నాదారి తీరు 97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర ఎన్నికలు వగైరా

— నాదారి తీరు

97-క్షేత్ర దర్శనం ,విహార యాత్ర  ఎన్నికలు వగైరా

చిలుకూరి వారి గూడెం దగ్గర  చండ్రగూడెం లో  మల్లె తోటలు ఉండేవి .ఉయ్యూరు వెళ్ళేటప్పుడు కొని తీసుకు వెళ్ళేవాడిని .చాలా సువాసనతో ఉండేవి  .ఇక్కడే శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ,దానికి అనుబంధంగా మంచినీటి కేంద్రం ఉన్నాయి .వాహన దారులకు బాట సారులకు అక్కడి బావిలోని చల్లని నీరు దాహంగా ఇచ్చేవారు. గొప్ప సేవాకార్యక్రమం .నీళ్ళు కొబ్బరి నీళ్ళు అంత తియ్యగా ,అంత చల్లగా ఉండటం ప్రత్యేకత .లారీలవాళ్ళు బస్సులవాళ్ళు దాతలు ఇచ్చిన విరాళాలతో దీన్ని నడుపుతున్నట్లు అర్ధమయింది .ఇక్కడి మల్లెపూలను ఉయ్యూరు లో మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో జరిగే శ్రీ హనుమజ్జయంతికి లెక్కలమాస్టారు శ్రీ పురుషోత్తమాచారి గారు చాలాశ్రమపడి తెచ్చి అందించేవారు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళేవారు .ఆచారిగారితోపాటు శేషగిరిరావు గారుకూడా ఒకటి రెండు సార్లు ఉయ్యూరుకు ,మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యం పొందిన జ్ఞాపకం .

జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ దర్శనం

చిన్నప్పటి నుంచి జమలాపురం కేశవరావు గారి గురించి ,వారి సేవానిరతి గురించి వింటూనే ఉన్నాను .ఆచార్లగారు శేషగిరిరావుగారు నన్ను ఒక సారి జమలాపురం తీసుకు వెళ్ళారు .శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది .లెక్కలమేస్టారికి అక్కడి పూజారులు అందరూ బాగా పరిచయమే .కనుక సరాసరి దర్శనానికి వెళ్లాం .అక్కడ వివాహాలు చేసుకొంటారు పుట్టు వెంట్రుకలు అక్షరాభ్యాసం అన్నప్రాసనలు లెక్కే లేదు. అందరికీ ప్రసాద వితరణ ఉంది .స్వామి విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది .కళ్యాణోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి .ఇది దాటితే మధిర వస్తుంది మధిర నుండి బస్ సర్వీస్ ఫ్రీక్వెంసి బాగా ఉంది

నెమలి శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం

ఒకశనివార౦  పుల్లూరులోనే ఉండిపోయి ,మర్నాడు ఆదివారం ఉదయం నేను లెక్కలమేస్టారు కలిసి ,రామచంద్రాపురం తోటపల్లి గంపలగూడెం మీదుగా నెమలి వెళ్లాం .నెమలి లో శ్రీ వేణుగోపాలస్వామి ప్రత్త్యేక ఆకర్షణ ఉన్న దైవం .కోరికలు తీరటానికి ఇక్కడ రాత్రి నిద్ర చేసి ఉదయం స్వామి దర్శనం చేస్తారు. వంటలు చేసుకొనే వీలు, గదులు ఉన్నాయి .నీతటి సౌకర్యం లేని ఆతిమెట్ట ప్రాంతం. జిల్లా పరిషత్ స్కూళ్ళలో నెమలి పనిష్ మెంట్  ఏరియా గా భావించేవాళ్ళం .దగ్గరలోనే ఊటు కూరు లో కూడా హై స్కూల్ ఉంది. శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి శాసనమండలి ఎన్నిక సమయం లో ఆయనతో పాటు ఈ ప్రాంతాలన్నీ కారులో తిరిగి ప్రచారం చేశాం .స్వామి నల్లరాతి వ్యత్యస్త పాదార వింద విగ్రహ రూపుడు .గొప్ప కళ కనిపిస్తుంది .ఇక్కడి స్వామి వారి కల్యాణానికి అనేక ప్రాంతాలనుండి భక్తజన సందోహం వస్తుంది .అర్చకులు ఉయ్యూరు వేదా౦తంవారికి బంధువులే .మా రచకులు వేదాంతం రామాచార్యులగారి కొడుకు దయాకర్ కు ఈ ఆలయ అర్చకస్వామి కుమార్తెనే ఇచ్చి వివాహం చేశారు .స్వామి దర్శనానందం తో మధ్యాహ్నానికి పుల్లూరు తిరిగి వచ్చి ఆచార్యుల గారింట భోజనం చేసిన గుర్తు .

