వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన

      భాషా ప్రవీణులు ,పొన్నూరు శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల సంస్కృతాంధ్ర సాహిత్యాధ్యయన శీలి ,ఆంధ్రో పాద్యాయులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిల్లపల్లి గ్రామ వాస్తవ్యులు ,కవిరాజు సాహిత్య సరస్వతి బిరుదాంకితులు ,కనకాభిషేకి ,సంస్కృతాంధ్ర రచనా దురంధరులు శ్రీ కడెము  వేంకటసుబ్బారావు గారు  సహస్రాధిక పద్యాలతో రచించిన  వీర రస ప్రదానకావ్యం ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’.ఖడ్గ తిక్కనకు ముందు శ్రీ చేర్చటం లోనే కవిగారికి ఆ సాహస వీరునిపై ఉన్న అనన్య భక్తీ తాత్పర్యాలు వ్యక్తమౌతున్నాయి .ఖడ్గ తిక్కన కథ అరవై ,డెబ్భై ఏళ్ళ క్రితం అయిదు ఆరు తరగతుల తెలుగు వాచకాలలో పాఠ్యాంశం గా మనం  చదువుకొన్న వాళ్ళమే.కాలక్రమం లో అది కనుమరుగైంది .కాని తెలుగు దేశం లో కవి తిక్కన ఖడ్గ తిక్కన పేర్లు తెలియని వారు ఉండేవారు కాదు . ఇద్దరూ నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి మహా రాజు ఆస్థానం లో మంత్రిగా ,సేనాపతిగా గౌరవస్థానాలు అందుకొన్నవారే .భారతాంధ్రీకరణలో కవిత్రయం లో రెండవ వాడుగా తిక్క యజ్వ సుపరిచితుడే .ఆయన తేట తెలుగు, నాటకీయత చవి చూసి మురిసిపోని వారు లేరు .ఖడ్గ తిక్కన పేరు చెబితే  పల్నాటి బాలచంద్రునిలా ,ఝాన్సీ లక్ష్మీ బాయిగా వొడలు పులకరిస్తుంది .అంతటి అవినాభావ సంబంధం ఉన్న కీర్తిమంతులు వీరిద్దరూ .

   శ్రీ కడెము   వేంకట సుబ్బారావు మాస్టారు గారు చాలా సాహసంగా ,కవితాత్మకంగా నాటకీయంగా ,సహజ సరళ ధారా పద్య విన్యాసం తో ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం తీర్చి దిద్దారు .’’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేత సంస్కృతాంధ్రాలు ,గ్రాంథికవ్యావహారికాలు ,సంప్రదాయ ఆధునికతలు రచనలో పడుగు –పేకయినవి ‘’అని మెచ్చిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.వి . రాఘ వేంద్ర రావు గారి  మాటలు అక్షర సత్యాలు .ఈ కావ్యానికి ముందుమాటగా ‘’గ్రంథ పరిచయం ‘’చేసిన విశ్రాంత ఆంధ్ర శాఖాధిపతి శ్రీ మేడూరి ఉమామహేశ్వరం కవినీ కావ్యాన్నీ క్షుణ్ణంగా ఆవిష్కరించి మహోపకారం చేశారు .కనుక నాకు దీన్ని పరిచయం చేయటం చాలా తేలికయినది .ఎక్కువభాగం వారి మాటలలోనే కావ్య సౌరభాన్ని మీకు అందిస్తున్నాను .

  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం  ఏడాశ్వాసాల గ్రంథం.సహస్రాధిక పద్య సమన్వితం .పూర్వాపర విరుద్ధం కాకుండా చరిత్రా౦శాలను కవి కథా కథనమున చక్కగా నిరూపించారు .ఇతివృత్తం ,పాత్ర పోషణ, రసము పరస్పరాశ్రయంగా పూర్వ పూర్వా శ్వాశాలు ,ఉత్తరావుత్త్రా రాశ్వాశాలు పోషకంగా కథ మలచబడింది .సంగ్రహంగా ఇందులోని కథ తెలుసుకొందాం .

