బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్‌..!

బాపు బొమ్మ’ పెద్ద కాంప్లిమెంట్‌..!

మానవ జీవితంలో మధుర ఘట్టమైన పెళ్లి తాలూకు జ్ఞాపకాల దొంతర బాపు సృష్టించిన ‘పెళ్లి పుస్తకం’. ఈ సినిమాతో తన కెరీర్‌కీ, వెండితెరకి సొబగులు దిద్దిన బాపు బొమ్మ దివ్యవాణి. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరమై, క్రీస్తు సేవలో తరిస్తున్నారు. మళ్లీ నటించాలన్న ఆశ ఉన్నా, ఇకపై నటించనని, నటించలేనని చెబుతున్న దివ్యవాణి అంతరంగం ఇది…
‘‘మా ఊరు తెనాలిలోని ఆదినారాయణపురం. అమ్మ విజయలక్ష్మి, నాన్న కె.ఆదినారాయణరావు. నేను పుట్టి, పెరిగిందంతా తెనాలిలోనే. అమ్మ తరపుగానీ, నాన్న తరపునగానీ ఆర్టిస్ట్‌లు, నాటకాల్లో నటించినవాళ్లు ఎవరూ లేరు. అయితే అమ్మకి చిన్నప్పటి నుండి డ్యాన్స్‌ అంటే ఆసక్తి ఉండేది. మా అక్క హరిప్రియ నటించాలని ఆశపడితే ఆమెకోసం చెన్నైకి వచ్చాము. నేను అప్పుడు తెనాలిలోనే 9వ తరగతి చదువుతున్నాను. 10 వ తరగతి పరీక్షలు రాసేసి, అమ్మ, అక్కని చూద్దామని నేనూ చెన్నైకి వచ్చాను. ఊర్వశి శారదగారు అమ్మకి మంచి ఫ్రెండ్‌, తెనాలి అవ్వడం వల్ల. శారదా ఆంటీ నన్ను చూసి, ‘ఈ అమ్మాయికి మంచి ఆర్టిస్ట్‌ అయ్యే లక్షణాలున్నాయి’ అని అమ్మకు చెప్పారు. తరువాత ఫోటోసెషన్‌ చేయడం, అవి చాలా బాగా రావడం, నేను ఆర్టిస్ట్‌ని కావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది, అలా నేను సినిమా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాను.
ఏమీ తెలియని వయసులోనే…
నిజానికి అప్పటికి ఇండస్ర్టీ గురించి నాకేమి తెలియదు. 14 ఏళ్లంటే ఏం తెలుస్తుంది చెప్పండి? మన గురించే మనకి అవగాహన ఉండని వయసు అది. కేవలం అమ్మ, అక్కల ఇంట్రస్ట్‌తోనే నేను సినిమాల్లోకి రావడం జరిగింది. చాలామంది ‘నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి’ అని ఒక తపనతో వస్తుంటారు. నా వరకైతే అప్పటి వరకు స్కూల్‌కెళ్లడం, చదువుకోవడం, ఆడుకోవడం, తినడం తప్పించి ఇంకేమీ తెలియవు. అయితే నటన నాకు దేవుడిచ్చిన వరం. స్వతహాగానే నేర్చుకోగలిగాను. ఏ రోజూ నేను ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లింది లేదు. డ్యాన్స్‌ కూడా అంతే. మామూలుగా ఇంట్లో సరదాగా నేర్చుకున్నదే తప్పితే ప్రత్యేకంగా శిక్షణ ఏమీ పొందలేదు. మొదట అవకాశం కోసం అమ్మ, నేను పరుచూరి గోపాలకృష్ణ దగ్గరకి వెళ్లాం. నా సినిమా కెరీర్‌కి ఆద్యం పోసింది శారద ఆంటీ, పరుచూరి బ్రదర్సే. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వర్ణించలేనిది. ఇప్పటికి కూడా కష్టాలు వాళ్లవి, విజయాలు నావి.
