ఈ అధునాతన 21 వ శతాబ్ది లో కూడా గాంధీజీ ని స్మరించాల్సిన ఔచిత్యం ఉన్నదా ?-2
మహాత్ముని ఆధ్వర్యం లో జరిగిన స్వాతంత్ర్య పోరాట ఫలితంగా మనకు బ్రిటిష్ దాస్యం నుండి విముక్తికలిగి 1947 ఆగస్ట్ 15 స్వాతంత్ర్యం లభించింది .దీనితో భారతదేశం లోని మధ్యతరగతి వారికి పాలనా భాగ్యం కలిగింది .స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిన కాంగ్రెస్ కేంద్రం లో అధికార పగ్గాలు చేబట్టి౦ది .పరిపాలనలో వచ్చిన మార్పు పై అంతస్తులోనే జరిగింది తప్ప, ,క్రింది తరగతి ప్రజల ఆర్ధిక సాంఘికవ్యవస్థలో గణనీయ మైన మార్పు రాలేదు .చేతిలో ఖడ్గం పట్టిన వారు మారారు కాని ,దిగువ వర్గాల సామాన్యప్రజల జీవన పరిస్థితులలో మార్పు మాత్ర౦, రాలేదు .కాని వారి అదృష్టాన్ని మార్చే అవకాశమున్న జాతీయ ప్రభుత్వం ఏర్పడింది ఇదొక్కటే ఊరట . సామాన్య ప్రజలు కొత్త జాతీయ నాయకత్వాన్ని గట్టిగా నమ్మారు .తమ ,దేశ స్వాతంత్ర్యం కోసం శ్రమించి ,సిద్ధి౦పజేసిన ఈ నాయకులు ,ఇప్పుడు తమ ఆర్ధిక సామాజికాభివృద్ధికోసం అహరహం కృషి చేస్తారని విశ్వసించారు .దేశ విభజన తర్వాత జరిగిన హింస తప్ప ,భారత దేశం స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ పాలకులనుండి చాలా ప్రశాంతంగా,సులంభంగా సరళంగా నే పొంది విదేశీ పాలన నుండి స్వదేశీ పాలన సాధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు . దురదృష్ట వశాత్తు పాలనా పరమైన ఈ మార్పు సాంఘిక విప్లవానికి ఉత్రేరణ కాలేక పోయింది .కాలనీ వాసుల కబంధ హస్తాలనుండి విడివడిన స్వతంత్ర భారత దేశం, సర్వ శక్తి యుక్తులు ధారపోసి ఎంతో శ్రమిస్తేనే సంపూర్ణ సామాజిక ఆర్ధిక మార్పులు సాధించటానికి అర్ధ శతాబ్ది కి పైగా సుదీర్ఘ కాలం పట్టింది .ఇప్పుడిప్పుడే అట్టడుగున కొద్దిగా మార్పులు చిగురులు వేస్తూ కనిపిస్తున్నాయి .