 మొదటి ఆశ్వాసం –పాకనాటి సీమ రాజధాని నెల్లూరు .దీనికి విక్రమ సింహ పురం అనే పేరుకూడా ఉంది .పాలకుడు మనుమసిద్ధి మహారాజు .కొమ్మన కుమారుడు కవి తిక్కన మంత్రి .అరొక మంత్రి భీమన .సిద్దన మంత్రి కొడుకు ఖడ్గ తిక్కన సర్వ సేనాపతి .ప్రక్కరాజ్యం కనిగిరి సీమ పాలకుడు  కాటమ రాజు . మంత్రి పద్మరాఘవుడు .బ్రహ్మ రుద్రయ్య సేనాపతి .కనిగిరి విస్తారమైన గో సంపదతతో అలరారు తోంది .మూడేళ్ళుగా వర్షాలు లేక ,కరువు కాటకాలతో అలమటిస్తోంది కనిగిరి .కాటమరాజు మనుమసిద్ధి దగ్గరకు వచ్చి పశువుల మేతకు పుల్లరి( పశువుల మేతకోసం ఇచ్చే డబ్బు )ఒడంబడిక చేసుకొన్నాడు .

   రెండవ ఆశ్వాసం – ఒప్పందం ప్రకారం యాదవులు నల్లమల అడవులలో లక్షకు పైగా ఆవులు మేపుకొంటున్నారు  .అక్కడ నెల్లూరు గిరిజనులు రక్షకులుగా ఉన్నారు .పశు కాపరులైన యాదవులు అడవిలో పిట్టల్ని జంతువుల్ని కొట్టటం తో గిరిజనులకు యాదవులకు భేదాలు ,తగాదాలు ఏర్పడ్డాయి .రాణీగారు తన పెంపుడు చిలుకను యాదవులు కొట్టారని పగబట్టి గిరిజనుల్ని ఉసి గొల్పింది .వాళ్ళు ఆవులను చంపటం మొదలెట్టారు .పశు వధ మనుమసిద్ధి మహా రాజే చేయించాడని యాదవులు భావించి ,ఒక అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ,ఇవ్వాల్సిన పుల్లరి చెల్లించకుండా ఆవులతో సహా పారిపోయారు .

   మూడవ ఆశ్వాసం –గొల్లలు పుల్లరి ఎగ గొట్టి పారిపోవటం మనుమసిద్ధి రాజుకు కోపం తెప్పించింది .పుల్లరి వసూలు చేసుకొని రమ్మని భట్టును రాయబారిగా కనిగిరి పంపాడు .కాటమ రాజు తమ గో నష్టాన్ని లెక్క తేల్చమని పేచీ పెట్టాడు .తాము ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల పుల్లరికన్నా ,గోనస్టం చాలా ఎక్కువకనుక దాన్ని బిగపట్టుకొని మిగిలిన డబ్బు ఇమ్మన్నాడు కాటమరాజు .అన్యాయపు మాటలు అన్నాడు భట్టు .సంధి చెడింది .యుద్ధం లో మనుమ సిద్ధిని బందిస్తామని యాదవులు ప్రగల్భాలాడారు .భట్టు చెప్పిన మాటలు విన్న మనుమసిద్ధి మారాజు సేనాపతి తిక్కనకు ‘’వీర ఖడ్గ తాంబూలం ‘’ఇచ్చి యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు .

  నాలుగవ ఆశ్వాసం –ఖడ్గతిక్కన ఇంటికి వచ్చి భార్య చానమ్మ తో కనిగిరి వెళ్లి పుల్లరి వసూలు చేసుకొని వస్తాను లేదా యుద్ధమైనా చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు .ఇంతలో రాయశృంగార భట్టు వచ్చి యుద్ధానికి ప్రోత్సహించాడు .వీరపత్ని చానమ్మ భర్తకు రక్త తిలకం దిద్ది  విజయం తో తిరిగి రమ్మని వీరగీతం ఆలాపించింది .

  ఐదవ ఆశ్వాసం –యుద్ధరంగం లో సైన్యం సమాయత్తమైంది .యాదవుల స్కంధావారం లో వీరాలాపాలు మిన్నంటాయి .పంబ జోళ్ళ కథ  వీరరస స్పోరకంగా సాగుతోంది .భట్టుతో ఖడ్గతిక్కన తన శౌర్య పరాక్రమాలే చాలు అనుకొని  ,కొద్దిమంది సైనికులతో  ప్రవేశించి కాటమను పుల్లరి ఇమ్మని అడుగగా ,యాదవులు మిగిలినడబ్బు ఇమ్మన్న్నారు .వాద ప్రతివాదాలు తీవ్రమయ్యాయి కాని పరిష్కారం కనిపించలేదు .యుద్ధం ప్రారంభమైంది .తెలివిగా యాదవులు యుద్ధరంగం లోకి అశేషమైన ఆవులమంద ను తోలారు .’’ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య ‘’లా తయారైంది పరిస్థితి .ఖడ్గ తిక్కన ఖంగు తిన్నాడు ఈ ఆకస్మిక పరిణామానికి .యాదవ సేన నెల్లూరి సేనను చంపింది .ఖడ్గ తిక్కన ఒంటరి పోరాటం చేసి సూర్యాస్తమయం అవుతుండటం తో  కాటమ కోరికపై యుద్ధం ఆపేసి ఇంటికి వచ్చాడు .

