నేను ఆర్కే లక్ష్మణ్ దంపతులను మొదటిసారి కలిసినది వైస్రాయ్ హోటల్‌లో ‘మీట్ ది ఆధర్’కార్యక్రమంలో. ఇది నాకు గుర్తుచేసింది అశోక్
(అశోక్ బుక్స్, విజయవాడ). లక్ష్మణ్ దంపతులు తర్వాత గ్రాండ్ కాకతీయ హోటల్‌లో బస చేశారు. మర్నాడు లంచ్‌కి బయటకు వెళ్దామని లక్ష్మణ్ దంపతులను తీసుకు వెళ్ళటానికి మేమిద్దరం వెళ్ళాము. నన్ను చూడగానే లక్ష్మణ్ ‘వాట్ పోలీస్ మన్! నన్ను అరెస్ట్ చేయటానికి వచ్చారా?’’ అన్నారు.
‘‘అవును, ఎక్కువ నవలలు రాయనందుకు మిమ్మల్ని నిజంగా అరెస్ట్ చేయవలసిందే’’నన్నాను.
లక్ష్మణ్, కమల, అశోక్… అందరూ నవ్వారు.
తర్వాత అక్కడే కూర్చుందామని నిర్ణయించుకుని లాంజ్‌లో కూర్చుని బీర్ తాగుతూ కబుర్లు చెప్పుకున్నాం. మా బీర్ కార్యక్రమం సమయంలో కమల, అశోక్ బయటకు వెళ్ళి లంచ్ సమయానికి వచ్చారు. తర్వాత కూడా లక్ష్మణ్ దంపతులను కలియటం జరిగింది. మేం మాట్లాడుకున్న విషయాలు ఎన్నో…
పంచ్ మాగజైన్ కార్టూనిస్టులూ… న్యూయార్కర్ కార్టూనిస్టులూ… ప్రపంచంలోని ముఖ్యమైన పొలిటికల్ కార్టూనిస్టులు ఇన్ జనరల్… డేవిడ్‌లో… ఓలిఫాంట్… ఇంకా ఎందరో. ఆయనకి బ్రిటిష్ కార్టూనిస్టులు… పంచ్ మాగజైన్‌తో విరివిగా వేస్తుండే ధెల్‌వెల్ (ఇతడి బొమ్మల్లో బొద్దుగా వుండే పిల్లలూ, బొద్దు గా వుండే పొట్టి గుర్రాలూ)…. రొనాల్డ్ సియిర్ల్… అంటే ఇష్టమని చెప్పారు.. న్యూయార్కర్ కార్టూనిస్టులలో జేమ్స్ దర్బర్… ఇంకా ఎందరినో ఆయన మెచ్చుకున్నారు.
‘‘స్టీన్‌బెర్గ్ ఎలా వుంటాయి’ అని అడిగాను.
‘‘బావుంటాయి కాని చాలా సొఫిస్టికేటెడ్… ఆబ్‌స్ర్టాక్’’ అన్నారు.
రచనల మీదకు మాటలు మళ్ళాయి. ఆయన ఆధునిక నవలలు… మంచివి దాదాపు చదువుతూనే వుంటానన్నారు. ముఖ్యంగా గ్రాహం గ్రీన్.
బైర్ట్రండ్ రసెల్‌ని కలసిన రోజున ఏం జరిగిందో చెప్పారు.
“You indians Discovered Nothing” అన్నాడు రసెల్. లక్ష్మణ్‌కి అర్థం కాలేదు. రసెల్ కాస్త రూడ్‌గా ఇన్‌సల్టింగ్‌గా మాట్లాడినట్లు అనిపించింది. కాని వెంటనే రసెల్ ‘‘మీరు గణితంలోని జీరోని కనుగొన్నవారు. గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు మాధమెటిక్స్’’ అన్న తర్వాత అర్థమయింది రసెల్ పొగిడాడని.
