కథా వార్షిక – 2012
మధురాంతకం రాజారాం
సాహిత్య సంస్థ
వెల: రూ.60/-
ప్రతులకు: డా.ఎం.నరేంద్ర
15-54/1, శ్రీ పద్మావతినగర్,
తిరుపతి-2.
మరియు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ అన్ని బ్రాంచీలు
ఆధునిక సమాజం ముసుగులో ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని కథలుగా చిత్రిస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే సంకలనమే ‘కథా వార్షిక- 2012’ మానవ జీవితాల్లోని పలురకాల కోణాల్ని ఇది బహిరంగంగా వ్యక్తపరుస్తుంది. ఈ లోతుపాతుల్ని తెలుసుకుని వీటిలోని కష్టనష్టాల తడిని పలకరించాలంటే ఒక్కసారి మనసు చూపుతో చుట్టిరావాల్సిందే!
తర్కబద్ధమైన హేతువాదానికి మానవీయ కోణాన్ని కర్తవ్య నిర్వహణ బాధ్యతారూపంలో ప్రకటించిన కథలాంటి.. జీవితం కథ ’దేవుణ్ణి అటకాయించిన మనిషి’ దీని రచయిత మెహర్ గొప్ప ఆశను కలిగిస్తుంది.
బహుళజాతి సంస్థ తమ పునాదులను పటిష్టం చేసుకోవడానికి భారతదేశంలోని ఆంధ్రరాష్ట్రంలో నాగరాజనే వ్యాపార విషయాల ఇన్‌చార్జి వేసిన పథకానికి, గ్రామస్థాయిలోని సామాన్య ఉమ్మడి ప్రతినిధి తిప్పణ్ణ చేతిలో ఏవిధంగా పరాభవం చెందాడో చాటి చెప్పేదే ‘ఒక దళారీ పరాభవం’ కథ. జి.ఉమామహేశ్వర్ రాసిన ఈ కథ సామ్రాజ్యవాదంలో భాగంగా ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న మోసానికి నిలువెత్తు దర్పణంలా నిలుస్తుంది.
‘గోమేజ్ ఎప్పుడొస్తాడో’ కథను వేలూరి వెంకటేశ్వరరావు రాసారు. అమెరికా నేపథ్యంలో రాసిన ఈ కథ గోమేజ్ లోపలి మనిషిని పరిచయం చేసి మనిషితనానికి సంబంధించిన ఒక ఆశను మనలో మిగిల్చిపోతుంది.
కథాంశానికి వస్తే-ఇంటి బయట ఉన్న లాన్‌ని కొయ్యడానికి గోమేజ్‌ని బేరమాడుకుంటారు సుజాత-కేథరిన్‌లు. గోమేజ్‌కు తోడుగా మార్సిలినోను తెచ్చుకుని ఆడుతుండగా మోవర్ పల్టీకొట్టి గోమేజ్‌కు గాయమై రక్తస్రావం కావడంతో హాస్పటల్‌లో జాయిన్ చేస్తుంది సుజాత. కానీ అతనక్కడినుండి పారిపోతాడు. వెతుక్కుని వెళ్లినా ప్రయోజనం కనిపించక ఆశవదులుకుంటుందామె. కొన్ని రోజుల తరువాత ఒక ఉత్తరాన్ని చదువుతుంటే-గోమేజ్ మాటలు గుర్తుకొచ్చి మనసు తడితో కంటనీరు పెట్టుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. గొప్ప మానవతా దృక్పథం తొణికిసలాడి చెరగని ముద్ర వేస్తుందిది.
‘కాళాపు కథ’ గొప్ప శిల్ప వైవిధ్యంతో కొనసాగుతుంది. దీని రచయిత్రి మన్నం సింధుమాధురి.
‘కలాపు’ అని పిలువబడే ‘బిసివిని’ గౌడుతోపాటు అనేక మంది అనుభవిస్తూ కాలం వెళ్లదీస్తుంటారు. ఈ క్రమంలో ఓ కొడుకు పుట్టాక, వాడు పెరిగి పెద్దవాడై అనుకోని రీతిలో గౌడు మిత్రుణ్ణి చంపి పారిపోతాడు. కొన్నాళ్లకి కాటి పాపడితో కలాపు లేచిపోయిందనే పుకారు గౌడుద్వారా లేస్తుంది. జోగిని వృత్తిలో ఉండే వారి జీవితాల్ని, ఎదురైన చేదనుభవాల్ని చాలా ఆర్ద్రంగా, విషాదభరితంగా ఈ కథ రూపుకడుతుంది.
మంచి కథాకథనంతో ఆద్యంతం రక్తికట్టించే కథ ‘కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు’. విమల రాసిన ఈ కథలో ఒకనాటి జ్ఞాపకాల సంఘటనను నెమరేసుకుని దాని మూలాలు వెతుకులాట కనిపిస్తుంది.
