’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం

‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం

 ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ సుమారు 15 రోజులముందు ఫోన్ చేసి’’ సంఘం కొత్తగా మొదటిసారిగా జ్ఞాన జ్యోతి పురస్కారం ఏర్పాటు చేస్తోంది.మొదటిపురస్కారం మీకే నవంబర్ 15విజయవాడ టాగూర్ గ్రంధాలయం లో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రదానం చేయాలని ,అధ్యక్షులు మిగాతాకార్యవర్గం నిర్ణయించి మీకు తెలియ జేయమన్నారు ‘’అని చెప్పారు .’’ధన్యవాదాలు ‘’అన్నాను .ఈ విషయం మా శ్రీమతికితప్ప ఎవరికీ చెప్పలేదు .నవంబర్ 5న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పేపర్ ప్రకటన ద్వారా విషయం తెలియ జేశామని  నాకు ఫోన్ చేసి ప్రకాష్ చెప్పారు .ఆతర్వాత మా అబ్బాయి రమణకు  ఫోన్ చేసి చెప్పి ఫేస్ బుక్ లో పెట్టాక వాడు నాకు ఫోన్ చేసి చెప్పి పంపిస్తే అప్పుడు మా అబ్బాయిలకు చెప్పాను . ఆతర్వాత రెండు రోజులకోసారి ఫోన్ చేస్తూ ప్రకాష్ గారు గుర్తు చేస్తూనే ఉన్నారు .’’మీరేమైనా పత్రికల వారిని పిలిపించి విషయం చెప్పారా ?’’అని ఒక రోజు చలపాక ఫోన్ చేస్తే ‘’అలాంటి హడావిడి నాకుఅలవాటు లేదు ‘’అని చెప్పాను .ఆయనే ఆపని చేసి వార్తాపత్రికలలో వచ్చిన విషయాలు మెయిల్ ద్వారా పంపిస్తూనే ఉన్నారు .ఒక విధంగా నేను అదృష్టవంతుడిని .ఏప్రిల్ 2నవిజయవాడ  శారదా స్రవంతి వారు శ్రీ పంతుల వెంకటేశ్వరరావు తండ్రిగారి పురస్కారం అందించారు .ఏప్రిల్ 4 న  నెల్లూరు లో శ్రీ సర్వేపల్లి రామమూర్తి గారి ఆధ్వర్యం లో సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఉగాది సాహిత్య పురస్కారాన్నీ,మే17న గుడివాడ లోశ్రీమతి పుట్టినాగలక్ష్మిగారు   తమ తండ్రి శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు స్మారక పురస్కారాన్నీ అందించారు . జులై 17న హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో శ్రీ నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యం లో నిర్వాహకులు బ్రహ్మశ్రీ  నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు  గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ కళా సుబ్బారావు సాహితీ పురస్కారం అందజేశారు .ఇప్పుడు జ్ఞానజ్యోతి పురస్కారం అయిదవ పురస్కారం అవటం నా జన్మకు ధన్యత చేకూర్చింది .ప్రతిభ తక్కువా, గుర్తింపు అధికం అనిపించింది .అయినా పెద్దలమాట శిరోధార్యం కదా . ఈ ఆహ్వాన పత్రికను గుంటూరు లో ఉన్న ఆత్మీయులు ,కవి ,విమర్శకులు  డా రామడుగు వేంకటేశ్వర శర్మగారికి పంపిస్తే ,అందాక ఫోన్ చేసి మనః పూర్వకంగా అభినందిస్తూ ‘’సర్వ వాజ్మయం జ్యోతి స్వరూపం .దాని దర్శనానికి మీరు చేస్తున్నప్రయత్నం గుర్తించి ఈ పురస్కారం మీకు అందిస్తున్నారు .మీరు సర్వ విధాల అర్హులు ‘’అని చెప్పాక మనసు కుదుట బడింది.ఆత్మీయులమాట శ్రేయోదాయకం . మా అబ్బాయి రమణ జాగృతి సంస్థ ద్వారా  అందరికీ విషయం అందించి పేపర్లలో వచ్చేట్లు చేశాడు