ఆయనకీ కాకులకీ వున్న అవినాభావ సంబంధం గురించి బాగా చెప్పారు. ఉదయం టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీసుకి వెళ్ళి తన రూమ్‌లో కూర్చుని టీ తాగి అక్కడ వున్న అన్ని న్యూస్ పేపర్లని తిరగేయటం మొదటి కార్యక్రమం. దేశ కాల పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలను గురించి ఆలోచిస్తూ తన గది బయట వున్న చెట్టు మీద వాలి వుండే కాకుల మందలను చూస్తూ ఐడియాల కోసం ఎదురు చూసేవారు. మెల్లగా ఒకటో రెండో కార్టూన్ ఐడియాలు వస్తే రఫ్ స్కెచ్‌లను వేసి మళ్ళీ కాకుల విన్యాసాలను చూస్తూ గడపటం… కాస్త సమయం తర్వాత వచ్చిన ఐడియాలతో మళ్ళీ కొన్ని రఫ్ స్కెచ్ లు వేయటం- ఇలా జరిగేది. లంచ్ తర్వాత ఈ రఫ్ స్కెచ్‌ల నుండి పుట్టిన కార్టూనులు రెండో మూడో వేస్తే అవి ఎడిటర్ రూమ్‌కి వెళ్ళి తిరిగి వచ్చేవి. వాటికి కేప్షన్స్ రాసి ఫైనల్ డ్రాయింగ్ అయిపోతే రోజు పని పూర్తవుతుంది.
తన కార్టూన్ల సృష్టిలో బయట చెట్టు మీద సందడి చేస్తున్న కాకుల మందల విన్యాసాలు తన ఆలోచనలు ఓ దారికి రావటానికి దోహదం చేసేవని లక్ష్మణ్ అన్నారు. కాకులంటే లక్ష్మణ్‌కి ఎంతో ప్రేమ. వాటిని ఎన్నో మూడ్స్‌లో… ఎన్నో వేల బొమ్మలు వేశారాయన. ఆయన నాకు నాలుగు బొమ్మలు వేసి ఇచ్చారు. అవి (1) కామన్ మాన్ (2) కామన్ వుమన్ (3) గణేశుడు (4) కాకి. ఆ నాలుగు వేసి ఇచ్చాక నన్ను అడిగారు.
‘‘అవి ఎంత ఖరీదు వుంటాయో తెలుసా?’’
‘‘తెలియదు. బహుశా ప్రైస్ లెస్’’ అన్నాను
నవ్వి ఇలా చెప్పారు.
‘‘ఓ ఆరు నెలల నాడు బొంబాయిలో ఓ రోటరీ క్లబ్ సమావేశంలో నన్ను పిలచి మాట్లాడమని అడిగారు. ప్రసంగం పూర్తయ్యాక ఓ బొమ్మ వేయమని కోరారు. నేను ఓ బొమ్మ వేసి ఇచ్చాను. వెంటనే దానిని అక్కడ వేలానికి పెడితే క్లబ్‌కి ఓ యాభై వేలు వచ్చింది’’ అన్నారు.
‘‘థాంక్స్ ఫర్ మేకింగ్ మి రిచ్’’ అన్నాను. నవ్వేశారు లక్ష్మణ్. ఆ బొమ్మలు మా పిల్లలతో ప్రస్తుతం అమెరికాలో వున్నాయి.
ఓ సారి బాపు నన్ను అడిగారు.
‘‘లక్ష్మణ్‌ని నీ కారికేచర్ వేయమని ఎందుకు అడగలేదు?’’
‘‘నాకు అడగాలని తోచలేదు బాపూ’’ అని చెప్పాను.
ఎన్నో ఏళ్ళనాడు ఆర్కే లక్ష్మణ్ రెండు నవలలు కూడా రాయటం జరిగింది.