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌ అనేవారు…
నాకు అన్నయ్య కూడా ఉన్నాడు, రవిచంద్ర బాబు. ముగ్గురం చాలా ఆత్మీయంగా ఉండేవాళ్లం. అక్క తనకంటే ముందు నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడింది. కృష్ణగారి అమ్మాయిగా తొలిసారి కెమెరా ముందు నిలబడ్డాను. నా తొలి సినిమా ‘సర్దార్‌ కృష్ణమనాయుడు’. కృష్ణగారు డ్యూయల్‌ రోల్‌, శారద ఆంటీ కూడా ఉన్నారు. నేను చాలామంది పెద్ద పెద్దవాళ్ల ఇంటర్వ్యూలు చదివాను, దాదాపు అందరూ కూడా తొలి రోజు చాలా భయపడ్డామని, టెన్షన్‌గా ఉండేదని చెప్పారు. కానీ, నిజంగా చెబుతున్నాను నాకు అటువంటిదేమి లేదు. ధైర్యంగా వెళ్లి కెమెరా ముందు నిలబడ్డాను, తొలి షాట్‌ సింగిల్‌ టేక్‌లో ఓకే అయిపోయింది. అందులో – కృష్ణగారు ఆసుపత్రిలో మంచం మీద వుంటారు, ఆయన నాకు తండ్రి అని తెలియదు. శారద ఆంటీ లోపలే ఉంటారు. నేను తలుపు తెరచి ‘ఆంటీ’ అని పిలవాలి. అదీ నా తొలి సన్నివేశం. ఆ సినిమాలో అందరూ హేమాహేమీలే. బాగా నటించానని నన్ను మెచ్చుకున్నారు. ఎంతైనా అందరం తెనాలివాళ్లమే కదా. కళలకు పుట్టినిల్లు అది. దివ్యవాణి అంటే సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌ అని పేరు వచ్చింది. అది దేవుడి వరమే అనుకోవాలి.
ఇక సినిమాలు వద్దనుకున్నా… కానీ!
తరువాత కేఎస్‌ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో ‘అడవిలో అర్ధరాత్రి’ చేశాను. ఇంకా ‘మా తెలుగు తల్లి’; రవిరాజాగారి ‘ముత్యమంత ముద్దు’.. హీరోయిన్‌గా నా తొలి సినిమా కన్నడంలో చేసిన ‘డ్యాన్స్‌ రాజా డ్యాన్స్‌’. చాలా పెద్ద హిట్‌. అప్పటికి తెలుగులో హీరోయిన్‌గా చేయలేదు. అవకాశాలు వచ్చేవి, కానీ హీరోయిన్‌గా ఓకే అయ్యాక కూడా చేజారిపోయేవి. ఇలా కొన్ని సినిమాలు చేసిన తరువాత నటన వరకు ఓకేగానీ, ఎందుకో ఇండస్ర్టీలో ఇమడలేకపోయాను. ఇండస్ర్టీ అంటే ఏంటో అర్ధమయ్యాక, ఇక సినిమాలు వద్దు, తెనాలి వెళ్లిపోయి చదువుకుందాం అని నిర్ణయానికి వచ్చేశాను. ఆ సమయంలో బాపుగారి దగ్గర నుండి కాల్‌ వచ్చింది.