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-

  నిన్న నవంబర్ 15 శనివారం మా దంపతులం ,మా కోడలు శ్రీమతి రాణి ,మనవడు చరణ్ ,ఆత్మీయులు శ్రీ గంగాధరరావు గారు ,మా అన్నయ్యగారి అబ్బాయి రామనాథ బాబు సుమోలో బెజవాడ టాగూర్ లైబ్రరీకి చేరాం .అప్పటికే అక్కడున్న ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవాధ్యక్షులు ,ఒంగోలు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు,లాయర్  శ్రీ బి హనుమారెడ్డి గారికి నేను నమస్కరించి నాపేరు చెప్పబోతుండగా ‘’అక్కర్లేదు మీపేరు జగద్విదితం ‘’అని నన్ను మాట్లాడ నివ్వని సౌజన్యం వారిది .తర్వాత సంఘం అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు వచ్చారు .ప్రకాష్ గారు ముందే నాకు చెప్పినట్లు సరసభారతి ప్రచురించిన 24 రకాల పుస్తకాలను అక్కడ ఒక బల్లపై ప్రదర్శనకు పెట్టాము .గంటన్నర ఆలస్యంగా సభ ప్రారంభమైంది జాయింట్ కలెక్టర్,కృష్ణా జిల్లా  గ్రంథాలయ సంస్థ  పర్సన్ ఇంచార్జ్  శ్రీ కే మోహన్ కుమార్ వచ్చాక .

  మోహన్ కుమార్ గారి ఆధ్వర్యం లో వేదిక పై ఉన్నరెడ్డిగారు, సుబ్బయ్యగారు ,కవి సమ్మేళనం నిర్వహించే శ్రీమతి యామినీదేవి గారు శ్రీ ప్రకాష్  మొదలైన  పెద్దల సహకారం తో మా దంపతులను ప్రత్యేక ఆసనాలపై కూర్చోబెట్టి ,శిరసుపై పూల కిరీటం పెట్టి ,,శాలువాలు కప్పి, రోజాపుష్పహారాలు వేసి చందనం రాసి ,నుదుట బొట్టుపెట్టి ,జ్ఞాపిక ,శ్రీమతి కోనేరుకల్పనగారు చదివిన  అభినందన పత్రం  ,3వేల నూటపదహారు రూపాయల నగదు కవరు అందించారు .చాలా ఆత్మీయంగా గౌరవంగా కార్యక్రమం నిర్వహింఛి చిరస్మరణీయం చేశారు .అంతటా ఆప్యాయత స్పష్టంగా కనిపించి .మనసుకు ఆనందం కలిగించింది .ఇదంతా ప్రకాష్ గారి ప్రత్యేక శైలి . శ్రీమతి కోపూరి పుష్పాదేవి దంపతులు మాకు నూతనవస్త్రాలు సమర్పించి శాలువా కప్పారు .సరసభారతి ఆస్థానకవి శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు ,మా వియ్యంకులు శ్రీ కే ఆర్ శాస్త్రి దంపతులు ,గంగాధరరావు గారు, రామనాథ్ బాబు ,మా తోడల్లుడిగారబ్బాయి  మధు ,మామనవాడు చరణ్  లు కూడా శాలువాలుకప్పి అభిమానం తెలియ జేశారు .ముచ్చటగా ఉంది .రెడ్డిగారు ,సుబ్బయ్యగారు,ప్రకాష్ గారు  నాగురించి మంచిమాటలు చెప్పారు .

