గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం

గౌతమీ మహాత్మ్యం—71

101- చక్షుస్తీర్ధం

గౌతమికి దక్షిణాన చక్షుస్తీర్ధం ఉంది. అక్కడ దేవదేవుడైన యోగీశ్వరుడు కొలువై ఉంటాడు .పర్వత శిఖరం పై ‘’భౌవనం ‘’అనే పురం ఉంది. దాని రాజు భౌవనుడు క్షాత్ర ధర్మ పరాయణుడు .ఆపురం లో కౌశికుడనే బ్రాహ్మణుడు ,అతని కొడుకు వేదపండితుడైన గౌతముడు ఉన్నారు .తల్లి మనో దోషం చేత యితడు తండ్రికి విరోధి అయి ,మణి కుండలుడు అనే ధనిక  వైశ్య బాలునితో స్నేహం చేశాడు .ఇది విచిత్ర స్నేహం .ఒక రోజు గౌతముడు అతనితో ‘’ధన సంపాదనకోసం పర్వతాలు సముద్రాలు దాటి  వెడదాం.నిర్ధనుడి జీవితం వ్యర్ధం ‘’అనగా వైశ్యబాలుడు ‘’నా తండ్రి సంపాది౦ చిందే చాలా ఉంది .ఇంకా నాకు డబ్బు ఎందుకు “’?అనగా గౌతముడు ‘’మానవునికి ఆధిక్యత కావాలి .పితృ దనం అపేక్షి౦చ నివాడినేలోకం గౌరవిస్తు౦ది.స్వయంగా డబ్బు సంపాది౦ చే వాడే కృతార్ధుడు ‘’అన్నాడు .

   నిజమేనని నమ్మిన మణి కుండలుడు రత్నాలు డబ్బు తెచ్చి గౌతముడికిచ్చాడు .విప్రుడు మోసకారి అని ఆమయాకుడికి తెలీదు .ఇద్దరు ఊరు వదిలి దేశాలు తిరుగుతున్నారు .మిత్రుని వద్ద వున్న దనం రత్నాలకు  కాజేయాలని గౌతముని దురాలోచన .డబ్బు సంపాదించి కాంతా సుఖం పొందాలని ఉవ్విళ్ళూ రుతున్నాడు బాపడు .ఒకరోజు మిత్రునితో ‘’ప్రాణులు అధర్మ౦ వలననే అభి వృద్ధి చెందుతున్నయి .ధర్మం వలన ప్రయోజనం లేదు ‘’అనగా మిత్రుడు ‘’కాదు ‘’అని ‘’ధర్మం వలన సుఖం ప్రతిస్టితమౌతుంది. పాపం లో దుఖం భయం శోకం దరిద్రం క్లేశాలున్నాయి .ధర్మం ముక్తి నిస్తుంది .ధర్మం వినాశనం చెందని శాశ్వతమైనది ‘’అన్నాడు ,

  చివరికి వారిద్దరి మధ్యా ‘’ఎవరి పక్షం ఉత్తమమం అని తేలితే ఎదుటివాడికి తన ధనం అంతా ఇచ్చెయ్యాలి’’అనే ఒప్పందం కుదిరింది .అక్కడున్న జనాలతో ‘’ధర్మం ,అధర్మం లలో ఏది గొప్పది ?’’అని అడిగారు .వాళ్ళు ధర్మాత్ములు దుఖం పొందితే పాపాత్ములు సుఖం పొందుతారు అని చెప్పగా ,తాను ఓడినట్లు ఒప్పుకొని ,.ధర్మ వేత్తలలో గొప్పవాడైన వైశ్యుడు తన దగ్గరున్న దంతా బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు . గౌతముడు మళ్ళీ స్నేహితుడిని ‘’ఇంకా ధర్మాన్ని నమ్ముతావా ?’’అని ప్రశ్నించగా ‘’నమ్ముతాను ‘’అని నిస్సంకోచంగా చెప్పాడు .దానికి బాపడు ‘’నేనే జయించి నీడబ్బంతా తీసుకొన్నాను .కనుక ధర్మం నా చేత జయించబడింది .దీనికి చిరు నవ్వుతో వైశ్యుడు ‘’ధర్మం ఎవరి దగ్గర ఉండదో వాడిని ధాన్యం లో తాలు గా ,పక్షులలో ‘’పుత్తిక ‘’అంటే వ్యర్ధమైన పక్షిగా లోకం భావిస్తుంది .నాలుగు పురుషార్ధాలలో ధర్మమే మొదటిది .నువ్వు  జయించా నని ఎలా అనుకొంటావు ?అన్నాడు .’’ఐతే పందెం కాద్దాం’’అనగా ఇద్దరూ ఒప్పుకొని మళ్ళీ జనాలను అడుగగా వాళ్ళు అధర్మాన్నే సమర్ధించటం తో ద్విజుడు తానే గెలిచినట్లు ప్రకటించి కోమటి వాని రెండు చేతులూ ఖండింఛి మళ్ళీ అడిగాడు .ధర్మమే శ్రేష్టం అని మళ్ళీ చెప్పాడు వైశ్యుడు .గౌతముడు ధనవంతుడుకాగా మణి కుండలుడు చేతుల్లేక నిర్ధనుడై ,కలిసే సంచరిస్తూ గంగానదిని చేరి మళ్ళీ వాదు లాడుకొన్నారు .వైశ్యుడు గంగామాతను యోగీశ్వరుడైన హరిని స్తుతించగా గౌతముడు ధనగర్వంతో ‘’నీ రెండు చేతులు నరికాను ఇప్పుడు డు ప్రాణాలతో మాత్రమే ఉన్నావు .నాకు వ్యతిరేకంగా మాట్లాడితే తల నరికేస్తా ‘’అని బెదిరించాడు .