ఇతివృత్తానికొస్తే..ఉద్యోగరీత్యా కొనే్నళ్ల క్రితం ఆమె పనిచేసిన ప్రాంతంలో ఎన్నికల గందరగోళ స్థితిలో, ఉద్యమకారులు తిరుగాడుతుండగా- కొంతమంది కుర్రకారు వేర్వేరు బాధ్యతలతో గుంపులుగా విడిపోతారు. అందులో తిరుపతి, మాధవులు ముఖ్యులు. మాధవ ప్రేమించిన అమ్మాయి జ్యోతి. వాళ్ల పెద్దలు అంగీకరించరు వాళ్ల ప్రేమను. కానీ ఈలోగా అప్రయత్నంగా పోలీసు కాల్పుల్లో కుర్రాళ్లిద్దరు మృతి చెందుతారు. ఇవన్నీ పెళ్లిలో కలుసుకున్న ఆమెతో జ్యోతి భోజన సమయంలో కలుసుకుని గతాన్ని తలుచుకుని బాధపడుతుంది. అందులో భాగమే ఒకనాటి నక్షత్రకాంతి, అవ్యక్తానంద స్థితికి వెదుకులాటకి దారి తీయిస్తుంది. విషాదరేఖలు పురివిప్పి ఆర్ద్రపూరితమైన ముగింపునిస్తాయి.
ఒక ప్రధాన పాత్రతో కథను నడిపిస్తునే మధ్యమధ్యలో శివాని, బసంతి లాంటి చిన్నచిన్న పాత్రలతో జ్ఞాపకాల మధ్య అనే్వషిస్తుంటే అసంపూర్ణ జీవితానికి నిర్లిప్తత, పశ్చాత్తాప భావన వెదుకులాట వెంటాడుతాయి ‘వాంగ్మూలం’ కథలో. వీటికి కొసమెరుపుగా ఒక ఆత్మహత్య మరణ వాంఛతో ఊపిరాడని తనాన్ని మిగుల్చుతుంది ఇందులో. చాలా వైవిధ్యపూరితమైన కథనం కనిపిస్తుంది. శిల్పరహస్యం కూడా కొత్తగా అనిపిస్తుంది. స్వాతికుమార్ దీనిని రాసిన రచయిత్రి.
అంటరానితనం కేంద్రంగా శ్రమ జీవన ప్రాధాన్యతను వివరించి చెప్పిన కథ ‘కాకికి కడివెడు పిచ్చిక్కి పిడికెడు’ కథ. స.వెం.రమేశ్ రాసిన శైలి సరళమైంది. సున్నితమైంది. కాకమ్మకు అమ్మను, పిచ్చుకమ్మకు మంగమ్మను ప్రతీకగా చేసి ఇద్దరు తల్లుల బిడ్డలతో నాలుగు తరాల మనుషుల చరిత్రను చిత్రించిన తీరు అబ్బురపరుస్తుంది. అందర్నీ చదివింపచేస్తుంది.
‘కథలు లేని కాలం’ కథను రాసిన రచయిత్రి ఓల్గా. ఎనిమిదేళ్లు పెంచిన మనుమరాలు అనన్య తిరిగి ఎనిమిదేళ్ల తరువాత అమెరికానుండి తిరిగి వస్తుంది. గతంలో అమ్మమ్మ చేత కథలు చెప్పించుకోవడానికి అలవాటు పడిన ఆ పిల్లకి, కొనే్నళ్ల తర్వాత కొత్తగా కథలు మార్చి చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అనన్యకి అమ్మమ్మైన సుమిత్ర ప్రేమించి పెళ్లి చేసుకుని పల్లె జీవితంలో రంగారావుతో స్థిరపడిపోవడాన్ని ఇష్టపడని కూతురు శ్రావణి, కొనే్నళ్లకు బాగా చదువుకుని వేరొకతనిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. అలా శ్రావణికి పుట్టిన కూతురు అనన్యతోనే ఈ కథంతా నడుస్తుంది. కథన చిత్రణలో విలక్షణమైన కొత్త పార్శ్వాలను తడిమి చూపారు. ఇందులో రచయిత్రి ఓల్గా ప్రత్యేక ముద్ర తప్పక కనిపిస్తుంది.
‘దావత్’ కథ మహమద్ ఖదీర్‌బాబు శిల్ప నిర్మాణ పద్ధతిని కొత్తకోణంలో పాఠకులకు పరిచయం చేస్తుంది. ఆడ ముస్లిం పెళ్లింట జరిగిన భోజన కార్యక్రమంలో భాగంగా తిండి విషయంలో తలెత్తిన చిన్న తగాదా చివరికి పరిస్థితిని ఏ స్థాయికి దిగజారుస్తుందో తెలియజెప్పే కథ ఇది. మగపెళ్లి వాళ్ల పెత్తనం అన్నింటా ఆధిపత్య ధోరణి కలిగించి అస్లాం లాంటి తండ్రుల పాలిట ఎలా శాపంగా మారుతుందో ఇది వివరిస్తుంది. చాలా సహజంగా సాగి జీవన సత్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది.
ఇలా వస్తు వైవిధ్యం పుష్కలంగా కలిగిన ఈ కథలు జీవన సంఘర్షణలను ఎత్తి చూపడమే కాకుండా, అందులోని కరుణ రసాత్మక దృశ్యాలను ఆకర్షీకరించి ఆలోచింపచేస్తాయి. డా.వి.చంద్రశేఖరరావుగారు ఒక కథా సమయంలో పేరుతో ఈ కథలపై ఇచ్చిన విశే్లషణలు సమగ్రంగా, సందర్భానుసారంగా మానవతా పరిమళాలను అద్ది ఈ కథావార్షికకు నిండుదనాన్ని చేకూర్చాయి. ఇందులోని తొమ్మిది జీవన చిత్రాల్ని ప్రతిబింబించి సాహిత్య లోకానికి కొత్తదారులు తెరలు తెరిచాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