  నేను మాట్లాడుతూ సరసభారతి ఏర్పడ్డాక జరిగిన పదేళ్ళ అభివృద్ధి ,33పుస్తకాల ప్రచురణ ,అందులో నేను రాసిన 21పుస్తకాలు ,కేమోటాలజిపిత డా .కొలచల సీతారామయ్య ,117వ మూలకం కనిపెట్టిన డా ఆకునూరి వెంకట రామయ్య ,ప్రయోగాత్మక కాంతి శాస్త్రపిత డా .పుచ్చా వెంకటేశ్వర్లు గార్లగురించి వారిపై నేను రాసిన పుస్తకాల గురించి ,రామయ్యగారిపై పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ,ఉయ్యూరులో మూడవసారి ఎం .ఎల్.సి .శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన విశేషం ,సంస్కృత కవులపై 3 భాగాలలో 1090మందికవులను గురించి రాసిప్రచురించిన  విషయం,నెట్ లో రాస్తున్న  నాలుగవ భాగం లో 520 కవుల విషయం గురించి అందునా ప్రస్తుతం యూనివర్సిటీలలో ఉంటూ రాస్తున్న లేటెస్ట్ రచనలతో సహా చెప్పి ,జర్మనీకి చెందిన’’ సింఫనీ మాంత్రికుడు  బీథోవెన్, జర్మనీకి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఫిలాసఫర్  ఇమాన్యుయల్ కాంట్ ,వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి,కోనసీమ ఆహితాగ్నులు నా జీవిత చరిత్ర ‘’నా దారి తీరు ‘’,ఊసుల్లో ఉయ్యూరు   గురించి విస్త్రుతంగా  అంతర్జాలం లో రాసిన సంగతి ,నిత్యం సరసభారతి బ్లాగ్ లో ఏదో ఒక ప్రత్యెక విషయం  రాస్తున్న వైనం ,శ్రీమైనేని గోపాలకృష్ణగారు ఉయ్యూరులో ఎసి లైబ్రరీ ఏర్పాటు చేయటానికి ఇచ్చిన భూరి విరాళం ,దాని నిర్మాణం లో కన్వీనర్ గా నాపాత్ర ,సరసభారతి పుస్తకాల  ముద్రణకుఆయన స్పానర్ షిప్,ప్రకాష్ గారి తోడ్పాటు  వగైరాలు  చెప్పాను .

ఇదంతా జ్ఞాన మార్గ గామిగా నేను చేస్తున్న  కృషి మాత్రమేనని ‘’జ్ఞాన జ్యోతి ‘’అంటే జ్ఞానాన్ని జ్యోతిలాగా అందించేంత ‘’దృశ్యం ‘’ ఉన్నవాడిని ,’’బీకన్ లైట్ ‘’ను కానని వినమ్రంగా అన్నాను  .వారు అభిమానం తో శిరసునపెట్టిన పూలకిరీటం చిన్న దోమ తలకాయకు పెట్టినట్లు ఉందని భావిస్తున్నానని ,అందరికీ సాహిత్యం ,మంచి విషయాలు చేరువ చేయటానికే తపన పడుతున్నానని చెప్పాను .తర్వాత కవి సమ్మేళనం జరిగింది .ప్రదర్శనకు పెట్టిన పుస్తకాలు ప్రకాష్ గారికి అందించి కావలసినవారికి ఇవ్వమని కోరాను .ప్రకాష్ గారు హోటల్ కు వెళ్లి భోజనం చేద్దామని మమ్మల్ని బలవంత పెట్టారు .అయినా సున్నితంగా కాదని చెప్పి దారిలో హోటల్ లో టిఫిన్లు చేసి ఉయ్యూరు చేరేసరికి రాత్రి 11 అయింది .ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఇచ్చిన పురస్కారానికి,ప్రకాష్ గారి పూనికకు  సదా కృతజ్ఞుడను .

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-11-19-ఉయ్యూరు

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

2 Responses to ’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం

  1. seshubabugs's avatar seshubabugs says:

    సర్
    మీకు శుభాభినందనలు
    💐💐💐

    Like

Leave a reply to gdurgaprasad Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.