గౌతమీ మహాత్మ్యం-61
88-కిష్కింధా తీర్ధం
శ్రీరాముడు కిష్కింధలోని సుగ్రీవ వానరసైన్య సాయంతో లంక ప్రవేశించి ,రావణాది సర్వ రాక్షస సంహారం చేసి ,సీతాదేవి తో సహా అందరితోకలిసి అయోధ్యకు పుష్పక విమానం లో బయల్దేరాడు ..దారిలో పరమపావని ,సంతాప నివారిణి గంగానదిని చూసి పులకించి హనుమంతాదులనలను పిలిచి –
‘’అస్యాః ప్రభావాద్ధరయో యాసౌ మామపితా ప్రభుః-సర్వ పాప వినిర్ముక్త స్తతో యతత్రి విస్ట పం .
‘’ఇయం జనిత్రి సకలస్య జంతోర్భుక్తిప్రదా ముక్తిమతాపి దద్యాత్ –పాపాని హన్యాదపి దారుణాని కాన్యాంనయాస్తత్ర నదీ సమానాః’’-గౌతమి ప్రభావంతో ప్రభువైన మాతండ్రి సర్వ పాప విముక్తుడై స్వర్గం చేరాడు .ఈ నది సకల జీవులకు తల్లి వంటిది ,పాప విమోచని .ఈనదికి మించిన నది పృధ్విలో లేదు .ఈనదీ ప్రభావంతో శత్రువులు మిత్రులయ్యారు సీతాదేవి లభించింది .హనుమ ఆత్మ బందువయ్యాడు . విభీషణుడు నిత్యమిత్రుడయ్యాడు ,లంక భగ్నమైంది. సర్వ రాక్షసులతో రావణుడు చంపబడ్డాడు .ఇంతపవిత్రమైన గంగానది ని గౌతమమహర్షి శివుని పూజించి ,శివ జటాజూటం లో ఉండేట్లు చేశాడు .సకలవరప్రదాయిని అమంగళహారిణి.అనేక నదులకు జన్మస్థానం మనసావాచా కాయం తో శరణు వెడుతున్నాను ‘’ అన్నాడు .
రాముని మాటలు శ్రద్ధగా ఆలకించి ,వానరులంతా గౌతమీ స్నానం చేసి పునీతులై ,పూజ చేశారు .రాముడు శివుని మనసారా ప్రార్ధించి స్తుతించాడు .వానర బృందమంతా గాన నృత్యాలతో పరవశం చేశారు . ఆరాత్రి అందరూ అక్కడే గడిపి ,చెప్పరాని ఆనందం అనుభవించి జరిగిన కాయ క్లేశాలన్నీ మర్చిపోయారు .ప్రభాత సమయం లో విభీషణుడు వచ్చి నాలుగు రాత్రులు ఆక్కడే గడుపుదామని రామునికి చెప్పగా అందరూ సంతోషించి ఉండిపోయారు .సకలేశ్వరుడైన సర్వేశ్వరుని ,జగద్దాత్రితో ఉన్న సిద్దేశ్వర క్షేత్రం దర్శించి, భక్తితో పూజించి అయిదు రోజులు౦డి ,లింగాభిషేకం చేసి తరించారు .హనుమ రాజైన రామునికి సకల సపర్యలు చేశాడు .హనుమను ఆ లింగాలనాన్నిటికీ విసర్జన కావించమని చెప్పాడు .సరే నని హనుమ వెళ్లి తన వాలం తో చుట్టి పీకేయాలనుకొన్నాడు .కాని అశక్తుడయ్యాడు .రామాదులకు ఆశ్చర్యమేసింది .మరల లింగాలకు భక్తితో పూజాదికాలుచేశాడు .కపి వీరుల చేత సేవి౦ప బడిన ఈతీర్ధం కిష్కింధ తీర్ధం గా పవిత్రమై నది .రాముడు గౌతమికి మరలమరల నమస్కరించి ప్రసన్ను రాలు కావలసినదని ప్రార్ధించాడు . ఈ కథ విన్నవారికి చదివినవారికి పాపాలు తొలగిపోతాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
89-వ్యాస తీర్ధం
దీనికే ప్రాచేతస తీర్ధమని కూడా పేరు .బ్రహ్మమానసపుత్రులు పది మంది జగత్తు యొక్క సృష్టికర్తలు భూమి యొక్క అంతం తెలుసుకోవాలనే తపనతో ,బయల్దేరి వెళ్ళారు కాని తిరిగి రాలేదు .అప్పుడు వేదవేదాంగ తత్వవిదులు ,సకల శాస్త్ర నిపుణులు అంగిరసులుతండ్రి అంగిరసుని అనుజ్ఞ తీసుకొని తల్లి అనుమతి పొందకుండానే తపస్సుకు వెళ్ళారు .తల్లికి కోపం వచ్చి వారిని ‘’తపస్సు సిద్ధించదు ‘’అని శపించింది .ఎన్ని చోట్లకు వెళ్లి తపస్సు చేసినా వారికి తపోసిద్ధి కలగలేదు .రాక్షస మానవ స్త్రీల వలన అనేక విఘ్నాలు కలిగాయి .చేసేదిలేక అగస్త్యమహామునిని సందర్శింఛి తమ తపో విఘ్నాలకు కారణం అడిగారు .