ఇక్కడ పని చేస్తుండగానే ఎన్నికలు జరిగిన జ్ఞాపకం .ఒక చోట రిటర్నింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నప్పుడు మొదటి సారిగా శ్రీబోళ్ళ బుల్లిరామయ్య, శ్రీ గంటి మోహన చంద్ర బాల యోగి గార్లు బూత్ పరిశీలనకు రాగా చూసిన గుర్తు .

పంద్రాగస్ట్ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం .విపరీతమైన వర్షం  వచ్చింది .లోపలే వరండాలో కానిచ్చాం .పోటీలు నిర్వహించి ప్రైజులు అందజేశాం .జాతీయ గీతాలు నేర్పి పాడించాను .కమిటీ ప్రెసిడెంట్ గారు ముఖ్యఅతిధి .పిల్లలకు మైలవరం నుండి స్వీటు హాటు చాక్లెట్లు తెప్పించి ఇచ్చాం .టీచర్స్ కు టీ పార్టీ ఇచ్చాం. ఇక్కడ ఏదైనా చాలా ఘనంగా జరిగేది .అందరి సహకారం బాగా ఉండేది .

శ్రీ కృష్ణ దాసు గారి ఆతిధ్యం ,ప్రభావం

పుల్లూరు స్కూలు ఎలిమెంటరీ స్థాయి నుంచి హైస్కూల్ స్థాయికి ఎదిగి ఇప్పుడు ఇ౦త సర్వాంగ సుందరంగా ఉండటానికి ముఖ్య కారకులు శ్రీ వి .కృష్ణ దాసు గారు .వారిది గుడివాడ దగ్గర భూషణ గుళ్ల .ఇక్కడే చేరి పని చేసి అంచెలంచెలుగా స్కూల్ ను అభి వృద్ధి చేసి తానూ డిగ్రీ ,పోస్ట్ గ్రాడ్యుయేషన్ బి ఎడ్ లు సాధించి ఇంగ్లీష్ లో అసమాన పాండిత్యం పొంది అన్నీ వున్నా చాలా అణకువగా ఉన్న విశిష్ట వ్యక్తీ .కమిటీ వారికి తలలో నాలుక. శాఖా పరమైనది ఏది సాధించాలన్నా ఆయనే ముందు ఉండి సాధించి అభి వృద్ధి చేసేవారు .పీనల్ హెడ్మాస్టర్ వచ్చేవరకు ఆయనే అన్నీ ,రూల్స్ ,రేగ్యులేషన్లు కరతలామలకం .నేను బాగా పని చేస్తున్నాని తెలుసుకొని ఒక సారి స్కూల్ కు వచ్చి పలకరించి వారింట ఆతిధ్యం తీసుకోమని వినయంగా కోరారు. వారమ్మాయి సీత తొమ్మిది చదువుతోంది .ఇక్కడ వారి కాపురం చిలుకూరు వారి గూడెం లోనే . నేను వారింటికి భోజనానికి వెళ్లి నప్పుడు తల్లిగారు భార్యగారు స్వంత బందువు లాగా ఆప్యాయత కనబరచి చాలా మర్యాద చేశారు .దాసు గారటే మైలవరం ప్రాంతం లో తెలియని వారు లేరు .నేనంటే చాలా ఆత్మీయంగా ఉండేవారు .వారి తల్లి గారు స్వంత కొడుకులాగా ఆదరించారు వారి ఆతిధ్య మర్యాద మరుపుకు రాదు  .వీలున్నప్పుడు స్కూల్ కు వచ్చి పలకరించేవారు .వేసవి సెలవులలో వారబ్బాయి ఉపనయనం స్కూల్ లో చేయాలనుకొన్నానని చెబితే, జిల్లా పరిషత్ కు రాసి పర్మిషన్ తెప్పించాను .మేమిద్దరం ఉపనయనానికి ఉదయమే హాజరై వారి ఆతిధ్య మర్యాదలు పొందాము  మా ఇద్దరికీ నూతన వస్త్రాలు అందజేశారు .నేను చిలుకూరి వారి గూడెం వదిలాక వారికి నెమ్మది నెమ్మదిగా ప్రోమోషన్లు వచ్చి అంగలూరు డయట్ లెక్చరర్ అయి డిప్యూటీ డి.యి. ఓ. అయి పరీక్షల ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించి  రిటైర్ అయ్యారు .సుమారు ఏడెనిమిది ఏళ్ళ క్రితం  సాహితీ బంధువు పెద వోగిరాల వాసి మాకు అత్యంత ఆప్తులు కవి అందునా భక్తకవి అయిన శ్రీ ఓగిరాల సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి వివాహం లో బెజవాడలో దాసు గారు మళ్ళీ కనిపించారు .సహృదయం ,సంస్కారం, సౌజన్యం ,వినయం, నిక్కచ్చితన౦  మూర్తీభవించిన వారు శ్రీ కృష్ణ దాసు గారు  నవ్వుతూ చక్కని చతురోక్తులాడుతూ ,సాహిత్య మర్మాలు తెలియ జేస్తూ ఎలివేట్ చేసే గొప్ప సుగుణం వారిలో ఉంది .వారు నాకు పరిచయమవ్వటం నా అదృష్టంగా భావించాను వారి స్పూర్తి ప్రేరణ నా విద్యుక్త ధర్మానికి మంచి మార్గం చూపాయి .