ఆరవ ఆశ్వాసం –విషయం తెలియని నెల్లూరు పౌరులు ఖడ్గ తిక్కన యుద్ధం లో వోడిపోయి వస్తున్నాడని గేలి చేశారు .బొగ్గులు పేడ,పిడకలతో కొట్టి అవమానించారు .ఎలాగో భరించి ఇంటికి వస్తే తండ్రి ‘’మీసం ఉన్న పేడి’’అని  నిందించాడు .భార్య చానమ్మ భర్త స్నానం కోసం మంచం చాటు పెట్టి ,పసుపు ముద్దా, నీళ్ళు పెట్టి మరీ అవమానించింది .ఇవన్నీ భరిస్తూ తల్లి అనురాగం తో వడ్డించే అన్నమైనా తిందామని కూర్చుంటే ‘’విరిగిన పాలు ‘’పోసి కొడుకు మనసు విరిచింది .భరించలేని అవమానం ఊరిలో ఇంట్లోనూ జరిగాక ఖడ్గతిక్కన రక్తం ఉడికి పోయి ‘’విజయమో వీర స్వర్గమో ‘’తేల్చుకొంటానని ,ఆ రాత్రికి రాత్రే మలి యుద్ధం లో పాల్గొనటానికి యుద్ధభూమికి వెళ్ళాడు .

   ఏడవ ఆశ్వాసం –యాదవులు తమ సేనాని బ్రాహ్మ రుద్రయ్యను యుద్ధ ముఖద్వారం దగ్గర నిలిపారు .ఖడ్గ తిక్కన వీరావేశం తో ఆతడిని నిరుత్తరుని చేసి  ,రణభూమిలో వీర విహారమే చేశాడు.కాటమ రాజు   మొదలైన వారందరికీ తన ఖడ్గమహిమ చాటి చెబుతూ, యుద్ధ రంగాన్ని యాదవ సేనల పీనుగుల  పెంటగా మార్చేశాడు .తెగిపడిన యాదవ శిరస్సు ల గుట్టపై’’ ఈటెను పాతి,తన ఉత్తరీయం తగిలించి విజయస్త౦భ౦ గా వీర పతాకం ‘’గా నిలబెట్టాడు ఖడ్గతిక్కన .సొమ్మసిల్లిన బ్రహ్మరుద్రయ్య తేరుకొని తిక్కన తో కలియబడ్డాడు .చాలాసేపు ద్వంద్వ యుద్ధం చేశారు .ఖడ్గ తిక్కన రుద్రయ్య తలనరికాడు కత్తితో  .కిందపడిపోతూ రుద్రయ్య తిక్కనను కత్తితో పొడిచి చనిపోయాడు .జవసత్వాలను కూడ గట్టుకొని ఖడ్గ తిక్కన పాక్కుంటూ పోయి తాను పాతిన విజయ ధ్వజాన్ని పట్టుకొని మరణించి వీర స్వర్గం అలంకరించాడు .భట్టు వచ్చి గుర్తించి వీర తిక్కనను ప్రశంసించాడు .తండ్రి ముసలి సిద్దనామాత్యుడు వచ్చి నెత్తురు వర్రులో ఎగసి పడే కొడుకు ఖడ్గ తిక్కన కండలను శాలువలో సేకరించి ఇంటికితెచ్చాడు .వీరపత్ని చానమ్మ తిక్కనతో సహగమనం చేసింది

  మనుమసిద్ధి ,కాటమ రాజులమధ్య యుద్ధం సాగింది .కవిబ్రహ్మ తిక్కనామాత్యుడు పల్లకిలో వచ్చి యుద్ధాన్ని ఆపి ,’’ధర్మాద్వైతాన్ని’’ ఇద్దరికీ బోధింఛి ,స్నేహహస్తాలు కలిపి , సంధి కుదిర్చి , శాంతి గీతం ఆలాపించాడు .తెలుగు నాట శాంతి కేతనం రెపరెపలాడింది .తిక్కనగారి హరిహరాద్వైతం  పరమ శాంతిని చేకూర్చింది ‘’ .