నీ సొంత జుట్టేనా అనడిగారు…
‘అబ్బ.. ఈయన కూడా అందరిలాగే చూస్తారు. ఏవేవో అంటారు. మనం కాంప్రమైజ్‌ కాలేం. హీరోయిన్‌గా తీసుకోకపోతే మళ్లీ ఏడ్వాలి’ అనుకుని తలంతా నూనె పెట్టుకుని, మామూలుగా తెనాలిలో ఎలా ఉంటామో అలా జడ వేసుకుని వెళ్లాను. బాపు సహజత్వాన్ని బాగా ఇష్టపడే దర్శకులు. ఆయన దగ్గరకి వెళ్లగానే ఆయన ‘ఇది నీ సొంత జుట్టేనా’ అనడిగారు. అవునండి అన్నాను. కాళ్లు చూపించమ్మా అన్నారు. చూపించాను. వెంటనే ఇప్పుడు ఎలా ఉన్నావో, సినిమాలోనూ అలాగే ఉండాలి. మేకప్‌ అంతా నేను వేయను అన్నారు. చేస్తానని చెప్పాను. వెంటనే అగ్రిమెంట్‌ కూడా అయిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతిలో ‘బాపు బొమ్మ – దివ్యవాణి’ అని న్యూస్‌ వచ్చింది. అది చూసి పెద్దపెద్ద దర్శకులు నాకు ఫోన్‌ చేశారు. దాసరిగారు ఫోన్‌ చేయడం నాకు బాగా గుర్తు. ఉదయం 6 గంటలకి, నేను ఇంకా నిద్రపోతున్నాను. ల్యాండ్‌లైన్‌కి ఫోన్‌ చేసి ‘బాపు బొమ్మ-దివ్యవాణి’ అని పేపర్‌లో వేశారు. నువ్వేనామ్మ? అని అడిగారాయన. అవునని చెబితే శుభాకాంక్షలు చెప్పారు.
సావిత్రిని చూసినట్టుందన్నారు…
‘పెళ్లి పుస్తకం’ మొదలుకావడానికి ముందు బాపుగారు ‘మిస్సమ్మ’ సినిమా చూశావా?’ అనడిగారు. నాకు సినిమా జ్ఞానం అస్సలు లేదు. క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు అయిపోతే, అదీ బ్రతిమిలాడితే ఎప్పుడైనా ఒక సినిమాకి పంపించేవారు. ‘చూడలేదండి’ అని చెప్పాను. ‘మిస్సమ్మ’లో ఉన్న క్యారెక్టర్‌ లాంటిదే నీది, చూడమని చెబితే, చూశాను. అప్పటికి బాపు విలువగానీ, బాపు బొమ్మ అంటే ఒక ఆడదానికి ఇంత గౌరవం ఉంటుందని గానీ తెలీదు. అటువంటి సమయంలో ‘పెళ్లి పుస్తకం’లో నటించడం నా భాగ్యం. దేవుడు కొన్ని అడిగితే ఇస్తాడు, కొన్ని అడక్కుండానే ఇస్తాడంటారు!! అలా నేను అడగకుండానే దేవుడు నాకిచ్చిన వరం ‘పెళ్లి పుస్తకం’. నాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అంటే, ప్రివ్యూకి ఆరుద్రగారు వచ్చారు. సినిమా అయిపోయాక ఆరుద్రగారు ‘ఎవరు హీరోయిన్‌?’ అనడిగితే, నేను వెళ్లి ‘సార్‌ నమస్కారం’ అన్నాను. అప్పుడు ఆయన చెప్పిన మాట ‘మళ్లీ సావిత్రిని చూస్తున్నట్టుందమ్మ’ అని. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.
