బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు
గబ్బిట వారు సంగీత ,సాహిత్య రంగాలలో నిష్ణాతులు .శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఒక సారి నాతో ‘’మీకు గబ్బిట దక్షిణ మూర్తిగారు తెలుసా ?’’అని అడిగితె నేను నోరు వెళ్ళ బెట్టాను .అప్పుడు ఆయనే చెప్పారు దక్షిణామూర్తిగారు మహా గొప్ప సంగీత విద్వాంసులు అని . అలాగే గబ్బిట వెంకటరావు గారు మా జ్ఞాతి అని మా మామ్మా నాన్న చెప్పే వారు కాని వారి గురించీ నాకు తెలియదు .మా మేనమామ గుండు గంగయ్యగారి పెద్దబ్బాయి పద్మనాభానికి గబ్బిట వెంకటరావు గారి భార్య చెల్లెలు శ్రీమతి వెంకట లక్ష్మి నిచ్చి ఆకిరిపల్లి లో వివాహం చేసినప్పుడు వారిని చూశాను. అంతకు ముందు మా చిన్నతనం లో మా ఇంటికి ఆయన వచ్చేవారని అమ్మా నాన్న చెప్పేవారు . తర్వాత ఆయన భార్య చనిపోయినప్పుడు ఆకిరిపల్లిలో కార్యక్రమం చేస్తే వెళ్లాం అప్పుడు చూశాను .2008 లో బాపు గారిని మద్రాస్ లో వారి౦టి వద్ద మా మైనేనిగారి పరిచయం తో వెళ్లి సందర్శించాం .అక్కడే ఉన్న ముళ్ళపూడి రమణ గారి పరిచయమూ కలిగింది .వారిద్దరూ చూపిన ఆప్యాయత మర్చిపోలేనిది .అప్పుడు బాపుగారు నన్ను ‘’మీకు వెంకట రావు గారు తెలుసా ?’’అని అడిగితే మా బంధుత్వం చెప్పాను. ఆయన ఎంతో సంబర పడి ‘’తెలుగు పద్యం రాయాలంటే వెంకట రావు గారే రాయాలి ‘’అంతబాగా రాస్తారు నాకు నచ్చిన ,నేను మెచ్చిన కవి అన్నారు .‘’మహదానందం వేసింది .అలాంటి వెంకటరావు గారి అమ్మాయి వివాహం బెజవాడలో జరిగితే మాకు ఆహ్వానం వస్తే వెళ్ళాము .అదే చివరి సారి ఆయన్ను చూడటం .వాళ్ళబ్బాయి మధు తో మంచి పరిచయం ఉంది.మేము మద్రాస్ వెడితే వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చేవాళ్ళం .వాళ్ళు ఉయ్యూరు వస్తే తప్పక మా ఇంటికి వచ్చేవాళ్ళు. మధు కుమారుని వివాహం రెండేళ్ళ క్రితం బెజవాడలో చేస్తే వెళ్లాం .మంచి ఆప్యాయతను ఆతను,అతని సోదరులూ చూపారు .
అలాగే శ్రీ డా.గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖ ప్రొఫెసర్. వారబ్బాయి శ్రీ డా.జయ మాణిక్య శాస్త్రి ఒరిస్సాలోని జగన్నాధ సంస్కృత విశ్వ విద్యాలయం లో న్యాయ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ .చివరి అబ్బాయి శ్రీ డా.నివాస శాస్త్రి వారణాసిలో స్మార్తం లో దిట్ట సంస్కృత గ్రంధ రచయిత ఈ కుటుంబం పామర్రుదగ్గర ఎలమర్రు గ్రామానికి చెందినవారు .వీరిని డిసెంబర్ 4 న ‘’గీర్వాణకవుల కవితా గీర్వాణం ‘’రెండవభాగం ఆవిష్కరణకు ఉయ్యూరు కు ఆహ్వానించగా అందర్నీ చూసే అదృష్టం కలిగింది . వీరందరి గురించి ఎవరో ఒకరు రాయక పొతే ఈ తరానికి తెలియదు .నా తపన అంతా దానికోసమే ‘.