అవి (1) ది హోటెల్ రివియెరా (2) ది మెసెంజర్
ఆనాటి విమర్శకులు ఈ నవలలని సోదరుడు ఆర్.కె. నారాయణ్ నవలల తో పోల్చే ప్రయత్నం చేయటంతో నవలలు రాయటం విరమించుకుని కేవ లం డ్రాయింగ్స్, కార్టూన్ల మీద తన దృష్టిని కేంద్రీకరించటం జరిగింది. ఆర్.కె. నారాయణ్ రాసిన నవలలకీ కథలకీ, వాటి మీద ఆధారపడి తీసిన టీవీ సీరియల్స్‌కీ లక్ష్మణ్ వేసిన బొమ్మలతో వాటిలోని పాత్రలూ జీవం పోసుకుని ఆనా టి సమాజాన్ని, మనుషుల్ని ఎంతో ప్రతిభావంతంగా రూపొందటంలో భాగస్వాములయ్యాయి. నారాయణ్ వూహలకి లక్ష్మణ్ రూపాల్ని కల్పించటంలో వాటిలోని దృశ్యాలన్నీ మన కళ్ళ ముందు అద్భుతంగా ప్రత్యక్షమవుతాయి. మాల్గుడీ వూహా ప్రపంచంలోని మనుషులూ, ఇళ్ళూ వాకిళ్ళూ, బజారులూ అన్నీ మనకి స్పష్టంగా కనిపించి నారాయణ్ సృష్టించిన సాహిత్య ప్రపంచం మనకి అర్థమవుతుంది. పధ్నాలుగు ముఖ్య భాషలూ, ఇంకా ఎన్నెన్నో భాషలూ, 130 కోట్ల జనం వున్న ఈ దేశంలోని వైవిధ్యం, వైరుధ్యం అన్నీ ప్రస్ఫుటంగా నిత్యమూ చూపించటంలో లక్ష్మణ్ కృతకృత్యుడయ్యాడని వొప్పుకోక తప్పదు. అదే మన బలం… మన ఐక్యత..
అధికారగణాలలో, రాజకీయ వాదులలో, పారిశ్రామికాధిపతులలో, బ్యూరోక్రసీలలోని అన్ని లెవెల్స్‌లో వుండే రుగ్మతలూ, అధికార దాహంతో రాజకీయ నాయకులు చేపట్టే రధ యాత్రలూ, పాదయాత్రలూ, నిరాహార దీక్షలూ, ప్రజలను మభ్యపెట్టే ఇంకా ఎన్నో ఇతర కార్యక్రమాలనూ – వీటన్నింటినీ నమ్మి ఓట్లు వేసి మళ్ళీ అధికారాలను కట్టబెట్టి తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితి అన్ని వేళలా వుంటున్నది. అంతులేని అవినీతికి అడ్డుకట్టలు వేయటం ఎలాగో ఎవరికీ తెలియదు. ఇవన్నీ మనం అందరం నిత్యమూ అనుభవించేవే…ఇవన్నీ లక్ష్మణ్ కార్టూన్లకి మూల ధాతువు. మనందరి నిత్య జీవితాలనుండే ఈ సమస్యలన్నీ పుట్టాయన్న సంగతి మనకి తెలియదు.
మేం మాట్లాడుతున్న సమయంలో లక్ష్మణ్ – నాన్‌సెన్స్ కవితలు, వాటికి బొమ్మలు వేసిన ఆంగ్ల కవిని ప్రస్తావించారు. కాని మా ఇద్దరికీ ఆ పేరు గుర్తుకు రాలేదు. కాసేపు ప్రయత్నించి కవితల్ని గురించి మాట్లాడుకున్నాము. ఆ రోజు రాత్రి నాకు కవి పేరు గుర్తుకు వచ్చింది.
అది ఎడ్వర్డ్ లియర్. మర్నాడు మేం ఇద్దరం కలిసినప్పుడు వచ్చిన మొదటి మాట ‘‘ఎడ్వర్డ్ లియర్’’ అని ఇద్దరం ఒక్కసారి అన్నాం. తర్వాత నవ్వులు.