హ్యాట్రిక్‌ మిస్సయ్యా… చాలా బాధపడ్డా
రాజేంద్రప్రసాద్‌తో ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌’, శ్రీకాంత్‌తో ‘దొంగ రాస్కెల్‌’’, నరేష్‌తో ‘పెళ్లి కొడుకు’, ఇంకా ‘పెళ్లి నీకు శుభం నాకు’ అన్నీ మంచి పేరు తెచ్చాయి. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేశాను. ‘మిస్టర్‌ పెళ్లాం’ విషయంలో నేను చాలా బాధపడ్డాను. నేను చేయాల్సిన సినిమా అది. బాపు-రమణలు కూడా నేనే నటించాలని చాలా ప్రయత్నించారు. కానీ, కుదరలేదు. ఏదేమైనా, మరో మంచి ఆర్టిస్ట్‌ ఆ సినిమాలో నటించింది. నేను చేసిన దాని కన్నా ఆమని చేసినందుకు ఎక్కువ సంతోషపడుతున్నాను కానీ, కొన్ని పాలిటిక్స్‌ వల్ల ఆ సినిమాలో నేను చేయలేకపోయానన్నది కొంచెం బాధనిపించింది. ఈ మూవీ కూడా నేను చేసుంటే బాపుగారితో హ్యాట్రిక్‌ అయ్యేది. ఇండస్ర్టీలో నన్ను బాగా బాధపెట్టిన విషయమిది. బాపుగారితో ‘పెళ్లి పుస్తకం’, ‘పెళ్లి కొడుకు’, ‘కవి సార్వభౌమ’, ‘రాధాగోపాలం’ చేశాను. నేను హీరోయిన్‌గా నటించిన ఆఖరు సినిమా ‘దొంగ రాస్కెల్‌’.
వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కాలేదు…
మంచి పీక్‌ టైంలో ఉండగానే నాకు పెళ్లి అయిపోయింది. మావారి పేరు దేవానంద్‌. ఇండస్ర్టీలో దివ్యవాణి అంటే మంచి ఆర్టిస్ట్‌గా పేరు, మా పద్ధతులు, ఇంట్లో పెరిగిన పరిస్థితులు గురించి తెలుసు. పైగా నాపై ఒక్క రూమర్‌ కూడా లేదు. కాబట్టి సినిమా జీవితం మా వ్యక్తిగత జీవితానికి ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు. ఒక బాబు కిరణ్‌ కాంత్‌, ఒక పాప కారుణ్యదేవి. బాబు ఇంజినీరింగ్‌, పాప టెన్త్‌ చదువుతున్నారు. మా వారు నా సినిమాలు చూసినప్పుడు సింపుల్‌గా బాగుంది అంటారంతే. పెళ్లి తరువాత నటించకూడదని షరతులేమి పెట్టలేదు. ఆ తరువాత కూడా నేను నటించాను. ‘కలవారికోడలు’, ‘పుత్తడి బొమ్మ’ సీరియల్స్‌ చేశాను. సినిమాలైతే బాపుగారు తీసిన ‘రాధాగోపాలం’ చేశాను. ఆఖరుగా ‘వీర’లో నటించాను. అందులో కడప అమ్మాయి పాత్ర నాది. ఓ సందర్భంలో
చోటాకె.నాయుడుగారు చెప్పారు – ‘పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమా చూసి బాపు బొమ్మ ఇలా కూడా ఉంటుందా’ అని అడిగారని. బాపు బొమ్మ కత్తిపట్టడం అంటే వింతే కదా మరి.
నిజమైన ఆర్టిస్ట్‌కి ఆ భావన ఎప్పుడూ ఉంటుంది…
టీవీలో నా సినిమాలు చూసినప్పుడు ఇంకాస్త బాగా చేస్తే బాగుంటుదని అనిపిస్తుంటుంది. చెప్పింది చెప్పినట్టు చేయడమే తప్ప, ఇంకేమి తెలియని వయసు అది. ఇప్పుడు చూస్తుంటే, ఇంకా బాగా చేసుండొచ్చు కదా అని అనిపిస్తుంది. నిజమైన ఆర్టిస్ట్‌కి ఈ భావన ఎప్పుడూ ఉంటుంది. ‘రాధాగోపాలం’లోనే తీసుకోండి, బాపు బొమ్మగా అంత పేరు తెచ్చుకున్న నేను, ఈ సినిమాలో వేణుమాధవ్‌కి జోడీగా కాసులమ్మ పాత్ర చేశాను. చాలామంది అన్నారు ‘కాస్త స్లిమ్‌ అయ్యి, మీరు, శ్రీకాంత్‌కి జంటగా చేస్తే ఇంకా బాగుండేది’ అని పెద్ద పెద్ద వాళ్లు ఫోన్‌ చేశారు.
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.