  కవిగారు శ్రీ కడెము  వేంకట సుబ్బారావు గారు తన ‘’విన్నపం ‘’లో ‘’ఖడ్గ తిక్కన కథ-‘’కాటమ రాజు కథలు’’పేరిట ద్విపద ఛందస్సులో ఉన్నది .’’పిచ్చుగుంటలవారు’’  దీన్ని బాగా ప్రచారం చేశారు .పల్నాటి వీర చరిత్రకు ఉన్న ప్రాశస్త్యం ఖడ్గ తిక్కనకూ ఉంది .అందులో లాగా లోలాగా ఇందులో వంచనలు,మాయలు  లేవు .మనుమసిద్ధి కాటమరాజు ఇద్దరూ దీరోదాత్తులే .ఇద్దరూ నిజాయితీగానే వ్యవహరించారు .అక్కడ మగువ మాంచాల, ఇక్కడ చానమ్మ ఇద్దరూ వీరవనితలే .ఇద్దరూ భర్తలను యుద్ధానికి సమాయత్త పరచి వీర తిలకం దిద్ది పంపిన  తెలుగు ఆడపడుచులని పించారు .ఖడ్గ తిక్కన తన శౌర్య పరాక్రమాలతో శత్రువులను సైతం మెప్పించాడు .బాలచంద్రుడు నరసి౦గుని తల నరికి వీరస్వర్గం అలంకరిస్తే ,ఇందులోఖడ్గ  తిక్కన బ్రహ్మ రుద్రుని తలనరికి వీర స్వర్గం చేరాడు .ఈ ఇద్దరూ వీరాభిమన్యుని పౌరుష పరాక్రమాలకు వారసులే .

‘’’ఖడ్గ తిక్కన కథను పరిగ్రహించేముందు నేను యోగ సమాధి కి రావలసి వచ్చింది .ఆయోగ చక్షువులతో లోపాలన్నీ తొలగిపోయాయి .చక్కని ప్రేరణాలు ,సముచిత పూరణాలు బొమ్మకట్టి నా మనో వేదికపై ఆటాడాయి ,మాటాడాయి.మూల కథకు భంగం రాకుండా  ,ఇరు వర్గాలవారి గౌరవోన్నతులకు పోషకంగా రచన చేశాను .కావ్యం చివరలో కవి బ్రహ్మ తిక్కనను ప్రవేశ పెట్టి ‘’పోరునస్టం –పొందు లాభం ‘’అనే ధర్మోక్తి తో సఖ్యం కావించి ,మంగళప్రదంగా ఆంద్ర పౌరుష జ్యోతి వెలిగింప జేశాను .ఈ కావ్య రచన చేశాకనే డా శ్రీతంగిరాల వేంకట సుబ్బారావు గారి ‘’కాటమ రాజు కథలు ‘’గ్రంథం చూశాను .అందులో కొన్ని సముచిత విషయాలున్నాయి .

  ‘’ఖడ్గ తిక్కన ,కవితిక్కన అన్నదమ్ముల బిడ్డలు .ఇద్దరూ మనుమసిద్ధి మహారాజు సేనాపతిగా కవిగా ఉన్నారు . కవితిక్కన తన ‘’నిర్వచనోత్తర రామాయణం ‘’కావ్యకన్యను మనుమసిద్ధికి అంకితమిచ్చి ‘’మామా ‘’అనిపించుకొన్నాడు .ఖడ్గ తిక్కన అనేక యుద్ధాలు జయించి మనుమసిద్ధికి జయశ్రీ కలిగించి ‘’గంధ వారణ’’బిరుదుపొండాడు .కవి తిక్కన లాగానే నేనూ నా కావ్యాన్ని హరిహర నాథునికి  అ౦కితమిచ్చాను ’’అని ఎంతో సమ దృష్టి తో కవిగారు సుబ్బారావుగారు చెప్పుకొన్నారు .

