గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం
ప్రణీతా సంగమ తీర్ధం అనే కుశ తర్పణ తీర్ధం భుక్తి ముక్తి దాయకం .వింధ్యపర్వత దక్షిణ భాగాన సహ్యపర్వతం ఉంది .దీనిపాదాలనుండి గోదా, భీమరథీ నదులుద్భవించినాయి. దగ్గరలో ఏకవీరా, విరజా నదులు కూడా ఉన్నాయి అని మొదలుపెట్టి బ్రహ్మ కొన్ని రహస్య విషయాలు చెప్పాడు నారదునికి .’’పరమపురుషుడు పరుడు .అవ్యక్తుడు అక్షరుడు .అతనినుంచే అపరుడు ,క్షరుడు ,ప్రకృత్యన్వితుడు కలిగారు .నిరాకార పురుషునివలన సావయవ పురుషుడు పుట్టాడన్నమాట .ఇతని నుంచి నీరు , ఈరెండిటివలన కమలం పుట్టింది .ఆకమలం లో బ్రహ్మ పుట్టాడు .బ్రహ్మకంటే ముందే పంచభూతాలైన భూమి వాయువు ఆకాశం జలం,తేజస్సు ఒకే సారి పుట్టాయి . అప్పటికి అవి తప్ప స్థావర జంగమాలు లేవు .వేదాలే లేవు .బ్రహ్మ దేనినుంచి పుట్టాడో దానినికూడా చూడలేకపోయాడు .బ్రహ్మకు మాట కూడా లేదు .అప్పుడు ఆకాశవాణి బ్రహ్మను స్థావర జ౦గ మాది సృష్టి చేయమని ఆదేశించింది .ఎలాచేయాలో అర్ధంకాక ఎలా ఎక్కడ సృష్టించాలి అని అడిగాడు .అప్పుడు ప్రకృతి యైన వాగ్దేవి యజ్ఞం చేసి శక్తిపొందమని యజ్ఞమే అన్నీసాధించి పెడుతుందని చెప్పింది .మళ్ళీ అనుమానం వచ్చి యజ్ఞం ఎక్కడ, దేనితో చేయాలని ప్రశ్నించాడు .అప్పుడు ఆకాశవాణి ఓంకార రూపమైన జగన్మయిగా విలసిల్లుతోందని ,దానివలన కర్మ భూమి యైన మానవ లోకం లో యజ్ఞేశుడైన యజ్ఞ పురుషుని గురించి యజ్ఞం చేయమని చెప్పింది .అతడే యజ్ఞసాధనం స్వాహా ,స్వాథా అనేవి మంత్రాలు .బ్రాహ్మణులు ,,హవిస్సు మొదలైనవి కూడా యజ్ఞమే .అన్నీ విష్ణువు నుంచే వస్తాయి అని వివరించింది .
బ్రహ్మ కర్మభూమి ఎక్కడ ఉన్నది అని అడిగాడు .దానికి వింధ్య,సహ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న భూమి శ్రేష్టం అని చెప్పింది. బ్రహ్మ వెళ్లి పరిశీలించగా ఆకాశవాణి యే అన్ని సూచనలు చేస్తూ దారి చూపింది .సంకల్పం చెప్పుకొని యజ్ఞ ప్రారంభం చేసి ,వేదాలు చెప్పినట్లు చేయమని సలహా చెప్పింది .అప్పుడు ఇతిహాస పురాణాలు అన్నీ బ్రహ్మ ముఖం లో చేరాయి .తర్వాత స్మృతికి వచ్చాయి .అప్పుడే వేదార్ధం గోచరించింది .పురుష సూక్తం స్మరించాడు .దానిలో చెప్పబడిన సమస్త యజ్ఞ ఉపకరణాలు ,యజ్ఞపాత్రలు కల్పించుకొని యజ్ఞ దీక్ష కు పూను కొన్నాడు . ఆ స్థలమే బ్రహ్మగిరి .దీనికి పూర్వభాగం లో ఉన్న 84యోజనాల వరకు ఉన్న భూమి’’ దేవయజనం ‘’అని పిలువబడింది .దానిమధ్య యజ్ఞ వేదిక నిర్మాణం జరిగింది .దీనికి దక్షిణాన గార్హస్పత్యాగ్ని,దానిప్రక్క ఆహవనీయాగ్ని స్థాపనం జరిగాయి .
పత్ని లేకుండా యజ్ఞం సిద్ధించదు అనిశ్రుతి చెప్పింది కనుక ,బ్రహ్మ తన శరీరాన్ని రెండుభాగాలు చేసుకొని ,పూర్వభాగాన్ని పత్ని గా చేసుకొన్నాడు .ఉత్తరభాగం లో బ్రహ్మ ఉన్నాడు .ఉత్కృష్టమైన వన స్తన౦ ఆజ్యంగా గ్రహించాడు .గ్రీష్మాన్ని ఇద్మం అంటే సమిధలుగా ,శరత్తును హవిస్సుగా వర్షరుతువును దర్భలుగా చేశాడు .సప్త ఛందాలు పరిధులయ్యాయి కలలు, కాస్టాలు,నిమేషములు ,సమిధలు ,పాత్రలు,కుశలు అయ్యాయి .