కుంభ సంభవుడు క్షణం ధ్యానించి ‘’మీరు సృష్టికర్త బ్రహ్మ చే సృస్టింపబడిన వారు. ఈ తపస్సు చాలదు .పూర్వం బ్రహ్మ చే సృష్టింప బడినవారు సుఖాన్ని వెతుకుతూ వెళ్లగా ,,వాళ్ళను వెతుకుతూ వెళ్ళినమీరు అంగీరసులయ్యారు .మంచికాలం వస్తే మీరు ప్రజాపతికంటే గోప్పవారౌతారు .ముల్లోక పావని గంగానదిని చేరి శంకరధ్యానం చేయండి .ఆయన మీ సకల సంశయాలు తీర్చగల సమర్ధుడు .సద్గురువు లేకుండా ఎవరికీ సిద్ధి కలుగదు ‘’అన్నాడు .వారు ‘’జ్ఞానడుడు అంటే ఎవరు ?బ్రహ్మ విష్ణువా,మహేశుడా,ఆదిత్యుడా చంద్రుడా అగ్నియా వరుణుడా ?’’అని అడిగారు .అగస్త్యమహర్షి ‘’జలమే అగ్ని ,అగ్నే సూర్యుడు .సూర్యుడేవిష్ణువు.విష్ణువే భాస్కరుడు .బ్రహ్మయే రుద్రుడు .రుద్రుడే సర్వం .ఆసర్వమే జ్ఞానం .అతడే జ్ఞానదుడు.ఉపదేశకుడు ,ప్రేరకుడు ,వ్యాఖ్యాత ,ఉపాధ్యాయుడు ,తండ్రి ఇలా గురువులు అనేకరకాలు .వీరిలో జ్ఞాప ప్రదుడు గొప్పవాడు .జ్ఞానం వలన భేద బుద్ధి నశిస్తుంది .శివుడు ఒక్కడే .జ్ఞానులు ఆయనను శంభుడని ఇంద్రుడని ,సూర్యుడని అగ్నిఅనీ అంటారు అని వివరి౦చాడు..
ముని వాక్యాలకు మనసు లో సంతోషించి ,సంశయ చ్చేదమై ,అంగీరసులలో సగం మంది గంగకు ఉత్తరం వైపు ,మిగిలిన అయిదుగురు దక్షణం వైపుకు వెళ్లి ,అగస్త్యుడు చెప్పినట్లు సకల దేవతారాధన చేసి ,తత్వ చింతన చేస్తూ ఆసనాలపై ఉన్నారు .సకల దేవతాగణం ప్రీతి చెంది బ్రహ్మ సంకల్పంగా వారు లోకస్రస్టలు అవుతారని .అధర్మ ౦ పెరిగినప్పుడు ,వేదాలకు అపకారం జరిగినపుడు వారు వ్యాసులై లోకోపకారం చేస్తారు అని ఆశీర్వదించారు .వారంతా వేర్వేరు రూపాలు పొందినా వారంతా పరబ్రహ్మ స్వరూపమే .ఇక్కడ ఉండే శివ దేవుడు సర్వ దేవతలతో అనుస్టింఛి ఉండి,అనుగ్రహం ప్రసాదిస్తాడు .అంగీరసులే ధర్మస్వూపులైన వ్యాసులు .వారే వేదవ్యాసులు .అందుకే ఈతీర్ధం మొహా౦ధకారం పోగొట్టే, జ్ఞానజ్యోతి వెలిగించే వ్యాస తీర్ధం గా విరాజిల్లింది అని నారదునికి బ్రహ్మ ఉపదేశించాడు .
సశేషం
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -3-10-19-ఉయ్యూరు

