రుద్రవీణపై కోటి రాగాలు
ప్రతులకు: డా.జలంధర్‌రెడ్డి,
ఇంటి నెం.12-13-336,
ప్లాట్ నెం.465,
వీధి నెం.2, తార్నాక,
సికింద్రాబాదు- 500 017.
మొబైల్.9848292715
వెల: రూ.200/-; పుటలు: 230.
డా.జలంధరరెడ్డి మహాకవి దాశరథి గురించి పెద్దఎత్తున సదస్సు నిర్వహించి ఆ ప్రసంగ పత్రాలతో ఒక బృహగ్రంథాన్ని వెలువరించారు. పాత పత్రికల్లో వచ్చిన వ్యాసాలన్నింటిని ఎంతో శ్రమకోర్చి సేకరించి 800 పుటల మరో గ్రంథాన్ని ప్రకటించారు. ఈ రెండు పుస్తకాలు దాశరథిని గురించి మాట్లాడే వారందరికీ ప్రధాన ఆధార గ్రంథాలుగా నేడు ఉపయోగపడుతున్నాయి. జలంధరరెడ్డి అం తటితో ఆగక రుద్రవీణపై కోటి రాగాలు పేరుతో దాశరథికి 81 మంది కవులతో కవిత్వ నీరాజనాన్ని సమర్పించారు.
దాశరథీ! మనోజ్ఞ కవితాశరధీ! శరదిందు చంద్రికా
పేశల కావ్యఖండముల పండిన నీ కలమందునన్ మహో
గ్రాశనిపాతముల్ వెలయునౌర! మహేశుని కంటిలో సుధా
రాశి తరంగముల్ కటు హలాహల కీలలు పొంగినట్లుగా.
(పుట.27).
-అన్న డా.సి.నారాయణరెడ్డి ‘‘జలపాతం’’ అంకిత పద్యాలు ఈ గ్రంథానికే మకుటాయమానం. నారాయణరెడ్డి దాశరథిని అగ్రజునిలాగ భావించారు. ‘‘అన్నలు లేని చింత హృదయాంతికమందు జనింపకుండా చేసి తమ్ముడాయని మనస్సుమముల్ విరబూయ’’ సినారెను సంభావించిన వ్యక్తి దాశరథి.
మద్దూరి రామమూర్తి, ఆశావాది ప్రకాశరావు, ఉన్నత జ్యోతివాసు, రామడుగు వెంకటేశ్వరశర్మ, ఎన్.యాదగిరిశర్మ లాంటి వారి పద్యాలు. టి.వీ. భాస్కరాచారి, వేదాటి రఘుపతి లాంటి వారి గేయాలు, అనిసెట్టి రజిత, దర్భశయనం శ్రీనివాసాచార్య, గిరిజా మనోహరబాబు, తిరునగరి లాంటి వారి వచన కవితలు అలరిస్తాయి. దాశరథి పట్ల ప్రశంసోక్తులు పలకడం, ఆయన పుస్తకాల పేర్లు వచ్చేలా రాయడం, ఆయన కవితా పంక్తులను కూ ర్చడం లాంటి వ్యూహాలను కవులు అనుసరించారు.
‘‘వీధిలో నడుస్తుంటే కనిపించనంతటివాడు, కవిగా వీధిలోకి వస్తే శృంగాయమానంగా కనిపించే ధీరు డు’’అంటారు కనపర్తి రామచంద్రాచార్యులు (పుట. 182). ‘‘ప్రాచీన అర్వాచీన కవిత్వానికి వారధి ఒళ్ళంతా కవిత్వం, మనసంతా కవిత్వం అన్ని రసాలను గుప్పించి మెప్పించడం అతని తత్వం’’ (పుట.199) అంటూ జి.వెంకటేశ్వర్లు దాశరథిని ప్రస్తుతించారు.
రుధిర సంధ్యల్లోని భానుడు
నెత్తురు కక్కుతున్న వేళ
ఉషస్సుల్లేని నిశీధిలో చంద్రుడు
అశ్రువులు రాలుస్తున్నాడు
మోదుగుపూలు రక్తం పూసుకొని
అరుణకాంతులను వెదజల్లుతున్న వేళ
ఇటు వసంతము లేక కోకిలలు
ఆర్తనాదాలతో రోదిస్తున్నాయి
పాషాణ హృదయ పారావతాలు
కిక్కురు మనకుండా మిన్నకున్నాయి. (పుట 133)
-అంటూ గడ్డం మోహన్‌రావు రాసిన కవిత కమనీయంగా సాగుతుంది.
తెలుగు తేజముతోడ వెలుగురేఖలు జిమ్ము
కవి దాశరథి- తెలంగాణ యింట
అగ్నిధారను పోసి అశ్రుధారను ఆపె
గద! దాశరథి- తెలంగాణ కంట
బీడు బుర్రలలోన స్వేచ్ఛాన్నముల నివ్వ
గల దాశరథి- తెలంగాణ పంట
జన్మజన్మల బూజు జాడించి దులిపిన
ఘన దాశరథి- తెలంగాణ జంట
ఇల్లు చక్కదిద్ది కళ్ల కలత దీర్చి
సాగుచేయు రైతు జతగ నిల్చు
రణనినాది దాశరథి కృష్ణమాచారి
నవ్యకవితకు నిధి భవ్య సుకవి.(పుట 79) అంటున్న సల్ల విజయ్‌కుమార్ ఇట్లాగే తన రచనాభ్యాసాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో మంచికవి కాగలడన్న ఆశను రేకెత్తిస్తున్నారు.
దాశరథి ఆస్థాన కవిగా నియమితులయ్యారంటే- అదేదో ఆ దాయం ఉండే ఉద్యోగం కాదు. సంవత్సరానికి ఆరువేల రూపాయల గౌరవ పారితోషికమట. అంటే నెలకు ఐదువందల రూపాయలు అన్నమాట. ఆస్థాన కవి నియామకం ఉత్తర్వును ఈ గ్రంథంలో పొందుపర్చడంవల్ల చరిత్రకు మేలుచేసిన వారయ్యారు. భవిష్యత్తరాలు దాశరథి పట్ల ఏవేవో ఊహించుకోకుండా రక్షింపబడ్డాడు.
సర్వేపల్లి రాధాకృష్ణ, ఇందిరాగాంధీ, బూర్గుల రామకృష్ణరావు, జలగం వెంగళరావు, మదర్ థెరీసా, నీలం సంజీవరెడ్డి లాంటి నేతలతో, జాషువా, సినారె, దేవులపల్లి లాంటి సమకాలీన కవులతో దాశరథి దిగిన ఫొటోలు, ఆకాశవాణిలో పనిచేసినప్పటి ఫొటోలు అందంగా అదనంగా ఉన్నాయి. ఈ చిత్రాలను ఎక్కడో ఒకచోట ఇలా పొందుపరచకపోతే అవి కాలగర్భంలో కలిసిపోయేవి. దాశరథి లాంటి మహనీయుడికి ఎంత నివాళి అర్పించినా తక్కువేనన్నది వాస్తవం. దాశరధి సాహిత్యాన్ని చదవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నది మరింత వాస్తవం.