నాగార్జున సాగర్ యాత్ర

లేక్కలమేస్టారు  ఇక్కడ ప్రతి ఏడాది ఏదో చోటుకు పిల్లలను యాత్రా సందర్శనానికి తీసుకొని వెళ్ళే అలవాటు ఉందని ఒక సారి నాతో అంటే ఈ ఏడాదీ వేద్దాం అని చెప్పి విద్యార్ధుల అభిప్రాయం పరిగణలో తీసుకొని నాగార్జున సాగర్ యాత్ర ఏర్పాటు చేశాం .సుమారు పదిహేను రోజులముందే నేనూ ఆచారిగారు కలిసి బెజవాడ వెళ్లి ఒక ప్రైవేట్ బస్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాం .విద్యార్ధుల వద్ద డబ్బు వసూలు చేయటం ఏర్పాట్లు వసతి అన్నీ లేకల మాస్టారు సైన్స్ మాస్టారు చూశారు.  వార్డెన్ రాఘవులుగారు   హాస్టల్ తరఫున భోజనం టిఫిన్ ఏర్పాట్లు చూస్తానని ముందుకొచ్చారు .అంతా రెడీ అయి ఒక రోజు రాత్రి 7 గంటలకు బయల్దేరటానికి నిర్ణయించుకొని విద్యార్ధినీ విద్యార్ధులను సాయంత్రం 5 గంటలకే స్కూల్ లో హాజరు కావాలని చెప్పాం .వాళ్ళందరూ వచ్చారు .కాని బస్ మిస్ .అనుకొన్న సమయానికి బస్సు రాలేదు .ఆచార్లుగారు ఫోన్లమీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు .ఇదిదగో అదుగో అని తెల్లవారు ఝామున అయిదింటికి బస్ వచ్చింది .బెటర్ లేట్ దాన్ నెవర్ సామెత  సార్ధకం చేస్తూ అందరం బస్సు ఎక్కాం .సుమారు అరడజను మంది టీచర్లు కూడా విద్యార్ధుల అవసరాలను తీర్చటానికి తీసుకొని ఉపాధ్యాయులందరికి ఉచితంగా తీసుకొని వెళ్ళే ఏర్పాటు చేశాం అంతా హాపీ .

