బందరు గురు మహారాజ్ –శ్రీ పేర్నేటి గంగాధర రావు గారు
నేను అడ్డాడ హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు శ్రీ పేర్నేటిగంగాధరరావు గారు పామర్రుకు నాలుగు కిలోమీటర్ల దూరం అవనిగడ్డ దారిలో మెయిన్ రోడ్డుకు ఎడం వైపు కొంచెం దూరం లో ఉన్న జమీ దగ్గుమిల్లి హెడ్ మాస్టర్ గా ఉన్నారు .ఆయనకు ముందు అక్కడ శ్రీ అ౦జయ్యగారు హెచ్.ఎం .ఇద్దరూ నాకు ఆత్మీయ మిత్రులే .గంగాధరరావుగారిది బందరు ,అ౦జయ్యగారిది చినముత్తేవిదగ్గర కారకం పాడు గ్రామం మోతుబరి రైతు కూడా . .అ౦జయ్యగారు లెక్కల మేష్టారు .రావు గారు సోషల్ .
గంగాధర రావు గారు బహు సౌమ్యులు .అతి సాధారణంగా ఉంటారు .మొహమాటస్తులు .విధినిర్వహణలో అత్యంత చురుకు .గ్రామస్తుల సాయం తో దగ్గుమిల్లి హైస్కూల్ అభి వృద్ధికి చాలా కృషి చేశారు .ఆయనంటే గ్రామస్తులకు విపరీతమైన అభిమానం .అంజయ్య ,రావు గార్లకు ముందు అక్కడ పని చేస్సిన హెడ్ లందరూ కాలం దొర్లించుకు వెళ్ళినవారే కాని విద్యార్ధుల విషయం లో స్కూల్ అభివృద్ధి విషయం లో అస్సలు పట్టించుకోలేదు .కనుక ఆస్కూల్ ఒక పనిష్మెంట్ స్కూలనే అభిప్రాయం ఉండేది .అ౦జయ్యగారు కొంత చక్కబరిస్తే రావు గారు దాన్ని కొనసాగించి దగ్గుమిల్లి స్కూల్ ను ఆదర్శ వంతంగా తీర్చి దిద్దారు .వనరుల సదుపాయం కలిగించారు .ఆస్కూల్ లో పని చేయాలనే కాంక్ష ఉపాధ్యాయులలో తెచ్చారు .వీరిద్దరి వలన ఆ స్కూల్ సర్వతోముఖాభి వృద్ధి చెందింది .అడ్డాడ హై స్కూల్ లో జరిగే ప్రతికార్యక్రమానికి వారు వారి స్టాఫ్ వస్తే ,అక్కడ జరిగేవాటికి నేనూ నాస్టాఫ్ తప్పక వెళ్ళేవాళ్ళం .కనుక మా స్కూళ్ళకు ఆత్మీయ బంధుత్వం ఏర్పడింది .అ౦జయ్యగారి రిటైర్మెంట్ ను ,ఉపాధ్యాయ విద్యార్ధి బృందం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. అలాగే రావు గారి పదవీ విరమణనూ చిరస్మరణీయంగా చేసి ఋణం తీర్చుకున్నారు .అ౦జయ్యగారు సరదామనిషి జోకులు పేలుస్తూ మాట్లాడితే రావుగారు గారు పరమ ప్రశా౦త మూర్తిగా ఉండేవారు .
గంగాధరరావు గారికి సాహిత్య ప్రవేశం బాగా ఉంది .ఎప్పుడూ ఏదో ఒక ఉపయుక్త గ్రంథం రాసి ప్రచురించేవారు .రిటైరయ్యాక ఈ వ్యాపకం బాగా హెచ్చి జీవితాన్ని సార్ధకం చేసుకొంటున్నారు .వారి పుస్తకాలు నాకు పంపిస్తే మన సరసభారతి పుస్తకాలు వారికి పంపటం ఆ నాటి నుంచి అలవాటు .వారు చేతలమనిషే తప్పమాటల వారుకాదు .పనియే దైవం అని భావించే వారు .దగ్గుమిల్లి కి రాకపూర్వం నుంచి పరిచయమున్నా ,అక్కడికి వచ్చాక మరీ దగ్గరయ్యాం .నాకు నచ్చిన స్నేహితులాయన .ఆయ సద్గుణాల పోగు .నెమ్మదిగా సూటిగా మాట్లాడటం ఆయన నైజం .బ్రహ్మ కుమారీ సమాజం పై వారికి మక్కువ ఎక్కువ .రాజస్థాన్ లోని మౌంట్ యాబు పై జరిగే కార్యక్రమాలకు క్రమ౦ తప్పకుండా వెళ్ళేవారు .కనిపించినప్పుడు ఆ విశేషాలు తెలిపెవారు .నాకూ వెళ్ళాలనే ఉ౦డేదికాని ఎప్పుడూ సాహసించలేదు .ఆసమాజంపై నాకు అవగాహనా లేక పోవటం ఒక కారణం .రిటైరయ్యాక బందరులో సెటిల్ అయి స్వగృహం ఏర్పరచుకొని తమ ఆధ్యాత్మిక ,సాహితీ వ్యాసంగాన్ని కొన సాగిస్తున్నారు . పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాసి ప్రచురిస్తున్నారు. అవి సమాజానికి ,వ్యక్తి వికాసానికి ఆధ్యాత్మిక వికసనానికి దోహద పడేవి .