  నేను చెప్పాలంటే ఈ కావ్యం లో  ప్రతి పద్యం హృద్యంగా ఉంది . మంచి మాటల పోహళింపు ,చమత్కారం ,అలంకార సౌందర్యం ,పాత్రోచిత భాష ,నాటకీయ సన్నివేశ చాతుర్యం, ఒకే పద్యం లో వివిధపాత్రల సంభాషణ దేనికదే సాటిగా ఉన్నాయి .ఉదాహరించాల్సి వస్తే కావ్యమంతా ఉదాహరించాల్సి వస్తుంది .నాకు అంతబాగా నచ్చిన కావ్యం .ఇంతటి ఉత్తమ వీర కావ్యం మన సాహిత్య పరిషత్ ల దృష్టిలో పడకపోవటం ఆశ్చర్యంగా ఉంది .దగ్గరే ఉన్న నాగార్జున  విశ్వ విద్యాలయం వారికీ ఆనక పోవటం విడ్డూరం .నవ్యాంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ సచివోత్తములు శ్రీ డి.విజయభాస్కర్ గారికీ ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికీ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘానికీ ఈ కవిగారి గురించి కావ్యం గురించీ తెలియదని పిస్తోంది .నన్నడిగితే ‘’అక్షర లక్షలు ‘’చేసే కవిత్వం ఇందులో ఉంది .హాయిగా చదివిస్తుంది .ఇంత తేలికగా పద్య రచన చేయవచ్చా అని పిస్తుంది ,మార్గ దర్శనం చేస్తుంది .మనల్ని ఎలివేట్ చేస్తు౦ది కావ్యం .

  ఆధారం –వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం శత వార్షిక  వేడుకలో నేను శ్రీ చలపాక ప్రకాష్ గారి  బృందం తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒక మహానుభావుడు శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం నాకు ఆత్మీయంగా అందజేశారు .  మూడు రోజుల క్రితమే  దాన్ని చదివి వారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం ‘’రాయటం చేత నిన్ననే   గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 లో 389 వ గీర్వాణకవిగా వారి గురించి రాసి సంతృప్తి చెందాను .ఇప్పుడు ఈ వ్యాసం రాశాను .

    ఇప్పుడే వేటపాలెం లైబ్రేరియన్ శ్రీమతి శ్రీ వల్లి గారికి ఫోన్ చేసి శ్రీ సుబ్బారావు గారి గురించి కావ్యం గురించీ నేను రాసిన విషయం గురించీ తెలియజేసి కవిగారి ఫోన్ నంబర్  ఉంటేతెలియజేయమని కోరాను .ప్రస్తుతం తనవద్ద నంబర్ లేదని తెలుసుకొని తెలియ జేస్తానని చెప్పి ,కవిగారు ఇప్పుడు 94ఏళ్ళ వయో వృద్ధులని  ,మాట్లాడలేకుండా ,కదలలేకుండా ఉన్నారని చెప్పారు .మొన్ననే తానూ వారి ఇంటికి వెళ్లి పలకరించి వచ్చానని చెప్పారు .అంతటి మర్యాద ఆమె పాటించినందుకు అభినందించాను .

శ్రీ ఖడ్గతిక్కన కావ్యం లో కవిగారి కవితా ప్రౌఢి కి మచ్చుకు కొన్నిపద్యాలు –

‘’శ్రీ గౌరీ హృదయేశ్వర –ఆగమ నిగమాది వినుత ,హరిహర నాథా-భోగీశ్వర ,యోగీశ్వర –బాగుగ రణ తిక్కన కథ పలుకుదు వినుమా ‘’

‘’శ్రీ కరుడవు ,జగతీ సృజ –నాకరుడవు ,కర్మ యంత్ర నాథుడవగుచున్ –లోకుల నేలెడి హరిహర –తేకువతో వినుము ఖడ్గ తిక్కన కథలన్’’(ఖడ్గ తిక్కన పౌరుష౦ )

‘’హృదయ పాత్రలో రక్తాజ్య మింత నించి –ప్రాణ వర్తి రగిల్చి ,శౌర్యాగ్ని పెంచి –తెలుగు పౌరుష జ్యోతియై తేజరిల్లి –వీడె’’ఖడ్గ తిక్కన ‘’వచ్చెచూడ రండు ‘’

‘’తెలుగు గడ్డ మగంటిమి వెలుగు బిడ్డ-మేఘ గర్జానుకారి ,క్రొమ్మెరు పనంగ-అశ్వ మెక్కి ఖడ్గో జ్వాల  హస్తుడగుచు  -‘’ఖడ్గ తిక్కన ‘’అరుదెంచె,కనుడు బుధులు ‘’(వీర తిక్కన )

‘’హరిహర నాథు డంట,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –హర గిరి జాద్వయంబు ,పరమార్ధ హిరణ్మయ కోశ రూపమే –

పరము నిహమ్ముకున్ దిగిచి భక్తి రసామృత మందజేసి అం –దరకు దైవ దృష్టియును ,దర్శనమున్ కలిగింతురా ప్రజల్ ‘’(నెల్లూరు వర్ణన )

‘’జ్యోతి ప్రణవమైన చూడాంబ సుతులు దే-వాంగ జనులు మగ్గమందు నేసి –సన్న నూలు పట్టు అరి బుటా చీరెలు –అఖిల దేశములకు అ౦పు  చుంద్రు’’( నేత మగసిరి )