ఇవాల్టి ప్రపంచం లో పర్యావరణ పరిరక్షణ పెద్ద సవాలుగా నిలిచింది .అభి వృద్ధి చెందినా ,చెందుతున్న దేశాలన్నీ ఈసమస్య పైనే దృష్టి పెట్టాయి .ఇప్పుడే కళ్ళు తెరిచిన వారందరికీ ,ఒక విషయం తెలియదు .దాదాపు వందేళ్ళ క్రితమే గాంధీజీ దీనిపై ఎన్నో వ్యాసాలు రాశాడు .అయినా ఇప్పటికీ అకాడెమిక్ క్షేత్రం లో ‘’గాంధీ ఇంకా అవసరమా ,ఆయన స్మరణ ఔచిత్యమా ?’’ అనే ప్రశ్న వినిపిస్తోంది.మహాత్ముడు రాసిన వ్యాసాలు , ఉత్తరాలు, చేసిన ప్రసంగాలు పరిశీలిస్తే బాపు కు ఎంతటి దూర దృష్టి ఉందో అర్ధమై ,ఆశ్చర్యపోతాం .అనేక సందర్భాలలో గాంధీజీ జల, వాయు కాలుష్యాలు ,రోగాలు, ఆరోగ్యం ,వృక్ష రక్షణ ,చెత్త రీ సైక్లింగ్ విషయయాలు ప్రస్తావించాడు . నదులలోకి వ్యర్ధపదార్ధాలను విడుదల చేయటం పై ఆందోళన చెంది, వాటివలన స్వచ్చమైన నదీ జలం కల్మషమై ,అంటు వ్యాధులు ప్రబలి ప్రజారోగ్యం దెబ్బ తింటుందని పదేపదే చెప్పాడు .ఈ ‘’వ్యర్ధాలు అనర్ధాలకు నిధి’’ అని బాధపడ్డాడు .వీటినన్నిటినీ అధిగమిస్తూ జాతీయ ఆదాయం పెంచుకొంటూ ,ఆర్ధిక సంక్షేమం కోసం రెండు దశాబ్దాల క్రిందటమాత్రమే ముందడుగులు పడ్డాయి , సాధించాల్సింది చాలాఉంది .కనుక గాంధీ గొప్ప ‘విజనరీ’’ అని అర్ధమౌతోంది .
ఎన్నో శతాబ్దాల నుండి భారత దేశం ప్రపంచ౦ లో ముఖ్య ఆకర్షణ కేంద్రంగా ఉన్నది .భారతీయ విజ్ఞానం ,ఆధ్యాత్మికత, సంస్కృతీ ,నైతిక విలువలు ,సౌభాగ్యం ,ప్రజాజీవన విధానమైన నాగరకత ప్రపంచ దేశాలపై గొప్ప ప్రభావం కలిగించి చెరగని ముద్ర వేశాయి..మహాత్ముడు అహింసకు కొత్త అర్ధాన్నీ ,పరమార్దాన్నీ చెప్పాడు .అత్యున్నతమైన సాధారణ, శాశ్వత విలువలను ఆచరించి మార్గ దర్శనం చేశాడు .ఆయన జీవితకాలం లో మహాత్ముడు భారతీయ సంస్కృతికి, ఆత్మకు అసలైన ప్రతీకగా, కేంద్రంగా నిలిచాడు .పరస్పర సహకారం , అభివృద్ధి లో అందరిసహకారం ,అందరి ఐక్యత, అవతలివారి విశ్వాసాలపట్ల గౌరవం అన్నీ కలిస్తే గాంధీ ఫిలాసఫీ .ఆధునిక కార్పోరేట్ వ్యవస్థ లో ఒంటరి తనానికి చోటు లేదు .సమస్టి విధానమే శ్రేష్టం . ఎవరు ఉత్పత్తి చేసే వస్తువులు వారికే కాదు ,ఉత్పత్తిలో భాగస్వామ్యం లేకపోయినా ప్రపంచ ప్రజల౦ద రివి. ఒక వ్యవస్థ ,సంస్థ విజయం సమాజం ఆమోదం ,అనుమతి పైనే ఆధారపడి ఉంటుంది .సమాజం ఆమోదించని ఏ వ్యాపారమూ మనుగడ సాగించలేదు .వ్యాపారానికి ,సమాజానికి ఆరోగ్య పూర్వక అనుబంధం ఉండాలి .సమాజానికి నష్టం కలిగించే ,వారి మనోబావాలను దెబ్బతీసే వ్యాపారం ఏదీ నిలబడదు నిలబడ నివ్వ రాదుకూడా . విలువలు కూడా వ్యాపార, వాణిజ్యాలలో ముఖ్య పాత్ర వహిస్తాయి .బాపు ప్రవచించింది గుణాలైన ఈ విలువలనే . కనుక వీటికి కాల దోషం పట్టదుకదా .
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ఈ చిరు ధారావాహిక
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-18 –ఉయ్యూరు

