదు. బోడోలకూ, బోడోయేతర ఆదివాసీ తెగలకూ మధ్య అగాఽధాన్ని పెంచుతున్న అంశాల్లో ప్రభుత్వాలు పరిష్కరించగలిగేవి అనేకం ఉన్నాయి. దీనితోపాటు రెండు గ్రూపులు చర్చలకు దిగివచ్చిన నేపథ్యంలో, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోకుండా జాప్యం చేసిన పక్షంలో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది.
అసోంలో భూమిపుత్రులు ఎవరన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. అందరికంటే ముందు వలస వచ్చిన బోడోలు పదిన్నర లక్షలమంది వరకూ ఉన్నారు కనుక తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండు చేస్తున్నారు. అనేక సంస్థలు సాయుధ పోరాటం చేస్తున్నాయి. 2003లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం బోడో లిబరేషన్ టైగర్ ఫోర్స్ (బీఎల్‌టీఎఫ్)తో ఒక ఒప్పందానికి వచ్చి బ్రహ్మపుత్ర ఉత్తర తీరంలో ఐదారు జిల్లాలతో బోడో ప్రాదేశిక మండలి ఏర్పాటు చేసింది. 70 శాతం బోడోలున్న ఈ ప్రాంతంలో మిగతా తెగలూ ఉన్నాయి. మతాలూ ఉన్నాయి. స్వతంత్ర రాష్ట్రం ముసుగులో వారిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రెండు జిల్లాల్లో ఊచకోతకు గురైన ఆదివాసీలు ప్రధానంగా బెంగాల్‌లోని సంతాల్ పరగణాల నుంచి, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వలస వచ్చినవారు. వలసపాలనలో హక్కులకు నోచుకోని ఈ తేయాకు తోటల కూలీలకు 1951లో హక్కులు దఖలు పడ్డాయి. హిందూమతాన్ని అనుసరిస్తున్న బోడోలు ముస్లింలను ఊచకోతకోయడమూ, క్రైస్తవ బోడోలు సంతాల్‌లపై దాడులు చేయడమూ కనిపిస్తున్నదే.
ప్రధానంగా పరిమిత వనరుల కోసం జరుగుతున్న ఈ పోరాటాలను అదుపు చేయడం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించగలిగినప్పుడు చాలా వైషమ్యాలు సమసిపోతాయి. వ్యవసాయమే ప్రధానమై, బ్రహ్మపుత్ర మాత్రమే బతుకు తెరువైనప్పుడు ఉన్నవారి మధ్యనా, వలసలు వస్తున్నవారితోనూ ఘర్షణలు తప్పవు. మతం పేరిట, తెగల పేరిట పడగవిప్పుతున్న వైషమ్యాలకు రాజకీయం కూడా తోడుకావడం దేశ సరిహద్దు ప్రాంతంలో ప్రమాదకరం. ఉపాధికి పెద్దపీట వేస్తూ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం అవసరం.