‘’పుల్లరడుగ బోయి పోరాట నిలబడి –ముచ్చముడిగి వోడి వచ్చినావు –నమ్ముకొన్న నృపతి నట్టేట ముంచితి –పరువు బరువు లేని పిరికి పంద‘’ (  తండ్రి ఈసడింపు ) )

‘’పెరటికి నన్ను తెచ్చితివి –పేర్మిని స్నానము చేయుమంటి ,వీ-పరిసరమంత స్త్రీలయిన వారికి మాత్రమె స్నాన యోగ్యమై-పరగుచు నుండెగాని –మగవారికి న్యూనత గల్గు నట్లుగా –స్వరచన మిచ్చటన్ జరుప జాలితి  వీ యెగతాళిసైతునా ?’’( భార్యతో తిక్కన )

‘’నాన్నగారు బైటకు వెళ్ళినారు పురుషు –లెవ్వరిటలేరు ,మరి పోతుటీగ రాదు –సిగ్గు పడకుండ స్నానంబు చేయవచ్చు –పసుపుతో స్నానమును చేసి త్వరగరండు ‘’-(భర్తతో చానమ్మ )

‘’పత్ని భుజోపరి మూట పట్టునంట-తల్లి కొమరు నాకలి పొట్ట తడుము నంట-కన్నతల్లి ఎవ్వరికైన కల్పవల్లి –అమ్మ పిలిచెను ,లోపలి కరుగువాడ ‘’( భోజనానికి సిద్ధమైన తిక్కన )

‘’వీర వనితనైతి ,వీర పత్నియు నైతి –వీరమాత నగుచు వీగిపోతి-వారపోసి నీకు హరతిచ్చిన నాడె-వీరమాత నగుదు వేడ్క పడుదు ‘’(కొడుకుతో తల్లి ప్రోలమ్మ  )

‘’అసదృశముగ నరి వీరుల – మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్ –కసవును మేయగ బోయిన –పసులును విరిగినవి తిక్క !పాలును విరిగెన్ ‘’(తల్లి అవమానం )

‘’ఇంక నాకు శాంతి ప్రశాంతి ఏమి లేదు –అంతకంత కావేదన అధికమయ్యె-అజ్ఞతాబ్ది నిర్మథన జీవాత్మ నేను –ప్రజ్వలత్ భిన్న భౌమాగ్ని పర్వతమను ‘’(క్రోధాగ్ని పరాభావాగ్ని తో తిక్కన )

‘’జడ వస్తువున శక్తి ,శక్తిలో చేతన –చైతన్య మానంద సాగరమగు –జీవాత్మ పరమాత్మ చేరిక ఒక్కటై –సచ్చిదానందాత్మ సాగరమగు –ప్రకృతిపురుష లాస్య భావ ,తా౦డవభావ –సహితాభినయ కళాసాగరమగు –ఊర్ధ్వ దృష్టికి ముక్తి –ఒగిఅధో దృష్టికి-సంసృస్టి యుగ సౌఖ్య సాగరమగు –అదియె బ్రహ్మ ముహూర్త నిత్యాభినవత –పొంగి పొరలు వేగురు జుక్క పొడుపు వేళ-గండు మగడైన ఖడ్గ తిక్కన్న తేజి –చూపు దాటె’’( వేకువ జాము వర్ణన )

‘’కుంతముల వంటి దంతాల క్రుమ్మి పొడిచి –కంబముల వంటి నాలుగు కాళ్ళ ద్రొక్కి –అరటి గెలల తోటల వంటి అరి బలముల –కూల ద్రోయుచు౦డెను మత్త కుంజరములు ‘’(భీకరయుద్ధం )

‘’ఘల్లు ఘల్లున మ్రోగు గజ్జల చెడ్డిపై –కుదురుగా పెనుకాసెకోక జుట్టి –ఘణఘణమని  మ్రోగు గంట లోడ్డాణ౦బు –నడుముపై బిగువుగా నాచికట్టి –ఉక్కు చొక్కావంటి చక్కని మరువును –బలుపైన ఎదరొమ్ము పైన బెట్టి –పాగా శిరస్త్రాణ వస్త్వాదికమ్ములు –శిరసున సొగసుగా జేర్చి చుట్టి –టముకు తప్పెట్లు మేళ తాళముల తోడ –చిందులను త్రొక్కుచు పదాతి సేనలపుడు –వారి వారి ఆయుధముల తీరు లెసగ –పొలికలని యందు వేర్వేర తలపడిరటె’’(సైన్య వర్ణన )