ఆయన పూర్తిగా రిలాక్స్ అయితే చెప్పే విషయాలు ఎంతో ఆత్మీయంగా, ఫన్నీగా వుంటాయి. ఆయనకి జపనీస్ సినిమాలు అంటే ఇష్టం. ముఖ్యంగా అకీరా కురసోవా. ఆ సినిమాలలో ఎక్కువగా నటించే ప్రముఖ నటుడు తోషిరో మిఫునె కోపం వస్తే జపనీ్‌సలో ఎలా మాట్లాడేవాడో లక్ష్మణ్ మిమిక్ చేస్తే చూడటం ఓ అపురూపమైన అనుభవం. ఆ భాష జపనీస్ కాదు.. జపనీస్ లాంటి జిబరిష్. కాని, జపనీ్‌సలా అనిపించి మనకి ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది. ఆయన మిమిక్రీ అద్భుతం.
ఇంతకీ కామన్ మాన్ ఎవరు? ఈ ప్రశ్నని నేను లక్ష్మణ్‌ని అడిగాను.ఆయన ఎనిగ్మాటిక్‌గా నవ్వారు.
మళ్ళీ దగ్గరున్న కార్టూన్ పుస్తకాలను ఓ సారి తిరిగేస్తే తోచింది- లక్ష్మణ్ సృష్టించిన కామన్ మాన్, అతని భార్య కామన్ వుమన్- మన వూహా ప్రపంచంలో భాగాలైపోయారు. కామన్ మాన్ సమస్యలు నిజానికి మన అందరి సమస్యలు అన్న భావన కలిగించటంలో లక్ష్మణ్ ప్రతి దినమూ ప్రయత్నం చేసేవారు. కామన్ మాన్ అసహాయత, కామన్ వుమన్ మాటలలో వుండే వ్యంగ్యం, వెటకారం గిలిగింతలు కలిగిస్తాయి. లక్ష్మణ్ కార్టూన్లని చూసే ప్రతి మనిషికీ తన జీవితంలోని పలు సందర్భాలలో తారసపడే మనుషులూ, గతుకుల రోడ్లూ, త్రవ్వేసి మళ్ళీ రిపేర్ చేయని పట్టణాల వీధులూ, రాజకీయ నాయకుల తెలివితక్కువ తనం, వారి వివిధ కార్యక్రమాలూ, కష్టాలూ, కన్నీళ్ళూ… ఇవన్నీ ఇలాగే వుంటాయి, మనం భరించక తప్పదు సుమా అన్నట్లు. ఆ సందర్భాలలో హాస్యాన్ని ఆస్వాదించటం మినహా ఏం చేయాలో తోచని పరిస్థితి అది. అందుకే ఆ కార్టూన్లు సందర్భోచితంగా, టైమ్ లెస్‌గా ఎంతకాలం గడిచినా రెలెవెంట్‌గా వుంటాయి.
దానికి గల ముఖ్యకారణం కామన్ మాన్ మనమే కాబట్టి.
నేను… మీరు…. మీరు… మనం అందరం…. ఆ కార్టూన్లన్నీ మన మీదే…
లక్ష్మణ్ లేరన్న మాట తెలిశాక పూనె ఫోన్ చేసి కమలా లక్ష్మణ్‌తో మాట్లాడాను. ‘‘అంతా అయిపోయింది. నేను అలసిపోయాను’’ అన్నారు.
ధైర్యం చెప్పి పెట్టేశాను.
ఎదురుగా వున్నాయి- లక్ష్మణ్ పుస్తకాలు
టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఎంతో ప్రేమతో, ఎంతో ఆనందంగా ముద్రించిన లక్ష్మణ్ కార్టూన్ల నిధి.
అవి తరతరాలకూ ఆహ్లాదాన్నీ ఆలోచనలనీ కలిగించే గని.
మనం వాటిని చూస్తూ ఆనందిస్తే లక్ష్మణ్‌కి అది నివాళి.
ఎందరో రానున్న యువ కార్టూనిస్టులకి మార్గదర్శకత్వం ఇస్తాయని నా నమ్మకం.
థాంక్ యూ ఆర్కే లక్ష్మణ్!
కె. సదాశివరావు
9848034662