ఈ నెల 10 వ తేదీ శుక్రవారం గంగాధరరావు గారు తాజాగా పంపిన 1-వజ్రకాయం (మూలకణ౦ )అనే యోగరహస్యాల పుస్తకం 2-శ్రీ లలితా సహస్రనామాలకు స్వర్గీయ శ్రీ మల్లాప్రగడ శ్రీ రంగారావు గారి వ్యాఖ్యానానికి రావు గారు రాసిన సులభ వ్యాఖ్యానం అందాయి .ఈ పుస్తకాల పేర్లు వింటేనే వారిలోని దివ్యత్వం ,ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం గోచరమౌతాయి .బందరు ఆధ్యాత్మిక గురు మహారాజ్ గా నాకు వారు కనిపిస్తారు .ఎప్పుడూ తెల్లని పైజమా లాల్చీతో, పైన శాలువాతో స్వచ్చతకు స్వచ్చం గా ఉంటారు .వాల్మీకి, వ్యాసుల లాగా పొడవైన గుబురు తెల్ల గడ్డం తో దర్శన మిస్తారు .కనుక వారిని గురుమహరాజ్ అన్నాను .
ఒక్కసారి వారు రాసిన గ్రందాల వివరాలు తెలుసుకొని వారి విద్వత్ ఎట్టిదో గ్రహిద్దాం .1-ఆత్మ దర్శనం 3భాగాలుగా రాశారు. రెండవ దానికి ఆత్మిక విజ్ఞాన శాస్త్రం అని మూడవ భాగానికి మృత్యుంజయుడు అని సార్ధక నామకరణం చేశారు .అత్యంత గహనమైన విషయాలను అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు సరళ సులభంగా సాగిన ఆధ్యాత్మిక త్రివేణి ఇది .4 క్షీర సాగర మధనం 5 కామవేదం ముక్తికి మార్గం 6-ఆధ్యాత్మిక రత్నాలు 7-మోడల్ పార్లమెంట్ 8-Think it over HOW to become Success ful in Life 9-అష్టోత్తర శత సుందరకాండ 10-యోగ వాసిస్టసారం –వచనం 11-ఆరోగ్య సూత్రాలు –యోగ మార్గాలు 12-సర్వ యోగ సమన్వయము మరియు సీక్రెట్ డాక్ట్రిన్13-బ్రహ్మ జ్ఞానము (దృక్కు దృశ్యము వివేకము )14-వివేక చూడామణి 15-ఫేస్ బుక్ (యోగ సారం ).పైన చెప్పిన రెండిటితో కలిపి 17 అపూర్వ గ్రంథాలు రాశారన్నమాట .
ఇలాంటి గ్రంథాలు రాయాలంటే యెంత ఆలోచన ,పరిశీలన పరిశోధన ,అనుసరణ ,అభిరుచి అనుభవం, కావాలో మనకు అర్ధమౌతుంది .ఇదంతా ఆ గంగాధరుని జ్ఞాన ‘’గంగ’’ అని పిస్తుంది నాకు .అలాంటి ‘’మనీషి’’ బందరులో ఉన్నారంటే ఆ పురజనుల భాగ్యమే భాగ్యం .ఆయన తన పనేదో తాను చేసుకొంటూ పోయేమనీషి .డాబు ,దర్ప౦ ,పటాటోపం ఎక్స్పోజింగ్ లేని వారు . సాహిత్య సభలకు తప్పక హాజరౌతారు శ్రద్ధగా వింటారు .స్టేజి పైకి ఎప్పుడూ రాగా నేను చూడలేదు .వారి విద్వత్తు అక్కడి వారు గ్రహించారో లేదో నాకు తెలియదు .వారిని పిలిచి ఎక్కడా సన్మానించిన దాఖలాలు నాకు పేపర్ ద్వారా తెలియదు .చేసి ఉంటె సంతోషం .చేయకపోతే ప్రయత్నించమని కోరిక .ఇంతటి సౌజన్య సహృదయ మూర్తి నాకు పరమ ఆత్మీయ మిత్రులైనారంటే అది నా అదృష్టంగా భావిస్తూ ,వారు మంచి ఆరోగ్యం తో మరిన్ని గ్రంథ రచనలు చేయమని కోరుతున్నాను .వారిని పరిచయం చేసే భాగ్యం కలిగినందుకు గర్విస్తున్నాను .
శ్రావణ మాస శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్