‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-5
22-నవ్యాంధ్ర వైభవం –శ్రీమతి ముదిగొండ సీతారావమ్మ –మచిలీపట్నం
సీ.-నవ్యాంధ్ర దేశాన సవ్యమౌ రీతిని –తెలుగు వెలుగ వలే తీరుగాను
విద్యావిధానమే వేయి వేల వెలుగులై –దివ్యమౌ వెలుగును దిశలయందు
భవ్య పాలకు లంత నవ్య రీతుల తొడ –సుపరిపాలన నీయ సోంపు గాను
కష్ట నష్టము లేక కలిగి సంతోషాన –తిండిగింజలు రైతు పండజేయు
తెలుగు తేజమ్ము వ్యాపించు దిశలయందు –నవనవోన్మేష సుందర నందనముగ
ఈ ఉగాది శుభము గూర్చు ఎల్లరకును –తెలుగు వారలు మది నిండు కలుగు వెలుగు .
మత్తకోకిల -వచ్చుగా ఇక మన్మదుండుమన వాంఛలన్ని నేర వేర్చగా –తెచ్చేగా ఇపుడు కొత్తభావములు తీరగా కలల సౌధముల్
యిచ్చెగా మనకు కొత్త రాష్ట్రమును ఎల్లజగము కీర్తిం చగా –హెచ్చుగా సుపరిపాలనంబు ఇక హేమకాలమే వచ్చుగా .
మత్తకోకిల –సింగపూరు గా మారు ఆంధ్రయే సేద తీరగ తెల్గులే – అంగ లార్చేడి రోజులన్నియు అపుడే కను మర్గులే
కుంగి పోయెడి జీవితంబుల కోర్కె లన్నియు తీరులే- మంగళారతి కూర్చవే నవ మన్మదుం డిక ఇచ్చులే .
మత్తకోకిల– వచ్చే నూతన వత్సరమ్మిదె,వంత ఏల కోయిలా ?-పిచ్చి పిచ్చగు ఊహలాపవే ప్రేమతోడుగ పాడవే
మెచ్చు నట్టివరాల పాటను మేలు గూర్చగ నేర్వవే –మచ్చ లేని మనో భావము మా మదిన్ కలిగి౦పవే
.
23-పాటల నీరాజనం –శ్రీమతి ఎస్ .ఉషా రాణి –పెదఓగిరాల
శాతవాహనులూ ఇక్ష్వాకులూ –విష్ణు కుండినులూ చాళుక్యులూ
నడచి వెళ్ళిన నేలమీద మరొక నవ్యాంధ్ర నెరజాణ నడచి వస్తోంది
కృష్ణా జల తరంగిణులతో చెమ్మగిల్లిన ఈ నేల
కూచిపూడి ఘలంఘలంలతో ఆమెను స్వాగతిస్తోంది .
విరామమెరుగని కళల బేహారి ఒకడు
వారం వారం సింగపూరు వెళ్లి కలల్ని గంపకెత్తుకొని
బెజవాడ వీధుల్లో అమ్మకం పెడుతున్నాడు
మనం కూడా గుప్పెడు కలల్ని కొనుక్కుందాం రండి
ఎందుకంటె కళలు గనలేని వాళ్ళూ
కాంక్షా మధువును చప్పరించ లేని వాళ్ళూ
నవ్యాంధ్ర కు శ్రీకారం చుట్టలేరు .
అయినా ఒక్క మాట
మన హృదయాల నవ్యాంధ్ర కవితా ఝరులను
పారింప వలసిన చోటు ఇదికాదేమో ?
ఎర్రంచు నల్ల దుప్పట్లు బుజాన వేసుకొని
నడివీదుల్లో నూ తోపుడు బండ్ల వెనకా
పొలం గట్ల మీదా ,గళం విప్పి కదం తోక్కండి
మిత్రులారా
వాళ్ళు పాటకి పట్టం కట్టి తమకు తాము కంచెలు వేసుకొన్నారు
మనం మాత్రం తక్కువా ?
పదునెక్కిన పాటతో అగ్గి రగిలించి కదలండి
తేటగీతుల్నీ ఆట వెలదుల్నీ అవతలకు పెట్టి
పాటల నెగళ్ళతో నవ్యాంధ్ర కు హారతు లివ్వండి
అప్పుడే మనం మోగించిన కంచు నగారా దిల్లీకి వినిపిస్తుంది .
నదులెండినా కను లెండని గడ్డమీద నిలిచి
అరాచకాన్ని పరాచికం గా చూపిస్తున్న పాలకుల
గుండెల్లోకి గురి చూసి ఎర్రటి పాటను బాకుల్లా దించండి
అదే నవ్యాంధ్ర కు మనమిచ్చే నిజమైన నీరాజనం .
24-నవ్యాంధ్ర ప్రదేశ్ –ఏ ఏం ఏం కుమార్ –విజయవాడ
తెలుగు భాష మాట్లాడే వారికోసం ఏర్పడ్డ విశాలాంధ్ర రాష్ట్రం
రాజకీయ కారణాలతో విడ గొట్ట బడింది రెండు రాష్ట్రాలుగా
తెలుగు జాతిని రెండుగా విభజించి వినోదం చూస్తున్నారు
అన్ని ఆదాయ వనరులున్న హైదరాబాద్ తెలంగాణాలో
వట్టి పోయిన గొడ్డులా ,బీడు పడ్డ భూమిలా
ఆదాయం ,రాజధాని లేని రాష్ట్రం నవ్యాంధ్ర ప్రదేశ్
పులిమీద పుట్రలా హుడు హూద్ తుఫాన్ అతలాకుతలం
అయినా ఆడారని బెదరని ఉక్కు సంకల్పం గల ఆంధ్రులం మనం
మొక్కవోని ధైర్యం తో ,చెదరని ఉక్కు సంకల్పం తో
చేబడతాం నవ్యాంధ్ర నిర్మాణం –సకల జనుల సంతృప్తిగా
అందరం ఒకటై కదులుదాం ,ప్రపంచాగ్రాన నిలబెడదాం
ఆంధ్రులంటే అభిమాన ధనులని ,అసహాయ శూరులని చాటుదాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15 –ఉయ్యూరు