గౌతమీ మాహాత్మ్యం-4
అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు
నారదమహర్షి బ్రహ్మ దేవుని గంగ ఎలా భూలోకం చేరిందో వివరించమని కోరగా ఆయన’’శివుని జటలో ఉన్న గంగను గౌతమహర్షి ,భగీరధుడు అనే మహారాజు శివుని ఆరాధించి భూమిమీదకు తెచ్చారు .ఇలా ఇద్దరి ప్రయత్నాలవలన గంగ రెండు రూపాలుగా భూమిని చేరింది .శివ పార్వతీ కళ్యాణం తర్వాత గంగాదేవి కూడా ఆయన జటాజూటం చేరింది .ఉమామహేశ్వర శృంగార రస ప్రవృత్తిలో శివుడు రసము అంటే గంగను సృష్టించాడు .ఈమెపైనే అధికప్రేమభావం చూపాడు .చివరకు తన జటాజూటం లో గంగను దాచిపెట్టాడు .ఇది తెలిసిన ఉమాదేవి సహించలేక పోయింది .ఎన్నోసార్లు గంగను వదిలెయ్యమని కోరింది .ఆయన ఆపని చేయలేదు వినాయకుడు భార్య జయ , స్కందులతో సంప్రదించి పార్వతి ,వినాయకుడితో శివుడు ఎవరిమాటా వినటం లేదు కనుక తాను మళ్ళీ హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తాను ,లేకపోతె పవిత్ర విప్రుడు ఎవరైనా గంగను బయటికి పంపే మార్గం చేయాలి అన్నది .
ఇంతలో భూలోకం లో 22ఏళ్ళు అనావృస్టి కలిగి ,గౌతమమహర్షి ఆశ్రమం తప్ప అంతా కరువుకోరల్లో నలిగి పోయింది .దీనికొక కారణం ఉంది .పూర్వం బ్రహ్మ దేవ యజనం అనే పర్వతం పై యజ్ఞం చేశాడు . అందుకే దీన్ని ‘’బ్రహ్మ గిరి ‘’అంటారు .ఇక్కడే గౌతమమహర్షి ఉండేవాడు .మహా శక్తివంతుడైన ఆయన ఆశ్రమ వద్ద ఆధి వ్యాధులు,దుర్భిక్షం అనావృస్టి భయ శోకాలు ,దారిద్ర్యం ఉండవు .అందుకే అందరూ ఇక్కడికే చేరారు .ఆయన పితరులకు పిండప్రదానం చేస్తే ,దేవతలగూర్చి యజ్ఞాలు చేస్తే పితృదేవతలు దేవతలు స్వీకరించి తృప్తి చెందేవారు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన మునులు కూడా ఆయనను తండ్రిలాగా గౌరవించి సేవించేవారు .ఇక్కడే ఓషధులు కూడా ఆరాది౦పబడి చక్కగా వృద్ధి చెందాయి . .త్రిమూర్తులను ఆయన పూజించేవాడు .గౌతమఖ్యాతి ముల్లోకాలకు ప్రాకింది .
ఈ విషయాన్ని తల్లికి గణేశుడు వివరించి శివుని గంగను వదిలేసేట్లు గౌతముడు చేయగలడని నమ్మకంగా చెప్పి ,సోదరుడు, భార్య తోకలిసి విఘ్నేశ్వరుడు విప్ర వేషాలలో గౌతమ ఆశ్రమం చేరి కొన్ని రోజులు అక్కడ ఆతిధ్యం పొంది కొంతకాలం తర్వాత అక్కడి మునులతో ఇప్పటికే చాలాకాలంగా ఇక్కడ ఉన్నాం కనుక వేరే చోటకు వెడితే మంచిదనే ఆలోచన చెప్పి మునికి విన్నవి౦చేట్లు చేశాడు .ఆమాటవిన్న మహర్షి ఒప్పుకోక పొతే ,ఆయన మనసు కరిగించే ఉపాయం ఆలోచించాడు . భార్య జయను గో రూపం ధరించి గౌతముడిదగ్గరకు వెళ్ళని చెప్పగా, ఆమె అలానే చేసి అక్కడున్న పొలాలలోపడి ఇష్టం వచ్చినట్లు తింటూ తొక్కుతూ భీభత్సం చేసింది .విప్రగౌతముడు గడ్డి పరకతో దాన్ని వారించాడు .ఆవు అరుస్తూ పడిపోయింది .దాని హాహాకారాలకు వినాయకుడు మునులు పరిగెత్తుకొచ్చి ,గౌతముడు చేసింది సరైనదికాదని తామంతా ఆశ్రమం వదిలి వెళ్లి పోతున్నామని చెప్పారు .దీన్ని తట్టుకోలేక గౌతముడు పడిపోయాడు .అప్పుడు విప్రులు ఆయనతో ‘’తీర్ధ –దేవ స్వరూపం అయిన గోవు నేలపై పడిపోయింది .మేమిక్కడ ఉంటె ఇప్పటిదాకా చేసిన తపస్సు ఫలం అంతా క్షయమైపోతుంది .మేము తపోధనులము మాత్రమే ‘’అన్నారు .పాపం గౌతముడు డీలాపడి,నమస్కరిస్తూ ‘’మీరే నాకిప్పుడు శరణం నన్ను పవిత్రుడిని చేయగలిగిందికూడా మేరే ‘’అన్నాడు వినాయకుడు ‘’దీనికి నివారణ మార్గం ఒకటి ఉంది ‘’అనగా చెప్పమని ఆయన కోరగా,బ్రాహ్మణ వేషం లో ఉన్న వినాయడే పరిష్కారం చెప్పగలడు అన్నారు. ఆయన ‘’ మునులు, గౌతముడు నా మాట మన్నించాలి .శివుని జటాజూటం లో, బ్రహ్మ కమండం లో గంగ ఉన్నది .గౌతముడు వెళ్లి ఆ గంగాజలాలను తేవాలి .అప్పుడే మేము ఈ ఆశ్రమలో ఉంటాం ‘’అన్నాడు .దేవతలు సంతోషించి పుష్పవృష్టి కురిపించారు .
గౌతముడు నమస్కరిస్తూ తపస్సు అగ్ని ,దేవతల ,బ్రాహ్మణుల అనుగ్రహం తో తాను గంగను సాధించగలను అని చెప్పి ,ఒక్కసారి దివ్య దృష్టితో చూసి దేవకార్యం, లోకోపకారం శివ ప్రీతి ,గౌరీ దేవి సంతోషం కోసమే ఈ కార్యం అని తనవలన ఏ లోపమూ జరగలేదని గ్రహించాడు .అందరి వద్దా సెలవు తీసుకొని గంగావతరణం కోసం కైలాసానికి వెళ్ళాడు గౌతమ మహర్షి .
సశేషం
నేడు నాగులచవితి ,రేపు నాగపంచమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-18-ఉయ్యూరు .