గబ్బిట వెంకటరావు గారు ఫోర్త్ ఫాం చదివుతున్నప్పుడే’’ హనుమద్రామ సంగ్రామం ‘’నాటకం రాశారట .సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కదా ,పాటలు సంభాషణలు పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .అప్పటికే చాలా నాటకాలు నాటికలు రాసి సుప్రసిద్దులయ్యారు .అందులో అల్లూరి సీతారామ రాజు ,మనోహర ,వరూధిని ప్రసిద్ధి చెందాయి .వెంకట రావు గారు 15-3-1928న శ్రీ గబ్బిట దక్షిణామూర్తి, శ్రీమతిలక్ష్మీ నరసమ్మ దంపతులకు .పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు .కృష్ణా జిల్లా ఆకిరిపల్లి లో శ్రీ చల్లా శ్రీరాములు శ్రీమతి పేరమ్మ దంపతుల కుమార్తె శ్రీమతి అన్నపూర్ణమ్మ ను వివాహమాడారు .సీనియర్ సముద్రాల ,జగ్గయ్యల ప్రేరణతో సినీ రంగ ప్రవేశం చేసి బాపుగారి దృష్టిలో పడి ఆయన కోరికపై శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రానికి కదా మాటలు పాటలు పద్యాలుస్క్రీన్ ప్లే రాసి బాపు ను మెప్పించారు . సీతా కల్యాణం ,సంపూర్ణ రామాయణం లకు కూడా గబ్బిట వారి రచన తోడ్పడింది. ఎన్టి రామారావు నటించిన బొబ్బిలి యుద్ధం మాయా మశ్చీంద్ర చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు .బి ఏ సుబ్బారావు దర్శకత్వం చేసిన మోహినీ భాస్మాసురకూ సంభాషణలు రాశారు .విష్ణుమాయ ,భలే మోసగాడు చిత్రాలు చేశారు .కన్నడం లో శ్రీ చాము౦డేశ్వరి మహిమ ,రాజనర్తకి రహస్యనిర్మించారు ., ఒరియా భాషలో సి ఎస్ రావు డైరెక్ట్ చేసిన చిత్రం సత్య హరిశ్చంద్ర నూ నిర్మించారు ,ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు .మళయాళ చిత్రం ను కొండవీటి మొనగాడు గా డబ్ చేశారు .భక్త అంబరీష మాటలు సమకూర్చారు
వెంకటరావు గారికి మధుమోహన్ ,ఉమకుమార్ శేషాద్రి ,సాయినాద్,లక్ష్మీ ప్రసన్న దక్షిణా మూర్తికుమారులు . కుమార్తె గౌరీ విజయ లక్ష్మి .ఇంటి పేరుతో సహా వెండి తెర పై రచయితగా వెలుగొందిన గబ్బిట వెంకటరావు .కళామతల్లి ముద్దు బిడ్డ .శ్రీ వెంకటరావు గారు శ్రీమద్భగవద్గీత లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్యం రచించి శ్రీ సుసర్ల దక్షిణా మూర్తిగారి చే,స్వర కల్పన చేయించి, శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారి చే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేసి రికార్డ్ నెలకొల్పారు .దీనితో సినిమా తీయాలని ఆయన సంకల్పం .ఇంతటి పూర్ణ ప్రజ్నులైన శ్రీ గబ్బిట వెంకటరావు గారు 11-10-1997 న 69 వ ఏట మద్రాస్ లో పరమ పదించారు.
శ్రీ గబ్బిట వెంకటరావు గారి కుటుంబ చిత్రాన్ని జత చేశాను చూడండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-12-2-17 –ఉయ్యూరు