కోదాడకు దగ్గర ఏటి ఒడ్డున బస్ ఆపి కాల కృత్యాలు తీర్చుకొనే అవకాశమిచ్చి కోదాడ హోటల్ లో టిఫిన్ చేయించి మళ్ళీ బయాల్దేరాం .సాయంత్రానికి నాగార్జున సాగర్ చేరాం రాత్రి అక్కడ ఒక స్కూల్లో బస ముందే ఏర్పాటు చేసుకొని వార్డెన్ గారు వండించిన భోజనం చేసి రాత్రి విశ్రమించాం .ఉదయం కార్యక్రమాలు కానిచ్చి వార్డెన్ గారి టిఫిన్ తిని కాఫీ తాగి సాగర్ డాం అంతా కాలినడక న తిరిగి ప్రతి విషయాన్ని అర్ధమయేట్లు వివరించి చెప్పి ఈపర్యటన  సఫలం చేశాం .తర్వాత విజయపురి  గెస్ట్ హౌస్ మ్యూజియం వగైరాలు చూపించి రాత్రి భోజనాలు చేసి బయల్దేరి మర్నాడు ఉదయం 10 గంటలకు చిలుకూరి వారి గూడెం చేరాం .విద్యార్ధులను తమ అనుభవాలను తెలియ జేయవలసినదిగా అసెంబ్లీ లో కోరి చెప్పించాం చాలా సంతృప్తి చెందారు అందరూ .దీని విజయానికి ముఖ్య కారకులు లెక్కల మాస్టారు పురుషోత్తమా చారిగారే నని సగర్వంగా తెలియ జేస్తాను ఇచ్చిన బాధ్యతా అ౦త పకడ్బందీ గా నిర్వ హించే సామర్ధ్యం ఆయనది  .

వార్షిక తనిఖీ

విజయవాడ జోన్ లో ఈ స్కూల్ ఉంది కనుక అక్కడి ఉపవిద్యా శాఖాధి కారి గారుశ్రీ సుగుణ భూషణ రావు గారు ? స్కూల్ ను తనిఖీ చేయటానికి వచ్చారు .ఆయన తూర్పు గోదావరి జిల్లావారు ..చలాకీ మనిషి .స్కూల్ లోనే వారికి వసతి సౌకర్యాలు కలగజేసి ,కాఫీ టిఫిన్లు నాకూ వారికీ లెక్కల మాస్టారి ఇంటి నుంచే తెప్పించే ఏర్పాటు చేశాం. ఆచారి గారి భార్య గారు తల్లిగారు ఈ బాధ్యత తీసుకోవటం లో పరమాన౦ద పడ్డారు .స్కూల్ రికార్డ్ లన్నీ పకడ్బందీ గానే ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు .అన్ని క్లాసుల ,అన్ని సబ్జెక్ట్ ల తనిఖీకి చుట్టు ప్రక్కల స్కూళ్ళ సీనియర్ ఉపాధ్యాయులను పానెల్ ఇన్స్పెక్టర్లు గా ఆహ్వానించాము .ఏర్పాట్లన్నీ ఘనంగా చేశాం .గంటకో సారి కాఫీ లేక టీ .తనిఖీకి ముందు టిఫిన్ ఏర్పాటు అన్నీ పెళ్లి తంతు లాగా నడిపాం .ఆఫీసర్ గారు ,గుమాస్తా ఖుషీ ఖుషీ .వారిద్దరికీ’’ తాంబూలాలు’’ఇచ్చి మర్యాదా చేశాం .తనిఖీ  రెండు రోజులు చేశారు .రెండు రోజులూ ఇదే విధానం .మొదటి రోజు మధ్యాహ్నం లంచ్ ,రెండవ రోజు సాయంత్రం డిన్నర్ షడ్రసోపేతంగా ఆచారిగారి ఇంటి నుండే కమ కమ్మగా వండి పంపారు. లొట్టలేసుకొంటూ అందరం తిన్నాం  .స్టాఫ్ మీటింగ్ లో ఉపవిద్యాశాఖాదికారిగారు నన్నూ స్కూల్ ను స్టాఫ్ ను బాగా మెచ్చుకొన్నారు. విద్యార్ధుల ప్రవర్తనకు ముగ్ధులయ్యారు .చాలామంచి రిమార్క్ లు రాశారు. లాగ్ బుక్ లో విజిట్ బుక్ లో ఘనంగా పొగిడారు. మా స్కూలు అందరికీ అన్ని విషయాలలో ఆదర్శంగా ఉందన్నారు .  తాను  చాల చాలా సంతృప్తి చెందానని చెప్పారు . .ఈ ఇన్స్పెక్షన్ సక్సెస్ కావటానికి స్టాఫ్ నాకిచ్చిన తోడ్పాటు ,విద్యార్ధుల ప్రవర్తన యెంత ముఖ్యమైనవిగా ఉన్నాయో ఆచార్యుల గారింటి ఆతిధ్యం అంతకంటే గొప్పగా ఉంది చెప్పక తప్పదు.లెక్కల మాస్టారు ఈ ఖర్చు అంతా తానే భరిస్తానని ముందే నాకు చెప్పారు .అలాకుదరాదని మొత్తం ఖర్చు ఎంతో లెక్కరాయమని చెప్పి ,జీతం ప్రకారం వాటా వేసి మొత్తం వసూలు చేయించి ఆచారిగారికి ఇప్పించా .ఆయన కూడా కాదన లేక పోయారు . నేను అక్కడి నుంచి వచ్చాక లేక్కలమేస్టారు ఆయనతో సాన్నిహిత్యాన్ని బాగా పెంచుకొన్నారు .తర్వాత ఈ అదికారిగారు బందరులో స్పాట్ వాల్యుయేషన్ లో అసిస్టంట్ కాంప్ ఆఫీసర్ గా ఉండాగా కలిశాను .ఆ రోజుల్ని బాగా గుర్తుకు తెచ్చుకొన్నారు .