‘’ధర్మమును ,క్షాత్రమును నాకు ద్వ్యక్షు లంటి-జ్ఞాననేత్ర మొక్కటె ఆత్మ శక్తి యంటి-సోహమే బ్రహ్మమే నేను –జయము నేను –ఇటుల నా రాజ ఋణము నే నీగు చుంటి ‘’ (యుద్ధం లో  ఖడ్గ తిక్కన )

‘’రెండు పెద్దపులులు గా౦డురు గాండ్రంచు-బొబ్బరించి గ్రుడ్లు నుబ్బరించి –పళ్ళు కొరుకు చుండి పంజా విసరు చుండి –పోరునట్లు వారు పోరిరపుడు ‘’(ఖడ్గ తిక్కన ,బ్రహ్మ రుద్రయ్యల ద్వంద్వ యుద్ధం )

‘’ప్రళయ కాల రౌద్రోద్రేక భయద కాళి-నాల్క వంటి తిక్కన కత్తి నాట్యమాడె-మిత్తి మిడి గ్రుడ్ల జిగి వంటి మెరపులుమిసె-నిప్పు రవ్వలు పువ్వులు నింగి విరిసె’’(ప్రళయ భయంకర ఖడ్గ తిక్కన )

‘’కొంచె మూపిరితో ప్రాకి కొనుచు పోయి –ఖడ్గతిక్కన్న ధ్వజభూమి కన్ను మూసె-జ్ఞాన కర్మ యోగముల సంస్కారులైన – ఎట్టి వారికి నైన మోక్షైక  ఫలమె’’(ఖడ్గ తిక్కన వీర మరణం )

‘చిజ్జగాత్మక మీ విశ్వ సృష్టి యెల్ల-ఈశ్వరోత్పన్న ,మాత్మజులెల్ల జనులు –సోదరులుగ జీవింపక ,ఒకరి నొకరు –చంప జూతురే?వారికి చావు రాద?’’(కవి తిక్కన శాంతి సందేశం )

‘’తిక్క యజ్వ మహా మంత్రి ధీ నిదాన –నా నమస్కృతుల్ మీ ఉపన్యాసమునకు ‘’(మనుమా సిద్ధి )

‘’తిక్కన మహా కవీ !మీ సుదీ గరిమకు –మాకు కనువిప్పు కలిగె నమస్కృతు లివె’’(కాటమ రాజు )

‘’ఖడ్గ తిక్కనతో పోరాడగలుగు వాడు –రుద్రమూర్తికి ఈడైన భద్రమూర్తి –అట్టి జగదేక వీరులే అంతమైరి –అయ్య బ్రహ్మ రుద్రయ్య ! జోహారులయ్య ‘’(వీరులకు తిక్కయజ్వ నివాళి )

‘’యుద్ధమె ఆన్ని తీర్చునను యోజన మంచిది కా,దదేఅసం –బద్ధము –గెల్చి ,గద్దె గొని పాండవులే ,యువరాజు నెన్నుచో –ఇద్ధ కళా నిరాత్ముని పరీక్షితునిన్ గొనినారు ,శాంతి సం-సిద్దత బూని యెల్లరును క్షేమమునన్ బ్రతుకంగ  జెల్లదే’’(కవి  తిక్కనార్యుని ప్రజాహిత శాంతి సందేశం )

    ఈ కవిగారి గురించి వారి కావ్య రచన గురించి నేనూ ఇప్పటిదాకా తెలుసుకోకపోయినదుకు సిగ్గు పడుతున్నాను .ఇంతటి కావ్యాన్ని చదివి ఆస్వాదించలేక పోయినదుకు బాధగా ఉంది .ఇప్పటికైనా చదివి అందులోని సారాన్ని మీతో పంచుకొన్నదుకు మిక్కిలి సంతృప్తిగా ఉన్నాను .. మీ-  గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-19-ఉయ్యూరు

  ఇప్పుడు మీకు శ్రీ  కడెము వేంకట సుబ్బారావు కవి వరేణ్యుల గురించి నేను నిన్న గీర్వాణం-4లో రాసిన వ్యాసం పొందుపరుస్తున్నాను

    గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4

389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)

ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ  అ.ప్ర.శ్రీ ములకల వేంకట సుబ్బయ్యగారు .