అనాది ఐన కాలం యూప స్తంభంగా ,పశువును బంధించే యోక్త్రం అవగా ,సత్వ రజస్ తమో గుణాలు పాశాలయ్యాయి .యజ్ఞపశువే లేదు .ఆశరీరవాణిని అడిగితే పురుషసూక్తం స్మరించమని చెప్పగా స్మరించాడు .తనను యజ్ఞపశువుగా చేసుకోమని ఆకాశవాణి చెప్పింది .అదిఅవ్యయుడైన పరమపురుషుని వాణి అని గుర్తించి ,యూపం ప్రక్క తత్వాది గుణ పాశాలతో బద్ధుడై ,దర్భలపై కూర్చున్న జన్మించిన పురుషుని పై ప్రోక్షణ చేశాడు బ్రహ్మ .అప్పుడా పరమ పురుషుని నుంచి చరా చర జగత్తు ఏర్పడింది .ముఖం నుంచి బ్రాహ్మణులు ,బాహువులనుంచి క్షత్రియులు ,ముఖం నుంచి ఇంద్రాగ్నులు ,ప్రాణం నుంచి వాయువు చెవులనుంచి దిక్కులు ,శిరస్సునుంచి సమస్త స్వర్గం ,మనసునుంచి చంద్రుడు ,కళ్ళ నుంచి సూర్యుడు ,నాభినుంచి అ౦తరిక్షం ,ఊరువులనుంచి దిక్కులు కలిగాయి .
పరమపురుషుని పాదాలనుండి భూమి ,శూద్రుడు ,రోమకూపాలను౦డి రుషులు ,కేశాలనుండి ,ఓషధులు ,నఖాలనుంచి గ్రామ్యాలు ,వన్యాలు ,పశువులు పాయువు ఉపస్థలనుండిక్రిమికీటకాలు, పక్షులు ,అంటే సకల చరాచర జగత్తు అంతా ఆపరమ పురుషునినుంచి ఉద్భవించింది .అప్పుడు అశరీరవాణి బ్రహ్మ కోరిన సృష్టి అంతా జరిగిందని కనుక అగ్నిలో హవనం చేయమని ,పాత్రలను యూప ప్రణీతపాత్ర ,కుశాదులను రుత్విక్కులను ,యజ్ఞ రూపాన్ని ,ఉద్దేశ్యాన్ని, ధ్యేయం, సృవం ,పురుషుని ,పాశాలను మొత్తం విసర్జించమని చెప్పింది .
క్రమంగా యజ్ఞ కుండం లో గార్హస్పత్య , ఆహవనీయాగ్నులు ,దక్షిణాగ్నులలో,పూర్వాగ్ని లో ,క్రమంగా ఆయా స్థానాలలో జగత్ స్రష్ట ,మంత్రపూతుడైన పురుషుని అనుసంధానం చేసి హవనం చేశాడు బ్రహ్మ .అప్పుడుసర్వవ్యాపి యజ్ఞపురుషుడు ఐన విష్ణువు ఆహవనీయాగ్నిలో శుక్లారూప ధరుడు అయ్యాడు .దక్షిణాగ్నిలో శ్యామ వర్ణుడైన విష్ణువు ,గార్హస్పత్యాగ్ని నుండి పీత వర్ణుడైన విష్ణువు కలిగారు .అన్నిటా విష్ణుమూర్తి నిండిపోయాడు .తర్వాత బ్రహ్మ మంత్రాలతో ప్రణీతను సృస్టించాడు .ఈ ప్రణీత ఉదకమే ప్రణీతా నది అయింది .దర్భలచే మార్జనం చేసి దాన్ని వదిలిపెట్టాడు .ప్రణీత జలబిందువులు పడిన చోట్ల తీర్దాలేర్పడ్డాయి .ఈనది ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది .దర్భలు పడిన చోటు కుశాతర్పణ తీర్ధం అయింది .తర్వాత గౌతమి ఇక్కడ సంగమించగా అది ప్రణీతా సంగమ తీర్ధమైంది .కుశాతర్పణం జరిగిన చోటు కుశాతర్పణ తీర్ధం అయింది .
వింధ్యకు ఉత్తరాన యూప స్తంభం నాటబడిన చోటు విష్ణువుకు ఆశ్రయమైంది .అక్షర మైన యూపం అక్షయ వట వృక్ష మైంది . వట వృక్షస్మరణ తో యజ్ఞఫలం లభిస్తుంది .దేవయజనం దండకారణ్య మయింది. క్రతువు సంపూర్ణం కాగానే బ్రహ్మవిష్ణువును భక్తితోప్రార్ధింఛి ప్రసన్నం చేసుకొని నమస్కరించి విసర్జన మంత్రాలు చెప్పాడు .24యోజనాలున్న దేవయజనం శుభప్రదమైంది .అక్కడమూడు కుండాలున్నాయి.అవి యజ్ఞేశ్వర ,విష్ణు ,చక్రపాణి స్వరూపాలు .అప్పటి నుంచి అది బ్రహ్మ దేవ యజనం గా ప్రసిద్ధి చెందింది .అక్కడి క్రిమికీటకాలుకూడా ముక్తిపొందుతాయి .
దండకారణ్యం ధర్మబీజమని ,ముక్తి బీజమని పిలువబడుతోంది .దండకారణ్యం తో ఉన్న గౌతమి పరమ పవిత్రమైనది .ఉభయ తీరాలలో 86వేల తీర్దాలున్నాయి .అన్నీపుణ్యప్రదాలే .ఈతీర్ధం భూవాసులకు స్వర్గద్వారమే ‘’అని బ్రహ్మ నారదునికి వివరించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-11-19-ఉయ్యూరు ,,