రోజూ పసందైన విందు

ఈ తనిఖీ విందు అందరిలో ఆనందాన్ని నూతన ఉత్సాహాన్ని కలిగించింది .ఒక సారి నేను ఒక సోమవారం ఉదయమే ఉయ్యూరు లో గారెలు , ,చక్కర పొంగలి  పులిహోర , మా శ్రీమతితో చేయించి  ఉయ్యూరు అరటిపళ్ళు కూడా తీసుకొని కాన్ ల నిండా పెట్టించుకొని అంచెలంచెల మీద స్కూల్ కు సమయానికి చేరి ,ఎవరికీ తెలియ జేయకుండా మధ్యాహ్నం స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పి ,అందరికీ ఉయ్యూరు నుంచి తెచ్చిన పదార్ధాలు వడ్డింప జేసి టీ కూడా తెప్పించాను అందరూ మహా రుచికరంగా ఉన్నాయని ఎంతో సంతోషంగా తిని ధన్యవాదాలు చెప్పారు. బహుశా ఆరోజు మా పెళ్లి రోజేమో జ్ఞాపకం లేదు .ఇది ప్రేరణ కలిపించింది అందరికి. ఇలాంటి వాటిలో ముందుండే శేషగిరిరావు అనే సెకండరీ గ్రేడ్ మాస్టారు ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఇంతకంటే ఎక్కువ ఐటమ్స్ వండించి విందు చేశారు .తర్వాత లెక్కలమాస్టారు .ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వార్డెన్ రాఘవులుగారు కూడా  తమ బాధ్యతగా తీసుకొని రోజు పసందైన విందు చేస్తూ తాము వెనక బడలేదని నిరూపించుకొన్నారు .ఇట్లా చాలా హుషారుగా  జాలీగా హేపీగాఒక నెల రోజులు విందే విందు గా  కాలం దొర్లి పోయింది చిలుకూరి వారి గూడెం లో .

Inline image 1  Inline image 2Inline image 3

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-20-8-16-కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.