  కవిగారి సాహిత్యాధ్యయనం అంతా పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి వారి సంస్కృత కళాశాలలో సాగింది .1954లో ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి భాషా ప్రవీణ పట్టం పొందారు .1954నుండి వేటపాలెం లోని శ్రీ బండ్ల బాపయ్య హిందూ హైస్కూల్ లో ఆంధ్రోపాధ్యాయ పదవిలో చేరి రిటైరయ్యే వరకు అక్కడే పని చేశారు .

 సుబ్బారావు కవిగారు సంస్కృతం లో ‘’శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం రచించారు .దీనిని15-5-1980 న మద్రాస్ లో గ్రామ ఫోన్ రికార్డింగ్ చేయించి 6-4-1984 న ఆవిష్కరింప జేశారు .కవి గారు తెలుగులో’’జీవన జ్యోతి ‘’పద్య కావ్యం రాసి 1964లో తమ హైస్కూల్ లోనే ఆవిష్కరణ జరిపించారు .’’పుణ్య పురుషుడు ‘’కావ్యం రచించి 11-8-1975లో ఆవిష్కార మహోత్సవం జరిపారు  ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యాన్ని రసోదంచిత౦గా  వీర శృంగార స్ఫోరకంగా రచించి తమకవితా ప్రతిభ చాటారు .శ్రీ దేవల మహర్షి చరిత్ర  రాసి 6-41984లో ఆవిష్కారం జరిపించారు .

   విద్వత్ కవి అయిన శ్రీ కడెం వెంకట సుబ్బారావు గారికి 11-81975నకరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు  ‘’కవి రాజు ‘’బిరుదు ప్రదానం చేసి ‘’కనకాభిషేకం ‘’చేసి సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించారు .శ్రీశైలం లో 18-11-1984 న  దేవాంగ సత్ర ప్రారంభోత్సవ సమయంలో   ఆంద్ర ,కర్ణాటక ,ఒరిస్సా రాష్ట్రాల వారిచే ‘’సాహిత్య సరస్వతి ‘’బిరుడునండుకొన్న కవి వరెంయులు సుబ్బారావు కవిగారు .వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయంలో అరుదైన ‘’పుష్పకిరీట’’సన్మానం అందుకొన్నారు .’’వస్త్ర నిర్మాత ‘’మాసపత్రికకు కవిగారు గౌరవ సంపాదకులు .

  కవిగారి శ్రీ చౌడేశ్వరీ సుప్రభాతం నాకు లభ్యమవలేదు కాని  వారి శ్రీ ఖడ్గ తిక్కన కావ్యం లో కనిగిరి ప్రభువు కాటమరాయని చేత ,నెల్లూరు ప్రభువు మనుమసిద్ధి సేనానిఖడ్గ తిక్కన తో ద్వంద్వ యుద్ధానికి పంపబడిన ముదిగొండ బ్రహ్మయ్య చేత చెప్పి౦చిన శ్రీ పరమేశ్వర  సుప్రభాత  శ్లోకాలు కనిపించాయి .కవిగారి సంస్కృత పాండిత్యానికి ఇవి మచ్చుతునకలు –

‘’శ్రీ సహస్రార పద్మస్థ జ్యోతిర్లింగ-చిదాత్మక –ప్రవర్తతే సుప్రభాతం  -ఉత్తిష్ట పరమేశ్వర

‘’శృంగార శోభి గురు మస్తక జూట గంగ –చంద్రావతంస –నిటలేక్షణ,శేష భూష –దుర్వార రాక్షస  విదారణ ,శూలపాణే-కాళీ సనాథ –చరణౌ శరణం ప్రపద్యే.

  సాహిత్య సరస్వతి ,కవిరాజు శ్రీ  కడెం వేంకట సుబ్బారావు గారు ‘’నేత నేయు దేవాంగ కులోద్భవులగుట చేసి సంస్కృతాంధ్రాలు ,గ్రాంధిక  వ్యావహారికాలు ,సంప్రదాయ –ఆధునికతలు రచనలో పడుగు -పేక లయినవి ‘’అని వీరి కవిమిత్రులు ,బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజి మాజీ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.బి. రాఘవేంద్ర రావు అన్నమాటలు  అక్షర సత్యాలు .

ఆధారం -30-12-18ఆదివారం వేటపాలెం లైబ్రరీ శత వసంతోత్సవ వేడుక సందర్భంగా శ్రీ చలపాక ప్రకాష్ గారి తో కలిసి వెళ్ళినప్పుడు అక్కడెవరో ఒకాయన నాకు అత్యంత ఆభిమానంగా అందజేసిన శ్రీ కడెం వేంకట సుబ్బారావు గారి ‘’శ్రీ ఖడ్గ తిక్కన ‘’కావ్యం.

   సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.