 నవ్వుతో వైశ్యుడు ‘’ధర్మమే గొప్ప హరిని నిందిస్తే పాపం .’’అని ‘’ఇప్పటికీ ధర్మమే గొప్ప అని నీవు అంటే మన ప్రాణాలను పణంగా పెడదాము ‘’అనగా సరే అన్నాడు .ఇద్దరూ జనాలను అడిగితె పూర్వపు సమాధానమే రావటం వలన బ్రాహ్మణుడు  జయించి నట్లు భావించాడు .కోపం పట్టలేక వైశ్యుని కిందపడేసి ఒకకన్ను పీకేసి ‘’నీ శరీరం లో భాగాలన్నీ పోయాయి .ఇకనేను పోతున్నాను .మళ్ళీ ధర్మం మాట ఎత్తకు ‘’అని హెచ్చరించి వెళ్ళిపోయాడు .వైశ్యుడు దీనంగా శోకం తో అక్కడే పడి ఉన్నాడు .రాత్రిఅయి చంద్రోదయం అవగా శుక్ల ఏకాదశి  కనుక విభీషణుడుతన పరివారం తో  అక్కడి వచ్చి గంగాస్నానం చేసి యోగీశ్వరుని పూజించాడు. అతడి కొడుకు ‘’వైభీషణి’’ దారిలో వైశ్యుని చూసి జాలిపొంది ,విషయం తెలుసుకొని తండ్రికి విన్నవించాడు .కొడుకుతో తండ్రి ‘’శ్రీ రాముడు నా గురువు .నా మిత్రుడు హనుమ ఈ సంజీవనీ పర్వతాన్ని ఇక్కడికి తెచ్ఛి అవసరం తీరగానే దాన్ని హిమవత్పర్వతానికి చేర్చాడు .నువ్వు దానిపై ఉన్న ఓషధి  తెచ్చి ,శ్రీహరిని స్మరిస్తూ అతని హృదయం దగ్గర పెట్టు  సంజీవ పర్వతం పై ఉన్న విశల్య కరణి ఇక్కడే పడిపోయింది ‘’అనగా విభీషణుడు చూపించగా కొడుకు’’ఇషేత్వె త్యస్య వృక్షస్య శాఖాం చిచ్చేదతత్సుత –‘’దానికొమ్మను ఖండించి  దాన్ని తీసుకొని వైశ్యుని దగ్గరకు వచ్చి తాకించగా అతడికి కళ్ళు చేతులూ వచ్చేశాయి .

  అకొమ్మను తీసుకొని గౌతమీ స్నానం చేసి ,పరి శుద్దుడై ,హరిని స్మరిస్తూ మహాపురం అనే  నగరం చేరగా ,అక్కడి రాజు మహాబలుడికి ఉన్న అంధురాలైన పుత్రిక కు కళ్ళు తెప్పించిన వాడికి ఆమెనూ రాజ్యాన్ని ఇస్తానన్న  ప్రకటన విని వెళ్లి ,రాజ నగరికి  వెళ్లి తన చేతిలోని కొమ్మను తాకించగా ఆమెకు కళ్ళు వచ్చాయి .అప్పుడు అతడు ‘’బ్రాహ్మణుల అనుగ్రహం ధర్మం యొక్క తపస్సు,దాన యజ్ఞ ,దివ్య ఓషధీ  ప్రసాదం వలన   నాకు ఇలాంటి ప్రభావం వచ్చి౦ది ‘’అనగా రాజు ఆశ్చరపడి ,విషయం తెలుసుకొని అతడు వైశ్యుడైనా ధర్మమార్గగామికనుక తన కూతురుతోపాటు రాజ్యాన్ని కూడా ఇచ్చి వివాహం చేశాడు .దంపతులు చాలాకాలం సుఖంగా  జీవించారు .రాజు వానప్ర స్థానికి  వెళ్ళగా ఇతడే పూర్తి అధికారాలతో రాజయ్యాడు .మిత్రుడు గౌతముడి దగ్గరున్న ధనమంతా జూదరులు హరి౦చా రని తెలిసి ,పిలిపించి ,ధనవంతుని చేసి ధర్మ శ్రేష్టత ఏమిటో వివరించాడు .అతని తలిదండ్రులనూ రప్పించి యదా శక్తి గౌరవ హోదాలు కల్పించాడు .అప్పటిను౦చి ఈ  తీర్ధం మృత సంజీవనీ తీర్ధంగా ,చక్షుస్తీర్ధంగా ప్రసిద్ధి చెందింది .మనసుకు నిర్మలత్వం ప్రశాంతత కలిగిస్తుంది అని నారదునికి బ్రహ్మ వివరించాడు .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.